అరటి పువ్వు

29 Jul, 2018 00:34 IST|Sakshi

కథా ప్రపంచం

తరచుగా పశ్చాత్తాపమనే భావన నన్ను కుదిపివేస్తుంటుంది. నాకేదో జబ్బు చేసినట్లుంది. నాలో జ్ఞాపకాలేవీ మిగలడం లేదు. అందుకే ఈ డైరీ రాయడం మొదలుపెట్టాను. నా స్మృతులు పూర్తిగా చెదిరిపోతే, ఈ రాతల నుండి నన్ను నేను కనుగొనవచ్చని నా ఆశ. అయితే ఈ ప్రయోగం ఫలిస్తుందో లేదో నాకు తెలియదు. నన్ను చుట్టుముడుతున్న అజ్ఞాత అంధకారంతో పోరాడేందుకు చేసే చిన్న ప్రయత్నమిది. 
అయినా ఒక్కోసారి నన్ను బాధ కమ్మేస్తుంది. ఈ విశాలమైన, రంగురంగుల లోకానికి నేను త్వరలో పాతకాలపువాడిలా, పనికిరానివాడిలా, దండగమారిలా మారిపోతానని ఆ బాధ నాకు చెబుతుంది. ఈ ప్రశ్నే జవాబు దొరికేవరకూ నా మెదడును తొలిచేసింది. అయితే ఈ ప్రశ్నకి సమాధానం నాకు నేనే మాత్రం ఊహించని వ్యక్తి నుంచి దొరికింది. కూరల రామయ్య. చిన్న చెక్క బండి మీద కూరలు తెచ్చి అమ్ముతుంటాడు. మా ప్రాంతానికి ఎప్పటి నుండి వస్తున్నాడో నాకు గుర్తు కూడా లేదు. నాకు గుర్తున్నంతవరకు... మేం ఈ నగరానికి వచ్చి, ఈ అపార్టుమెంట్‌లో దిగినప్పటి నుంచి నేను అతన్ని చూస్తున్నాను. అంటే నా చిన్నప్పటి నుంచి! కూరల రామయ్య మా హౌసింగ్‌ సొసైటీ నివాసులకు అప్పటి నుంచి కూరలు అమ్ముతూనే ఉన్నాడు. అతని వయసు ఎనభైకి పైగానే ఉంటుందేమో, చాలా ఏళ్ళ నుంచి మాకు కూరగాయలు అమ్ముతున్నాడు మరి! అయితే నిన్నటి వరకూ కూరల రామయ్య వచ్చి వెళ్ళడం గురించి నేనేమీ పట్టించుకోలేదు. మా ఇంటి చుట్టూ జరిగే అనేకానేక సాధారణ వ్యవహారాల్లో ఇదీ ఒకటి అని వదిలేశాను. అతని గురించి పెద్దగా ఆలోచించను కూడా లేదు. నేను అతన్ని దాదాపుగా ప్రతీ రోజూ చూస్తుంటాను. కూరలు నిండిన అతడి బండిని రోజూ చూస్తుంటాను. కానీ నేనెప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించలేదు.

ఈ రోజు ఉదయం నేను కిటికీ దగ్గర నిలుచున్నప్పుడు కూరల రామయ్యని చూశాను. నాలో ఏదో వింత కుతూహలం కలిగింది. అతన్ని ఆగమని చెప్పి, కిందకెళ్ళాను. రామయ్యని ఎప్పుడూ ఇంత నిశితంగా పరిశీలించలేదు. ఈ రోజు పరిశీలించాను. మనిషి కొద్దిగా పొట్టిగా ఉన్నాడు. బహుశా ఐదున్నర అడుగుల ఎత్తుంటాడేమో. బక్క పలచని శరీరం. వయోభారాన్ని మోస్తున్న కారణంగా అతని చర్మం ముడతలు పడింది. అయితే అతని శక్తి, ఆ ఉచ్ఛ స్వరం ఆ వృద్ధుడి ప్రత్యేకతలుగా ఎంచాలి. వీధుల వెంట అరుస్తూ అమ్మేటప్పుడు అతని కదలికలు, అతని హావభావాల శక్తికి నేను అబ్బురపడ్డాను. ‘‘రామయ్యా, నేను నిన్ను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈ వయసులో నీ శక్తిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది’’ అన్నాను.రామయ్య చిన్నగా నవ్వి, నుదుటి మీద చెమటను తుడుచుకున్నాడు. అతని బండిలోని కొన్ని కూరలని అటూ ఇటూ కదిపాను. అతనితో సంభాషణ కొనసాగించాలి కదా మరి! కొన్ని కూరలు కొన్నాను కూడా. అతని ముఖంలో తృప్తి లీలగా దర్శనమిచ్చింది. ఉన్నట్టుండి నాకది గుర్తొచ్చింది. ‘‘రామయ్యా! ఓ విషయం గురించి నాలో నేను తెగ ఆలోచిస్తుంటాను కానీ ఈ రోజు నేను నిన్ను అడిగేస్తాను. ఎందుకు నువ్వు రోజూ అన్ని అరటి పువ్వులు తెస్తావు? నాకు గుర్తున్నంత వరకూ నీ బండిని ఏ రోజూ అరటి పువ్వులు లేకుండా చూడలేదు నేను. దీనికేదైనా ప్రత్యేకత ఉందా?’’ అని అడిగాను.

నాకేసి చూసి నవ్వాడు రామయ్య. సావకాశంగా మాట్లాడసాగాడు. ‘‘బాబూ, ఈ అరటి పువ్వు వెనకాల ఓ కథ ఉంది. అది కేవలం ఓ కూరగాయ కాదు. వినాలని ఉందా?’’నాకు సరదాగా అనిపించింది. ఒప్పుకున్నాను. రామయ్య తన చిన్న ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. ‘‘బాబూ, అరటి పువ్వు మనకెన్నో నేర్పిస్తుంది! దాన్ని రోజూ నేను అమ్మడానికి మాత్రమే బండిలో ఉంచను, నాకు స్ఫూర్తినివ్వడానికి ఉంచుతాను. అరటి చెట్టు ఈ అరటి పువ్వు నుంచే పుడుతుంది. అరటి చెట్టు ఎన్నటికీ వృథా కాదు. అరటి చెట్టులోని ప్రతి భాగం మనిషికి ఉపయోగపడేదే! పోషక విలువలు కావచ్చు లేదా ఇంటి అవసరాలకు కావచ్చు! పైగా కొత్త చెట్ల పుట్టుకకి కారణం, ప్రతీ అరటి చెట్టుకు పూసే ఈ అరటి పువ్వే! తను పుట్టి మళ్ళీ ఇంకో చెట్టుకి జన్మనిస్తుంది.’’అతని మాటలకి నా పెదవులపై చిరునవ్వు మొలిచింది. నేను మౌనంగా వినసాగాను. ‘‘బాబూ, ఇప్పుడు నాకు ఎనభై ఏడేళ్ళు. నేను ఐదేళ్ళ వయసు నుంచి నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను. మొదట్లో మా అమ్మ కోసం, తర్వాత నా భార్యా పిల్లల కోసం... ఇప్పుడు నా కొడుకు పిల్లల కోసం...’’ అంటూ ఒక్క క్షణం ఆపాడు. మళ్ళీ చెప్పసాగాడు ‘‘నా కొడుకు సముద్రంలో చేపలు పట్టేవాడు. ఓ రోజు సముద్రం వాడిని మింగేసింది. భార్యని, ఇద్దరు పసిబిడ్డలను వదిలి వెళ్ళిపోయాడు. నా భార్య కిందటేడు చనిపోయింది. అయితే నేనిప్పుడు విశ్రాంతి తీసుకోడానికి కుదరదు. నన్ను నేను పూర్తిగా ఉపయోగించుకోవాలి. నేను పనికిరాకుండా పోకూడదు. నేను అరటి పువ్వులా ఉండి నా కోడలికి, మనవలకి జీవిక కల్పించాలి. నా బండిలో ఉంచే అరటి పువ్వులు నాకు నిరంతరం శక్తినీ, స్ఫూర్తిని ఇస్తాయి. నేనింకా పనికిరాకుండా పోలేదని గుర్తు చేస్తాయి. నేనలా ఎప్పటికీ కాలేను....’’
కూరల రామయ్య తన బండిని తోసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ నేనక్కడే ఫుట్‌పాత్‌పై నిలబడి రామయ్య చెప్పినదాని గురించి ఆలోచిస్తున్నాను. నన్ను చుట్టుముడుతున్న అజ్ఞాత అంధకారమనే ప్రతికూల భావన ఇప్పుడు నా మనసులోంచి తొలగిపోయింది. రామయ్య కథ, అరటి పువ్వు స్ఫూర్తి నా కళ్ళు తెరిపించాయి. ‘ఏమైనా కానీ, నన్ను నేను వృథా చేసుకోను. చేయాల్సింది ఇంకా చాలా ఉంది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఇవ్వాల్సింది ఎంతో ఉంది. నేను కూడా అరటి పువ్వు లాంటి వాడినే. ఏం జరిగినా నిరుపయోగం కాను!’రోడ్డు చివర్లో రామయ్య ఆకారం, అతని బండి అస్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అతని కీచుమనే దృఢమైన గొంతు మాత్రం స్పష్టంగా వినబడుతోంది. నేను చిన్నగా నవ్వుకున్నాను. తృప్తి నిండిన మనసుతో ఇంట్లోకి అడుగుపెట్టాను.
ఆంగ్లమూలం : ప్రసూన్‌ రాయ్‌
అనువాదం: కొల్లూరి సోమ శంకర్‌  

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు