నన్ను చూడండి

10 Mar, 2019 01:21 IST|Sakshi

కథా ప్రపంచం

ఊచల కిటికీలోంచి నేను అలసిన చేతులతో ఒక పెద్ద రూపాయి కాగితాల కట్ట లెక్క పెట్టడం చూశాడు ఒకసారి. నా ముఖం కేసి ఒక సెకను చూసి మళ్లీ కళ్లు మరల్చాడు. నాకు తెలుసు అప్పుడు కూడా అతను నన్ను సరిగ్గా చూడలేదు. ఇంక 2 గంటలు కొట్టేందుకు 15 నిమిషాలు ఉంది. అప్పుడు నేను క్యాష్‌ అంతా మూసేసి టిఫిన్‌  తినేందుకు కిందకు వెళ్లాను. అప్పుడు ఒకవేళ అతను నన్ను త్రోవలో చూస్తే, ఫుట్‌పాత్‌ పక్కన ఉన్న దుకాణంలో నేను బిస్కట్టు తిని, టీ తాగుతుండగా చూస్తే అతను నన్ను గుర్తుపడతాడా? 

దయచేసి నన్కొకసారి చూడండి. ఇంతకు కొంచెం ముందు నేను తోసుకుంటూ బస్సు ఫుట్‌బోర్డ్‌ ఎక్కాను. తర్వాత ఆ జనసమూహం మధ్య అటూ ఇటూ దూరి, సరిగ్గా ఒక ఎలుక గొయ్యిత్రవ్వినట్లు త్రోవ చేసుకొని ఇంతదూరం వచ్చి పడ్డాను. బస్సుపై ఊచలు చాలా ఎత్తు. వాటిని అందుకుని వ్రేళ్లాడలేను. నేను పొట్టివాణ్ని. అంచేత సీట్ల వెనకాల పట్టుకుని నిలబడ్డాను. బస్సు కుదుపికి ఊగవలసి వచ్చినప్పుడు, ప్రక్క వాళ్ల మీద పడి సర్దుకోవలసి వచ్చినప్పుడు, చుట్టు పక్కల ఉన్న జనం నన్ను కోపగించుకోలేదు. కారణమేమిటంటే నా బరువు చాలా తక్కువ. నేనెవరి మీదైనా పడ్డా వాళ్లకు దెబ్బ తగలదు. నా ఇరువైపులా ఉన్న మనుష్యులు పర్వతాలంత ఎత్తుగా ఉన్నారు. వాళ్లు నన్నెంతగా మూసేవారంటే, అసలు వాళ్లు నన్ను చూడలేదనిపిస్తోంది. లేకపోతే చూసికూడా నన్ను ఎవరూ లెక్కచేయడం లేదు. ఇదే చిక్కు.నేను ఉన్నా లేకపోయినా వాళ్లకు లాభం కాని నష్టం కాని లేదు. నా ముఖంలో కూడా ఏమి ప్రత్యేకత లేదు...ఎవరైనా నన్ను వేరేగా గుర్తుపట్టేందుకు. 40 సంవత్సరాల తరువాత నా తల క్రమంగా పండిపోయింది. నా జుట్టు పలచబడిపోయింది. నా పెళ్లి అయ్యాక నన్ను కలవరపరిచే తమాషా సంఘటన ఒకటి జరిగింది. నేను నా భార్యను తీసుకొని బజారు పని మీద బైటకు వెళ్లాను. కాపురానికి తీసుకురావడం కోసం కొన్ని లాంఛనాలు బట్టలూ మొదలైనవి కొనవలసి వచ్చింది. ‘‘న్యూ మార్కెట్‌కు వెళదామా?’’ అని నా భార్యను అడిగాను. న్యూమార్కెట్‌లో  సరుకులు కొనేందుకు తగిన డబ్బు లేదు. బస్సు పక్కన ఉన్న అంగడిలో ఏవో చవక బట్టలు కొనేందుకు చాలిన డబ్బు మాత్రం ఉంది. అయినా ఆ మాట ఎందుకన్నానంటే ఒకటి నా భార్య పల్లెటూరిది. ఎప్పుడూ న్యూమార్కెట్‌ చూడలేదు. రెండోది నాతో పోలిస్తే మా అత్తింటివాళ్లు కాస్త ధనవంతులు. అంచేత నేను న్యూమార్కెట్‌ అని చెప్పేసరికి నా నూతన వధువు చాలా సంతోషిస్తుందని, అక్కడ బట్టలు గిట్టలూ కొంటే ఆ సంగతి తెలుసుకొని మా అత్తవారి తాలూకు వాళ్ల కనుబొమలు కాస్త పైకిలేస్తాయని. కానీ ఈ న్యూమార్కెట్‌ సంఘటన ప్రాణసంకటం చేసే తప్పయింది.

 ఏమయిందంటే, న్యూమార్కెట్‌లోకి ప్రవేశించి ఆ తళతళలాడే కొట్లలోని సరుకులు చూసేçసరికి మా ఆవిడకు ఒళ్లు తెలియలేదు. నా వైపు చూడడమే మరిచిపోయింది. ఆమె ఏ ఒక వస్తువుపైనా ప్రత్యేకించి శ్రద్ధ చూపించక, అన్ని వస్తువులనూ పరిశీలిస్తూనే ఉంది. గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ ఇచ్చేటప్పుడు సోల్జర్లు ఎలా నడుస్తారో  ఆ పద్ధతిలో ఆమె దుకాణాలలో సరుకులు చూస్తూ నడుస్తోంది,మధ్యమధ్య ఆమె ఏదైనా నేను ప్రక్కన ఉన్నాననుకొని మాట్లాడినా, నిజానికి నేను ఉన్నానా లేదా అన్న సంగతి పట్టించుకోలేదు. ఎప్పుడైతే నేను కనిపించలేదో నన్ను వెతుక్కుంటూ నిలబడింది. నాలుగువైపులా వ్యాకులా భావంతో చూస్తోంది నా కోసం. తమాషా చేద్దామని ఆమెకు కనిపించేలా ముందుకు వెళ్లలేదు. గుండ్రంగా ఉన్న సందుల్లో ఒకచోట హఠాత్తుగా వెళ్లిదాక్కున్నాను. పల్లెటూరిపిల్ల నా కోసం వెదుకుతూనే ఉంది. నాలో నేను నవ్వుకున్నాను.ఒక ప్రక్క నుంచి ఆమె ఏడుపు ముఖంతో ఇటూ అటూ నా కోసం నాలుగు ప్రక్కలా వెతికి బయలుదేరిన చోటికి తిరిగి రావడం కనిపెడుతున్నాను. ఎన్నిసార్లు తిరిగినా ఆమె నన్ను కనిపెట్టలేదు. గాభరలో నన్ను వెతుకుతున్న మనిషి నన్ను ప్రక్క నుంచి దాటిపోయింది. కానీ గుర్తుపట్టలేకపోయింది.  ఈ పల్లెటూరిపిల్ల గడుసుదే కాబట్టి ఆమె కావాలనే నన్ను చూసీచూడనట్లు నటిస్తుందేమో అనుకున్నాను. కానీ ఆమె ముఖం చూస్తే ఆమె అలా తమాషా చేస్తుందని అనుకోలేకపోయాను. ఆఖరికి ఒక గడియారం దుకాణం ముందు ఆమె త్రోవకు అడ్డువెళ్లి అన్నాను....‘‘హేయ్‌!’’
ఆమె ఉలిక్కిపడి నోటమాట లేకుండా నా వైపు చూసింది. అలా చాలాసేపు చూసి జోరుగా ఊపిరి విడిచి, వణుకుతూ నవ్వి అంది: ‘‘ఎక్కడున్నావు ఇంతసేపు నువ్వు?  నేనెంత సేపటి నుంచి నిన్ను వెదుకుతున్నానో!’’ఆమె నిజం చెబుతుందని అనుకున్నాను. బస్సులో తిరిగివెళ్లేటప్పుడు  ఆమెతో చెప్పాను–ఇలా నేను దాగుడు మూతలు ఆటలాడేటప్పుడు ఆమెకు చాలాసార్లు దగ్గరగానే ఉన్నానని, ఆమెముందే నిలబడ్డానని. మొదట ఆమె నా మాటలు నమ్మలేదు. కానీ నేను తిరిగితిరిగి నొక్కి చెప్పాక ఆశ్చర్యపడి అంది. ‘‘నిజంగానా! ఇంకెప్పుడు అలా దాక్కోక. అలా చేస్తే చాలా ప్రమాదకరం’’
ఆపు, కండక్టర్‌ భాయి, నేనిక్కడ దిగుతా....చూడు, దాదా చూడండి, భాయి, నా కళ్లజోడుని కాస్త కనిపెట్టండి...అయ్యో చూడండి, ఎవ్వరూ నా మాట వినరా,  నేను దిగే ముందరే కండక్టరు బస్సు వెళ్లే గంటకొట్టాడు. తలుపుకి అడ్డంగా మొద్దుబండలాగా ఒక అతను కదలకుండా నిలబడ్డాడు. హవాయ్‌ షర్టు కట్టుకున్న కుర్రవాడు, మోచేతితో త్రోసుకుంటూ వచ్చిన కళ్లజోడు వంకర చేశాడు.
అందుకే అన్నాను:‘‘ఎవ్వరూ నన్ను లెక్క చెయ్యరు–బస్సులో కానీ, ట్రాములో కానీ, రోడ్డు మీద కానీ...’’

వర్షాకాలం కాబట్టి ఎండవేడి తక్కువగా ఉంది.కొంచెం దూరంలో ఒక క్రాసింగు. దాని తర్వాత మా  ఆఫీసు. నేను క్రాసింగు దగ్గరకు వచ్చి రోడ్డు దాటటానికి కాలుపెట్టేసరికి  ట్రాఫిక్‌  పోలీసువాడు  చెయ్యి అడ్డుపెట్టి చాపాడు. నేను దాటవలసిన రోడ్డే అడ్డుపడింది.‘‘ఏం ట్రాఫిక్‌ పోలీసుభాయి, నేను రోడ్డు దాటాలని చూడడం లేదా?  కాస్త నీ చేయి దింపితే నీ చేతికేమైనా హాని కలుగుతుందా’’
నేను ఫస్ట్‌ఫ్లోరు పైకి వెళ్లేందుకు ఎక్కే లిఫ్టు ఒక వందసంవత్సరాల పూర్వానిది. గత 13 సంవత్సరాల నుంచి నేను ఈ లిఫ్ట్‌ వాడుతున్నాను. ఈ 13 సంవత్సరాలు లిఫ్ట్‌బాయి రామస్వరూప్‌ నన్ను పైకితీసుకువెళుతున్నాడు.‘‘ఏం భాయి రామస్వరూప్‌ నా 26వ ఏట లేక 27వ ఏట నుంచి నన్ను చూస్తున్నావు. ఇప్పుడు చెప్పు నా పేరేమిటి?’’ అని అడిగేసరికి రామస్వరూప్‌ నవ్వుతూ అంటాడుగదా–‘‘తమరు అరవింద బాబుగారు కదా?’’అది నా పేరేం కాదు. నేనెప్పుడూ అరవిందబాబుని కాను. చిన్నప్పటి నుంచి అరిందమ్‌ బమాని మాత్రమే.పదేళ్ల నుంచి క్యాషియర్‌గా ఉంటున్నాను. నేను అవలీలగా డబ్బు లెక్కపెట్టగలను. అందుచేత నాకు క్యాష్‌ పని తప్ప మరొకటి ఎక్కడా ఇయ్యరు. ఒకవేళ ఇచ్చినా క్యాషియర్‌గా మళ్లీ తిరిగిరావలసిందే.ఒకప్పుడు పేమెంట్, రిసీవింగ్‌ పేమెంటే ఎక్కువ. ఎందుకంటే మానవులకు ధనం ఇవ్వడం కంటే పుచ్చుకోవడానికి ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి.ఒక తీగపంజరం మధ్య నేను కూర్చుంటాను. నా గుండెకాయకు దగ్గరగా అనేక సొరుగులు గల ఒక డ్రాయరు. దాని మూలల్లో ఎన్ని రూపాయల నోట్లున్నాయో, ఎంత చిల్లర ఉందో నేను కళ్లు మూసుకుని తప్పు లేకుండా చెప్పగలను.పేమెంట్‌ చేసేటప్పుడు నేను డ్రాయరు తెరిచి లెక్కగా డబ్బు బైటకు తీసి, తర్వాత డ్రాయరు మూసి, మళ్లీ డబ్బు లెక్కపెట్టి, మళ్లీ డబ్బు ఇచ్చాక మరో పేమెంట్‌ కోసం చెయ్యి జాపి టోకెన్‌ తీసుకుని, మళ్లీ డ్రాయర్‌ తెరిచి డబ్బు బైటకు తీసి లెక్కపెట్టి దాని తర్వాత మళ్ళీ ఇలాగేవ్యవహారం నడుస్తుంది. నా ఎదురుగుండా కదులుతున్న వాళ్లు నా పని చూసి బహుశా....‘‘ఏమిటి  ఈ మానవుడు ఒకే విసుగు పుట్టే పద్ధతిలో పనిచేస్తున్నాడు!’’ అని అనుకుంటూ ఉంటారు.
రామ్‌బాబు మాకు బాగా పాత ఖాతాదారు. అతనికి పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఏజెంటు కూడా అతడిని బాగా గౌరవిస్తాడు. చాలా ఛాదస్తపు నిక్కచ్చి అతనిది. చాలామటుకు ఎవళ్లనీ పంపించకుండా తనే చెక్కులుక్యాష్‌ చేసుకుంటాడు. నేనెప్పుడు అతనికి పేమెంట్‌ చేసినా, అతను ఊచల మధ్య నుంచి ప్రసన్నముఖంతో నాకు ధన్యవాదాలు చెబుతాడుఒకమారు నా  పెద్దబావమరిది కలకత్తా వచ్చి పట్టణం అంతా తిరుగుతూ చాలా డబ్బు తగలపెట్టాడు. ఆ సందర్భంలో అతను నన్ను పార్కుస్ట్రీటులోని ఒక రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మాకు రామ్‌బాబు కనిపించాడు. ఒక్కడే కూర్చున్నాడు. చేతిలో తెల్లజిన్‌. కళ్లుఏవో కలలు కంటున్నట్లున్నాయి.

నిజం చెప్పాలంటే డబ్బున్నవాళ్ల మాట నేను ఏమంత గొప్పగా భావించను. అందుమూలాన రామ్‌బాబుతో మాట్లాడాలని నాకనిపించలేదు. అందుచేత నాకు తెలిసున్న పాత స్నేహితులున్న చోటుకు ముందుకు నడిచాను.రామ్‌బాబు కనుబొమ్మలు ఆశ్చర్యంతో  ఎత్తి అన్నాడు:‘‘ఎక్కడో చూసినట్లుందే! జ్ఞాపకం రావడం లేదు’’అప్పుడు నా బావమరిది ముందు నాకు చాలా సిగ్గేసింది. అతను నిజంగా గుర్తు పట్టలేకపోతే, నిజంగా ఇటువంటి అహంకారాన్ని ప్రదర్శిస్తే నాకు గౌరవహీనం అనిపిస్తుంది. అప్పుడు నేను చేసేది లేక మాబ్యాంకు పేరు చెప్పి, నేనెక్కడ క్యాషియర్‌ని అని చెప్పాను...అప్పుడు అతని చేతిలోనిజిన్‌లాగే అతని ముఖం స్వచ్ఛంగా పరిష్కరించబడినట్లయింది.గుర్తు పట్టాను అని, ప్రసన్నతతో ఇంకా ఇలా అన్నాడు.‘‘ఏం చెప్పను. ఈ ఊచల మధ్య ఆ పంజరం మధ్య మిమ్మల్ని చూడడం అలవాటైన వాళ్లు, అకస్మాత్తుగా ఇలాంటి చోట చూస్తే ‘తెలియదు’ అని చెప్పవచ్చు. అసలు సంగతి ఏమిటంటే, ఈ పర్‌స్పెక్టివ్‌  తప్పిస్తే,ఒక మనిషిని ఇంకో మనిషి గుర్తుపట్టాలంటే వేరే మార్గం ఏముంది.ఆ పంజరం మధ్య ఊచల లోపల నుంచి మీరు ఈ కోటూ, పాంటూ, బట్టతలా వీటితో ఉన్న నన్ను చూడండి. వీటి నుంచి వేరే చేస్తే, అప్పుడు మీకు తెలుస్తుంది. మీకూ, నాకూ నిజమైన పరిచయం లేదని. ఈమాటగ్రహించారా, ఇప్పుడే నేను పర్‌స్పెక్టివ్‌ మాట ఎత్తాను. నా చిన్నప్పుడు నేను రైల్వేకాలనీలో ఉండేవాణ్ణి. మా నాన్నగారు టాలీక్లబ్‌లో ఉద్యోగం చేసేవారు. ‘కాటిహార్‌’లోని రైల్వేక్వార్టర్సులో మా ప్రక్క ఇంటి నుంచి ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయి తన తల్లి ఇంట్లో ఆదరం  లేక,  మా ఇంటికి వచ్చి, అప్పుడప్పుడూ మా అమ్మకి వంటింట్లో సాయం చేస్తుండేది. ముడతలు పడి, చిరిగిపోయిన గౌనులోమోకాలుదూర్చి పరోటా వత్తేది. అప్పుడప్పుడూ మా అమ్మ అంటూ ఉండేది ‘దీనితో నీకు పెళ్లి చేస్తాను’ అని. ఆ మాట విని ఆ పిల్లను నేను ప్రేమతో చూసేవాడిని. కానీ ఈ జగత్తులో ఎక్కువ రోజులు అలా ఉండలేదు ఆ పిల్ల’’అంతవరకు చెప్పిన రామ్‌బాబు ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు. అప్పుడు నేను బాధతో అడిగాను–‘‘తర్వాత ఏమైంది, ఆమె చనిపోయిందా?’’. ఆయన తలాడించి ‘‘లేదు లేదు.పెద్దయ్యాక దాన్ని నేను పెళ్లాడాను. అది ఇప్పుడు నా భార్య. ఎప్పుడూ విసుక్కుని సాధించే స్వభావం దానిది. ఆమె దూషణం వింటుంటే కష్టపురోజుల్లో మా అమ్మ రెండు నారింజపళ్లు ఇస్తే, నోటినిండానవ్వే ఆమనిషేనా ఈ మనిషి అని  ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు చూడండి. దానితో దెబ్బలాడి బయటికివచ్చాను. ఆ పూర్వపురోజులూ, అది వంటింట్లో కూర్చొని నిప్పంటించడం, ముడతలుపడిన, చిరుగుగౌనులో దాని మోకాళ్లు దాచుకోవడం, దాని అప్పటి కూర్చునే తీరూ అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. మళ్లీ ఇప్పుడు నా మనసు ప్రేమతో నిండుతుంది. ఇంటికి తిరిగివెళ్లి దాని కోపాన్ని పోగొట్టాలి. అర్థం అయిందా!’’ అని రామ్‌బాబు ఆ తెల్లటిజిన్‌తో కొంత డోస్‌ వేసుకుని నవ్వాడు.

‘‘ఈ ఊచల కిటికీ ఉందే–దేనిలోంచైతే మిమ్మల్ని చూస్తానో అదే అసలు. ఈ ఊచలకిటికీ ఇప్పుడు 23–26 సంవత్సరాల మధ్య యువకుడొకడు పేమెంట్‌ కోసం వచ్చి నిలబడ్డాడు. అతనికి నేను తెలుసు. వాళ్ల నాన్నకి పాతకార్లు కొని అమ్మడం వ్యాపారం. ఇంతకు పూర్వం వాళ్ల నాన్న వస్తూ ఉండేవాడు. ఇప్పుడు  ఇతడొస్తున్నాడు బ్యాంకుకి.  ‘మీ నాన్నగారు బాగున్నారా?’ అని అడిగాను. ‘‘అ’’ అన్నాడు. కానీ నాకేమని అనుమానం ఉందంటే ఒకరోజు ఎప్పుడైనా ఇక్కడ నుంచి నన్ను బదిలీ చేస్తే ఈ స్థానంలో ఇంచుమించు అందరిలాగా ఉండే ముఖం గలవాడెవ్వడైనా కూర్చుంటే, అప్పుడు అతను ఆ తేడా కనిపెట్టలేడని. అప్పుడు కూడా ఇతను కౌంటర్‌ మీద డప్పు వేస్తూ, కొత్తగా వచ్చిన క్యాషియర్‌ కంటపడితే, అతని వైపు కూడా పూర్వపరిచయం ఉన్నట్లు చిరునవ్వు నవ్వుతాడు. తన తప్పు కనిపెట్టుకోవడానికి కొంతకాలం పడుతుంది అతనికి. ఎందుకంటే అతను నన్నింత క్రితం ఎప్పుడూ సరిగ్గా చూడలేదు.బహుశా అతని కొత్తగర్ల్‌ఫ్రెండ్‌ మాట ఆలోచించుకుంటూ ఉండవచ్చు. అతను మెడతిప్పి రిసెప్షన్‌ పిల్లకేసి చాలాసార్లు చూశాడు.ఊచల కిటికీలోంచి నేను అలసిన చేతులతో ఒక పెద్ద రూపాయి కాగితాల కట్ట లెక్క పెట్టడం చూశాడు ఒకసారి. నా ముఖం కేసి ఒక సెకను చూసి మళ్లీ కళ్లు మరల్చాడు. నాకు తెలుసు అప్పుడు కూడా అతను నన్ను సరిగ్గా చూడలేదు. ఇంక 2 గంటలు కొట్టేందుకు 15 నిమిషాలు ఉంది. అప్పుడు నేను క్యాష్‌ అంతా మూసేసి టిఫిన్‌  తినేందుకు కిందకు వెళ్లాను. అప్పుడు ఒకవేళ అతను నన్ను త్రోవలో చూస్తే, ఫుట్‌పాత్‌ పక్కన ఉన్న దుకాణంలో నేను బిస్కట్టు తిని, టీ తాగుతుండగా చూస్తే అతను నన్ను గుర్తుపడతాడా?
∙∙ 
అప్పుడప్పుడూ నాకీ సందేహం వస్తుంది. నేను నిజంగా ఉన్నానా అని. బ్యాంకులోని ఈ ఊచల మధ్య నుంచి ప్రజలు నా చేతిలోంచి డబ్బు తీసుకుని లెక్కపెడతారు. కొందరు నాకు ధన్యవాదాలు చెబుతారు. కానీ నా స్థానంలో మరెవరైనా వస్తే, ఈ డబ్బు లెక్క పెట్టుకునేవాళ్లూ, ఈ కృతజ్ఞత తెలియజేసే కొందరూ, ఈ  ఊచలకిటికీకి అవతల ఉన్న వ్యక్తిలో మార్పు గమనించరు. ఆ న్యూమార్కెట్‌ సంఘటన తీసుకోండి. నా భార్యే నడుస్తూ నడుస్తూ నన్ను వెతికింది కానీ, ఎదురుగుండా కళ్లముందు ఉన్న నన్ను గమనించకుండా దాటి వెళ్లిపోయిందంటే, ఇంక మిగతావాళ్లు నన్ను గమనించకపోవడంలో ఆశ్చర్యం ఏముంది?

‘‘నాన్నా, రథోత్సవానికి వెళ్లాలి. తొరగా ఇంటికొచ్చెయ్యి’’ అన్నాడు మా చిన్న అబ్బాయి హావనేను మెట్టు మీద అడుగు పెట్టానో లేదో వాడు పై నుంచి పరిగెట్టుకుంటూ దిగి వచ్చేశాడు. ‘‘ఇంత ఆలస్యం చేశావేం, నాన్నా? వెళదామా?’’ అన్నాడు.‘‘వెళదాం బాబూ, చాలా ఆకలేస్తుంది. కాస్త విశ్రాంతి తీసుకొని ఏదైనా కొంచెం తిన్నాక వెళదాంలే’’ అన్నాను.హావూ చాలా అల్లరి పిల్లాడు. తీర్థంలో అడుగుపెట్టాడో లేదో నా చెయ్యి విడిపించుకుని నడవడం మొదలెట్టబోయాడు. ‘‘నా చెయ్యి పట్టుకుని ఉంటేనే నీకు తీర్థం చూపిస్తాను’’ అన్నాను. వాడు గట్టిగా అరిచాడు:‘అదేంటి నానా? ఇక్కడ కూడానా? నన్ను స్వతంత్రంగా అన్నీ చూడనీ’’చేతిలో ఒక పాపిడి పట్టుకుని రంగులరాట్నం ఎక్కాడు హావూ. ఆ రాట్నం ఆకాశం పైకి  ఎగురుతున్నప్పుడు, మళ్లీ నేలపై దిగుతున్నప్పుడు ఒళ్లు తెలియని ఆనందంతో నవ్వుతున్నాడు. ఆ తర్వాత మేమిద్దరం ఒక అరగంటసేపు సర్కస్‌ చూశాం. వాడి కళ్లు మటుకు తళతళ మెరుస్తున్నాయి.  బయటకు వచ్చాక వాడిచేయివదిలేశాను. నా ప్రక్కగా నడుస్తున్నాడు. దుకాణంలో చక్కగా ప్రదర్శించబడిన  ఈలలు చూశాడు. ఇంకొంచెం ముందుకు వెళ్లి ఏరోప్లేన్‌ల వరుస చూశాడు. తర్వాత మెల్లిమెల్లిగానడుస్తూఆటతుపాకీలు, రంగురంగుల బొమ్మలూ చూస్తున్నాడు.నెమ్మదిగా అడుగు వేస్తున్నాడు. క్రమంగా జనసమూహంలోకి చొచ్చుకుపోయాడు హావూ.హావూ ఎక్కడా కనిపించడం లేదు. ‘హావూ’ అని పిలుస్తూ ముందుకు వెళ్లాను.అవును సార్, మీరెక్కడైనా చూశారా నీలం చొక్కా తొడుక్కున్న నాలుగేళ్ల అబ్బాయిని? వాడి పేరు హావూ. చాలా అల్లరికుర్రాడు.ఈ బొమ్మలకొట్టు ముందు నిలబడ్డవాడు కాదు–వాళ్లిద్దరూ చూడడానికి ఒకేలా ఉన్నారనుకోండి. వాడి ముఖంలోని  ప్రత్యేక గుర్తులు నాకిప్పుడు తట్టడం లేదు. ముఖం నా ముఖంలాంటిదే. నీలం చొక్కాతొడుక్కున్న కుర్రాళ్లు ఇక్కడ చాలామంది ఉన్నారు. అలాగే నాలుగేళ్ల వాళ్లూనూ. లేదండి, నేను నిక్కచ్చిగా చెప్పలేను...ఈ వేలకొలది ఉన్న బాలబాలికల మధ్య మా హావూ ఎవరో నా మట్టుకి. వాడి మట్టుకి వాడు చెప్పలేడు కూడా. ఈ జనసమ్మర్దంలో నేను ఎవరో మరిచిపోకండి. వాళ్లమ్మ కూడా ఒకప్పుడు నన్ను గుర్తుపట్టలేకపోయింది.ఒకవేళ మీరు హావూని చూస్తే దయచేసి వాడితో చెప్పండి. నేనే, నేనే వాళ్ల నాన్ననని.ఈ నన్ను కాస్త చూస్తూ ఉండండి. ఎక్కడికి వెళ్లినా ఈ మాటలు మరవకండి.

- బెంగాలీ మూలం : శీర్షేందు ముఖోపాధ్యాయ్‌
- తెలుగు : రాధాకృష్ణమూర్తి చల్లా

మరిన్ని వార్తలు