రాకెట్‌ తేజ్‌బలి

15 Jul, 2018 00:28 IST|Sakshi

కథా ప్రపంచం

అలీబాగ్‌లో ఎర్రటి సంధ్యాసమయపు సుదీర్ఘమైన సముద్రతీరంలో దూరంగా ఒక్కడే నడుస్తున్న రాకెట్‌ తేజ్‌బలి కాస్త ఎక్కువ ఎర్రగా మెరుస్తున్నాడు. చప్పున చూస్తే అతను ఇటువైపు వస్తున్నాడో లేదా అటువైపు వెళుతున్నాడో తెలియటం లేదు. ఒకింత భేల్‌పురి, ఐస్‌క్రీం స్టాళ్ళున్న ఈ రద్దీస్థలం నుంచి అతను చాలా దూరంలోనే ఉన్నాడు. ఊరిజనానికి ఈ సముద్రం, సూర్యాస్తమయం ఏవీ కొత్త కాదు. అందువల్ల ఇక్కడ అంతగా జనసంచారం ఉండలేదు. అయినా నగరంలోని గులాభా నుంచి తాత్కాలికంగా తప్పించుకునే భ్రమలో వంద కిలో మీటర్ల దూరంలోని ముంబయి నుంచి వచ్చిన కొన్ని పిక్నిక్‌ బృందాలు సాయంత్రపు ఎరట్రి నీటిలో ఈతకొడుతున్నాయి. కోలాహలం వల్ల ఊపిరి కట్టివేసే ముంబై సముద్రతీరాలనే చూసినవారికి ఈ నిరాటంకమైన పొడవైన తీరం, భయం పుట్టించేంత నిర్జనంగా అనిపిస్తోంది. ఈ అరుదైన వ్యక్తులకు కూడా కావలసినంత దూరంలో వున్న తేజ్‌బలి నడుస్తున్నాడు. లేదా నుంచున్నాడు. అప్పుడప్పుడు సముద్రం నుంచి వేగంగా వీస్తున్న గాలికి నిప్పులా ధగధగ మెరుస్తున్నాడు.

అలీబాగ్‌ బీచ్‌ సమీపంలోనే క్యాంప్‌ వేసిన ‘మిలన్‌ డెత్‌ వెల్‌’లోని ప్రధాన మోటర్‌ సైకిల్‌ నడిపే తేజ్‌బలికి, రాకెట్‌ తేజ్‌బలి అనే విశేషణం ఏనాటినుంచి ప్రాప్తమైందో అతనికీ గుర్తులేదు. ఇప్పుడతనికి యాభై సమీపిస్తోంది. బహుశా పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం డైమండ్‌ సర్కస్‌ నుంచి వేరుపడినపుడే అతను రాకెట్‌ తేజ్‌బలి అయివుండాలి. అప్పుడు ‘మృత్యుగోళపు’ శరవేగపు మోటర్‌బైక్‌ వీరుడయ్యాడు. అక్కడి నుంచి బయటపడ్డ తరువాత విశాలమైన బావిలాంటి మృత్యుకూపాల వివిధ కంపెనీలను మార్చుతూ ఇప్పుడు గత ఐదారేళ్ళ నుంచి ఈ ‘మిలన్‌ డెత్‌ వెల్‌’లో చూపరుల ఒళ్ళు జలదరించేలా మోటర్‌బైక్‌ నడుపుతున్నాడు. చెవిపక్కన సైడ్‌లాక్‌లు నెరిసిన తేజ్‌బలి, కూపంపైనున్న వేదికమీద సకలజనుల దృష్టిని ఆకర్షించాలనే పెట్టినటువంటి మడ్‌గార్డ్‌లేని, విచిత్రమైన మూపులాంటి ఎర్రటిఎరుపు పెట్రోలు ట్యాంకు కలిగిన పాత మోటర్‌సైకిల్‌ మీద కూర్చోని యాక్సిలరేటర్‌ తిప్పి దిక్కులు పిక్కటిల్లే చప్పుడు  రేపేటప్పుడు, పాత వెస్టర్న్‌ ఇంగ్లిషు చిత్రాల నాయకుడిలా కనిపిస్తాడు. ఇక ఆకాశంలో విస్ఫోటించే రాకెట్‌లా ఏకాగ్రచిత్తంతో ఒంటరిగా నిశ్చలంగా ఉంటాడు. 

ఇవాళ అలీబాగ్‌ క్యాంప్‌లో చిట్టచివరి రోజు. రాత్రి పదిగంటల ఆటే చివరిది. గత పదిహేను రోజుల ఈ క్యాంపులో ఒక్కరోజూ తప్పించకుండా, తేజ్‌బలి సూర్యాస్తమయ సమయంలో ఈ తీరానికి వచ్చేవాడు. పది సెకండ్లయినా సరే, నల్లతేలులా ఉన్నటువంటి పాత యెజ్డీ బైక్‌లో ఫట్‌ఫట్‌మని చిమ్ముకొచ్చి తీరంలో పల్లంవుంటే, తడిసినప్పటికీ గట్టిగా ఉన్న రేవు పొడవునా పరుగెత్తించి తిరిగొస్తాడు. అతడి వెనుక పిల్లలు పరుగెత్తుకు వస్తే– కేకలు వేసి, వేగంగా బైక్‌ నడిపి, చీకటి కమ్ముకోసాగిన వాడిన పొదలగుంపు వెనుక కనుమరుగైపోతాడు. చాలాసేపటి వరకు సైలెన్సర్‌ లేని ఆ నల్లతేలు ఫట్‌ఫట్‌మంటూ సద్దు చేస్తూ తీరంలోని గాలిలో నిలిచిపోతుంది. రేపటి నుంచి ఈ సాయంత్రపు సూర్యాస్తమయంలోని ఈ క్షణం మళ్ళీ ఇక్కడ ఉండదనే ఆలోచన అతను ఊహించిన దానికన్నా అధికంగా అతడిని ఆవరించుకుందా అన్నట్టు, ఇవాళ అతను తన నల్లతేలును కొబ్బరిబోండాలవాడి పక్కన నిలిపి, మౌనంగా రేవు తీరంలో నడిచిపోయాడు. ప్రవాహం తగ్గటంవల్ల సముద్రం వెనక్కి జరిగింది. తడి తీరంలో సాయంత్రపు ఎరుపు ప్రతిఫలిస్తూ ప్రత్యేకమైన ఓ మెరుపు అంచుమీద తేజ్‌బలి అడుగులు మృదువుగా ఏర్పడ్డాయి. కళ్ళనిండా నీళ్ళు వచ్చినట్టు, ఈ అడుగులు ఏర్పరిచిన ఇసుక చెలమలలో నీరు ఉబికి వస్తోంది. ఎదురుగా ఉన్న సముద్రంలో నిలబడిన పాతకోట ఇటువైపు నుంచి నీడను తొడుక్కుంటూ నల్లబారుతోంది. ప్రతిరోజూ దాన్ని చూశాడు. ఇక్కడి నుంచే. అయినా అక్కడికి వెళ్ళాలనిపించలేదు. ప్రవాహం మరీ తక్కువగా ఉన్నప్పుడు కోటవరకూ ఇసుక తీరం ఏర్పడి ప్రజలు అక్కడికి నడుచుకుంటూనే వెళతారట. ఆటుపోట్లు ఉన్నప్పుడే ఏవేవో రేవుల నుంచి చిన్నపడవల్లో, లాంచీలలో వచ్చిన జనం ఈ కోట నడిగడ్డవైపు ఊగుతూ సాగుతారు. ఈ కోట ఎప్పుడో ఎక్కడో పడిన స్వప్నంలా ఉంది. దాని అస్పష్టమైన కిటికీలలో చీకటి కమ్ముకుంటోంది. దాని ప్రాంగణంలోని చెట్లనిండా నల్లటి పక్షులు కూర్చున్నట్లున్నాయి. విరిగిన కోట బురుజు చిరిగిన భూపటంలా నిలుచోనుంది. తేజ్‌బలి మళ్ళీ వస్తానని కేకవేశాడు.

వేలాది ఊళ్ళలో ఉన్నాడు. అయితే ఎక్కడా ఏదీ ఇలా ఆకర్షించలేదు. డెత్‌ వెల్‌ అడుగున ఉన్న చిన్న తలుపు తోసి లోపలికి చేరి తలుపు మూసుకుని పైకి చూస్తాడుకదా, పైన బావిచుట్టూ వేదిక మీదికి వంగి నుంచున్న వందలాది కళ్ళ నేపథ్యంలో లోతైన ఆకాశం ఉంది. జనం కొట్టిన చప్పట్లు బావిలోకి రాలిపడతాయి. మెల్లగా ఎర్రటి మోటార్‌బైక్‌ కిక్‌ కొట్టినపుడు జనసమూహం ఉద్రిక్తతతో నిటారుగా నుంచుంటుంది. రాకెట్‌లా తేజ్‌బలి రివ్వురివ్వురివ్వుమని పైకెక్కి వస్తాడు. అంతే. మొత్తం డెత్‌ వెల్‌ కంపిస్తుంది, వీక్షకులు భయపడేలా. ఐటం ముగిసి కాస్త అడ్డదిడ్డంగా తిరిగి కిందికి దిగి మధ్యనున్న గరుడ స్తంభానికి వాహనాన్ని ఆనించి, బావి అడుగున ఉన్న చిన్న తలుపు తోసి కూపం బయటికి వెళతాడు. బయటకూడా అదే సమూహం. అన్ని ఊళ్ళల్లోనూ అదే సమూహం. ఏ కలలోనూ రానటువంటి సమూహం. ఎవరో మంత్రం వేసినట్టు రాత్రి పది అవగానే కరిగిపోయే సమూహం. ఈ సమూహాన్ని దాటి, దాని చేతులు, ఒళ్ళు నిమిరి, తేజ్‌బలి సముద్రతీరాన్ని చేరేవాడు. అంచులో నిలబడి కోటను చూసేవాడు. కోటను చుట్టుముట్టిన సముద్రం నెమ్మదిగా అతడి పాదాలను తడిపి, వేగంగా వెనక్కు జరుగుతూ పాదాలకింది ఇసుకనూ తోడేసేది. తేజ్‌బలి ‘మళ్ళీ వస్తాను’ అని కేక వేసేవాడు. 

ఒకవిధంగా చూస్తే అతడిని ఇవాళ ఇలా స్వేచ్ఛగా తీరానికి పంపే పెద్దమనస్సు చూపినవాడు యజమాని రామ్‌ప్యారే. చివరిరోజు కావటంవల్ల అన్ని షోలలోనూ నువ్వు ఉండాల్సిందే అని ఒత్తిడి పెట్టకుండా, ‘‘తేజ్‌బలి, నీపాటికి నువ్వు తిరిగిరా. ఈ రోజు ఛగున్, పట్టూలు ఐటం చేస్తారు. వారు సొంతంగా నిర్వహించడానికి తయారుకావాలి కదా! వెళ్ళు. మజా చెయ్‌. రేపు ఉదయం మనం ఊరు వదులుతాం. గుర్తుంచుకో’’ అని నల్లతేలు కీ ఇచ్చాడు రామ్‌ప్యారే. అప్పుడు అతను కాస్త కలవరంలో ఉన్నట్టు కనిపించాడు. రామ్‌ప్యారే కళ్ళల్లో  తేజ్‌బలి గురించి ఎప్పుడూ గుప్తమైన ఆరాధన భావమొకటి ఉన్నట్టుండేది. తలుచుకుని వుంటే, అదృష్టం వరించివుంటే, మరెక్కడో వెలిగిపోగలిగే తేజ్‌బలి అంతఃసత్వాన్ని గాఢంగా గౌరవించేవాడిలా రామ్‌ప్యారే వ్యవహరించేవాడు. రోజురోజుకూ దివాలా తీస్తున్నప్పటికీ తేజ్‌బలి జీతాన్ని, అతడి బైకుల సర్వీసింగ్‌లను తప్పకుండా నిర్వహించేవాడు. ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికైనా ముందు తేజ్‌బలిని ఒక మాట అడగటం అతడికి అలవాటైంది. ‘‘నువ్వు గొప్ప కళాకారుడివి. అంతే గొప్ప వ్యక్తివి. ఏమిటో నీ అదృష్టానికి పక్షవాతం వచ్చింది. అందువల్లే ఈ సామాన్యమైన స్టంట్‌ కళల కంపెనీకి వచ్చావు. మాకేమో నీవల్ల మంచే జరిగింది.  అయితే నీకు తగిన స్థలం, గౌరవం ఇచ్చే స్థితి మాదికాదు. ఉన్నదాంట్లోనే  సర్దుకుందాం’’ అనే రీతిలోనే అతని తీరు ఉండేది. తేజ్‌బలి ఆకర్షణీయమైన దుస్తులను సమయానికి ఉతికి లాండ్రీ చేయించే ఏర్పాటు గత సంవత్సరం ఇచలకరంజి క్యాంపులో రద్దయింది. అప్పుడు ఆదాయమే లేని, ‘మిలన్‌ డెత్‌ వెల్‌’ బిక్కుబిక్కుమంటోంది. జనరేటర్, విద్యుత్‌ మండలి లంచం, వేదిక అద్దె, స్థలానికి డిపాజిట్‌ –అన్నీ సమకూర్చేలోపు దివాలా తీసిన రామ్‌ప్యారేతో లాండ్రీ విషయంలో గొడవ పడటం సమంజసం కాదనిపించి తేజ్‌బలి మౌనం వహించాడు. తన దుస్తుల ఖర్చు తానే చూసుకోసాగాడు. ఒక రాత్రి తాగిన మత్తులో రామ్‌ప్యారే, ‘‘నిన్ను బాగా చూసుకోలేకపోతున్నాను. క్షమించు’’ అని తేజ్‌బలి కాళ్ళమీద పడి ఏడవసాగాడు. ‘‘వద్దు సేఠ్, వద్దు’’ అని తేజ్‌బలి అనగానే, ‘‘సేఠ్‌ అని నన్ను పిలవకు’’ అని అరిచి తన చెంపలు తానే వాయించుకున్నాడు. అతుకులు వేసిన జీన్స్‌ ప్యాంటులో ఉన్న రామ్‌ప్యారే కన్నీళ్ళను తన షర్ట్‌ చేతులకు తుడుచుకున్న  క్షణంలో తేజ్‌బలిలో ఏదో పొంగినట్టయ్యింది. జుట్టంతా నెరిసిపోయిన తలను తట్టి – ‘‘నీకు మంచి కాలం వస్తుంది. విచారించకు’’ అన్నాడు. దీన్ని నమ్మటానికి ఎదురుచూస్తున్నవాడిలా రామ్‌ప్యారే ‘‘నిజంగా, అవునా’’ అని కళ్ళు విప్పార్చి,‘‘నా టైమ్‌ బాగవ్వనీ తేజ్‌బలి, నిన్ను దేవుడిలా చూసుకుంటాను. నీకొక ఫుల్‌టైమ్‌ అసిస్టెంట్‌ కుర్రవాడిని ఇస్తాను’’ అని కొత్త ఆవేశంతో బయటికి నడిచాడు. ఒక విధమైన అబద్దపు వాగ్దానాన్ని పరస్పరం ఇచ్చుకున్నట్టున్న ఆ క్షణం తరువాత తేజ్‌బలికి తను మిలన్‌ డెత్‌ వెల్‌కు భారంగా మారాడనే భావన అతడి గుండెను బరువెక్కించసాగింది. వంట చేసే ఆట ఆడే పిల్లలు ఉత్తుత్తి భోజనం చేస్తున్నట్టు నటిస్తూ, చిన్నచిన్న గరిటెలతో వడ్డించినట్టు –తాము భవిష్యత్తు గురించి, జీవితం గురించి కలలను కంటున్నట్టు అనిపించింది.

ఇది జరిగిన కొన్నిరోజుల తరువాత అర్నాళా క్యాంపులో ఒక చిన్న ఇబ్బంది కలిగింది. డెత్‌ వెల్‌ చుట్టూ వరుసగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ బల్బుల మాలికలో ఒక చోట తెగిన వైర్‌ను అకస్మాత్తుగా తాకిన ఓ చిన్న అమ్మాయి షాక్‌ తగిలి మూర్ఛపోయింది. అదృష్టవశాత్తు ఆమె తేరుకున్నప్పటికీ ఊరిజనం కోపానికి ‘మిలన్‌ డెత్‌ వెల్‌’ ముక్కలైంది. జనం వేదికను విరిచేశారు. పోస్టర్లకు తారుపూశారు. భయపడి అర్నాళ కొండల్లో దాగి కూర్చున్న రామ్‌ప్యారేను తరుముకుంటూపోయి వెదికి కొట్టారు. చాలా రోజులు ‘డెత్‌ వెల్‌’ స్పీకర్లు మౌనంగా ఉన్నాయి. తేరుకున్న అమ్మాయికోసం పరిహారం వసూలు చేయడానికి వచ్చిన స్థానిక యువనాయకులు, తన బైక్‌కు బ్రాస్‌ పూసి మెరిసేలా చేస్తున్న తేజ్‌బలితో– ‘‘ఎందుకు హీరో, పని లేదా? మా ఎలెక్షన్‌ ప్రచారానికి రా, భోజనం పెడతాం. కోడికూరతో భోజనం’’ అని వెక్కించారు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత ఇది తనకొక దుర్భరమైన క్షణమనిపించింది. ఇలాంటి కఠిన సమయంలోనే మార్పు సాధ్యమని బలంగా అనిపించింది. రామ్‌ప్యారే భారాన్ని దించడానికి ఇది తగిన సమయం అనిపించి మెల్లిగా రామ్‌ప్యారే దగ్గరికి వెళ్ళి, ‘‘ప్యారేజీ, నీకు నీ భారమే ఎక్కువగా ఉంది. నా వల్ల ఎలాంటి సహాయం లేదు. నేను మీకు ఊరకూరకే భారమవకూడదు. నాకు పోయిన నెల జీతం వద్దు. నేను మరో ఉద్యోగం వెతుక్కుంటాను. ఎంత లేదన్నా పన్‌వెల్, కల్యాణ్‌లలో డ్రైవర్‌ ఉద్యోగం తప్పకుండా  దొరుకుతుంది. గత రెండేళ్ళల్లో ముంబయి ఫ్యాక్టరీలన్నీ మూతపడి జనం వీఆర్‌ఎస్‌ అనే పిడుగుకు బలి అయ్యారట. వచ్చిన సొమ్ముతో పిచ్చివాళ్ళల్లా బిజినెస్‌ బిజినెస్‌ అని మాక్సీ క్యాబ్, టాటా సుమో, క్వాలిస్‌ అని అద్దెకు తిప్పటానికి వాహనాలు కొనుక్కుంటూ ఉన్నారట. అందువల్ల మంచి డ్రైవర్‌కు చాలా డిమాండు ఉందట. వెళతాను. కచ్చితంగా ఉపవాసం ఉండను ప్యారేజి. నమ్మండి. మీ పరిస్థితి కుదుటపడనివ్వండి. అప్పుడు కచ్చితంగా వచ్చి చేరుతాను’’ – అని చెయ్యి పట్టుకుని ఎవరి గొంతుతోనో మాట్లాడుతున్నవాడిలా అన్నాడు. రామ్‌ప్యారే కళ్ళల్లో ఒక క్షణం విముక్తి పొందిన మెరుపు కనిపించినప్పటికీ, ఆ మెరుపు తేజ్‌బలికి తెలిసిపోయిందనే సత్యాన్ని మరుగుపరుస్తున్నట్టు తన చేతిలో ఉన్న అతడి రెండు చేతులను తన ముఖానికి హత్తుకుని – ‘‘ఛీ! ఇలాంటి రోజు నాకు వచ్చేసిందా’’ అని నిట్టూర్పు విడిచాడు. 

‘‘నువ్వు పులివి తేజ్‌బలి, పులి. పులి ఉపవాసం ఉంటుంది. కానీ కచ్చితంగా గడ్డి తినదు. నువ్వు గడ్డి తినకూడదు. నువ్వు వీరుడివి. నైపుణ్యం కలవాడివి. సమాజం నిన్ను తలమీద పెట్టుకోవాలి. సమాజపు ఇల్లు పాడైపోయింది. నేను? నేనూ నిన్ను చూడకపోతే? ఆ!’’ అని చెబుతూ వెంటనే విముక్తి పొందే క్షణాన్ని తనే చేతులారా పోగొట్టుకుంటున్నాడేమోననే భయంతో ఆగిపోయాడు. అతని రెండు కళ్ళూ డెత్‌ వెల్‌ ఖాళీ బావుల్లా కనిపిస్తున్నాయి.ఆ నిరాశ నిండిన చూపుల్లో  తేజ్‌బలికి తన విముక్తిదారి కూడా కనిపించినట్లయ్యింది. మాట్లాడటం మొదలుపెడితే మళ్ళీ అంతా కలగాపులగం అవుతుందనిపించి మెల్లగా నడుస్తూ తన టెంట్‌కు వెళ్ళాడు. రాత్రి ఒక్క బల్బు వెలిగించుకుని అందరూ భోజనం చేస్తున్నప్పుడు మోటర్‌బైక్‌ గర్జించినట్టు రామ్‌ప్యారె అరవసాగాడు – ‘‘పోనీ, పెద్దవాళ్ళందరూ పోనీ, మేము బాగుండాలని వాళ్ళనంతా కట్టివేయడానికి సాధ్యమా? మాతోపాటు మీరు ఉపవాసం ఉండండని చెప్పటానికి నేనెవరిని? ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారో–అందరూ వెళ్ళిపోండి. అయితే ఎవరి సొమ్ము బాకీ ఉంచుకోలేను. తీర్చేశక్తి నాకు లేదు. జనరేటర్‌ అమ్మి తరువాత ఇస్తాను. ఒకనెల అయినా వ్యవధి కావాలి. నా మీద ఆ మాత్రం నమ్మకముంచి వెళ్ళండి’’. 

ఈ అరుపులు ఒక దశ తరువాత తేజ్‌బలితోపాటు స్వయంగా ప్యారేకూ పిల్లల ఆటల్లోని కేకల్లా అనిపించసాగాయి. మాట్లాడటం మొదలుపెట్టిన వెంటనే అంతా నాటకీయమయ్యేది. పైగా అది నాటకీయమైనకొద్దీ వాస్తవాన్ని గెలిచిన భ్రమ అయ్యేది. అబద్ధం అనిపించినట్టల్లా తేలికయ్యేది. చప్పున ఇద్దరికీ నవ్వొచ్చింది. అర్ధరాత్రివేళ చీకట్లో నిలబడ్డ చెట్లను భయపెట్టేలా పకపకా నవ్వసాగారు.తదుపరి క్యాంప్‌ నుంచి ప్రకటనల్లో రామ్‌ప్యారే – ‘‘మా అమితాబ్, మా సచిన్‌ టెండూల్కర్, మా రాకెట్‌ తేజబలి’’ – అని కేకలు పెట్టసాగాడు. అయితే ఈ ఆవేశంతోపాటు అంతరంగంలో ఎక్కడో – చేతులారా దగ్గరికి వచ్చిన ఒక మలుపును తన శక్తికి మించిన దుర్బలతవల్ల తానే పోగొట్టుకున్నవాడిలా కుంగిపోసాగాడు. కొత్త యువకులకు ఈ రాకెట్‌ తేజ్‌బలిలో అంత ఆకర్షణ కనబడలేదు. ఎంతగా మీసాలకు రంగువేసినా, ఎంత టైట్‌ జీన్స్‌ ప్యాంట్‌ తొడుక్కున్నా అతని మెడ దగ్గర వదులైన చర్మం, అతడి మోచేతుల మీద ఉబ్బిన నరాలు ఉదాసీనంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కొత్త ఉత్సాహంతో ఛగున్, పట్టూలు జరిపే స్టంటులలో తేజ్‌బలి అనుభవం లేకపోయినా, ప్రేక్షకులకు కావలసిన తారుణ్యపు కాంతి ఉండేది. అది నిగూఢ నాడులను ఉద్దీపింపజేస్తున్నట్టుగా ఉంది. మైమరుపును సహజంగానే బదిలీ చేసేలా ఉండేది. అయితే తేజ్‌బలి ఏదో పాతవైభవపు అవశేషంలా కనిపించేవాడు. యువకుల నుదుటి చెమట పూలమీది మంచుబిందువులా కనిపిస్తే, తేజ్‌బలి చెమట అలసట ధారలా కనిపించేది. రామ్‌ప్యారేకూ ఇది తెలియని విషయంకాదు. అయితే రామ్‌ప్యారే తేజ్‌బలి ద్వారా తన తారుణ్యపు ఉత్కర్షను పొందడానికి తపించేవాడు. వయస్సులో దాదాపు తనంతే ఉన్నప్పటికీ తేజ్‌బలి ఆ డెత్‌ వెల్‌లో టర్‌ర్‌ర్‌ అని తిరిగి తిరిగి ప్రేక్షకులు విసిరిన కర్చీఫ్‌లను మెరుపులా పట్టుకుని చప్పట్లు కొట్టించుకునేటప్పుడు ‘పరవాలేదు ఇంకా ఉంది’, ‘ఇంకా ఏదో ఉంది’, ‘ఇంకా మిగిలి ఉంది’ అనే భావాన్ని రామ్‌ప్యారే అనుభవించేవాడు. అయితే ఐటం చూసిన తరువాత వీరయోధుల్లా సవారులంతా గుమ్మంలో నుంచున్నప్పడు – బయటకువెళ్ళే ప్రేక్షకుల బృందంలోని యువతీయువకులందరూ ఛగున్, పట్టూలను చూడటానికి, చేతులు కలపటానికి సహజంగానే ఆకర్షితులైనట్టుగా, తేజ్‌బలి చేత ఆకర్షింపబడేవారు కాదు. తేజ్‌బలి వయసు ప్రేక్షకులూ ఇంకేదో జగత్తులో అప్పటికే కాలుపెట్టేవాళ్ళు. అందువల్ల చివరికి ఈ తేజ్‌బలి రాకెట్‌ కావటం కేవలం తన మనోలోకంలో అని రామ్‌ప్యారేకు కచ్చితంగా అవగాహన కలిగినా ఈ లోకమే అతడి పరమసత్యం కావటం వల్ల అతను దాన్ని కించిత్తూ లోపం లేకుండా శ్రమ వహించి కాపాడుకునేవాడు. మిలిటరీ హోటల్‌నుంచి మటన్‌ తెప్పిస్తే, మంచి ముక్కలను వెదికి తేజ్‌బలికి పంపేవాడు. 

ఇలాంటి రామ్‌ప్యారే వ్యావహారిక జగత్తుకు తన వల్ల ఎలాంటి ఉపయోగం లేనప్పుడు, ఇప్పటికీ తాను అక్కడి నుంచి బయటికి రాకపోతే అన్యాయమౌతుందనే అభిప్రాయాన్ని ఎందుకో గత వారంనుంచి ఈ అలిబాగ్‌ కడలితీరం దృఢపరుస్తోంది. ఎదురుగా కోట, విశాలమైన నిర్జనమైన ఇసుక మైదానం, ఎగరడానికి మరిచిన పక్షుల్లా ఒత్తుగా కూర్చున్న గాలిమరలు, అన్నీ ఒక విసర్జన ఘడియలోని కరువును అస్పష్టంగా తేజ్‌బలికి సూచిస్తున్నాయి.దట్టంగా నల్లబారబోతున్న ఎరుపులో నడుస్తున్న అతడు మనస్సుల్లోనే తాలీము చేయసాగాడు – ‘రామ్‌ప్యారే, నాకు తెలుసు. నీకు బాధ కలుగుతుంది. నాకు తెలుసు నువ్వు భయపడతావు. నాకు తెలుసు మనమిద్దరమూ పరస్పరం ఒకరికొకరు కావాలి. కానీ కుదరదు. ఇక చాలు ! నేను మిలన్‌ డెత్‌ వెల్‌ని వదిలిపెడుతున్నాను. మన ఇద్దరివల్ల మన ఇద్దరికీ జరగవలసిందంతా జరిగింది. ప్యారేజీ, ఈ ఆయుష్షు ఉన్నంత వరకూ అది మన వెంట తోడుగా ఉంటుంది. నన్ను వదిలేయ్‌. నువ్వు మెత్తబడ్డావు. ఈ యువకులు నిన్ను చూసుకోవాలి. ఎక్కువగా తాగవద్దు. లివర్‌ పాడవుతే అంతా ముగిసిపోతుంది. ఈ నల్లతేలును నాకు ఇవ్వు, చాలు. అది నన్ను వేరెక్కడికో తీసుకెళ్ళగలదు. దాని ఋణం నాపై ఉండనీ. అది నీలో నన్ను శాశ్వతంగా కట్టివేయగలదు. చూడు ప్యారే... ఈ కోట అది వేరే ఎవరో చూసింది కాదు. అది ఇప్పుడు నాకు కనిపిస్తోంది. ఈ తీరంలో నన్ను వదిలెయ్‌. కేవలం అడుగులే ఉన్నటువంటి, దారులే లేనటువంటి ఈ మృదువైన తీరంలో ప్రశాంతంగా వెళ్ళిపోనువ్వు’.

అర్ధరాత్రి దాటేవరకూ తేజ్‌బలి అలాగే కాళ్ళుచాపి ఇసుకలోనే కూర్చునివున్నాడు. ఈ తావు కేవలం అతని ఏకాంత సమయం కోసమే వికసించినట్టుంది. కడలి సద్దు, సొగుసు, అన్నీ వేరు వేరు అవతారాలను ధరించసాగాయి. కోట పల్చటి మేఘాలను లాగుతోంది. అక్కడ ఎవరో వెలిగించి పెట్టిన దీపాలు అవునో కాదో అన్నట్టు వెలుగుతున్నాయి. అది మరికాసేట్లో తీరాన్ని వదలబోతున్న ఓడలా కనిపించసాగింది. 
ఇక్కడ చివరి ఆట తరువాత లవలేశమూ మిగలనట్టు ‘మిలన్‌ డెత్‌ వెల్‌’ రెండు పెద్ద పెద్ద లారీలలో చేరుకుంది. ‘‘సేఠ్, రాకెట్‌ సార్‌ ఇంకా రాలేదు. రాకెట్‌ సార్‌ ఇంకా రాలేదు’’ అని పనివాళ్ళు, ఛగున్, పట్టూలు అందరూ భయమూ, అయోమయాలతో తొందరపెట్టినపుడు రామ్‌ప్యారే, ‘‘అతను వస్తాడు. నాకు తెలుసు. మీ పనులు చూసుకోండి. పదండి. వేకువ ట్రాఫిక్‌ పెరిగేలోపు మనంహైవే చేరాలి. బయలుదేరుదాం’’ అని గద్దించాడు. పట్టూ– ‘‘సేఠ్, మన తర్వాతి క్యాంపు ఎక్కడో ఆయనకు తెలుసా? ఆయనను పిల్చుకునే వస్తాను. సముద్ర తీరంలో ఉంటారు...’’ అని అనగానే, రామ్‌ప్యారే, ‘‘చుప్, అతడిని ఎవరూ పిల్చుకుని రావలసిన అవసరం లేదు. అతనికంతా తెలుసు. అతనికంతా తెలుసు’’ అని తారాస్థాయిలో అరిచాడు. అతనికంతా తెలిసినట్టుంది. పరస్పరం ముక్తులయ్యే అవకాశాన్ని ఈసారి మళ్ళీ పోగొట్టుకోకూడదనే ఎరుక అతని అంతరంగంలో కంపిస్తోంది. తెల్లవారుతున్నప్పుడు హైవేలో లోనావాలా వైపు తిరిగిన ట్రక్కులలో అందరూ నిద్రపోయారు. రామ్‌ప్యారే మాత్రం రెప్ప వాల్చకుండా మొత్తం లారీ తన దేహమన్నట్టు విగ్రహంలా కదులుతూ, ఎదుటి రోడ్డునే చూస్తున్నాడు. ఇసుక తీరంలో, ఒరిగిన చోటే నిరాటంకంగా నిద్రపోయిన తేజ్‌బలి చుట్టూ నిలబడిన కొందరు పిల్లలు పరస్పరం ‘‘రాకెట్‌ తేజ్‌బలి, రాకెట్‌ తేజ్‌బలి’’ అని గుసగుసగా అంటూ, నిమజ్జనం మరుసటిరోజున ఒడ్డుకు వచ్చి పడిన విలక్షణ విగ్రహాన్ని చూస్తున్నట్టు, గాలికి ఎగురుతున్న అతడి ముంగురులనే చూస్తున్నారు.రెండు విభిన్న లోకాల మధ్యలో నిగూఢమైన ముక్త తంతులా దూరంలో నిల్చున్న నల్లతేలు, కొత్త కిరణాలలో తళతళమని మెరుస్తూ మొదటి కిక్‌ కోసం ఎదురుచూస్తోంది.
కన్నడ మూలం : జయంత కాయ్కిణి
 అనువాదం: రంగనాథ రామచంద్రరావు 

మరిన్ని వార్తలు