రెండు డాలర్లంత వర్షం

23 Dec, 2018 00:27 IST|Sakshi

కథా ప్రపంచం

ముసలి రెమిజియా గుర్రపు వీపును గట్టిగా కరచుకుని తన చిన్న ముఖాన్ని పైకెత్తుతూ ‘‘నరకంలో ఆత్మల కోసం ఇదిగో నా దమ్మిడీ. ఇక వర్షం పడుతుంది ఫెలిపా’’ అన్నది.ఫెలిపా చుట్ట తాగుతూ ఏ జవాబు ఇవ్వలేదు. కరువు గురించి ఎన్నో శోకాలను విన్నది ఆమె. అంతిమంగా చెయ్యి పైకెత్తి ఆకాశాన్ని ఒక కొస నుంచి మరో కొస వరకు పరీక్షగా చూసింది. ఆకాశం నిర్మలంగా ఉంది. ఒక్క మబ్బు కూడా లేదు. ఆకాశపు తెల్లదనం రెమిజియాకు ఆగ్రహాన్ని తెప్పించింది. ‘‘మన  బ్రతుకులు అంతమయ్యే రోజు వచ్చింది రెమిజియా’’ అన్నది ఫెలిపా.పంటల్ని నాశనం చేస్తూ కరువు ప్రారంభమైంది. నిరాశ నిండిన ఎన్నో కుటుంబాలు పొలాలను వదిలేసి తమ గుర్రాల మీద ఎక్కి  వర్షాభావం లేని ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్లిపోయారు.కాని వృద్ధులైన రెమిజియా అందుకు నిరాకరించింది ఏదో ఒకరోజు వర్షం వస్తుందనీ. తన కొడుకును స్ట్రెచర్‌ మీద తీసుకెళ్తూ మనవడినొక్కడినే తనకు వదిలిన నాటి నుండి రెమిజియా ముభావంగా ఉంటూ పొదుపును అవలంబించసాగింది. తన సొరకాయ బుర్రను కొంత బూడిదతో నింపి ఒకటొకటిగా నాణేలను అందులో వేస్తూ పోయింది.  మనవణ్ణి గుండెకు వేలాడదీసుకుని జీవితాన్ని స్వీకరించింది ఆమె. ‘‘నేను బతుకుతున్నది నీ కోసమే బిడ్డా! నువ్వు కూడా నీ తండ్రి లాగా జీవితం కోసం విపరీతమైన తంటాలు పడటం, లేక వయసు మీరకముందే చనిపోవడం నాకిష్టం లేదు’’ అంటుంది ఆమె ఆ పిల్లవాడితో. 

అంతా సవ్యంగా జరిగిపోతుంది. కానీ కొన్నాళ్ల తరువాత ఎందుకు ఎలా అని తెలియకుండా కరువు వచ్చింది. ఒక నెల వర్షం లేకుండా గడిచింది. తర్వాత రెండు నెలలు, ఆపైన మూడు నెలలు. ఒక్కోసారి ‘నరకంలో ఉన్న ఆత్మల కోసం కొవ్వొత్తుల్ని వెలిగించాలి’’ అంటుంది. కానీ వర్షం కురవలేదు. ఎన్నో కొవ్వొత్తుల్ని వెలిగించినా మొక్కజొన్న చేను వడలిపోయింది. ముసలి రెమిజియా పడక మీదికి పోయి దేవుణ్ని ప్రార్థించింది. నరకంలోని ఆత్మలకు మరిన్ని కొవ్వొత్తుల్ని  వెలిగిస్తానని వాగ్దానం చేసి నిరీక్షించింది. ఆమెకు కొండశిఖరాల మీద వర్షం కురుస్తున్న చప్పుడు వినిపించినట్టనిపించింది.ఆశాభావంతో రాత్రి ఆమె నిద్ర పోయింది. కానీ ఉదయం లేచి చూసేసరికి ఆకాశం తెల్లని తాజా దుప్పటిలా ఖాళీగా, నిర్మలంగా ఉంది.జనాలకు ధైర్యం సడలిపోయింది. ఒక చల్లని ఉదయం పూట రొసెండో తన భార్య, ఇద్దరు పిల్లలు, ఆవు, కుక్క, బక్కచిక్కిన గాడిదను తీసుకుని వెళ్లిపోయాడు. సామానంతా గాడిద వీపు మీద తీసుకెళ్తూ ‘‘దీన్ని నేను తట్టుకోలేను రెమిజియా, ఈ ఊరి మీద ఏ దుష్టశక్తివో పాపిష్టి కళ్లు పడ్డాయి’’ అన్నాడు. రెమిజియా గుడిసె లోపలికి పోయి రెండు రాగి నాణాలతో బయటకు వచ్చింది. వాటిని రొసెండోకు ఇస్తూ ‘‘నరకంలోని ఆత్మల కోసం నా పేరు మీద ఈ డబ్బుతో కొవ్వొత్తుల్ని కొని వెలిగించు’’ అన్నది. రొసెండో ఆ నాణాల్ని తీసుకుని, వాటిని చూసి, తలపైకెత్తి ఆకాశాన్ని చాలాసేపు చూశాడు.‘‘నీకు రావాలనిపించినప్పుడు టవేరాకు వచ్చెయ్‌. అక్కడ మాకు చిన్న భూమి చెక్క దొరికింది. నీకు ఎప్పుడూ మా స్వాగతం ఉంటుంది’’ అన్నాడు.

‘‘నేనిక్కడే ఉంటాను రొసెండో. ఈ కరువు ఇట్లానే ఉండిపోదు’’ అన్నది రెమిజియా.రెమిజియా మనవడు ఎండల ధాటికి నీగ్రో లాగా నల్లబడిపోయాడు.‘‘నానమ్మా! ఒక పంది చచ్చిపోయినట్టుంది’’ అన్నాడు వాడు.రెమిజియా పందుల దొడ్డి వైపు పరుగెత్తింది. ముట్టెలు వడలిపోయి తీగల్లాగా తయారయి పందులు గురగురమంటూ రొద చేస్తూ ఒగరుస్తున్నాయి. అవి అన్నీ ఒకచోట గుమిగూడాయి. వాటిని పక్కకు తరిమి చూడగానే చచ్చిపడి ఉన్న ఒక పంది కనిపించింది ఆమెకు. అది బతికి ఉన్న పందులకు ఆహారంగా పనికి వచ్చిందని ఆమెకు అర్థమైంది. తనే స్వయంగా వెళ్లి నీళ్లు తెస్తే పందులు బతుకుతాయి కనుక అలా చేయాలని నిశ్చయించుకున్నది ఆమె.సూర్యోదయం కాగానే ఆమె ముదురు గోధుమరంగులో ఉన్న తన చిన్న గుర్రాన్ని తీసుకుని బయలుదేరింది. తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నమైంది. సొరకాయ బరువు తగ్గింది. అయినా నరకంలోని ఆత్మలు జాలి చూపుతాయని తను పొదుపు చేసిన డబ్బుల్లో కొంత భాగాన్ని ఆమె వెచ్చించింది. గుర్రానికి శ్రమ ఇవ్వకూడదని ఆమె నడచి వెళ్లటం ప్రారంభించింది.జనాలు ఆ ఊరిని వదిలి వెళ్లటం కొనసాగింది. ప్రతిరోజూ ఒక గుడిసె ఖాళీ అవుతోంది. నేల బూడిదరంగుకు మారి దాని మీద పగుళ్లు  కనబబడసాగినై.రెమిజియా ఆశను పోగొట్టుకోలేదు. వర్షం వచ్చే సూచనల కోసం ఆమె ఆకాశాన్ని పరీక్షగా చూసింది. తన మోకాళ్ల మీద వంగి ‘‘నరకంలోని ఆత్మలారా, మీరు సహాయం చేయకపోతే మేము మాడిపోతాము’’అని వేడుకుంది.కొన్నిరోజుల తరువాత ఒక ఉదయాన గుర్రం తన కాళ్ల మీద నిలబడలేక పోయింది. అదేరోజు మధ్యాహ్నం ఆమె మనవడు జ్వరంతో కాలిపోతూ మంచం పట్టాడు. రెమిజియా ప్రతి గుడిసెకూ పోయింది. చాలా దూరంలో వున్న గుడిసెలకు కూడా వెళ్లింది. ఆ గుడిసెల వాసులతో ‘‘మనం సెయింట్‌ ఇసిడోరోకు రుద్రాక్ష విత్తుల దండ చేయిద్దాం’’ అన్నది.

వాళ్లు ఒక ఆదివారం పొద్దున పెందరాళే బయలుదేరారు. ఆమె తన మనవణ్ణి చేతిలో పెట్టుకొని నడుస్తోంది. పదిహేను ఇరవైమంది పురుషులు, స్త్రీలు ఎండకు నల్లబడిన శిథిల దేహాల పిల్లలు, బంజరు నేలల మీది తోవల మీదుగా సాగిపోతూ శోకాలు పెడుతున్నారు. వాళ్లు మేరీ కన్య బొమ్మను, వెలిగించిన కొవ్వొత్తుల్ని పట్టుకుని నడుమ నడుమ ఆగి మోకాళ్ల మీద వంగుతూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఒక బక్కపలచని వృద్ధుడు మండే కళ్లతో, నగ్నమైన ఛాతితో, పొడుగుగా  పెరిగిన గడ్డంతో వుండి ఆ ఊరేగింపు మొదట్లో నడుస్తున్నాడు ఆకాశం వైపు చూస్తూ...‘సెయింట్‌ ఇసిడోరో, ఓ కర్షకుడా / సూర్యుణ్ని కప్పేసి వర్షాన్ని తెప్పించు’ అంటూ వేడుకుంటున్నాడు.అందరూ వెళ్లిపోయారు. రొసెండో వెళ్లిపోయాడు. బుద్దిమాంద్యం వున్న తన కూతుర్ని తీసుకుని టోరిబియో వెళ్లిపోయాడు. ఫెలిపె, ఇతరులు, వేరేవాళ్లుఅందరూ వెళ్లిపోయారు. కొవ్వొత్తులు వెలిగించడానికి ఆమె వాళ్లందరికీ డబ్బు ఇచ్చింది. ఆఖరున వెళ్లినవాళ్లు ఎవరో ఆమెకు తెలియదు. వాళ్లు ఒక రోగిష్టి అయిన వృద్ధుణ్ని తీసుకుపోయారు. దుఃఖభారంతోవాళ్లు కుంగిపోయారు. ఇక వర్షం పడుతుందనే ఆశ అందరిలో అడుగంటిపోయింది. ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లేముందు వృద్ధులు ‘దేవుడు ఈ ప్రాంతాన్ని శిక్షిస్తున్నాడు’ అనుకున్నారు.యువకులు, పిల్లలు అక్కడేదో దుష్టశక్తి తనపాడు దృష్టితో కీడు కలిగిస్తున్నదని అనుకున్నారు.రెమిజియా ఆశను వదులుకోలేదు. ఆమె కొన్ని నీటి చుక్కల్ని సేకరించింది. మళ్లీ మొదట్నుంచి ప్రారంభించాలని అనుకున్నదామె. ఎందుకంటే సొరకాయ బుర్ర దాదాపు ఖాళీ అయింది. తన చిన్న తోట లోని భూమి రహదారిలా మారిపోయి అంతటా ధూళి నిండింది.నరకంలోని ఒక మూలలో నడుముల దాక ఉన్న మంటల్లో కాలుతూ ఆ ఆత్మలు పరిశుద్ధమవుతున్నాయి. భూమ్మిద వర్షాన్ని కురిపించి జలమయం చేసే శక్తి ఆ ఆత్మలకే వుండటం విడ్డూరం, వ్యంగ్యభరితం. గడ్డం వున్న ఒక వికృతమైన ముసలి స్త్రీ ఇలా అన్నది ‘‘కారంబా! పోసో హోండో అనే వూళ్లో  ముసలి రెమిజియా కొవ్వొత్తుల కోసం రెండు డాలర్లు వెచ్చించింది కాబట్టి అక్కడ వర్షం కురవాలి’’ఆమె సహచరులు అప్రతిభులయ్యారు. ‘‘రెండు డాలరా! అయ్య బాబోయ్‌’’మరొక ఆత్మ అన్నది ‘‘ఆమెకు ఎందుకు ఇంకా సహాయం అందలేదు. మనుషులతో మనం వ్యవహరించేది ఇలాగేనా’’‘‘ఆమె కోరికను మనం మన్నించాలి’’ అని గర్జించింది మరొక ఆత్మ.‘‘పోసొ హోండోకు రెండు డాలర్లంత వర్షం కురిపించాలి’’ఆ ఆత్మలన్నీ చాలా సంతోషించాయి.  ఎందుకంటే వర్షం కోసం అంత పెద్ద మొత్తాన్ని ఇంతకు ముందెప్పుడూ ఎవ్వరూ చెల్లించలేదు. అంత డబ్బు వెచ్చించి కొవ్వొత్తులు వెలిగించినందుకు ఎంత పుష్కలమైన వర్షం కురిపించాలో తలుచుకునేసరికి నరకంలోని ఆ ఆత్మలు అదిరిపడ్డాయి. దేవుడు తమను తన దగ్గరికి పిలిపించుకునేదాకా ఇలా మంటల్లోకలుతున్నంత కాలం వర్షాన్ని కురిపిస్తూనే వుండాలి కదా అని నివ్వెరపోయాయి ఆ ఆత్మలు.పోసోహోండాలో ఒక ఉదయాన ఆకాశం నిండా ముబ్బులు కమ్మినయ్‌. రెమిజియా తూర్పు దిక్కున ఉన్న ఆకాశాన్ని చూసింది. ఆమెకు పలుచనైన ఒక నల్లని మేఘం కనిపించింది. ఒక గంట తరువాత పెద్ద పెద్ద మేఘాలు జంటలుగా గుమిగూడి ఒకదాన్నొకటి తోసుకుంటూ వేగంగా కదలసాగినయ్‌.రెండుగంటల తర్వాత చిక్కని చీకటి ఏర్పడి రాత్రి అయిందా అనిపించింది.తక కలుగుతున్న సంతోషం సున్నా అవుతుందేమోనన్న భయం కమ్ముకోగా రెమిజియా ఏమీ మాట్లాడకుండా కేవలం చూస్తూ ఉండిపోయింది. ఆమె మనవడు ఇంకా జ్వరంతో మంచం మీద పడి వున్నాడు. వడు ఎముకల గూడులా చాలా బక్కగా వున్నాడు.

పెద్ద ఉరుము ఉరిమింది. ఆమె తనలో తానే నవ్వుకుని, చేతులతో చెంపలను గట్టిగా పట్టుకుని, కళ్లను విశాలంగా చేసింది. చాలాకాలం తర్వాత మళ్లీ వర్షం పడుతోంది. వేగంగా కదులుతూ టపటపనే చినుకులతో పాటు పడుతున్నట్లుగా వర్షం రోడ్డును చేరి, గుడిసె పై కప్పు మీద చప్పుడు చేస్తూ గుడిసె దాటేసి పొలాల మీద కురవడం ప్రారంభించింది. రెమిజియా వెనక గుమ్మం వైపు పరుగెత్తి చిన్న వరదలాంటి నీరు పారుతూ వస్తుంటే నేల అణగిపోయి దట్టమైన ఆవిరులను చిమ్మటం గమనించింది. ఆమె విజయోత్సాహంతో బయటికి పరుగెత్తింది.‘‘వర్షం వస్తుందని నాకు తెలుసు’’ అంటూ బిగ్గరగా అరిచింది. ఆకాశం వైపు చేతులు చాస్తూ ‘‘వాన పడుతోంది...ఇట్లా జరుగుతుందని నాకు తెలుసు’’ అంటూ కేరింతలు కొట్టింది. ఆమె ఇంటి లోపలికి పరుగెత్తి మనవణ్ని చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుని వాడికి వర్షాన్ని చూపించింది. ఆకాశం నుండి వర్షం ధారాపాతంగా కురుస్తోంది. వర్షపు చినుకుల బలమైన తాకిడి ధాటికి తాటాకుల గుడిసె పైకప్పు పగులుతోంది. రెమిజియా కళ్లు మూసుకుని కొన్ని దృశ్యాలను దర్శించింది. విరగకాసిన తన పంటచేను చల్లని గాలి తరగల్లో కదలాడుతోంది.  బయట ఎడతెరిపి లేకుండా బీభత్సంగా వర్షం. వారం రోజులు, పదిరోజులు, పదిహేను రోజులు గడిచాయి. వర్షం ఒక గంట సేపు కూడా ఆగక ఇంకా కురుస్తూనే వుంది. బియ్యం, వెన్న, అప్పుడు అన్నీ నిండుకున్నాయి. ఆహారపదార్థాల్ని కొనడానికి రెమిజియా వర్షంలోనే నగరానికి బయలుదేరింది. పొద్దున బయలుదేరిన ఆమె తిరిగి మధ్యరాత్రి ఇల్లు చేరింది.  ఒక మధ్యాహ్నంవేళ పెద్ద కంచర గాడిద తలను లోపలికి దూర్చింది.

‘‘కిందికి దిగ లోపలికి వస్తే కొంచెం వెచ్చగా వుంటుంది’’ అన్నదామె.కంచర గాడిద బయటే వుండిపోయింది. అతడు ‘‘ఆకాశం నీళ్లుగా మారిపోయింది. నేను నీ పరిస్థితిలో వుంటే ఈ లోతట్టు ప్రదేశాల్ని వదిలి ఆ కొండమీదికి పోయేవాణ్ని’’ అన్నాడు.‘‘నేను యిక్కణ్నుంచి వెళ్లిపోవటమా? లేదు స్వామీ, ఈ వర్షం ఒకటి రెండు రోజుల్లో  ఆగిపోతుంది’’ అన్నదామె.‘‘చూడమ్మా ఇది వరద పరిస్థితి. నేను కొన్ని భయంకర దృశ్యాల్ని చూశాను. వరద నీరు జంతువుల్నీ, ఇళ్లనూ, చెట్లనూ, మనుషుల్నీ లాక్కుపోతోంది. నేను దాటి వచ్చిన నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. పైగా నదుల జన్మస్థానాల్లో కుండపోతగా వర్షంకురుస్తోంది’’ అన్నాడతడు.‘స్వామీ, కరువు భయంకరంగా వుండింది. అందరూ పారిపోగా నేనొక్కదాన్నే తట్టుకుని ఇక్కడే వుండిపోయాను’’ అన్నది రెమిజియా.‘‘కరువు చంపకపోవచ్చు. కాని వరద ముంచేస్తుంది తల్లీ’’అన్నాడు ఆ ఆసామి. చీకటి పడుతుండటంతో అతడు వెళ్లిపోయాడు. ఆ రాత్రివేళ వెళ్లొద్దని ఆమె బతిమాలింది. కాని అతడు వినలేదు. ‘‘పరిస్థితి మరింత విషమించబోతుందమ్మా, నదులు గట్లను తెంపుకునిఅంతాజలమయం అవుతుంది’’ అంటూ వెళ్లిపోయాడు ఆ వ్యక్తి. రెమిజియా గుడిసె లోపలికి పోయింది. లోపల పిల్లవాడు జడుసుకుంటున్నాడు. ఆ ఆసామి చెప్పింది నిజమైంది. అబ్బ, అది ఎంత భయంకరమైన రాత్రి! మధ్యమధ్యన ఉరుములు మెరుపులతో అత్యంత ఉధృతమైన కుంభవృష్టి ఎడతెరిపి లేకుండా కురిసింది. మురికినీళ్లు సుళ్లు తిరుగుతూ గుమ్మం తలుపులోని సందులోంచి లోపలికవచ్చినేల మీద నిండిపోయాయి. దూరాన గాలి ఈల వేస్తోంది. చెట్టు విరిగిన చప్పుడు ఫెళఫెళమని వినిపించింది. రెమిజియా తలుపు తెరిచింది. దూరాన మెరిసిన మెరుపు పోసా హోండోను వెలుతురు మయం చేసింది. కొండవాలు మీంచి నీళ్లే నీళ్లు... రహదారి నదిగా మారిపోయింది.‘‘ఇది వరద కావచ్చునా’’ రెజిమియాకు మొదటిసారిగా అనుమానం వచ్చింది. కాని ఆమె గుమ్మం తలుపులు మూసి లోపలికి పోయింది. గడచిన కరువు తీవ్రత కన్న, రాబోయే వర్షపు తీవ్రత కన్న బలమైన ఆశాభావం కలిగింది ఆమెకు.

ఒక మధ్యరాత్రి వేళ గుడిసె పక్క గోడ నుంచి దభీమని చప్పుడు రావటంతో ఆమెకు మెలకువ వచ్చింది. మంచంలోంచి కిందికి దిగేసరికి తన మోకాళ్ల దాకా నీళ్లు వచ్చిన సంగతి తెలిసింది ఆమెకు.అబ్బ, ఎంతటి కాళరాత్రి! నీళ్లు ప్రవాహరూపంలో లోపలికి దూసుకువచ్చి లోపల మొత్తం నిండిపోయాయి. మరో మెరుపు మెరిసింది. పెద్ద ఉరుముతో ఆకాశం వణికినట్టనిపించింది.‘‘మేరీ కన్యాకా కరుణించు’’ అంటూఏడ్చింది. కానీ ఈ పరిణామానికి కారణం మేరీ కన్యక కాదు.నరకంలోని ఆత్మలు. అవి ‘‘ఈ వర్షం సగం డాలరుకే సమానం, సగం డాలరుకే’’ అంటూ అరిచాయి.ఎప్పుడైతే ఆ వరద నీరు గుడిసెను కదపడం మొదలెట్టిందో అప్పుడు రెమిజియా ఆశాభావాల్ని వదలి తన మనవణ్ని చేతుల్లోకి తీసుకుంది. ఆమె వాడిని సాధ్యమైనంత గట్టిగా ఎదకు హత్తుకుని నీళ్లలోంచి అతి ప్రయత్నపూర్వకంగా నడిచింది.ఎలాగో ఆమె తన గుడిసె తలుపును తీసి బయటికి నడిచింది. తను ఎక్కడికి పోతుందో ఆమెకు తెలియదు. గాలికి ఆమె వెంట్రుకలు విడివడి పోయాయి. దూరాన ఒక మెరుపు మెరిసింది. నీటి మట్టం ఇంకాఇంకా పెరుగుతోంది. తన మనవణ్ని మరింత గట్టిగా హృదయానికి హత్తుకుంది ఆమె. తూలి పడబోయింది కాని ఎలాగో నిలదొక్కుకుంది.ఉధృతంగా వీస్తున్న గాలి ఆమె కంఠస్వరాన్ని కబళించి దాన్ని జలమయమైన  ఆ ప్రదేశం మీద పరిచింది.‘‘ఆమె గౌను నీళ్ల మీద తేలింది. ఆమె జారిపోతోంది. ఏదో వస్తువు తన వెంట్రుకలకు తట్టుకుని తలను ముందుకు పోకుండా ఆపినట్టనిపించింది ఆమెకు.‘‘ఇదంతా ముగిసిన తర్వాత బంగాళాదుంపలు నాటుతాను’’ అనుకున్నదామె.తన మొక్కజొన్న చేను మురికి నీళ్లలో మునిగిన దృశ్యం కనబడింది ఆమెకు. ఆమె తన వేళ్లను మనవడి ఛాతీలోకి గుచ్చిపట్టింది. గాలి ఊళ వేసింది. ఆకాశాన్ని పగలగొడుతున్నట్లు పెద్ద ఉరుము ఉరిమింది.ఆమె వెంట్రుకలు ఒక ముళ్ల చెట్టుకు తట్టుకున్నాయి. గుడిసెల్నీ, చెట్లనీ లాక్కెళ్తూ వరద నీరు పొర్లింది. నరకంలోని ఆత్మలు ‘‘ఈ వర్షం సరిపోదు, రెండు డాలర్లంత వర్షం, రెండు డాలర్లంత వర్షం కురవాలి’’ అంటూ ఉధృతంగా గర్జించాయి.
డొమినికన్‌ మూలం : ఖ్వాన్‌ బాష్‌
 తెలుగు : ఎలనాగ 

మరిన్ని వార్తలు