విధి నిర్ణయం

24 Jun, 2018 00:45 IST|Sakshi

కథా ప్రపంచం

ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నా ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ రాసుకున్న ఉత్తరాన్ని మడిచి కనిపించేలాగా బల్లపైన పెట్టా. వాకిలి తలుపులను మూసేసి గడియ పెట్టా. తాడు తీసుకుని స్టూలు పైనెక్కి దాని ఒక కొస పైనున్న దూలానికి కట్టా. తాడు రెండో చివర జారుముడి వేసి నా మెడకు బిగించుకున్నా. ఇక స్టూల్‌ పైనుంచి కిందికి దూకేస్తే సరిపోతుంది. నా పాతికేళ్ళ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పడిపోతుంది. చివరిసారిగా అమ్మని, చెల్లెలినీ మనస్సులో తలచుకున్నాను. ఇవాళే నా పుట్టినరోజు కూడాను. నాపేరు మీద దేవుడికి అర్చన చేయించటానికని వాళ్ళిద్దరూ గుడికెళ్ళారు. ఉన్నట్టుండి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వాళ్ళిద్దరికీ నేనంటే ప్రాణం. నన్ను ఎప్పుడూ పల్లెత్తుమాట కూడా అనని మా అమ్మ నా జీవితంలో మొట్టమొదటిసారి వారం రోజుల కిందట నేను బరువు, బాధ్యతలని పట్టించుకోకుండా వ్యవహరించటం గురించి గట్టిగా చీవాట్లు పెట్టింది. ఆ రోజు చెల్లాయికి పెళ్లిచూపులు. అబ్బాయి తరపు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జరిగిందా సంఘటన. వాళ్ళతో గేటుదాకా వెళ్లి సాగనంపి తిరిగివచ్చిన పెళ్ళిళ్ళ బ్రోకరు అసలు విషయం చల్లగా చెప్పాడు ‘‘చాలా మంచి సంబంధం. అబ్బాయి బాగా సంపాయిస్తున్నాడు. మన అదృష్టం. కట్నం కింద వాళ్ళు పది సవరల బంగారం మాత్రమే అడిగారు’’. 

‘‘పది సవరలా? ..అంత బంగారం పెట్టడం మావల్ల కాదు’’ అన్నాను.‘‘బాగుందండీ. ఇకముందు సంబంధాలను వెతకమని నాతో అనబాకండి. కనీసం పది సవర్లు కూడా ఇవ్వకండా పెళ్ళికి ఎవరూ ముందుకు రారు.’’ అన్నాడు. అతడు విసురుగా వెళ్లిపోయింతరువాత అమ్మ అవమానభారంతో ఏడుస్తూ అన్నది ‘‘నీకున్నది ఒక్కగానొక్క తోడబుట్టిన చెల్లెలు. కనీసం దాని పెళ్ళిచేసి ఒక అయ్య చేతిలో పెట్టడానికి కూడా నీకు చేతకాకుండా పోతున్నదేరా నాయనా?! అంతా నా ఖర్మ.’’అమ్మ అన్న మాటల్లో సత్యం లేకపోలేదు. అందుకే మారుమాట్లాడలేక నాలో నేను కుమిలిపోయా. ఎవరికీ పనికిరాని నా ఈ జీవితం పట్ల విరక్తి పుట్టింది. నాకు ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదు. నేనూ, అమ్మ, చెల్లాయి ముగ్గురమే ఇమిడిన పొదరిల్లు లాంటి చిన్న కుటుంబం మాది. నా చిన్నతనంలోనే నాన్న చనిపోయాడు. ఉన్న ఊళ్లోనే ఒక స్కూల్లో వంటమనిషిగా పనిచేస్తున్న అమ్మ సంపాదన మీదనే ఆధారపడి బతుకుతోంది మా కుటుంబం. డిగ్రీ పరీక్షల్లో తప్పిన తరువాత జనాలకు ఇళ్ళు కట్టి ఇచ్చే ఒక ప్రైవేటు రియల్‌ ఎస్టేట్‌ కాంట్రాక్టరు దగ్గర కొంతకాలం పనిచేశా. సరిగ్గా నా దురదృష్టం కొద్ది నేను ఉద్యోగంలో చేరిన కొన్నాళ్ళకే  బీహార్, బెంగాల్, రాష్ట్రాలనుంచి నిరుద్యోగులైన యువకులు పనికోసం కేరళకు వందల సంఖ్యలో రావటం మొదలైంది. దాంతో ప్రతిదానికీ రూల్సు మాట్లాడే స్థానికులను పనికి పిలవటం మానేశారు కాంట్రాక్టర్లు. దాంతో నాలుగయిదేళ్ళు ఎండపొడ తగలకుండా, చెమట చుక్క రాల్చకుండా రోజులు గడపటం మినహా ఏమాత్రం సంపాదన లేదు.

నేను స్టూల్‌ మీదనుంచి దూకటానికి సిద్ధమయ్యానో లేదో వీధి తలుపు తడుతూ ఎవరో పిలవటం వినిపించింది.   ‘ప్రశాంతంగా చావనీయట్లేదు కదరా’ తిట్టుకుంటూ తాడులోంచి తలని బయటకు ఊడదీసి స్టూలు పైనుంచి దిగాను. మెల్లిగా వెళ్లి తలుపు తీసి చూస్తే... బయట పేపరబ్బాయి నుంచుని ఉన్నాడు.‘‘పేపరు పడేసి వెళ్లిపోవచ్చుగా?’’ విసుక్కుంటూ అడిగా వాణ్ని.‘‘ఈ నెల డబ్బులు ఇంకా ఇవ్వలేదు..’’ బుర్ర గోక్కుంటూ నసిగాడు వాడు. ‘‘రేపొచ్చి తీసికెళ్ళు.’’ అన్నాను. సరేనంటూ వెళ్ళిపోయాడు పేపరబ్బాయి. పేపరును టేబుల్‌ పైన పడేసి తలుపులు మూసేసి మళ్ళీ స్టూలుకేసి వెళ్తున్న వాణ్నల్లా పేపరు పైన నా దృష్టి పడేసరికి ఒక్కక్షణం ఆగిపోయా. ‘....ఎట్లాగూ చావటానికి డిసైడయ్యాం. పేపరు చదివేసి చస్తే పోలా?’ పేపరందుకుని తిరగేస్తున్న నా కళ్ళు ఒక ప్రకటన దగ్గర ఆగిపోయాయి. ‘కిడ్నీ కావలెను’ అన్న ఆ ప్రకటన నా దృష్టిని ఆకర్షించింది. ‘‘మూత్రపిండాల ఆపరేషను జరిగిపోతున్న పేషంటుకు బీ పాజిటివ్‌ గ్రూపు కిడ్నీ అర్జంటుగా కావలెను. సహృదయులు, మానవతావాదులైన ఉదారస్వభావం కలిగిన దాతలు దయచేసి సంప్రదించండి.’’ ఇదీ ఆ ప్రకటన. చివరన కాంటాక్ట్‌ చెయ్యటానికి ఒక ఫోన్‌ నెంబరు ఉంది. ప్రకటన చదవగానే నా బ్లడ్‌ గ్రూపు కూడా బీ పాజిటివ్‌ అన్న విషయం గుర్తుకొచ్చింది. పట్టరాని ఆనందంతో ‘యురేకా’ అని గొంతెత్తి గట్టిగా అరుద్దామనిపించినా, ఆ ప్రయత్నాన్ని అతికష్టం మీద అణచుకున్నాను. అనుకోకుండా ఎదురైన బంగారం లాంటి ఈ అవకాశాన్ని గనక సద్వినియోగం చేసుకోగలిగితే చెల్లెలి పెళ్లి అంగరంగవైభవంగా జరిపించగలను. బతుకుపైన కొత్తగా చిగురించిన ఆసక్తితో ఆ ప్రకటనలోని నెంబరుకు డయల్‌ చేసి కొన్ని వివరాలు తెలుసుకున్నా.
        ∙∙ 
ఏది ఏమైనా ఇంకేమాత్రమూ కాలయాపన చేయరాదనే నిర్ణయానికి వచ్చాను. మరునిమిషం డ్రెస్సు మార్చుకుని తయారై బయలుదేరా.కిడ్నీకి ఎంత ధర చెప్పాలి? బస్సులో కూర్చుని బాగా ఆలోచించా. ఇటీవల కిడ్నీలని  అమ్ముకున్న ఎవడి అడ్రస్సన్నా వెతికిపట్టుకుని వెళ్లి కలిసి మాట్లాడి వుంటే వివరాలన్నీ తెలిసేవి. కిడ్నీ ప్రస్తుతం పలుకుతున్న ధర తెలుసుకోవటానికి అంతకన్నా వేరే మార్గమే లేదు. పేపర్లో మార్కెట్‌ ధరవరలు కాలమ్‌లో ఎండుకొబ్బరి, రబ్బరు, మిరియాలు వగైరాల ధరలు మాత్రమే కనిపిస్తాయి. మనిషికి బతకటానికి అత్యవసరమైన కిడ్నీ మార్కెట్‌ ధర ఏరోజుకారోజు పేపర్లో ఇవ్వకపోవటం మరీ దారుణం! ఛీ...!చెల్లాయి పెళ్ళికి అన్నీ కలిపితే ఎంత లేదన్నా కనీసం నాలుగు లక్షల ఖర్చన్నా వస్తుంది. ఆ మొత్తానికి ఇంకో ఆరు లక్షలు కలిపి కిడ్నీకి పదిలక్షలు అడగాలి. వాళ్ళు బేరమాడితే.. ఒక లక్ష తగ్గించి తొమ్మిది లక్షల రూపాయలకు డీల్‌ కుదుర్చుకోవాలి. పెళ్లిఖర్చులన్నీ పోను మిగిలిన అయిదు లక్షల రూపాయలని ఏదన్నా బ్యాంకులో ఫిక్సెడ్‌ డిపాజిట్‌ చేసుకుంటే దానిమీద వచ్చే వడ్డీతో జీవితాంతం కాలుమీద కాలేసుకుని కూర్చుని హాయిగా బతకొచ్చు.  అప్పుడే అనుకోకుండా నా గతకాలపు ప్రియురాలి రూపం నా స్మృతిపథంలో మెరిసింది. నన్ను తప్ప వేరే ఎవర్నీ పెళ్లిచేసుకోనని నా కళ్ళలోకి చూస్తూ వెయ్యి ప్రమాణాలు చేసిన అమ్మాయి, నా తియ్యటి కలలను కల్లలు చేస్తూ హఠాత్తుగా ఒకరోజున ఇంటికొచ్చి తన పెళ్లిపత్రిక నా చేతిలో పెట్టి ‘‘నా పెళ్లి కుదిరింది. ఆయన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. గల్ఫ్‌లో ఉద్యోగం.’’ ఏమాత్రం తత్తరపాటు లేకుండా, మెరుస్తున్న కళ్ళతో చెప్పింది. వెడ్డింగ్‌ కార్డ్‌ని అందుకుని చదువుతూ అప్రయత్నంగానే దీర్ఘంగా నిట్టూర్చాను. ‘‘ప్లీజ్, నన్ను అపార్థం చేసుకోకు. మనం అనుకున్నట్టుగా అన్నీ జరగవు. గతాన్ని కలలా మరిచిపో. ఇప్పటినుంచి నన్ను నీ సోదరిగా భావించుకో.’’ చెయ్యాల్సిందంతా చేసేసి నాకు ఒక ఉచిత సలహా పడేసింది. ‘వెళ్ళొస్తా’నంటూ వెనుతిరిగి బయటకు నడిచింది. 

కోజికోడ్‌ బస్టాండులో బస్‌ దిగి ఆసుపత్రికి వెళ్ళటానికి ఆటో ఎక్కాను. ఆటో బయల్దేరగానే పొద్దున్న నేను మాట్లాడిన నంబరుకు మళ్ళీ కాల్‌ చేశా. ఆటోలోంచి బయటకు చూశాను. ఆటో మెయిన్‌ రోడ్‌లోంచి దిగిపోయి సందుగొందుల్లోంచి తిరిగి ఆస్పత్రికి చేరింది. ఆస్పత్రికి చేరుకొని ఆరో బ్లాక్‌లో పద్దెనిమిదో నెంబరు రూము కనుక్కోవటానికి పెద్దగా కష్టపడాల్సి రాలేదు. కాలింగ్‌ బెల్లు నొక్కితే వచ్చి తలుపు తెరిచింది ఆ అమ్మాయి. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. ఆ అమ్మాయి.. నన్ను దోచుకున్న... వన్నెల దొరసాని..! నా గతకాలపు ప్రేయసి..!ఆరోజు తన పెళ్ళిపత్రిక ఇవ్వటానికి మా ఇంటికి వచ్చిన రోజే మేము చివరిసారిగా కలుసుకున్నది. మళ్ళీ ఇప్పుడే కలవటం. ‘‘నువ్వు...ఇక్కడ..?’’ అప్రయత్నంగా అడిగాను. ‘‘కిడ్నీ పేషంటు నా భర్త,’’ అన్నది చూపులు మరల్చుకుని.‘‘ఫోన్లో మాట్లాడినప్పుడు నీ గొంతు గుర్తుపట్టలేకపోయాను..’’ అన్నాను.‘‘మొదటిసారి మీరు ఫోన్లో మాట్లాడినప్పుడే గుర్తుపట్టాను. ఎంత మందిలోనైనా, ఎంతటి గందరగోళంలోనైనా మీ స్వరాన్ని ఇట్టే గుర్తుపట్టేయగలను.’’ఆ మాటలు విని నాకు గుండెల్లో కలుక్కుమంది. ‘‘మరి నాకు అప్పుడే చెప్పొచ్చు కదా?’’‘‘మీకు తెలిసిపోతే మీరు రారేమోననిపించింది. ఈ రెండేళ్లలో నేను ఎన్నిసార్లు తహతహలాడానో మిమ్మల్ని వూరికేనన్నా కనీసం ఒకసారి చూడగలిగితే బాగుండునని.’’‘‘..దేనికి..?’’‘‘చెప్పానుగా.. ఊరికే..’’‘‘మీవారికి ఎంతకాలమైంది ఇలా?’’ ‘‘పెళ్ళైన కొత్తలోనే వ్యాధి లక్షణాలు కనిపించసాగాయి. రెండేళ్ళ కిందట వ్యాధి నిర్ధారణ అయింది.’’ నాకది వినగానే ఒక పైశాచికానందం కలిగింది. దుబాయిలో పనిచేస్తున్న ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు భర్తగా రాబోతున్నాడనగానే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నన్ను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించిన స్త్రీ. నాకు చేసిన అన్యాయానికి ఇంతకన్నా పెద్ద శిక్ష కావాల్సిందే. నా మనస్సు కసిగా నవ్వింది.

‘‘వైద్యానికి బోలడంత ఖర్చు. కదా?’’ సానుభూతి నటిస్తూ అడిగా.‘‘ఉన్న ఇల్లు, పొలంతో సహా ఆస్తంతా అమ్మితే వచ్చిన డబ్బు పూర్తిగా వైద్యానికే ఖర్చయ్యింది. ఇప్పుడిక మా పరిస్థితి పైన ఆకాశం, కింద భూమి.. ఇవే దిక్కు అన్నట్టుగా తయారయ్యింది’’.ఆమె దీనావస్థను వింటూ ఉంటే తెలిసినవాణ్ని గనక కిడ్నీని తక్కువ ధరలో ఇవ్వమని అడుగుతుందేమోననే అనుమానం కలుగసాగింది. ఇంకా ఆమెతోమంచీచెడు మాట్లాడి చనువు పెంచుకొనే బదులు అసలు విషయం అడిగటానికి సిద్ధమయ్యా. ‘‘ఇంతకీ కిడ్నీకి మీరు ఎంత ఇద్దామనుకుంటున్నారు?’’ అడిగేశా. ‘‘ముందు అసలు మీ కిడ్నీ నా భర్తకు సరిపోతుందా లేదా అనేది తేలనీయండి. ఆ తరువాత కదా డబ్బు సంగతి?’’‘‘నా బ్లడ్‌ గ్రూపు బీ పాజిటివ్‌. మీ ఆయనదీ అదే. ఇంకేముంది?’’‘‘గ్రూపొక్కటే సరిపోదు. బోలెడు టెస్టులు చెయ్యాల్సి ఉంటుంది.’’ఆమె మాటలు విన్నాక నన్ను నేను తిట్టుకున్నాను. బోల్డంత డబ్బు లభిస్తుందనే ఆశలో ఇలాంటి సమస్యల గురించి అసలే ఆలోచించలేదు. చివరికి నేను కన్న కలలన్నీ కల్లలై పోతాయేమోనన్న భయం కలగసాగింది. అయితే ఆసుపత్రి వాళ్ళు చేసిన అన్ని టెస్టుల ఫలితాలు నాకు అనుకూలంగానే వచ్చాయి. ‘‘కిడ్నీకి మీరివ్వబోయే డబ్బు గురించి...’’ నసిగాను నేను ఆమెతో.‘‘అంతా దేవుడి దయ.’’ రెండు చేతులనూ పైకెత్తి అన్నది. ఆమె చేష్టలు, మాటలతో నాకు మతిపోయింది.‘‘విషయం క్లియర్‌గా చెప్పు. తమాషాలకు సమయం కాదిది.’’ కోపాన్ని అతిప్రయత్నం మీద అణచుకొంటూ సీరియస్‌గా అన్నాను.‘‘ఇందులో తమాషా ఏముంది? మా ఇప్పటి పరిస్థితి మీకు ఇంతకుముందే చెప్పాను కదా?’’‘‘అంటే? డబ్బులు అసలు లేవనేగా? అలాం టప్పుడు పత్రికలో ప్రకటించటంలో నీ ఉద్దేశ్యం?’’‘‘ప్రకటనలో ‘సహృదయులు, మానవతావాదులైన ఉదారస్వభావం కలిగిన దాతలు సంప్రదించగలరు’ అని స్పష్టంగా ఉన్నది. మీరు గమనించలేదేమో? అలాంటి స్వభావం ఉన్న వాళ్ళు ప్రతిఫలంగా డబ్బును ఆశించరనే విశ్వాసం నాకున్నది.’’ ‘‘నువ్వనేది నేను నా కిడ్నీని ఇస్తే నువ్వు నాకు ప్రేమ, వాత్సల్యాలను పంచుతావు. అంతేగా?’’‘‘మీరు కిడ్నీ ఇవ్వకపోయినా సరే, మీరంటే నాకు ప్రేమే.’’

‘‘నీ ప్రేమ గురించి నాకు తెలియదా?’’‘‘నాకు ప్రేమ లేదనా మీరనేది..?’’‘‘ప్రేమ. నిజంగా నువ్వు నన్ను ప్రేమించి ఉంటే నన్నట్లా మోసం చేసి....’’‘‘పావలా సంపాదన లేక, ఉద్యోగమూ, సద్యోగమూ లేకుండా లేనిపోని గొప్పలు చెప్పుకొంటూ తిరిగేవాడిని ఏం చూసి ఏ తల్లిదండ్రులైనా తమ అమ్మాయికి భర్తగా ఒప్పుకుంటారు? ఇంకో విషయం చెప్పనా? ప్రేమ లేనిది నాకు కాదు. మీకు. మీకు నామీద ఏమాత్రమూప్రేమ లేదు. నిజంగా ప్రేమే ఉండి ఉంటే నేను వేరే ఎవర్నో పెళ్లిచేసుకున్నాననే కారణం చేత నాపట్ల ద్వేషాన్ని పెంచుకుని నన్ను అసహ్యించుకోరు.’’ ఆమె వ్యవహారం దొంగోడు పోలీసుని గద్దించినట్టుగా ఉన్నది. కిడ్నీ అమ్ముకుని వచ్చిన డబ్బులతో చెల్లి పెళ్లి చేద్దామని నేను కన్న కలలన్నీ పేకమేడల్లాగా కూలిపోబోతున్నాయని అర్థం అయ్యే కొద్దీ నాకు కోపంతో పాటు భరించలేని దుఃఖం కూడా ముంచుకొచ్చింది. ‘‘ఇంతకీ మీ నిర్ణయమేమిటి?’’ అడిగింది ఆత్రుతగా. ‘‘నా చెల్లెలి పెళ్ళికి నాకు డబ్బు చాలా అవసరం. నేను కిడ్నీని అమ్మటానికి తయారైందీ దానికోసం మాత్రమే.’’ అన్నాను.‘‘సరే.. అయితే! మీ అవసరానికి తగినంత డబ్బునిచ్చి కిడ్నీ కొనుక్కోగల తాహత్తున్న వాళ్ళు మీకు దొరకాలని నేను ప్రభువును ప్రార్థిస్తాను.’’ అన్నది.

‘‘డబ్బులేవీ అడక్కుండా కిడ్నీదానం చేసే ఒక సహృదయతగల దాత కూడా నీకు లభించాలని నేనూ కోరుకుంటున్నాను.’’ ఆమెకు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఆసుపత్రి నుంచి బయటకొచ్చాను. కిడ్నీ అమ్మాలనే నా ప్రయత్నం నెరవేరనందుకు బాధ కలిగింది. అయితేనేం ఎప్పుడైనా డబ్బులని సంపాయించిపెట్టే లక్షల ఆస్తికి సొంతదారుడినన్న ఒక ధీమాతో మావూరి బస్సెక్కాను. బస్సు దిగి వీధిమలుపులోకి అడుగుపెట్టగానే బిగ్గరగా ఏడుపులు వినబడ్డాయి. అది అమ్మ ఏడుపే. మా ఇంటిముందర, పెరట్లో జనం గుంపులుగా గుమిగూడి ఉన్నారు. గాబరాగా విషయం ఏమిటో తెలుసుకుందామని గబగబా ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళా. ఆత్మహత్య చేసుకుందామని నేను ఇంటి దూలానికి కట్టి వేలాడదీసిన తాడుకు నా ముద్దుల చెల్లెలి మృతశరీరం వేలాడుతోంది. బల్ల పైన నేను రాసిపెట్టిన ఉత్తరం గాలికి రెపరెపలాడుతోంది. నేను రాసిన రాతంతా పెన్నుతో అడ్డదిడ్డంగా కొట్టేసి ఉంది. ఆ కాగితపు రెండోపక్కన ఏదో ఉత్తరం రాసి ఉంది. తీసుకుని చదివా.‘‘ప్రియమైన అన్నయ్యకు,నా వల్ల నీకు ఎన్ని కష్టాలు? నా కారణంగా నువ్వు చావటానికి నిర్ణయించుకున్నట్టు నీ ఈ ఉత్తరం చదివి నాకు అర్థమైంది. ఈ రోజే కాదు, ఎప్పుడైనా అలా జరగటం నేను భరించలేను. నువ్వు కట్టుకున్న ఈ తాడును నేను వాడుకొంటున్నాను. నన్ను మన్నించు.ప్రేమతో నీ ప్రియాతి ప్రియమైన చెల్లి.’’ఎంత ఘోరం జరిగిపోయింది నా తొందరపాటు చర్య వల్ల?విపరీతంగా ఏడ్చా. నా ఏడుపు నాకే విచిత్రంగా కృతకంగా అనిపించింది. 
నా మనస్సు ఆ రాత్రంతా చెప్పలేని చిత్రవధననుభవించింది. మరుసటిరోజు చెల్లెలి శవసంస్కారం జరిగింది. వచ్చినవాళ్ళంతా వెళ్ళిపోయారు. అమ్మ జీవచ్ఛవంలాగా పడుంది. అంతర్గతంగా నాలో విపరీతమైన సంఘర్షణ! నేనిక ఆగలేకపోయాను. ఒక నిశ్చయానికొచ్చాను. నిద్రలో నడుస్తున్నవాడిలాగా ఇంట్లోంచి బయటకొచ్చా. 

కోజికోడ్‌ వెళ్ళే బస్సెక్కి కూర్చున్నా. ఏదో భయంకరమైన తుఫాను మధ్యలో చిక్కుకున్న పడవ లాగా మనస్సు తల్లడిల్లుతోంది. బస్సు దిగి ఆటోలో ఆసుపత్రికి చేరుకున్నా. గదిలో స్టూలుపైన అటుతిరిగి కూర్చుని ఉంది ఆమె. బెడ్డు పైన స్పృహ లేకుండా పడి ఉన్న ఆమె భర్త. నా పిలుపుకు వెనుతిరిగి చూసిందామె. ‘‘మీరు... మళ్ళీ ఇక్కడికి..?’’ ధారగా కారుతున్న కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ అడిగింది. ‘‘కిడ్నీ అమ్ముకుని డబ్బు సంపాయించుకుని నేను సాధించగలిగేది ఏమీ లేకుండా పోయింది.’’ అన్నాను. అర్థం గాక అయోమయంగా నాకేసి చూసింది. నా చెల్లెలు ఆత్మహత్య చేసుకున్న విషయం చెప్పగానే నోటమాటరాకుండా నిశ్చేష్టురాలైంది. ‘‘నాకు ఒక్క దుఖమే మిగిలింది. చనిపోయే ముందు కూడా నా చెల్లి దేవుడిని నా గురించి ప్రార్థించింది. బదులుగా దానికోసం నేనేమీ చెయ్యలేకపోయాను. నేను దూలానికి కట్టిన తాడుకు వేలాడి నా చెల్లెలు చచ్చిపోయింది. ఇరవై అయిదేళ్ళ సహజీవనంలో నేను దానికి ఇచ్చిన ఒకే ఒక బహుమతి ఆ ఉరితాడు మాత్రమే.’’నా గొంతులో దుఃఖం నిండుకుని మాట్లాడలేని స్థితికి జారుకున్నాను. గుండె పగిలి ఏడ్చాను. ఆ అలికిడికి బెడ్డుపైన అంతవరకు అచేతనంగా పడుకుని ఉన్న ఆమె భర్త ఆయాసపడుతూ మెల్లిగా లేచి కూర్చున్నాడు. దుఃఖాన్ని అతికష్టం మీద ఆపుకుంటూ అన్నాను, ‘‘నిష్కలంకంగా ప్రార్థిస్తే ప్రభువు దారిచూపిస్తాడనే నీ అచంచలమైన దైవవిశ్వాసం సాకారమైందన్నట్టుగా ఇదిగో నేను నీ భర్తకు ఇవ్వాల్సిన కిడ్నీతో తిరిగివచ్చాను’’.
- మలయాళ మూలం : పి.ఎన్‌. కిశోర్‌ కుమార్‌ 
- అనువాదం: వి.ఆర్‌. గణపతి 

మరిన్ని వార్తలు