నిర్ణయం

29 Jul, 2018 00:45 IST|Sakshi

ఈవారం కథ

హక్కుల కోసం పోరాడాల్సి వస్తే మనసే కాదు దేహం కూడా ప్రధానాంశమే! ఆ పోరాటం యుద్ధంగా మారితే? తెగిపోయేవీ ఉంటాయి. తెగ్గొట్టుకునేవీ ఉంటాయి. తెగిపోయేముందే బంధం గట్టిదనం తెలుస్తుంది. మరి తెగ్గొట్టుకోవాలనుకుంటే? ఆ గట్టిదనం ఎవరికుండాలి? వాసంతి మనసులో భయంకర అంతర్యుద్ధం! ఓ నిర్ణయాన్ని చుట్టేసుకున్న చిక్కుముళ్లెన్నో. మూడుముళ్లు పడ్డాక గానీ తనకు ఈ విషయం తెలిసిరాలేదు. ఎలాగైతేనేం చివరికి నిర్ణయం తీసుకుంది, చాలా ఊగిసలాట తర్వాత.  మనసు బెలూన్‌లా నింగిలో ఈదుతున్న ఫీలింగ్‌. చాలా కాలం తర్వాత మళ్లీ  స్వేచ్ఛ.

సమీర్‌ వాసంతి జీవితంలోకి చాలా అనూహ్యంగా వచ్చాడు. ఓ ఫ్రెండ్‌ మ్యారేజీలో పరిచయం, పెళ్లి దాకా తీసుకెళ్లింది. సమీర్‌ పరిచయం అయిన కొత్తలో తన టెండర్‌ ఫీలింగ్స్‌ని అక్షరాల్లో బంధించి, గులాబీ కాయితంలో అందంగా రాసి కొరియర్‌ చేసింది. ఆ పని చేసేదాకా నిద్రపోలేదు. ఎఫ్‌బీ దాటేసి వాట్సాప్‌... ట్విటర్‌... ఇన్‌స్టాగ్రాం దిశగా కమ్యూనికేషన్‌ రాకెట్‌లా  పరిగెడుతుంటే... ఈ లెటర్‌ గోలేంటీ? నేషనల్‌ హైవేలో ఎడ్లబండిలా అనుకుంటాడేమో? అని డౌట్‌ పడినా, కొన్ని ఇలా ఉంటేనే అందం అని చాలా అందంగా సమర్థించుకుంది. ‘వాసంత సమీరం నువ్వయితే... హేమంత తుషారం నేనవుతా...’ అంటూ పొయటిక్‌గా రాసుకున్న ఆ లెటర్‌ తన జీవితంలో వసంతాన్ని మోసుకుకొస్తుందని కలగంది. వాస్తవం వసంతం అంత అందంగా ఉండదని చాలా త్వరగా అర్థమైంది. అది తెలిసేలోగా గుండెకు బోలెడన్ని గాయాలు. రక్తసిక్తమైన భావాలు! సమీర్‌ తన లైఫ్‌లోకి వచ్చినపుడు బ్యూటిఫుల్‌ అనుకుంది. వచ్చినపుడు అని ఎందుకంటే ఇప్పుడా ఫీలింగ్‌ లేదు కాబట్టి. పెళ్లి లైఫ్‌ చేంజింగ్‌ ఈవెంట్‌ అనుకుంది. సమీర్‌ తప్ప తనకెవరూ  కరెక్టు కాదని అమ్మతో వాదించి మరీ ఒప్పించుకుంది. జీవితాంతం తోడుంటాడని, ఉండాలని అనుకుంది. కానీ ఆరునెలల్లోపే ఆశలన్నీ ఆవిరవుతాయని, కలలు కరిగి కన్నీరవుతుందని తను మాత్రం ఊహించిందా ఏంటి? జీవితం అనూహ్యంగా ఉంటుందని కథల్లో చదవడమే కానీ ఇంతలా ఉంటుందని వాసంతి అస్సలు ఊహించలేదు. 

‘‘ఏమైందే నీకు. మైండ్‌ దొబ్బిందా?’’.వాసంతి ఇరానీ చాయ్‌లో తడిసి మెరుస్తున్న బిస్కెట్‌ను శ్రద్ధగా తింటోంది.స్నేహకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఏంటే... నేనిక్కడ వాగుతుంటే తమాషాగా ఉందా? అసలు నువ్వేం చేస్తున్నావో తెలుసా?’’‘‘ఏం చేస్తున్నాను?’’‘‘చెప్పవే ఏం చేస్తున్నాను. ఓ నరకం నుంచి బైటకు రావాలనుకుంటున్నాను. తప్పా?’’‘‘అది కాదే బాబూ. లైఫ్‌లో కాసింత అడ్జెస్ట్‌మెంట్‌ ఉండాలి. అన్నీ మనం అనకున్నట్టుండవు..’’‘‘ఇంకాపుతావా సోది. చూడు... నా బాధేంటో నాకు తెలుసు. నేనెంతగా నలిగానో నాకు తెలుసు. నేనెంతగా చెప్పినా మీకర్థం కాదని మాత్రం ఇప్పుడే తెలుస్తోంది.’’‘...కాదే! సమీర్‌ను ఇష్టపడి చేసుకున్నావుగా ఏం ప్రాబ్లెమ్‌..’’‘‘డామిట్‌. ఏం చెప్పాలే! హీఈజ్‌ సెక్సువలీ పర్వర్టెడ్‌. నాట్‌ గుడ్‌ అట్‌ బెడ్‌. నన్ను నంజుకు తిన్నాడు...చాలా ఇంకా పచ్చిగా చెప్పాలా’’‘‘హే... లైట్‌ తీస్కో. కొందరలా ఉంటారం...’’‘‘ఇంకెక్కువ వాగితే చంపేస్తానంతే. ఇంత ఓపెన్‌గా చెప్పినా నీకర్థం కాలేదా?’’‘‘ఓకే బాబా. పోనీ సమీర్‌తో మాట్లాడనా...’’‘‘మన ఫ్రెండ్‌షిప్‌ ఉండాలంటే కాస్త మూసుకునుండు...’’‘‘అలాగే ఉంటా! కానీ మీ మమ్మీ గురించి ఆలోచించవా? నిన్ను ప్రాణంలా పెంచుకుంది. ఆంటీని అలా చూడలేకున్నారా!’’‘‘స్నేహా! గాయం తగిలింది. మందేస్తున్నాం. మానాలంటే టైం పడుతుంది కదా! చూద్దాం...’’ లేచింది.‘‘వాసూ వన్‌ మినిట్‌...’’ స్నేహæగట్టిగా హగ్‌ చేసుకుంది. ఇద్దరి కళ్లల్లో చివ్వున ఎగసిన కన్నీరు. గాలికి రెపరెపలాడే దీపం లాంటి నవ్వును పెదాలపై నిలుపుకుంటూ వాసంతి, ‘‘హే... డోంట్‌ బీ సిల్లీ.నన్ను డౌన్‌ చేయొద్దు ప్లీజ్‌...’’ అంటూ ముందుకు కదిలింది.

అమెరికా నుంచి మూటాముల్లె సర్దేసుకొచ్చిందని తెలీని మణి, కూతురికి తనపై బెంగయిందనుకుంది. రెండ్రోజులయ్యాక అది బెంగ కాదని అర్థమైంది. ఏమైందని తను అడగలేదు. ఏం వినాల్సి వస్తుందోనని భయం వల్ల. పదిహేనేళ్లుగా మణి చాలా విషయాల్లో భయపడుతూనే ఉంది. భర్త పోయాక జీవితంలో ఒంటరితనం ఒంటరిగా రాలేదు. భయాన్ని వెంటబెట్టుకొచ్చింది. ఈ విషయం వాసంతికి తెల్సు. అందుకే వచ్చి రెండ్రోజులవుతున్నా ఏం చెప్పలేదు. తనేం చెబుతుందా అని మణి ఎదురుచూస్తోంది. రాత్రి పదకొండు గంటలు. గదిలో చిన్నలైట్‌. బెడ్‌పై మణి, వాసంతి.‘‘మమ్మీ నాపై కోపంగా ఉందా?’’‘‘.....’’ఒకరి గుండెలో ఆవేశం. ఒకరి గుండెలో ఆవేదన. ఒకరి నుంచి మరొకరికి ప్రవహిస్తున్నాయి.‘‘రాగానే చెబుదామనుకున్నా. బట్‌ మొదట నేను సెట్‌ కావాలి కదా!’’మణి తలెత్తింది. చెక్కిళ్లపై జారిపోతున్న కన్నీళ్లు. మొహంలో చెప్పలేనంత ఆందోళన.‘‘మమ్మీ! కూల్‌...’’ వాసంతి గొంతు వణుకుతోంది.

‘‘ఎందుకిలా. మనకే ఎందుకిలా? ఇంకా ఎంత కాలం పోరాడాలి? నా ఒంట్లో ఓపిక చచ్చిపోయింది. ఇప్పుడెలా?’’ వెక్కిళ్ల మధ్య మణి మాటలు అస్పష్టంగా వస్తున్నాయి.వాసంతికిలాంటి సందర్భం వస్తుందని తెలుసు. కానీ ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. తనేం చెప్పినా మళ్లీ విషయం ‘అడ్జస్ట్‌’ అన్న పదం వద్దే ఆగుతుంది. అయితే అదెంత నరకమో ఆర్నెల్ల అమెరికా జీవితం చాలా ప్రాక్టికల్‌గా చూపింది. అసలు ‘దాడి’ అనేదే ఇన్‌హ్యూమన్‌! మానసికమైనా, దైహికమైనా. చాలా ఇరిటేటింగ్‌ ఉంటుంది. అన్‌బేరబుల్‌గా ఉంటుంది. అసలు ఎవరు ఎవర్నైనా టేకిట్‌ గ్రాంట్‌గా తీసుకోవడం కన్నా విషాదం మరొకటి ఉండదేమో! వద్దన్నారంటే వద్దనేగా. ఇంత చిన్న విషయం ఎందుకు అర్థం కాదని మొదట్లో అనుకున్నా, అర్థం కాకపోవడం కాదు అహంకారమని అర్థమైంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడో కొత్త సమస్య. అసలు ఎవరు ఎవరిని ఓదార్చాలి?గాయం తనకే. నష్టమూ తనకే. కానీ ఇబ్బంది మాత్రం ఇద్దరిదీ!‘‘అమ్మా బాధ పడకు. అన్నీ మనమంచికే...’’‘‘ఒంటరిగా ఉంటే ఏమవుతుంది? అయినా నువ్వుండగా నేను ఒంటరినెలా అవుతా?’’‘‘నాకదంతా తెలీదే. నాకోసం... కేవలం నాకోసం ఒక్కసారి ఆలోచించు ప్లీజ్‌...’’ తల్లి మాటలు గుండెలో మంటలు రేపుతున్నాయి. ఏం మాట్లాడలేక రూం నుంచి భారంగా కదలింది. వెనకాల వెక్కిళ్లు వినిపిస్తునే ఉన్నాయి. వాసంతి మనసు నిర్వికార స్థితిలో ఉంది. అమ్మ కోసం, స్నేహ కోసం, ఆ వెధవ సమీర్‌ కోసం, సమాజం కోసం, ఇంకా ఇంకా... ఎంతమంది కోసం నన్ను నేను మార్చుకోవాలి, రాజీ పడాలి? పోనీ అలా చేస్తే నెమ్మది దొరికి ఛస్తుందన్న గ్యారెంటీ ఉందా? ఛీఛీ. వెధవ జీవితం! ఒక్కసారిగా తలవిదల్చుకుంది. హాల్లో సోఫాపై నీరసంగా వాలిపోయింది. కళ్లు మూతబడుతున్నాయి.

అనుపమారావు. సిటీలో చాలా పేరున్న లాయర్‌. ఫ్యామిలీ కౌన్సెలర్‌. ఆఫీస్‌ ఫర్నిచర్, యాంబియన్స్‌ చాలా హైఫైగా ఉంది. కన్సల్టెన్సీ ఫీజు కూడా అదే లెవెల్‌లో ఉంటుంది.  వెయిటింగ్‌ లాంజ్‌లో పదిమంది దాకా ఉన్నారు. మణి బలవంతం మీద ఇష్టం లేకున్నా వాసంతి వచ్చింది. గదిలో అందరినీ నిశితంగా గమనిస్తోంది. అందరూ ఏదో ఓ సమస్యతో పోరాడుతున్నట్టే ఉన్నారు. ‘నా మొహం. సమస్య లేకుంటే ఇక్కడికెందుకు వస్తారు?’ అనుకుంది. పక్కనే  ఓ ఆంటీ. తెల్లగా చందమామలా మెరుస్తోంది. పొందిగ్గా కట్టుకున్న బ్లాక్‌ శారీలో మరింత అందంగా కనిపిస్తోంది. మొహంలో ప్రశాంతత! మరి ఇక్కడికెందుకొచ్చిందో?  వాసంతిని చూసి మెల్లగా నవ్వింది. అసలు మనుషుల్తో మాట కలపాలంటేనే విసుగ్గా ఫీలవుతున్న వాసంతికి చల్లని గాలి తాకినట్టు హాయి అనిపించింది. ఆంటీతో మాట్లాడితే బావుణ్ను అనుకుంటుండగానే ఆమే ‘‘హాయ్‌’’ అంది. దాదాపు పది నిమిషాల ఆత్మీయ సంభాషణలో వాసంతి చాలా అసంకల్పితంగా తన సమస్య ప్రస్తావించింది. ‘‘డోంట్‌ వర్రీ బేబీ! ఇదే లైఫ్‌. లోపల నా కూతురుంది. తనకూ సేమ్‌ ప్రాబ్లమ్‌. నేను క్లియర్‌గా చెప్పా. ఎవరి కోసమో మన ఇష్టాలను, లైఫ్‌నూ మార్చుకోవాల్సిన అవసరం లేదని.  స్త్రీగా తన సమస్య నాకు అర్థమవుతోంది. డివోర్స్‌కు లీగల్‌గా ఫార్మాలిటీస్‌ పూర్తయ్యాయి. అయామ్‌ విత్‌ హర్‌’’ ఆంటీ మాటలు బూస్ట్‌లా పనిచేశాయి. ఇంతలో ఆంటీ కూతురు బైటికి వచ్చింది. తనకు కనీసం నలభై ఏళ్ల పై చిలుకుంటాయి. పరిచయం చేసింది. ఆమెకు అయిదేళ్ల బాబు. ఈ స్టేజీలో ఈ సమస్యేంటి అని వాసంతికి ఆశ్చర్యమేసింది. 

‘‘రెండేళ్లుగా తనలో ఈ విపరీత ధోరణి పెరిగింది. ఎంత ఓపిక పట్టినా, మార్చేందుకు ప్రయత్నించినా కుదరలేదు. సైకాలజిస్టులు, ఫ్యామిలీ కౌన్సెలర్లు చాలా మందిని కలిశాం. ఎవరైనా చివర్లో చెబుతున్న మాట ‘కాస్త ఓపిక పట్టండి. తనలో మార్పు రావచ్చు.’ అని. కానీ ఆ కొన్నేళ్లు ఎన్నేళ్లు? అప్పటిదాకా ఈ హింసను నిబ్బరించుకోవడం ఎలా? ఒకసారి నేనే అడిగా ఎందుకిలా? అని. ‘నాయిష్టం. నా స్ట్రెస్‌ బరస్ట్‌కు అదొక్కటే దారి.’ అన్నాడు. అప్పుడే నేను డిసైడ్‌ అయ్యా. ఈ సమస్యకు పరిష్కారం నిరీక్షణ కాదు. మరో దారి వెతుక్కోవడమేనని. ఆరునెలలుగా పోరాడితే, ఇదిగో ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చింది.’’ ఆమె మాటలు విన్నప్పుడు వాసంతికి తను నడుస్తున్నది సరైన దారేనని మరోసారి అనిపించింది. ఆంటీ తన కూతురు భుజంపై చేయి వేసుకువెళుతుంటే. దెబ్బతిన్న పిట్టను తల్లి తన రెక్కలతో జాగ్రత్తగా కాపాడుతున్నట్టుగా ఉంది. తనెంత అదృష్టవంతురాలో కదా అనిపించింది. అదే సమయంలో తన యుద్ధం సరైనదే అనిపించింది.

‘‘వాసంతీ...’’ అటెండర్‌ పిలుపు విని లేచింది, స్థిరచిత్తంతో.గతాన్ని వదిలించుకునేందుకు, కొత్త బతుకును వెతుక్కునేందుకు వాసంతి సరికొత్తగా ప్రయత్నిస్తోంది.అనుకోకుండా ఓరోజు సమీర్‌ ప్రత్యక్షమయ్యాడు. వాసంతి నివ్వెరపోయింది. అదీ క్షణం పాటే. వెంటనే ఎలా వచ్చాడో అర్థమై మనసు నిబ్బరం చేసుకుంది. గదిలో ఇద్దరే. వారిని ఆవరించుకున్న నిశ్శబ్దం. ‘‘సారీ చెబుతున్నానుగా... ఇంకేం చేయమంటావో చెప్పు’’ సమీర్‌ తీయని స్వరం వాసంతికి చేదుగా అనిపిస్తోంది. అసలు తన ముందు కూర్చోడానికే ఇబ్బందిగా ఉంటోంది.‘‘...ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు లేకుండా నేను ఉండలేనురా.’’‘‘చచ్చిపో. వెంటనే చచ్చిపో. ఆపితే ఒట్టు!’’ మాట గొంతు వద్ద ఆగింది.‘‘ఏదో బ్యాడ్‌ టైమ్‌. ఇద్దరి మధ్య గ్యాప్‌ వచ్చేసింది. నువ్వెలా ఉండమంటే అలా ఉంటా! నవ్వు పర్మిషన్‌ ఇవ్వందే టచ్‌ కూడా చేయను. సరేనా!’’అసహ్యం అంతకంతకూ పెరిగిపోతోంది. ఇంతలో అమ్మ కాఫీ తీసుకొచ్చింది.‘‘ఆంటీ మీరుండండి. మరో కప్పు నేను తీసుకొస్తా. ముగ్గురం తాగుదాం’’ అంటూ లేచాడు. అల్లుడి మాటలకు మురిసిపోయింది. ‘‘వద్దులే సమీర్‌. కాసేపు రెస్టు తీసుకో! మళ్లీ రేపు ప్రయాణం అంటున్నావుగా. వాసంతి ఈసారైనా పచ్చళ్లు పట్టుకెళ్లు’’‘ఓహ్‌. అంటే  ఈయనగారు వాలిపోయి నా ప్రయాణానికి కూడా రంగం సిద్ధం చేశారన్నమాట’. అమ్మపైన కోపం వచ్చేస్తోంది. కనీసం సమీర్‌ వస్తున్నట్టు చెప్పలేదు. ఎందుకిలా? తను తల్లే కావచ్చు. కానీ ప్రాబ్లం స్పష్టంగా చెప్పాక కూడా ఎందుకీ నాటకాలు. ఎవర్ని మెప్పించడానికి. నాన్న చిన్నప్పుడే పోయాడు. చాలా కేర్‌తో పెంచింది. నిజమే! కానీ మళ్లీ ఆ నరకంలో పంపడానికి సిద్ధమైందంటే సమీర్‌ సెంటిమెంట్‌ మాటలకి కరిగిపోయి ఉండొచ్చు. లేదా కన్నతల్లిగా నన్ను కాపురానికి పంపడమే జీవిత పరమావధి అనుకుంటుందేమో. నాకైతే ఈ రెండూ తప్పే! ముసురుకుంటున్న ఆలోచనల్లో ఈదుతున్న వాసంతి ఉక్కిరిబిక్కిరవుతోంది.

‘‘రేపటికి ఫ్లైట్‌ టికెట్లు తీశా. సరేనా?’’ సమీర్‌ మాటల్ని మధ్యలోనే తుంచింది – ‘‘...సమీర్‌ నీతో ఎక్కువ మాట్లాడ్డం నాకిష్టం లేదు. ఒకటే చెబుతున్నా. మన పెళ్లి, కాపురం ఓ పీడకల అనుకో. నేనూ అలానే అనుకుంటున్నా! ఎవరికి వారు హాయిగా ఉందాం’’.అతని మొహం జేవురించింది. అయినా నవ్వు పులుముకోడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.‘‘ప్లీజ్‌ వాసంతి. డోంట్‌ మేక్‌ ఎ బిగ్‌ ఇష్యూ...’’‘‘డామిట్‌. బిగ్‌ ఇష్యూ కాదా! రాత్రంతా ఒంటిపై బట్టల్లేకుండా నిలబెట్టడం, సిగరెట్లతో కాల్చడం, ఒళ్లంతా పచ్చిపుండు చేస్తూ, నోట్లో డ్రింక్‌ పోస్తూ, ఇవేవీ బిగ్‌ ఇష్యూస్‌ కాదా?’’ తన గొంతు అదురుతోంది. చింతనిప్పుల్లా భగభగమంటున్న కళ్లు. ఉబికి వస్తున్న కన్నీళ్లు. ఆవేశంతో బెడ్‌షీట్‌పై బిగుసుకుంటున్న పిడికిలి. క్లౌడ్‌ బరస్ట్‌లా ఉంది వాతావరణం.‘‘అరే! ఇవన్నీ చిన్న చిన్న సరదాలు. అర్థం చేసుకుంటావనుకున్నా. ఓకే నీకిష్టం లేదంటున్నావుగా వదిలేయ్‌. అయినా పిల్లలయ్యాక ఈ సరదాలు ఎలాగూ ఉండవుగా. పోనీ ఇద్దరం అర్థం చేసుకోడానికి ప్రయత్నిద్దాం. అంతేగానీ నిన్న పెళ్లి, ఇవాళ పెటాకులు అంటే ఎలా? నాకూ సొసైటీలో ఓ పరువు ఏడ్చింది కదా!’’‘‘సమీర్‌ సార్‌! మీ పరువు మీవద్దే భద్రంగా ఉంచుకోండి. బట్‌ డోంట్‌ ఫోర్స్‌ మీ...’’క్షణకాలం నిశ్శబ్దం. తుపానుకు సూచికలా!‘‘అసలేంటే నీ ప్రాబ్లం?’’ వ్యంగ్యం అహంకారం దట్టించి వదిలిన మాటల తూటా. ఒక్కసారిగా దూసుకొచ్చింది. ‘‘మహా నోరేసుకుని మాట్లాడేస్తున్నావ్‌? నన్ను కాదని బతికేద్దామనే? ఏంటి ఎవడ్నయినా ఫిక్స్‌ చేసుకున్నావా? అలా అయితే చెప్పు ఇప్పుడే  వెళ్లిపోతా!’’ వాసంతికి నవ్వొచ్చింది. మాటలకు ఎంత మేకప్పు వేసినా కొన్ని సందర్భాల్లో అసల్‌ రంగు నికల్‌ గయా అన్నట్టు ఇట్టే బైట పడిపోతుంది. వీడిదీ ఇంతే!

‘‘సమీర్‌ మైండ్‌ యువర్‌ టంగ్‌. నువ్వు నా ఇంట్లో ఉన్నావు. ముందు బైటికి నడు. వారంలోగా లాయర్‌ నోటీసు నీ మొహాన కొడ్తా.’’ వాసంతి ధోరణి మరింత రెచ్చగొట్టింది. తట్టుకోలేకపోయాడు. ఎవరికైనా ఓడిపోతున్నప్పుడే బ్యాలెన్స్‌ తప్పుతుంది. ‘‘నువ్వింత బజారు దానివనుకోలేదు. నిన్ను కట్టుకోడానికి గంతులేశాను చూడు... అందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. థూ ఆడదానివేనా?’’ ముక్కుపుటాలదురుతుంటే బూతులు తిడుతూ పైకి లేచాడు.‘‘సమీర్‌ ఆగు... ఆగు.. ఏమైంది?’’ అప్పుడే వచ్చిన మణి కంగారుగా అడిగింది.‘‘నీ కూతురికి కొవ్వు ఎక్కువైంది. రాక్షసి. నన్ను కాదని ఎవడ్తోనో పడుకుంటుందట! నేనూ చూస్తా.’’ పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ వెళ్లిపోయాడు.‘‘ఏంటే ఇదంతా...’’ మణి ఏడుస్తోంది.‘‘అమ్మా! ఎందుకేడుస్తున్నావ్‌? ఇప్పుడేమైంది. నా రాత బాగుంది కాబట్టే ఈ వెధవను వదిలించుకోగలిగాను. అయినా ఎందుకమ్మా! ఫోన్‌ చేసి ఈ చెత్తగాడ్ని ఇండియాకి రప్పించడం అవసరమా? నా ప్రాబ్లం ఎలా సాల్వ్‌ చేసుకోవాలో నాకు తెల్సు’’.ఏం చెప్పాలో అర్థం కాకుండా ఆమె నిస్త్రాణంగా బైటికెళ్లిపోయింది.గదిలో నిశ్శబ్దం. యుద్ధం ముగిసిన తర్వాత ఉండే నిశ్శబ్దం. చాలాసేపు వాసంతి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎందుకో తెల్లని ఆంటీ గుర్తొచ్చింది. అమ్మ కూడా అలానే ఉంటే ఎంత బావుణ్ణు అనిపించింది.
- రామదుర్గం మధుసూదనరావు 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

శివానంద లహరి

ఔషధం కురిసే వేళ..

పసందైన రుచుల సమాహారం

గడసరి బుజ్జిమేక

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

నేరం దాగదు..

ఇది సహజమేనా?

అందుకే కాంపౌండ్‌ వాల్‌ ఉండాలి!

అంపకాల్లో కోడిగుడ్డు దీపం

దరువు పడిందో.. చావు డప్పు మోగాల్సిందే!

ఒక ఖైదీ ప్రేమకథ

దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు

వ్యాసుడి పలుకులు

వీరికి అక్కడ ఏం పని?!

ద్రుపదుడి గర్వభంగం

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గ్యాంగ్‌స్టర్‌ గానా బజానా!

రీమేక్‌ క్వీన్‌

రాజమండ్రికి పోదాం!

మిస్టర్‌ బచ్చన్‌ పాండే

మంచి కంటెంట్‌ ఉన్న సినిమా

అందరూ ఆలోచించేలా...