వానదేవుడు ఆకాశవాణి

2 Sep, 2018 01:00 IST|Sakshi

కథా ప్రపంచం

అతనికి సెలవనేదే లేదు. అతని ఉద్యోగమే అలాంటిది. నిజానికి నగర వీధులు పరిశుభ్రంగా ఉండాలంటే సెలవు రోజుల్లోనే బాగా నీళ్లు చల్లాలి. అందుకోసమే మున్సిపాలిటీ వాళ్లు చాలా వాహనాలు పెట్టారు.వాటిలో ఒకదానికి ఆయన డ్రైవర్‌.ఒక్కోసారి నెలల తరబడి వానచుక్క నేలరాలదు. అలాంటి రోజుల్లో ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం దాకా తన వ్యాన్‌లోని నీళ్ల ట్యాంకును ఖాళీ చేస్తూ, పొడవైన దుమ్ము కొట్టుకుపోయిన రోడ్లమీద నీళ్లు చల్లుతూ ఉండవలసి వస్తుంది. వేసవి కాలంలో మధ్యాహ్న వేళల్లో కొంచెం నయం. బాగా కాగిన నేలలోంచి మట్టి వాసన వస్తుంది. అది అతనికి తల్లిపాలకోసం నోటితో తడిమే పిల్లవాడికి తల్లి వెచ్చని శరీరం నుంచి వచ్చే కస్తూరి వాసన లాగా అనిపిస్తుంది. చలికాలంలో అలా ఉండదు. నేల మీది మంచుగడ్డను పగలగొట్టాలి. రక్తం గడ్డకట్టే చలి అయినా నిర్జనమైన రోడ్లను శుభ్రం చేయాల్సిందే. ఈ రొడ్డకొట్టుడు జీవితానికి విరుగుడు వాన. వాన అంటే అతనికి సెలవు అని అర్థం. అప్పుడు అతను చెయ్యవలసిన పనిని వానదేవుడు చేస్తాడు. అతను విశ్రాంతి తీసుకుంటాడు.అప్పుడప్పుడు పడుకుంటూ అతను, ‘‘ఓ భగవంతుడా! రేపు వాన కురిపించు. నేను సాయంకాలం దాకా నిద్రపోతాను.’’ అని ప్రార్థన చేస్తాడు. కొన్నిసార్లు భగవంతుడు ఆయన మొర ఆలకిస్తాడు. రాత్రిపూట వాన కురుస్తుంది. అతను పొద్దున్నే నిద్రలేస్తాడు. వానపడి ఉండటం చూసి మళ్లీ పడుకుంటాడు. శరీరంలోని ప్రతి అణువూ విశ్రాంతి పొందే దాకా అలా పక్కమీద పడుకుంటాడు. పూర్తిగా విశ్రాంతి తీసుకుని విసుగొచ్చే దాకా పడుకుంటాడు. 

అతను పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య వీరో. ఆమె చాలా సాదాసీదాగా ఉంటుంది. పెళ్లి చేసుకున్న తరువాత కూడా అతను తన పద్ధతిని మార్చుకోలేదు. ఉదయం ఆమె లేవకముందే ఇల్లు వదిలిపోయేవాడు. సాయంత్రం ఇరుగు పొరుగు ఆడవాళ్లు బజారుకు పోయి తమ మగవాళ్లతో తిరిగి ఇళ్లకు చేరిన చాలాసేపటికి అతను తిరిగి ఇల్లు చేరుకుంటాడు. బహుశా ఒక బిడ్డ పుడితే అతని పరిస్థితిలో మార్పు రావచ్చని వీరో ఆశించింది. పాపతో ఆడుకోవడానికి ఉబలాటపడతాడని, ఆ రకంగా ఇంటి దగ్గర ఎక్కవసేపు ఉంటాడని అనుకుంది.వీరోకు కొడుకు పుట్టాడు. కానీ అతని విధానంలో మార్పు రాలేదు.ఏమీ పనిలేనప్పుడు కూడా అతను ఇంట్లో ఉండకుండా ఇరుగు పొరుగు వాళ్లతో పిచ్చాపాటి మాట్లాడటానికో, చెట్టు కింద పేకాట ఆడటానికో వెళ్లిపోయేవాడు. పొద్దున్నే పిల్లవాడింకా లేవకముందే, పక్క వీధిలో ఉన్నావిడ భర్తలాగా తన భర్త తనను అలా మున్సిపల్‌ పార్క్‌ వైపు తీసుకుపోతే బాగుండునని వీరో ఆదేశించింది. సాయంత్రం కొడుకు కళ్లకు కాటుక దిద్ది అందమైన బట్టలు వేస్తుంది. కానీ ఆ పిల్లవాని తండ్రి అతడు చలాకీగా ఆడుకుంటూ చిలిపి చేష్టలు చేస్తుండగా చూడటానికి రాడు. ఒకరోజు సాయంకాలం. అది పున్నమికి ముందటి రోజు. ఇరుగుపొరుగు ఆడవాళ్లు గుడికి పోవడానికి తయారవుతున్నారు. వీరో వాళ్లను చూసింది. ఆ రాత్రి తాము కూడా మర్నాడు ఉదయం గురుద్వారాకు ఎందుకు వెళ్లకూడదని భర్తనడిగింది. ‘‘వాన దేవుణ్ని వాన కురిపించమని అడుగు. మనం కూడా గురుద్వారాకు వెళ్లవచ్చు’’ అని గొణుగుతూ నిద్రలోకి జారుకున్నాడతను. చుక్కలు నిండిన వినీలాకాశం వైపు చూస్తూ వీరో ప్రార్థన చేసింది – ‘‘భగవంతుడా! ఈ రాత్రి వాన కురిపించు. రేపు గురుద్వారాకు పోవాలనుకుంటున్నాను. నాతో కూడా నా కొడుకు నా భర్త రావాలని నా కోరిక’’.ఆ రాత్రి వాన పడింది.

మర్నాడు ఉదయం ఆ కుటుంబం గురుద్వారాకు వెళ్లింది. ఇంటికి తిరిగి వస్తూ దారిలో దండిగా మిఠాయి కొనుక్కున్నారు. మున్సిపల్‌ పార్కుకు కూడా వెళ్లారు. సాయంకాలం కొడుకు నాన్న పొట్టమీద కూర్చుని ఆడుకుంటున్నాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. నవ్వుకున్నారు. ఆ రాత్రి వీరో ఎంతో సంతోషించింది. తెల్లవారుతున్నా దీపం మండుతూనే ఉంది. వత్తి కాలిపోయి దానంతట అది ఆరిపోయేదాకా కిటికీలో దీపం వెలుగుతూనే ఉంది.ఒకసారి ఆమె ప్రార్థనను మన్నించిన వానదేవుడు మళ్లీ వాన విషయం మరిచిపోయినట్టున్నాడు. వీరో కొన్నాళ్లు తాము గడిపిన ఆ సెలవు దినాన్ని స్మరించుకుంటూ గడిపేసింది. కానీ జీవితం మళ్లీ నిస్సారమనిపిస్తోంది. ఇంటి మీద అయిష్టత, ఇరుగుపొరుగు ఆడవాళ్ల మీద అపారమైన అసూయపెరిగాయి. వర్షం కోసం ప్రార్థించింది. కానీ లాభం లేదు. నెలరోజులు గడిచిపోయాయి. పున్నమి రోజు వచ్చింది. చుట్టుపక్కల వాళ్లు పరమానందంగా ఉన్నారు. స్త్రీలు చీరలకు మిరుమిట్లు గొలిపే రంగులు అద్దుకున్నారు. పురుషులు గడ్డాలు సవరించుకుని మీసాలు చక్కగా మెలేసుకున్నారు. వాళ్లు ఆరోజు బజారులో, గురుద్వారాలో కాలక్షేపం చేస్తున్నట్లు వీరో తెలుసుకుంది. ఆరాత్రి అలిసిపోయి తూగుతున్న భర్తకు పున్నమిని గుర్తుచేసి అతనితో వాదనకు దిగింది. అతను పాత సమాధానమే చెప్పాడు – ‘‘వరుణదేవుణ్ని వర్షం కోసం ప్రార్థించు. మనం కూడా గురుద్వారాకు పోదాం’’. ఆ తర్వాత నిద్రపోయాడు. వీరో పక్కమీద కూర్చొని పెదవులు కదిలిస్తూ ప్రార్థించింది – ‘‘ఓ భగవంతుడా! వాన కురిపించు. ఓ స్వామీ! వాన కురిపించు’’. ప్రార్థన చేస్తూ చేతులు అలా జోడించుకునే నిద్రలోకి జారుకుంది. 

అర్ధరాత్రి పిడుగు పడిన శబ్దం ఆమెను నిద్రలేపింది. మెరుపు మెరిసింది. వర్షం మొదలైంది. మర్నాడు ఉదయమే కుటుంబమంతా గురుద్వారాకు వెళ్లారు. తిరిగివస్తూ బజారు మీదుగా, మున్సిపల్‌ పార్క్‌ మీదుగా వస్తూ నగరంలోని బంధువుల్ని పలకరించారు. ఆ రోజు పరమానందంగా గడిచిపోయింది. వీరో తన చీరకు అంచు కొనుక్కోవాలనుకుంది. ఆ విషయం ఇంటికి వచ్చేసినాక గుర్తుకొచ్చింది. బజారు చాలా దూరం. పైగా పిల్లవాడు బాగా అలిసిపోయి నీరసంగా ఉన్నాడు. మళ్లీ బయటికి వెళ్లడానికి బాగా ఆలస్యమైంది. కానీ చీరకు అంచు కొనుక్కోవాలనే కోరిక మనసులో మిగిలిపోయింది. రాత్రి నిద్రపోయే ముందు ప్రార్థన చేసింది. ‘‘స్వామీ! వాన కురిపించు. దయచేసి ఒక్కసారి..’’ అందుకు లోలోపలే సిగ్గు పడింది. అది గుడిలో పూజారిని రెండోసారి ప్రసాదం అడిగినట్లనిపించింది. ఆ రాత్రంతా ఆమె అదే ఆలోచనతో పక్కమీద పొర్లుతూనే గడిపింది. ఎడారిలో దప్పికతో వరపుతో తిరుగుతున్నట్టు, అడవిలో దారితప్పి తిరుగుతున్నట్టు, అగాధంలో పడిపోతున్నట్టూ కలలు వచ్చాయి. ఉదయ కాంతులు చీకటిని పారదోలుతున్న సమయంలో పిల్లవాని ఏడుపు విని వీరో మేల్కొంది. కళ్లు గట్టిగా నులుముకుంది. చూస్తే వర్షం కురుస్తోంది. 

వీరో ఉలిక్కిపడింది. భయంతో వణికిపోతూ వర్షం వైపు చూస్తూ కిటికీ దగ్గర నిలబడింది. భయాన్ని, ఉలికిపాటును వదిలించుకొని గురుద్వారాకు వెళ్లడానికి ఉపక్రమించింది. అవీ ఇవీ కొనుక్కోవడానికి ఇంకో పదిరూపాయలు ఖర్చు పెట్టింది. ఆ మధ్యాహ్నం ఆమె చెల్లెలు, మరిది వచ్చారు. కుండపోతగా వర్షం కురుస్తున్నందువల్ల వాళ్లు ఆ రోజు తర్వాత రెండు రోజులూ అక్కడే ఉండిపోవలసి వచ్చింది. మరిది చికాకు పడ్డాడు. వాళ్ల ఊరెళ్లే రైలును అందుకోవాలనుకున్నాడు. కానీ వాన కుండపోతగా కురుస్తూనే ఉంది. తను ఆగిపొమ్మంటే వాన ఆగిపోతుందనే భావన ఉంది వీరోకి. ఆగమంటే చాలు ఆకాశంలో మేఘాలు ఖాళీ చేస్తాయి. చుట్టాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అంత నమ్మకం కలుగుతూంది ఆమెకు తనమీద. వాళ్లు పదకొండు గంటల రైలందుకోవాలి. అప్పుడే తొమ్మిది దాటింది. వాళ్ల ఇబ్బందికి కారణం లేకపోలేదు.‘‘వాన పది గంటలకు ఆగిపోతుంది. మీరు అప్పుడు వెళ్లవచ్చు’’ అంది వీరో.సరిగ్గా పది గంటలకు వర్షం ఆగిపోయింది. ఆమె చెల్లెలూ మరిది చాలా సంతోషించారుగాని వీరో భర్త మాత్రం దానిని గుర్తించలేదు. వీరో మనసులోంచి ఆ విషయాన్ని తొలగించుకోలేకపోయింది. భర్త బట్టలు ఉతుకుతూ వాకిలి ఊడుస్తూ, ఇంకా ఇతర ఇంటి పనులు చేసుకుంటూ, తాను కోరినప్పుడు వాన రావడం, ఆగిపోతుందన్నప్పుడు ఆగిపోవడం ఎలా జరుగుతుందో మధ్యమధ్యలో ఆమె జ్ఞాపకం తెచ్చుకుంటోంది. తనలో తానే ఉప్పొంగిపోతోంది. కిటికీ దగ్గర నిలబడి ఆకాశంవైపు చూస్తూ నవ్వుతూ గంటలు గడిపేస్తోంది. అక్కడ ఎవరో నిలబడి తనవైపు చూసి నవ్వుతున్నట్లు భావిస్తుంది. జీవితం చాలా హాయిగా ఉన్నట్లుంటుంది. 

ఆకాశంలో గంటల తరబడి కొనసాగుతున్న నిశ్శబ్ద బంధుత్వానికి భంగం కలిగించిందొకటి. అది పక్కింటి రేడియో. అది ఉదయం మధ్యాహ్నం సాయంకాలం విశ్రాంతి లేకుండా శబ్దం చేస్తూనే ఉంది. చెవుల్లో వేళ్లు పెట్టి మూసుకుంది. దూది పెట్టుకుంది. కానీ రేడియో శబ్దం వినిపించకుండా అరికట్టలేకపోయింది. ఆ రేడియో శబ్దం చెవులు చిల్లులు పడేట్టుండటమే కాదు, మనసు పొరల్ని కూడా చీల్చేస్తోంది. అంతే కాక ఆమె సర్వస్వాన్ని ఆక్రమించేస్తోంది. కొంతకాలం తర్వాత గాలిలోంచి వస్తున్న సంగీతాన్ని వింటూ ఆనందిస్తున్నట్లు అనిపించింది వీరోకు. చాలా పాటలు నోటికి వచ్చాయి. తనలో తానే పాడుకుంటోంది.ఆమె కొడుకు కూడా పిల్లల పద్ధతిలో రాగాలు తీస్తున్నాడు. పాలవాడు, కూరగాయలవాడు, పాకీ ఆవిడ వంటి వాళ్లంతా తమ పనులు తాము చేసుకుంటూ రేడియో సంగీతం పాడుతున్నారు. ఒకరోజు సాయంత్రం వీరో రేడియో వింటూ పక్కింట్లో ఉంది. సంగీతం పూర్తికాగానే, కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటన వెలువడింది. ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను కూడారావొచ్చని ఆ ప్రకటన చెప్పింది. ఆ వాతావరణ సూచన వీరో మొహం మీద కొట్టినట్లయింది. వర్షం కురుస్తుందని, లేదని రేడియో ఎలా చెప్పగలుగుతుంది? అసాధ్యం. ఆ రాత్రి పిడుగుపడిన శబ్దం విని ఆమె మేల్కొంది. వర్షం బోరున కురుస్తోంది. వర్షం వెంట తుఫాను. ఆ తర్వాత వీరోకు నిద్ర రాలేదు. మళ్లీ పున్నమి వచ్చింది. వీరో వర్షం కోసం ప్రార్థన చేసింది. రాత్రంతా చేతులు జోడించి ప్రార్థన చేసింది. అలాగే ఆకాశం వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది. చుక్కలు స్పష్టంగా వెలుగుతున్నాయి. చందమామ ఆమెను చూసి నవ్వాడు. మబ్బులూ లేవు. వానా లేదు. వాతావారణం పొడిగా ఉంటుందని రేడియో చెప్పింది. మరో నెల గడిచింది. మళ్లీ పున్నమి వచ్చింది. వీరో దేవుని తలుచుకుంది. కళ్లనీళ్లు పెట్టుకొని ప్రార్థించింది. మొక్కులు మొక్కుకుంది. వినీలాకాశంలోంచి చుక్క వాన కూడా రాలలేదు. చుక్కలు ప్రకాశించాయి. నిండు చంద్రుడు నవ్వాడు. పొడి వాతావరణమే కొనసాగుతుందని రేడియో ప్రకటించింది. ప్రతిరోజూ రేడియో అలాగే చెబుతోంది. మళ్లీ ఒక పున్నమి రాత్రి వచ్చింది. ఈసారి ఆమె ఉపవాసం ఉంటూ మరింత భక్తిశ్రద్ధలతో ప్రార్థించింది. ఫలితం శూన్యం. చుట్టుపక్కల వాళ్లు నవ్వుకుంటూ సంతోషంగా గురుద్వారాకు వెళ్లారు. ఆమె భర్త తూర్పుపటం ఎగరక ముందే పనిలోకి వెళ్లిపోయాడు. ఆమె చుక్కలు మెరిసే ఆకాశం వైపు చూసి వేదనగా అడిగింది – ‘‘నీకేం పోయేకాలం వచ్చింది?’’.  
(‘పున్నమిరాత్రి – ఇతర కథానికలు’ సౌజన్యంతో) 
పంజాబీ మూలం : కర్తార్‌సింగ్‌ దుగ్గల్‌
 అనువాదం: రాచపాళెం చంద్రశేఖరరెడ్డి 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా