వెలిసిన వర్ణాలు

2 Dec, 2018 02:14 IST|Sakshi

కథా ప్రపంచం

సుదీప్‌ తల బొంగరంలా తిరుగుతున్నది. నవడలేకపోతున్నాడు. అద్భుతమైన ఆకుపచ్చ సౌందర్యం కళ్ల ముందు కదలాడుతున్నది. దాని వెనుకనే గుండెను పిండే బాధ, మనసును ముక్కలు చేసే జ్ఞాపకాలు తారాడుతున్నాయి. బిదిత వదనం అతడిని రేయింబవళ్లు వెంటాడుతున్నది. యూనివర్సిటీ చదువు అతనికి విషాదమే మిగిల్చింది. రబ్బరు సేకరించే కార్మికులు వదిలేసిన ఒక ముక్కని సుదీప్‌ తన చేతిలో నలుపుతున్నాడు. ఆ ముద్ద అతనికి తన దగ్ధ హృదయాన్ని గుర్తు చేస్తున్నది. అది తను చదువుకునే బల్లపై ఉంచితే ఒక జ్ఞాపికలాగా ఉంటుందని భావిస్తున్నాడు. కృతకమైన, క్రూరమైన నాగరికతకు అతి దూరంగా ఈ చిటగాంగ్‌ మహారణ్యం ఒక దుప్పటిలాగా అతడిని కౌగిలించుకుని తనలో ఇముడ్చుకోవడానికి సిద్ధంగా ఉంది. అతడు ఇక్కడే ఊరట పొందగలడు. అతి కష్టం మీద తన ఉద్వేగాలను అదుపు చేసుకున్నాడు. నెమ్మదిగా కొండపైకి ఎక్కుతున్నాడు. అతడికి తెలియకుండానే తన వ్యథకు సంకేతంగా అతడు పదిలపరచుకున్న రబ్బరు ముక్క కింద పడిపోయింది.  తన క్లాస్‌మేట్, తను ఎంతగానో ప్రేమించి ఆరాధించిన బిదిత ఒక కృతనిశ్చయంతో చెప్పేసింది. ఆమె మాటలు సందీప్‌ చెవిలో ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి. ‘‘మనిద్దరి మధ్య అంతరాలు అడ్డుగోడలు ఉన్నాయి. మనం ఈ జన్మలో కలిసి జీవించడం సాధ్యం కాదు. నేను కోరుకున్న జీవితం వేరు.’’ అని తెగేసి చెప్పింది. ఆమె నిజాయితీని శంకించడానికి వీల్లేదు. ఆమె వెనుకనున్న పరిస్థితులు అటువంటివి. ఆమె సుదీప్‌ని మోసం చెయ్యలేదు. కానీ సుదీప్‌ కోణంలో చూస్తే మరపు అంత తేలికైనది కాదు.

శుభప్రియొ ఆదివాసీ. సుదీప్‌ బెంగాలీ. ఇద్దరూ క్లాస్‌మేట్లు, రూమ్మేట్లు. బిదిత వియోగంతో సుదీప్‌ కుంగిపోతున్న స్థితిలో శుభప్రియొ అతని బాధను అర్థం చేసుకున్నాడు. పర్వతాల్లోని తన పురాతనమైన ఇంటికి వచ్చి, తన కుటుంబంతో కలసి ఉండమని కోరాడు. కొంత ఉపశమనాన్ని పొంది, మిత్రుడు గాయాన్ని మరచిపోగలడని భావించాడు. వారిది చాలా పెద్ద కుటుంబం. వివాహితులైన ఇద్దరు అక్కలు వేరే ఊర్లో ఉన్నారు. మూడో సోదరి కజోలికా పట్నంలో చదువుతూ హాస్టల్లో ఉంటున్నది. ప్రస్తుతం ఆమె సెలవులకని ఇంటికి వచ్చింది. పెద్దవాడు శుభప్రియొ. చిన్నవాడు పూర్ణచంద్ర పదేళ్ల వయసు వాడు. ఆ కుర్రవాడే ఇప్పుడు సుదీప్‌కు మిత్రుడూ మార్గనిర్దేశకుడూ అయ్యాడు. పూర్ణచంద్ర తనకు మాత్రమే తెలిసిన మహారణ్యాల అద్భుత రహస్యాలను చెబుతున్నాడు. అంత సుందరమైన నందనాన్ని చూసి సుదీప్‌ సంబరపడిపోయాడు.‘‘నీకెవరు బాబూ! ఈ పేరు పెట్టారు? పూర్ణచంద్రుడంటే నిండు పౌర్ణమి’ అడిగాడు సుదీప్‌.పూర్ణచంద్ర ముఖంలో హఠాత్తుగా రంగులు మారిపోయాయి. కన్నుల్లో క్రోధం కదలాడింది. ఒక్కసారిగా చలించిపోయాడు. ‘‘నాకీ పేరు ఠాకూర్‌దా పెట్టాడు’’ అంటూ బిగుసుకుపోయాడు. ‘‘ఆయన్ని వాళ్లు పొట్టన పెట్టుకున్నారు. నేను వాళ్లని చంపేస్తాను.’’ అన్నాడు.

మిత్రుడు శుభప్రియొ గత సన్నివేశాల్ని పూసగుచ్చిట్టు వివరించాడు. సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఆ కుటుంబం వారంతా తల దాచుకునేందుకు కీకారణ్యం లోనికి వెళ్లబోయారు. వృద్ధుడు ఠాకుర్‌దా నడవలేకపోయాడు. అతడ్ని ఉన్న చోటునే వాళ్లు కాల్చి చంపేశారు. ఆ దృశ్యాన్ని చిన్నవాడైనా పూర్ణచంద్ర కళ్లారా చూసేశాడు. అప్పటి నుంచి పిల్లవాడు మనిషి కాలేకపోతున్నాడు.  శుభప్రియొ తమ స్థితిని ఇంకా ఇలా వివరించాడు: ‘‘మేం ఒక యుద్ధ వాతావరణంలో బతుకులీడుస్తున్నాం. మా సమరానికి పగలూ రాత్రీ తేడా లేదు. బెంగాలీ వలస జనం మా నేలని ఒక్కొక్క అంగుళమూ ఆక్రమించుకుంటున్నారు.దాన్ని ఆదీవాసీలం మేం ప్రతిఘటిస్తున్నాం. వారు మమ్మల్ని చంపుతుంటుంటారు. మేం వారి జనావాసాల్ని తగలబెడుతుంటాం. మా జీవితాలు అతలాకుతలమయ్యాయి. ప్రశాంతతని నెలకొల్పడానికి సైనిక పటాలాలు వస్తాయి. అసలు చిక్కంతా వారితోనే. వారి చేతిలో తుపాకులుంటాయి. మా ఆడవారి మానప్రాణాలను వారు హరిస్తున్నారు. మా వారసత్వ సంపదనీ నాగరికతనీ ధ్వంసం చేస్తున్నారు. మా ఆర్థిక వనరుల్ని మట్టిపాలు చేస్తున్నారు...’’ ఈ ధోరణిలో ఇంకా చాలా చెప్పాడు. సుదీప్‌ నాడులు బిగుసుకున్నాయి.  ఒకవైపు బిదిత వల్ల ఏర్పడిన సొంత విషాదముంది. రెండోవైపున సూర్యుడి కింద పిడికెడు నేల కోసం, అంగుళం నీడ కోసం ఈ అశేష ప్రజానీకం సాగిస్తున్న నిరంతర సంఘర్షణ ఉంది. రెండూ మనుగడ కోసం పోరాటాలే. కాని వీరి విషాదంతో పోలిస్తే తన వ్యక్తిగత దుఃఖం అత్యంత స్వల్పమైనది. వీరి ప్రయోజనం కోసం, వీరి పక్షాన నిలబడి, వీర్ని ఉద్ధరించడానికి పోరాటం సాగించడం గొప్ప అంశంగా భావిస్తున్నాడు. 

సుదీప్‌ ఒక మహావృక్షం కింద వెల్లకిలా చేరబడి స్తబ్దమవుతున్న తన పంచేంద్రియాలనూ కూడగట్టుకుంటున్నాడు. అంతలో ఒక ఉడుత చెట్టు కొమ్మ నుంచి కిందకు దిగింది. నెమ్మదిగా అతని మీదకు పాకడానికి ప్రయత్నించింది. ఆ పరిసరాలకు కొత్తగా ఉన్న ఆ శాల్తీ వైపు కొన్ని సెకన్ల పాటు చూసింది. సుదీప్‌ ఊపిరి బిగపట్టాడు. ఈ వన్యప్రాణి తన భగ్నహృదయానికి శాంతినివ్వగలడేమో అనుకున్నాడు. కాసేపు పరిశీలించిన తర్వాత ఉడుత ఈ నరజాతిని నమ్మడం సురక్షితం కాదని నిశ్చయించుకుంది. ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగానూ చెట్టెక్కిపోయింది. సుదీప్‌ నవ్వుకున్నాడు. ఉడుత కూడా తనని తిరస్కరించినట్టు భావించాడు. ఈ స్థలం కూడా ప్రమాదరహితమైనది కాదు. ఏ వైపు నుంచి అయినా ఒక బుల్లెట్‌ దూసుకు రావచ్చు. పోరు భీకరంగా సాగుతున్నది. కానీ పరిస్థితి ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉన్నది. మరోసారి బిదిత అమాయకమైన ముఖం అతని మనోఫలకం మీద కనపడి మాయమైపోయింది. ఇంతలో ఒక ధ్వని అతని దగ్గరగా వస్తున్నది. ఒక పక్షి ఆకుల మధ్య నుంచి గొంతు విప్పి అరుస్తున్నది.ఒక పిల్ల తెమ్మెర నెమ్మదిగా వచ్చి అతన్ని లాలించింది. పూర్ణచంద్ర పులిలాగా గాండ్రిస్తూ, పెంకెగా నవ్వుతూ ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో ఒక పశువుల గంట ఉన్నది. ‘‘దీన్ని మీ మెడకు కడతాను’’ అన్నాడు.

‘‘నేను ఆవుని కాదే!’’‘‘మీకు ఈ స్థలం తెలియదు. ఒకవేళ దారి తప్పితే ఈ గంట మిమ్మల్ని గుర్తుపట్టడానికి సహాయం చేస్తుంది.’’‘‘పూర్ణా! నువ్వు నన్ను నమ్మగలవా?’’ సుదీప్‌ అడిగాడు.క్షణం ఆలోచించకుండా ఆ కుర్రవాడు ‘‘నమ్మను’’ అన్నాడు.‘‘ఎందుకని’’‘‘మీ బెంగాలీలు మా తాతయ్యని చంపారు.’’ అన్నాడు పూర్ణచంద్ర.‘‘శుభప్రియొ దాదాకు మీరంటే ఇష్టం. మీకేదో ఆపద వచ్చిందని చెప్పాడు. అందుకనే బాబా, అమ్మా మీరు మాతో ఉండటానికి అంగీకరించారు. లేకుంటే ఉండనివ్వరు’’ఎంత ద్వేషం? ఎంత అపనమ్మకం? ఇవి సుదీప్‌ గుండె మూలలకు గుచ్చుకున్నాయి. ఈ పిల్లవాడు అభం శుభంతెలియనివాడు. వాళ్ల తాతని చంపడం స్వయంగా చూశాడు. ఇంకా ఎన్నో అకృత్యాల్ని చూసే ఉంటాడు. ఆ చిన్నారి మనసు కరడుగట్టిపోయింది. ‘‘మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉండకూడదు. అప్పుడే మా జనం మీ గురించి గుసగుసలాడుతున్నారు. మిమ్మల్ని పర్వతాల మీద నుంచి కిందకు నెట్టెయ్యాలని అంటున్నారు.’’ అన్నాడు పూర్ణచంద్ర.‘‘ఎందుకు?’’‘‘మీరు మా శత్రువర్గానికి చెందినవారు.’’‘‘ నేను ఎవరికీ శత్రువుని కాను. ఈ కొండల మీద నేను కూడా నివసించి నా సర్వస్వాన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాను.’’‘‘అదంతా నాకు తెలీదు. వాళ్ల మాటలు మీకు నేను చెబుతున్నాను. ఇక్కడ ఎక్కువ కాలం ఉండొద్దు.’’ పదేళ్ల పూర్ణచంద్ర స్వరంలోని తీవ్రత సుదీప్‌ని చకితుడ్ని చేసింది. మళ్లీ పూర్ణ ఇలా అన్నాడు: ‘‘బాబా మాటికీ గొణుగుతున్నాడు. మీరిక్కడే ఉంటే మిలటరీ వారికి అనుమానం వచ్చి మొత్తం మా పల్లెనే తగులబెట్టేస్తారట.’’  సుదీప్‌కి మరో దెబ్బ తగిలింది. ‘‘తన బాధ నుంచి విముక్తుడు కావడానికి ఇతరుల్ని బాధపెట్టాలా?’’ ఒకవైపు బిదిత వియోగం, రెండో వైపు ఆదివాసీల జీవన్మరణ సమస్య సుదీప్‌ని కుంగదీస్తున్నాయి. పూర్ణచంద్ర ఇలా అన్నాడు: ‘‘ఈ గంటను మీ మెడకు కట్టుకోండి’’ అంటూ ఇంకా ఇలా అన్నాడు. 

‘‘దీదీ కజోలికా కూడా మీ ఉనికిని ఇష్టపడటం లేదు.’’‘‘అర్థమైంది. ఆమె... ఆమె.. ఎవర్నైనా ప్రేమిస్తున్నదా?’’‘‘ఔను. రేబొతీ దాదాను ప్రేమిస్తున్నది. అతడు శాంతిబాహినిలో చేరిపోయాడు. ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలీదు. అందుకే ఎప్పుడూ ఆమె విచారంగా ఉంటున్నది. త్వరలో ఆమె కూడా చేరబోతున్నది.’’‘‘పోరాటం చేస్తుందా?’’‘‘ఔను. మేం మిలటరీ వారిని మా నేలమీద నుంచి తగిలెయ్యాలి కదా!’’ అన్నాడు పూర్ణచంద్ర.సుదీప్‌ ఏమనగలడు? ఇక్కడికి రావడం వల్ల తన సొంత బాధ కన్నా మరింత అధికమైన భారం అతని భుజాల మీద పడుతున్నది. పట్నంలో ఉన్నప్పుడు కొండ ప్రాంతాల్లోని అశాంతిని గూర్చి లీలగా విన్నాడు.కాని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అంతలో ఒక పెద్దవృక్షానికి ఉన్న వేళ్లు కాళ్లకు తగిలాయి. కింద పడిపోయాడు. సరిగ్గా ఆ సమయంలో చాలా తొందరగా వస్తున్న ఒక జీపు ధ్వని వినపడింది. వెంటనే పూర్ణచంద్ర కూడా సుదీప్‌ పక్కన నేల మీద బోర్లపడిపోయాడు. ‘‘మీరు కిందపడటం మంచిదైంది. అది మిలటరీ జీపు.’’ అని చెవిలో మెల్లగా అన్నాడు. అక్కడి వృక్షాలు పొదలు వారిని కనపడకుండా చేశాయి.జీపు దగ్గరగా వచ్చి ఆగింది. కాని కనపడలేదు. కొంతసేపటి తర్వాత వెళ్లిపోయిన శబ్దం వినపడింది.

సుదీప్‌ మోకాలికి దెబ్బ తగిలింది. ఏదో చెప్పాలనుకున్నాడు. కాని ఆ పిల్లవాడి ముఖంలో ద్వేషాగ్ని కీలల్ని చూసి మాట్లాడలేకపోయాడు. పూర్ణచంద్ర పిడికిలి బిగించాడు. ‘‘నేను మా మహారణ్యంలోని పచ్చని పచ్చికను పట్టి ప్రమాణం చేస్తున్నాను. నేను ఏదో ఒక రోజున వార్ని చంపి పగ తీర్చుకుంటాను’’‘‘పూర్ణా! మీ దాదా వచ్చిన వెంటనే నేను కూడా వెళ్లిపోతాను. నన్ను నమ్ము.’’‘‘శుభప్రియొ దాదా మరి చదువు కొనసాగించడు. శాంతిబాహినిలో చేరడానికి నిర్ణయించుకున్నాడు.’’ అంటూ పూర్ణచంద్ర ఇంకా ఇలా అన్నాడు: ‘‘దీదీ కజోలికా వెదురుపొదల వద్ద వేచి ఉంటుంది. మనం ఆమెను కలిసి ఇంటికి వెళ్లిపోదాం.’’‘‘వెదురు పొదల వద్ద ఎందుకు?’’‘‘రేబొతీ వస్తే అక్కడ కలుసుకుంటుంది.’’‘‘అతనెప్పుడొస్తాడో ఆమెకు తెలీదా?’’‘‘తెలీదు. ఆమె కూడా గంట కట్టుకునే ఉంటుంది. దాంతోనే మేం గుర్తుపడతాం. ఇది మా రహస్యం. నాకు దీదీ అంటే చాలా ఇష్టం.’’ఇద్దరూ ఇంకా దట్టమైన అడవిలోకి ప్రవేశించారు.  ‘‘ఈ ప్రాంతంలో ఏదైనా మిలటరీ ఆపరేషన్‌ ఉన్నదేమో!’’ అంటూ సుదీప్‌ పూర్ణచంద్ర భుజాల మీద చేతులు వేశాడు.‘‘కావచ్చు. వారికి దీదీ కనపడితేనే ప్రమాదం’’ పూర్ణచంద్ర కంఠం కటువైపోయింది ఇలా ఒంటరిగా తిరగొద్దని నేను దీదీకి చాలాసార్లు హెచ్చరించాను.’’సుదీప్‌ పూర్ణచంద్రను దగ్గరగా తీసుకున్నాడు. ‘‘భయపడకు. నేను నీతో ఉన్నాను. మీ దీదీకేమీ కాదు. ఇలాంటి రాత్రి మనకు చంద్రుడు కనిపిస్తాడు. జంతువులు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాయి. ఇంత నిశ్శబ్దంలో మనం కజోలికా గంటను స్పష్టంగా వినగలం.’’ ‘‘మీరేమంటున్నారు? ఇది రాత్రి కాదు పగలు. ఈ చెట్లు సృష్టినే చీకటి చేసేస్తాయి. మీరు కొత్త ఈ ప్రదేశమంతా నాకు తెలుసు. అందుకే రాత్రి అనిపిస్తున్నది.’’ అని పూర్ణచంద్ర నవ్వాడు. అంతలోనే ఏదో కీడు శంకించిన వాడిలా నవ్వు ఆపేసి, సుదీప్‌ని వెనక్కు నెట్టి  ‘‘దీదీ..’’ అని అరుస్తూ పరుగెత్తడం మొదలు పెట్టాడు. ఈ హఠాత్‌ పరిణామానికి సుదీప్‌ కూడా భయభ్రాంతుడయ్యాడు. పూర్ణ వెనుకనే సుదీప్‌ కూడా పరుగెత్తాడు. ఈ సరికి పూర్ణచంద్ర బిగ్గరగా ఏడుస్తున్నాడు. వారికి కజోలికా కనపడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్నది. ఆమె దుస్తులు చుట్టూ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆమె అనాచ్ఛాదితంగా ఉంది.

కాళ్ల మధ్య నుంచి రక్తం స్రవిస్తున్నది.పూర్ణచంద్ర ఆమె దగ్గరగా వెళ్లి అసహాయంగా చేతులూపుతూ అరుస్తున్నాడు ‘‘దీదీ... మాట్లాడ్డం లేదు. కదలడం లేదు. చనిపోయిందా? దీదీ... దీదీ’’అక్కడి మెత్తని నేల మీద జీపు టైలర్ల గుర్తులున్నాయి. జరిగిన క్రూరమైన కథ సుదీప్‌కు అర్థమైంది. కాని ఆ పసివాడికి ఎలా చెప్పగలడు? ఈ దారుణానికి తను ప్రత్యక్ష సాక్షిగా మిగిలాడు.‘‘దీదీకేమైంది? దీదీకేమైంది?’’ పూర్ణచంద్ర పదేపదే ఏడుస్తూ అరుస్తున్నాడు. కజోలికా బోర్లా పడి ఉంది. సుదీప్‌ తన చేతిని ఆమె వీపు మీద ఆనించాడు. శ్వాస ఆడుతున్నది. అంటే చనిపోలేదు. కాని తీవ్రంగా గాయపడింది. ‘‘పూర్ణా! మీ దీదీకి వెంటనే వైద్యం చేయించాలి. ఆమెను బతికించాలి’’పూర్ణ చెదిరి ఉన్న దుస్తుల్ని ఏరి సుదీప్‌ చేతికిచ్చాడు. ‘‘ఆమెకు దుస్తులు వెయ్యండి’’ అన్నాడు.‘‘మరి నువ్వేం చేస్తావు?’’‘‘నేను ఆ మృగాన్ని చంపే మార్గం కనుగొంటాను.’’కజోలికాకు ఆచ్ఛాదన ఏర్పరుస్తుండగా సుదీప్‌కు వేళ్లు వణికాయి. కజోలికాను పైకెత్తి భుజాల మీద వేసుకున్నాడు. ఆమెని కుటుంబానికి అందజేయాలి. వైద్యం చేయించాలి. బతికించాలి. ఇంటి వైపు బయల్దేరారు.ఒక్కసారిగా రేబొతీ, తుపాకులు ధరించిన అతని సహచరులూ ప్రత్యక్షమయ్యారు. సుదీప్‌ని అడ్డగించారు.‘‘రేబొతీ దాదా! మీరు ఆలస్యంగా వచ్చారు. వాళ్లు దీదీని చంపేశారు.’’‘‘ఎవరు.. ఎవరు?’’‘‘ఆ జీపులో వచ్చిన వాళ్లు’’‘‘నాకిప్పుడు అర్థమైంది’’ అంటూ రేబొతీ తన తుపాకీని సుదీప్‌ గుండెకు గురిపెట్టాడు.‘‘వొద్దు.. వొద్దు... ఇతడ్ని చంపొద్దు’’ అంటూ పూర్ణచంద్ర అరుస్తూ అడ్డుపడ్డాడు. ‘‘ఇతడేమీ చేయలేదు. ఇతడు దాదా స్నేహితుడు.’’సుదీప్‌ రానున్న పరిణామాలకు సిద్ధంగా ఉన్నాడు. ‘‘ముందు ఈమెకు వైద్యం చేయించాలి’’ అన్నాడు.రేబొతీ ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. అతని మిత్రులు కూడా తుపాకులు దించి విషాదగ్రస్తులయ్యారు. ‘‘పగ తీర్చుకుంటాం’’ అని ప్రతిజ్ఞ చేశారు.సుదీప్‌ కజోలికాను ఆమె ఇంటి వైపు మోసుకెళ్లాడు. పూర్ణచంద్ర దుఃఖిస్తూ వెంబడించాడు. వారు చేరే సరికే జనం పోగై ఉన్నారు. శుభప్రియో తిరిగి వచ్చాడు. అతడూ విచక్షణ కోల్పోయాడు. స్నేహాన్ని జాతి విద్వేషం అధిగమించింది. అతని కళ్లు నిప్పు కణికల్లా ఉన్నాయి. సుదీప్‌ వైపు తిరిగి విషం చిమ్మాయి. ‘‘నువ్వు... నువ్వు... మీ జనం చేసినదానికి నువ్వే మూల్యం చెల్లించాలి..’’ అని అరిచాడు.సుదీప్‌ మౌనం వహించాడు. తన జాతి మొత్తం చేసిన అకృత్యాలకు సిగ్గుతో తల దించుకున్నాడు.శుభప్రియొ తండ్రి ఒక తాడుని తెచ్చాడు. సుదీప్‌ వారించలేదు. వారు అతడ్ని ఒక చెట్టుకు కట్టివేశారు. దాన్నీ నిశ్శబ్దంగా భరించాడు. వారి ప్రచండ క్రో«ధాన్ని అర్థం చేసుకున్నాడు. వారేం చేయగలరో అదే చేస్తున్నారు.శుభప్రియొ కూడా నిశ్చయుడైపోయాడు. ‘‘నీ ఒక్కడి బాధ మరచిపోవడం ముఖ్యం కాదు. ఒక నిజమైన బాధ... ఒక జాతి కన్నీటిగాథని నువ్వు తెలుసుకోవాలి... అనుభవించాలి.’’ సుదీప్‌ మౌనం వహించాడు. శిక్షని అంగీకరించాడు. తలవంచుకున్నాడు. ఒక పండు వెన్నెల రాత్రి నెమ్మదిగా నిబిడ గాఢాంధకారంగా మారింది.
 

బంగ్లా మూలం : సెలీనా హుస్సేన్‌

అనువాదం: టి.షణ్ముఖరావు 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు