రాజీ

21 Oct, 2018 01:50 IST|Sakshi

కథా ప్రపంచం

అస్సామీ మూలం : భాబేంద్రనాథ్‌ సైకియా
 అనువాదం: టి.షణ్ముఖరావు

ఊతకర్రతో నడుస్తున్న గుడ్డివాడు హఠాత్తుగా తన పక్కనే ఏదైనా గలాటా వినపడగానే ముందుగా తన చేతికర్రని గట్టిగా పట్టుకుంటాడు. ఆ తర్వాతే అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. సరిగ్గా అదేవిధంగా ఆ ప్రాంతంలోని మహిళలు ఏ చిన్న సంఘటకైనా ప్రతిస్పందిస్తారు.సాధారణంగా వీరు తమ పిల్లల ఉనికిని పట్టించుకోరు. ఆకలి వేస్తే చాలు పిలవకుండానే ఇళ్లకు వస్తారని వారికి తెలుసు. కాని ఈరోజు గడబిడ వినగానే మహిళలంతా వారి గుడిసెల నుంచి పరుగులతో బయటకు వచ్చారు. తత్తరపాటుతో అటూ ఇటూ తిరుగుతూ తమ పిల్లలను పేర్లు పెట్టి పిలవడం మొదలుపెట్టారు. ప్రతి స్త్రీ తన పిల్లవాడు ఆ గుంపులో ఉన్నాడో లేడో దూరం నుంచే చూసి గుర్తు పట్టగలదు. కానీ అంతటితో తృప్తి పడదు. వాడి వద్దకు పరుగున వెళ్లి వాడి రెక్క పట్టుకుని గుంజుతుంది. గుంపు నుంచి దూరంగా లాక్కొనిపోయి నిలబెడుతుంది. ఆ తర్వాతనే అక్కడి కోలాహలానికి కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.

ఆ రోజు కూడా అక్కడ ఏదో జరిగింది. కొద్ది నిమిషాల్లోనే తల్లులందరూ తమ పిల్లల్ని పోగేసుకున్నారు. వారి పేర్లతో బిగ్గరగా పిలవడమూ ఆగిపోయింది. ఒక్క చీమోతీచీ అనే పిల్లవాడి తల్లి గొంతు మాత్రమే కీచుగా వినిపిస్తోంది. బిగ్గరగా పైకి లేస్తోంది. అక్కడి జనాల రణగొణ ధ్వనుల మధ్య నుంచి కూడా ఆమె సన్నని గొంతు స్పష్టంగా వినిపిస్తోంది.మొదట ఆమె ‘మోతీ... మోతీ’ అని అరిచింది. ఆందోళనతో పరుగులు పెట్టింది. ‘ఇప్పటి వరకు మోతీ మాతోనే ఇక్కడే ఉన్నాడు’ అని మోతీ తోటి పిల్లలు చెప్పారు. కానీ ఎక్కడ? ఏడీ మరి?అందరూ మోతీ ఇప్పుడే ఇక్కడే ఈ బరువైన బస్తాల పోగు వద్దనే ఉండే వాడని ముక్తకంఠంతో చెప్పారు.అది గౌహతీ పట్టణానికి శివారు ప్రాంతం. అక్కడ వేలాది జనాభాకు సరిపడే తిండిగింజలు, నిత్యావసరాలు నిల్వ చేసే గిడ్డంగులు ఉన్నాయి. అసంఖ్యాకమైన లారీలూ ట్రక్కులూ బస్తాలతో నిండుగా వచ్చి ఖాళీగా వెళతాయి. ఖాళీగా వచ్చి బస్తాలతో నిండుగా వెళతాయి.

అక్కడొక ప్రధాన రహదారి ఉంది. దాన్ని ఆనుకుని గిడ్డంగులకు దారితీసే చిన్న సందులున్నాయి. వాటిని రోడ్లనడానికి వీల్లేదు. కొన్నిసార్లు ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. పరిసరాలు క్లీనర్ల అరుపులతో కలుషితమవుతాయి. ఆ ప్రాంతంలో ఒక ఖాళీ ప్రదేశం ఉంది. సుమారు సగభాగం నల్లని ఆకుపచ్చని బురద నీటితో నిండి ఉంది. పిల్లలు మురికి పట్టిన వారి శరీరాల్ని ఆ నీటితోనే కడుక్కుంటూ ఉంటారు. ఆ ప్రదేశం చుట్టూ వెదురు, మట్టి, గోనెసంచులు, అట్టపెట్టెలతో నిర్మించిన గుడిసెలున్నాయి. ఒకప్పుడు ఆ గుడిసెల్లో కళాసీలు ఉండేవారు. ఇప్పుడు మాత్రం కొందరు స్త్రీలు వారి పిల్లలతో కలిసి వాటిలో నివసిస్తున్నారు. వారంతా కూలీ నాలీ లేక భిక్షాటన చేస్తుంటారు. మోతీ తల్లి వంటి కొద్దిమంది తప్ప మిగిలిన వారంతా వయసు మళ్లిన స్త్రీలే. పిల్లలు కూడా రోడ్ల పక్కనే తిరుగుతుంటారు. ఆడుకుంటూ ఉంటారు. జామ్‌లో నిలిచిన ట్రక్కుల అడుగు భాగంలోని గింజలను తుడిచి తల్లులకు ఇస్తారు. లేదా చిన్న ఇనుపరాడ్లతో లారీల్లోని బస్తాలకు రంధ్రాలు చేస్తారు. బియ్యం, చక్కెర, పప్పులు వెలికితీసి సేకరిస్తారు.క్లీనర్లు అదిలించినట్లయితే దూరంగా పారిపోతారు. వారు ఏమరుపాటుగా ఉంటే తిరిగి చేరి తమ పని చేసుకుంటారు. పిల్లలు ఎల్లప్పుడూ ట్రాఫిక్‌ జామ్‌ కావాలనే ప్రార్థిస్తూ ఉంటారు.నిజానికి ఈరోజు జామ్‌ అంత పెద్దది కాదు.

రెండు లారీలూ ఎదురెదురుగా వచ్చి నిలిచిపోయాయి. కొంతసేపు ఇద్దరు డ్రైవర్లూ నీది తప్పంటే నీది తప్పని వాదించుకున్నారు. తన లారీ కదిలించనంటూ భీష్మించుకు కూర్చున్నారు.రెండోవైపు నుంచి బియ్యం బస్తాలతో వస్తున్న మరో లారీ తాలూకా ఎడమ చక్రం బురదలో దిగబడిపోయింది. లారీ కూడా ఒకవైపు ఒరిగిపోయింది. దానిపైనున్న బస్తాలు నేలమీద పడసాగాయి. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న పిల్లలు బురదనీటి మీదుగానే దూరంగా పారిపోయారు. మోతీ చావుకేక మాత్రం దొర్లిపోతున్న బస్తాల శబ్దంలో కలిసిపోయింది. వాడిపైన బస్తాలు ఒకదాని తరువాత ఒకటిగా పడిపోయాయి.ప్రధాన రహదారి నుంచి జనం వచ్చి ఘటనాస్థలం వద్ద గుమిగూడారు. మోతీ తల్లి ఏడుపు విన్న వారంతా పిల్లవాడి గురించి వాకబు చేయడం మొదలుపెట్టారు. బస్తాల్ని ఒక్కొక్కటీ తొలగించడం ప్రారంభించారు. మొదట మోతీ పాదాలు కనపడ్డాయి. చివరి బస్తా కూడా తీసేసరికి అక్కడి మనుషులు ఆ దృశ్యాన్ని చూడలేకపోయారు. ఇక ఆరోజు రవాణా ఆగిపోయింది. అప్పటికే సాయంకాలమైంది. ప్రధాన రహదారి మీద కూడా లారీలు వరుసగా నిలిచిపోయాయి. నుజ్జు నుజ్జయిన మోతీ ఎముకల్నీ మాంసాన్నీ పోగు చేసిన పోలీసులు వాటిని ఒక బస్తాలో వేసి హాస్పిటల్‌కు తరలించారు. మోతీ తల్లి వెర్రిగా రోదిస్తుండగా చుట్టూ ఉన్న స్త్రీలు ఆమెను గట్టిగా పట్టుకున్నారు. ఆమె స్పృహ తప్పిపోయింది. ఎవరూ చాలా రాత్రి వరకు నిద్రపోలేకపోయారు. కొందరైతే నెత్తీ నోరూ కొట్టుకుని రోదిస్తున్న మోతీ తల్లి వద్దనే ఉండిపోయారు. ఆలస్యంగా నిద్రపోయినప్పటికీ ఉదయాన్నే తొందరగా లేచారు. పెద్దవారంతా సూది మొనగల ఇనుప కడ్డీలూ బుట్టలూ పట్టుకొని బస్తాల వద్దకు చేరిపోయారు. వీలైనంత వరకు బియ్యం పప్పులూ చక్కెరా సేకరించుకున్నారు. మోతీ రక్తంతో తడిసిన బస్తాను మాత్రం ఎవరూ ముట్టుకోలేదు.రెండోరోజు కొద్దిమంది దర్జా దుస్తులు ధరించిన వ్యక్తులు ఘటనాస్థలానికి వచ్చారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నారో ఎవరికీ తెలీదు. పడి ఉన్న బస్తాల్ని కూలీల చేత ఎత్తించారు. ఇద్దరు కూలీలు మోతీ రక్తపు మరకలున్న బియ్యపు బస్తాని మోసుకొచ్చి మోతీ తల్లి పాకలో పెట్టారు. 

బహుశా మోతీ ప్రాణం ఖరీదు ఒక బియ్యపు బస్తాగా ఆ పెద్దలు నిర్ధారించారు. ఆమె వెర్రిదానిలా లేచి ఏడుస్తూ ‘వద్దు... వద్దు... నాకీ బస్తా వద్దు’ అని అరవడం మొదలుపెట్టింది. ఆ బస్తా మీద పడి రోదించసాగింది. కూలీలు రక్తపు మరకలున్న భాగాన్ని గోడవైపు పెట్టారు. ఆరోజంతా ఆమె తన నులకమంచం మీదనే కూర్చుని ఏడవసాగింది. ఆ బస్తా వైపు చూడలేకపోయింది. తిండి తినలేదు.నిద్రపోలేదు. చాలారోజుల వరకు ఆమె ఏడుస్తూనే ఉంది. ‘నాకే బస్తా వద్దు. తీసుకుపొండి... తీసుకుపొండి’ అని అరుస్తూనే ఉంది. మోతీ తల్లికి తన పల్లెలో తల్లిదండ్రులెవరూ లేరు. ఆమె తన పినతండ్రి వద్ద పెరిగింది. అతనికి పప్పుధాన్యాలు పండించడంలో సహాయపడేది. ఒక వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లేవదీసుకొచ్చాడు. కాని ఆమె గర్భవతిగా ఉన్నప్పుడే ఆమెను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు. తిరిగి రాలేదు. మోతీ పుట్టిన ఇన్ని సంవత్సరాలుగానూ అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది. లారీల వారికి మురీమిక్చర్‌ అమ్ముతూ పొట్ట పోషించుకుంటోంది.

ఒంటరి స్త్రీ కనుక డ్రైవర్లూ క్లీనర్లూ పరాచికాలాడేవారు. ‘వాడు మరి రాడు. మాలో ఎవర్నైనా ఎంపిక చేసుకో’ అనేవారు. మిగిలినవారు నవ్వేవారు. కానీ మోతీ తల్లి స్పందిచేది కాదు. కోపంగా చూసేది.నిజానికి అలా ఒంటరిగా జీవించడానికి ఆమె దిగులు పడుతూ ఉండేది. చుట్టూ ఉన్న మగవారన్నా భయపడేది. మోతీ తలను గుండెకు హత్తుకుని నిద్రపోయేది. మోతీయే ఆమె ఆశ. ఆమోతీయే ఆమె ప్రాణం.కొడుకు మగనికన్నా విలువైన వాడు. ఆమె చెవికి అమ్మా అనే పిలుపు ఎప్పుడూ వినపడుతూ ఆసరాగా ఉంటుందని భావించింది. ఆ ఆశ ఇప్పుడు అడియాస అయింది.మోతీ దుర్మరణంతో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఆ పాకను ఆవరించింది. ఆమెలో ఒక భయానకమైన శూన్యం ఏర్పడింది. పిచ్చిదానిలా ప్రవర్తించసాగింది. మొదట్లో ఆ బస్తా వైపు చూస్తూ నెమ్మదిగా ఏడ్చేది. ఇప్పుడు మౌనంగానే రోదిస్తోంది. ఇరుగు పొరుగువారు బిచ్చమెత్తి తెచ్చిన గింజల్ని ఇచ్చేవారు. కొన్నిసార్లు ఏదో వండుతుంది. కానీ తినదు. కొన్నిసార్లు వంటే చెయ్యదు. అసలు ఆమెకు ఆకలే లేకుండాపోయింది. ఏ లారీ నుంచి బస్తాలు మోతీ మీద పడ్డాయో ఆ లారీ క్లీనరు తరచుగా ఆమెను చూడటానికి వచ్చేవాడు. తినుబండారాలనూ తెచ్చేవాడు. చనువుగా మాట్లాడబోయేవాడు. కానీ మోతీ తల్లి అతనితో ముభావంగా ఉండేది.ఎక్కువగా మాట్లాడేది కాదు. రోజులు గడుస్తున్నాయి. ఆమె ఎప్పుడూ ఆకలితోనే ఉంటోంది. ఇరుగు పొరుగు వారి సహాయమూ ఆగిపోయింది. ఒక రోజు ఎలుకలు ఆ బస్తాకు రంధ్రం చేసినట్టు ఆమె గుర్తించింది. ప్రతిరోజూ ఉదయం కొంచెం బియ్యం గింజలు బస్తా పరిసరాల్లో పడి ఉంటున్నాయి. ఆ బియ్యాన్ని ఆమె చీపురుతో తుడిచేది. అప్పుడు ఆమె కళ్లు కన్నీళ్లతో తడిసేవి.ఒకరోజు ఆమెకు ఆకలి దహిస్తోంది. మంచం మీద అదే పనిగా అశాంతిగా దొర్లసాగింది. కొంతసేపటి తర్వాత లేచింది. ఒక వెదురు చేటను ఆ బస్తా వద్ద పెట్టింది. ఎలుకలు చేసిన రంధ్రం గుండా తన చూపుడు వేలిని చొప్పించి నెమ్మదిగా కదిలించింది.గుప్పెడు బియ్యం పోగవడానికి చాలాసేపు పట్టింది. ఆ బియ్యంతోనే ఆ పూట గడిచింది. అప్పడప్పుడూ క్లీనరు వస్తూనే ఉన్నాడు. ఏదో తెస్తూనే ఉన్నాడు. కానీ తీసుకోవడానికి ఆమె అంత ఇష్టపడేది కాదు.ఎలుక వల్లనో, ఆమె వేలి వల్లనో బస్తాకున్న రంధ్రం పెద్దదయింది. బియ్యమూ ఎక్కువ మొత్తంలో కింద పడ్డాయి. ఆ విధంగా బియ్యాన్ని వృథా చేయడం ఆమెకు నచ్చలేదు. బస్తాపై ఒక గుడ్డను కప్పి రంధ్రాన్ని మూసివేసింది. 

కొన్నిసార్లు క్లీనరు అనేవాడు ‘ఒక్క బియ్యంతో ఎలా బతుకుతావు? పప్పులూ కూరగాయలూ కూడా నన్ను తేనివ్వు’. కానీ మోతీ తల్లి ఏమీ జవాబు చెప్పేది కాదు. రోజులు గడుస్తున్నాయి.బస్తాకున్న రంధ్రం అవసరం లేకుండానే బియ్యం చేతికి అందుతున్నాయి. బస్తా చిన్నదైపోయింది. ఒకరోజున ఆమె భుజాల వరకు చేతిని చొప్పించింది. కానీ చాలినన్ని బియ్యం రాలేదు. ఉన్న కొద్దిపాటి బియ్యమూ బస్తా కుట్లలో ఇరుకున్నాయి. అప్పుడామె బస్తా మూతి వద్ద ఉన్న కుట్లను విప్పింది. బస్తాని తిరగేసి దులిపింది. సాయంత్రం తిండికి సరిపడా గింజలు రాలాయి. వాటిని చీపురుతో తుడిచింది. చేటతో చెరిగి చెత్తను తీసేసింది.ఖాళీ గోనె సంచిని ఎండలో పెట్టింది. రక్తపు మరకల భాగాన్ని నేలవైపు ఉంచింది. సాయంత్రం ఆ బస్తాను దులిపి తను పడుకునే నులకమంచం మీద పరుచుకుంది.కొంచెం ఎంగిలిపడి మంచంపైకి చేరింది. వాతావరణంలో చలి గుడిసెలోనికి చొచ్చుకొస్తోంది. గత కొద్దిరోజులుగా చలి మరింత తీవ్రమవుతోంది. గతంలో మోతీ ఆమెను హత్తుకుని పడుకునేవాడు. కాబట్టి ఆమెకు చలి బాధ తెలిసేది కాదు. కింద పరుపుగా ఉన్న గోనెసంచి కూడా చలి నుంచి కొద్దిగానే రక్షిస్తోంది.కానీ ఆమె మనసు వికలమవుతోంది. ఒంటరితనం గుండెల్లో దిగులు పుట్టిస్తోంది. ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి.అంతలోనే ఒక ఎలుక గతంలో బస్తా ఉన్న చోటికి రావడం ఆమె గమనించింది. ఆ ఎలుకను అదిలించడానికి మోతీ ఆమె పక్కన ఇప్పుడు లేడు. మోతీ లేని లోపం బాధగా మారిఆమెను మరింతగా దహించేస్తోంది. ఆమె ఏడుపు ఆపుకోలేకపోతోంది. ఏమైనా ఆమెకొక ఓదార్పు కావాలి. ఆమె జీవితానికొక ఆశాజ్యోతి కావాలి. వార్ధక్యానికి ఆసరా కావాలి. ఆ దశలోనే ఆమె ఇలా అనుకుంది.. ‘ఈసారి ఆ క్లీనరు వచ్చి బియ్యం పప్పులూ ఇస్తానంటే వద్దనను. తెచ్చివ్వమనే అంటాను. అది కూడా మరో మోతీ కోసమే... మోతీ కోసమే..’
  

మరిన్ని వార్తలు