ఇలా ఉంటే ఆరోగ్యమేనా?

10 Feb, 2019 01:16 IST|Sakshi

సందేహం

నా వయసు 29 సంవత్సరాలు. వ్యాయామాలు ఎక్కువగా చేసి  సన్నబడ్డాను. ‘ఇలా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు’ అని కొందరు అంటుంటే, ‘హార్మోన్ల పనితీరు బాగుండడానికి కొవ్వు కూడా ఉండాలి’ అని మరికొందరు అంటున్నారు. దీని గురించి వివరంగా తెలియజేయగలరు. – బి.గాయత్రి, మంచిర్యాల
శరీరం పనితీరు, రసాయన ప్రక్రియలు, శరీరంలో జరిగే రోజువారీ పనులు సక్రమంగా సజావుగా జరగాలంటే కార్బోహైడ్రేట్స్, ప్రోట్రీన్స్, విటమిన్స్, మినరల్స్‌తో పాటు కొవ్వు కూడా సరైన నిష్పత్తిలో ఉండాలి.
ఆడవారిలో ముఖ్యంగా విడుదలయ్యే ఈస్ట్రోజెన్, ప్రొజ్రెస్టిరాన్, టెస్టోస్టిరాన్‌ వంటి హార్మోన్లు తయారవ్వడానికి శరీరంలో కొలెస్ట్రాల్‌ అవసరం. కొలెస్ట్రాల్‌ అనేది ఈ హార్మోన్లు తయారవడానికి ఒక ముడి పదార్థంలాంటిది. రజస్వల అవ్వడానికి శరీరంలో కనిసం 17 శాతం ఫ్యాట్‌ అవసరం. పీరియడ్స్‌ సక్రమంగా రావడానికి కనీసం  22 శాతం కొవ్వు ఉండాలి. కాబట్టి  మరీ డైటింగ్‌ చేసి బాగా సన్నబడితే, శరీరంలో బాగా కొవ్వు తగ్గిపోవడం వల్ల పీరియడ్స్‌ క్రమం తప్పడం, శరీరం యాక్టివ్‌గా లేకపోవడం, డల్‌గా ఉండటం, నీరసం, ఒళ్ళునొప్పులు వంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి.
అలాగే ఈస్ట్రోజెన్‌ వంటి హార్మోన్స్‌ సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల లైంగిక కోరికలు సరిగా ఉండకపోవచ్చు. కాబట్టి ఆరోగ్యకరంగా ఉండడం అంటే  బాగా సన్నబడిపోవడం కాదు. పొడువుకు తగ్గ బరువు ఉండటం, అధిక బరువు, ఎక్కువ కొవ్వు లేకుండా చూసుకోవడం...అంతేగానీ అసలు కొవ్వే లేకుండా ఉండటం కాదు. 
శరీరంలో అన్ని ప్రక్రియలూ సజావుగా జరగాలంటే శరీరంలో 25 శాతం కొవ్వు ఉండాలి. కాబట్టి మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, క్రమంగా వ్యాయామాలు చేసుకుంటూ, పొడవుకు తగ్గ బరువు అంటే బి.యం.ఐ(బాడీ మాస్‌ ఇండెక్స్‌) ఉండేటట్లు చూసుకోవడం వల్ల ఆరోగ్యం అన్ని రకాలుగా బాగుంటుంది. ఆహారంలో కొద్దిగా అన్నం లేదా చపాతి ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు కొద్దిగా డ్రైఫ్రూట్స్‌ వంటివి ఉండేటట్లు చూసుకోవడం మంచిది.

ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నాం. అయితే సరిౖయెన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల గర్భం దాల్చాను. ఇప్పుడు అబార్షన్‌ చేసుకోవచ్చా? ఇలా చేయడం వల్ల మున్ముందు ఏమైనా సమస్యలు ఎదురవుతాయా?
– ఎన్‌.కీర్తన, గుంటూరు

ఇప్పుడు గర్భం ఎన్ని నెలలు అని రాయలేదు. సాధారణంగా రెండు నెలల లోపల గర్భం అయితే అబార్షన్‌ అవ్వడానికి మందులు వాడవచ్చు. రెండు నెలలు దాటితే అంటే 8 వారాలు దాటితే మందుల ద్వారా పూర్తిగా అబార్షన్‌ అవ్వకపోవచ్చు. దానికి డి అండ్‌ సి అనే చిన్న ఆపరేషన్‌ ద్వారా యోని ద్వారం నుంచి గర్భాశయంలోని  గర్భాన్ని తోలగించడం జరుగుతుంది.
మందుల ద్వారా అబార్షన్‌కి ప్రయత్నం చేసినప్పుడు, నూటికి నూరుశాతం ఒకొక్కరి శరీరతత్వాన్నిబట్టి  గర్భం సైజ్‌ని బట్టి, కొందరిలో కొన్ని ముక్కలు ఉండిపోవచ్చు.
కొందరిలో బాగా నొప్పితో బాగా బ్లీడింగ్‌ అవ్వడం, బాగా నీరసపడటం, రక్తహీనత ఏర్పడటం, హాస్పిటల్‌లో అడ్మిట్‌ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.
అబార్షన్‌ చేయించుకునే ముందు స్కానింగ్‌ చేయించుకొని గర్భం, గర్భాశయంలో ఉందా, ఉంటే ఎన్ని వారాలు ఉంది అని చూసుకోవాలి.
మందులతో అబార్షన్‌ తర్వాత కూడా స్కానింగ్‌ చేయించుకోవాలి. అందులో గర్భం పూర్తిగా తొలిగిపోయిందా లేక ఇంకా ఏమైనా ముక్కలు ఉండిపోయాయా అనేది నిర్ధారణ చేసుకోవాలి. లేదంటే లోపల ముక్కలు ఉండిపోయి నిర్లక్ష్యం చేస్తే, మధ్యమధ్యలో బ్లీడింగ్‌ అవుతూ ఉండడం, ఇన్‌ఫెక్షన్‌ సోకడం, పొత్తికడుపులో నొప్పి, ట్యూబ్స్‌ మూసుకుపోయే అవకాశాలు, మళ్లీ గర్భం దాల్చడానికి ఇబ్బందులు ఎదురుకావచ్చు.
ఒకవేళ ముక్కలు ఉండిపోయి, మందుల ద్వారా పూర్తిగా అబార్షన్‌ కాకపోతే, డి అండ్‌  సి పద్ధతి ద్వారా నొప్పి తెలియకుండా మత్తు తీసుకొని అబార్షన్‌ చెయ్యించుకోవలసి ఉంటుంది. డి అండ్‌  సి పద్ధతి ద్వారా 1–2 శాతం మందిలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చి మళ్ళీ గర్భం రావటానికి ఇబ్బంది కావచ్చు. కాకపోతే అబార్షన్‌ చెయ్యించుకున్నæ అందరిలోనూ మళ్ళీ గర్భం రావటానికి ఇబ్బంది ఉండాలని ఏమీ లేదు. కొందరిలో సాధారణంగా వచ్చిన గర్భాన్ని తొలగించుకుని, మళ్లీ  కావాలనుకున్నప్పుడు వారి శరీరంలో మార్పులు, హార్మోన్లలో మార్పులు వంటి వేరే కారణాల వల్ల ఆలస్యం అయితే, అప్పుడు అనవసరంగా వచ్చిన గర్భాన్ని తీయించుకున్నాము అని పశ్చాత్తాప  పడటం జరగుతుంటుంది. కాబట్టి అబార్షన్‌ చేయించుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.

నా వయసు 43 సంవత్సరాలు. గత నాలుగైదు నెలలుగా నెలసరి రావడం లేదు. ఇది ప్రమాదకర సంకేతమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు.– టీఆర్‌. ఆముదాలవలస
మీకు ఇంతకుముందు నెలనెల క్రమంగా వచ్చేవా? మీ వయసు 43 సంవత్సరాలు. ఈ వయసులో పీరియడ్స్‌ క్రమం తప్పడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఈ వయసులో కొద్దిమందిలో ఈస్ట్రోజెన్‌ వంటి హార్మోన్లు మెల్లగా ఉత్పత్తి తగ్గిపోవడం మొదలయ్యి తర్వాత 5–6 సంవత్సరాలకు పూర్తిగా తగ్గిపోయి పీరియడ్స్‌ ఆగిపోతాయి. ఇలా ఒక  సంవత్సరం పాటు పీరియడ్స్‌ రాకపోతే దానినే మెనోపాజ్‌ దశ అంటారు.ఈ దశకి చేరేముందు కొందరిలో పీరియడ్స్‌ ఆలస్యంగా రావటం, బ్లీడింగ్‌ ఎక్కువ లేదా తక్కువగా అవ్వటం వంటి అనేక రకాల లక్షణాలు ఉంటాయి. ఇవే కాకుండా కొందరిలో అండాశయాలలో నీటికంతులు, గడ్డలు వంటి ఇతర కారణాల వల్ల కూడా పీరియడ్స్‌ ఆలస్యంగా రావచ్చు. కాబట్టి మీరు కంగారు పడకుండా గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే, వారు  రక్తపరీక్షలు, స్కానింగ్‌ అవి చేసి కారణాన్ని బట్టి చికిత్స చేస్తారు.అవి మెనోపాజ్‌ ముందు వచ్చే మార్పులు అయితే దానికి చెయ్యగలిగింది ఏమి లేదు. కాకపోతే వయసు 43 కాబట్టి ఆహారంలో ఎక్కువ కాల్షియం, ఐసోఫ్లావోన్స్‌ ఉండే పదార్థాలు అయిన ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, సోయాబీన్స్, పాలు, పెరుగు వంటివి తీసుకోవాలి.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హైదర్‌నగర్ హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు