వయసు పెరిగే కొద్దీ నాకూ వస్తుందా?

9 Dec, 2018 01:57 IST|Sakshi

సందేహం

నా వయసు 41. మా దగ్గర బంధువు ఒకామె హాట్‌ప్లషెస్‌తో ఇబ్బంది పడుతోంది. వయసు పెరిగేకొలది తనలానే నాకూ హాట్‌ప్లషెస్‌ వచ్చే అవకాశం ఉందేమోనని భయంగా ఉంది. మెనోపాజ్‌ టైమ్‌లో హాట్‌ప్లషెస్‌ సమస్యను నియంత్రణలో ఉంచాలంటే ఎలాంటి జాగ్రత్తలు, ఆహారం తీసుకోవాలి? ఆ సమస్య తగ్గాలంటే హార్మోన్‌ రిప్లేస్‌మెంట్‌ థెరపీ వల్ల ఉపయోగం ఉంటుంది అంటున్నారు. కానీ అసలు హాట్‌ప్లషెస్‌ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియజేయగలరు. – కె.శ్రీలత, కొత్తగూడెం
మెనోపాజ్‌ సమయంలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తగ్గిపోవడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించి, శరీరంలో ఉన్నట్టుండి వేడిగా పుట్టడం, ఆవిర్లు రావటం, చెమటలు పట్టడం, నిద్రలో ఉన్నప్పుడు చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. వీటినే హాట్‌ప్లషెస్‌ అంటారు.  ఇది కొందరిలో మెనోపాజ్‌కు 4–5 సంవత్సరాల ముందు మొదలవుతుంది. కొందరిలో మెనోపాజ్‌ వచ్చిన తర్వాత 6 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండవచ్చు. వీటిని పూర్తిగా నివారించటం కష్టం. ఈ సమయంలో ఎక్కువగా నీళ్లు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తీసుకోవటం, వాకింగ్, వ్యాయామాలు చెయ్యడం మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం, కాఫీలు తగ్గించటం వంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కొంత వరకు హాట్‌ప్లషెస్‌ నుంచి ఉపశమనం దొరుకుతుంది. అలాగే సోయాబీన్స్‌లో ఉండే జీటౌజ ్చఠిౌn్ఛటఅనే పదార్థం, కొద్దిగా ఈస్ట్రోజన్‌ హార్మోన్‌లాగా పని చేస్తుంది. కాబట్టి సోయా ఉత్పత్తులను తీసుకోవటం మంచిది. అంటే సోయాగింజలు, సోయాపిండి, సోయాపాలు వంటివి తీసుకోవాలి. ఈ సమయంలో ఎక్కువగా ఫ్యాన్‌ కింద ఉండటం కూడా మంచిదే. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నా హాట్‌ప్లషెన్‌ తీవ్రత ఎక్కువగా ఉంటే జీటౌజ ్చఠిౌn్ఛట కాంబినేషన్‌ ఉన్న విటమిన్, కాల్షియం ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చు. డాక్టర్‌ పర్యవేక్షణలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ను టాబ్లెట్స్‌ రూపంలో, లేదా ‘స్ప్రే’లాగా తక్కువ మోతాడులో వాడి చూడవచ్చు. దీనినే ‘హార్మోన్‌ రిప్లేస్‌మెంట్‌ థెరపీ’ అంటారు. కొందరిలో వీటివల్ల దుష్పరిణామాలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి.. ఇది ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, బరువుని బట్టి, ఫ్యామిలీ హిస్టరీని బట్టి డాక్టర్‌ సలహా మేరకు వాడవచ్చు లేదా తెలుసుకొని వాడటం మంచిది. 

నా వయసు 24. నాకు నెలసరి సమయంలో బాగా వాంతులు అవుతున్నాయి. మొదట్లో ఇది ఫుడ్‌ప్రాబ్లమ్‌ అనుకున్నాను. కానీ ప్రతి నెలసరికీ వాంతులు అవుతున్నాయి. ఆఫీసులో చాలా ఇబ్బందిగా ఉంటోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. దయచేసి నివారణమార్గాలు తెలియజేయగలరు. – ఆర్తి, విజయవాడ
నెలసరి సమయంలో శరీరంలో ఎన్నో హార్మోన్ల మార్పులు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా ఆ సమయంలో ప్రోస్టాగ్లాండిన్స్‌ అనే కెమికల్‌ పదార్థాలు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి గర్భాశయ కండరాలపైన ప్రభావితం చూపి, గర్భాశయం కుచించుకుంటూ, బ్లీడింగ్‌ బయటకు వచ్చేలా చేస్తుంది. అలాగే ఇవి ఆ సమయంలో జీర్ణాశయ పేగులపైన కూడా ప్రభావం చూపటం వల్ల, ఈ సమయంలో ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, అవి విడుదలయ్యే మోతాదును బట్టి, కొందరిలో వికారం, వాంతులు, విరోచనాలు, తలనొప్పి వంటి ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిని పూర్తిగా రాకుండా నివారించలేము. కాకపోతే కొద్దిగా ఉపశమనానికి నడక, యోగా, మెడిటేషన్‌ వంటివి చెయ్యడం మంచిది. అవసరమైతే ఆ సమయంలో ప్రోస్టాగ్లాండిన్స్‌ కెమికల్‌ పదార్థాలు తక్కువగా విడుదల చేసే "anti inflammatory" మందులయిన నొప్పి నివారణ మాత్రలు, వాంతులు తగ్గడానికి ranitidine, ondansetron  మాత్రలు ఆ రెండు, మూడు రోజులు వాడుకోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు.

∙నా వయసు 27, నాకు మూడో నెల. ప్రెగ్నెన్సీ సమయంలో కారు డ్రైవింగ్‌ చేయవచ్చా? మా వారికి ఆటిజమ్‌ లక్షణాలు ఉన్నాయి. ఆయన లక్షణాలు బేబీకి వస్తాయేమోనని భయంగా ఉంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వీలుందా? దయచేసి వివరంగా తెలియజేయగలరు. – టిఆర్, నూజివీడు
ప్రెగ్నెనీ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని కారు డ్రైవింగ్‌ చెయ్యవచ్చు. కారు మరీ స్పీడుగా కాకుండా మెల్లగా డ్రైవింగ్‌ చెయ్యాలి. స్పీడ్‌ బ్రేకర్స్‌ దగ్గర సడన్‌గా బ్రేక్‌ వెయ్యకుండా మెల్లగా డ్రైవింగ్‌ చెయ్యాలి. సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవాలి. వెన్నుపూసకి సపోర్ట్‌ ఉండేలాగా కూర్చుని డ్రైవింగ్‌ చెయ్యాలి. ఆటిజమ్‌ అనేది మెదడుకు, అందులోని నరాల పనితీరులో లోపాలు ఏర్పడటం వల్ల వచ్చే వ్యాధి. దీనికి జన్యుపరమైన, ప్రకృతిపరమైన మార్పులు, తల్లిలో ఇన్‌ఫెక్షన్‌లు మానసిక ఒత్తిడి, దురలవాట్లు, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల పిల్లల్లో మానసిక ఎదుగుదలలో వినికిడిలో లోపాలు, ఇంకా అనేక లక్షణాలతో కూడిన ఆటిజమ్‌ వ్యాధి రావచ్చు. తండ్రికి ఆటిజమ్‌ లక్షణాలు ఉన్నప్పుడు, ఆ లక్షణాల తీవ్రతను బట్టి, జన్యులోపాలను బట్టి బిడ్డకు 10 నుంచి 20 శాతం వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. జన్యుపరంగా సంక్రమించే సమస్యలను చాలా వరకు నివారించలేము. కాకపోతే నూటికి నూరుశాతం రావాలని ఏమీ లేదు కాబట్టి, మీరు ఆందోళన చెందకుండా మానసిక ఒత్తిడిలేకుండా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటూ సరైన పౌష్టికాహారం తీసుకుంటూ, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండటం ఈ సమయంలో చాలా అవసరం.
డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌ హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు