ఎందుకో... ఆందోళన

18 Nov, 2018 01:59 IST|Sakshi

సందేహం

నా వయసు 27 సంవత్సరాలు. నేను ప్రెగ్నెంట్‌. ఎందుకో తెలియదు, అప్పుడప్పుడు అకారణ ఆందోళనకు గురువుతుంటాను. ‘బిహేవియరల్‌ యాక్టివేషన్‌’ అనే టెక్నిక్‌తో ఈ సమస్యకు దూరం కావచ్చు అని ఒక ఫ్రెండ్‌ సలహా ఇచ్చింది. వైద్యుల సలహా తీసుకున్న తరువాతే అలాంటి టెక్నిక్‌లను పాటించాలనే ఉద్దేశంతో మీ సలహా కోరుతున్నాను. – జి.రూప, ఆలేరు
ప్రెగ్నెన్సీ సమయంలో జరిగే హర్మోన్ల మార్పుల వల్ల, శరీరంలో జరిగే మార్పుల వల్ల ఎన్నో తెలియని  భయాలు, సందేహాల వల్ల కొందరు గర్భవతులు అప్పుడప్పుడూ ఆందోళనకు గురవుతుంటారు.  ఆందోళన, డిప్రెషన్‌కు గురయ్యేవారు బిహేవియరల్‌ యాక్టివేషన్‌ అనే టెక్నిక్‌లో శిక్షణ తీసుకున్న థెరపిస్ట్‌లు లేదా స్పెషలిస్ట్‌లను సంప్రదించినప్పుడు వారి సమస్యను తెలుసుకోవడమే కాకుండా, అది ఏ సమయంలో ఉంటుంది? దానిని అధిగమించడానికి ఏమి చేస్తారు, చెయ్యాలనుకుంటున్నారు..వంటి ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రాలను వారికి ఇచ్చి, వారు ఇచ్చే జవాబును బట్టి, వారికి అనేక సలహాలను, ఉదాహరణలను ఇవ్వడం జరుగుతుంది. అలాగే  రోజువారీగా వారు ఏ రోజుకా రోజు సలహాలను పాటించారా లేదా, ఆందోళనను మళ్ళించడానికి వారికి  ఇష్టమైన పనులను, వారు చెయ్యాలనుకొని చెయ్యలేని పనులను చెయ్యడానికి ఉత్సాహపరచడం వంటి మాట సహాయం చేస్తూ వారికి ధైర్యాన్ని నింపి, వారి డిప్రెషన్‌ను దూరం చేస్తారు. ఈ బిహేవియరల్‌ యాక్టివేషన్‌ టెక్నిక్‌లో మందులు వాడడం జరగదు కాబట్టి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కాబట్టి సందేహం లేకుండా దీనిని పాటించవచ్చు.

ఒక సమస్య గురించి డాక్టర్‌ని సంప్రదించినప్పుడు మెనోపాజ్‌ సమయంలో టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజెన్‌ హార్మోన్ల శాతం తగ్గడం వల్ల సమస్యలు వస్తాయని చెప్పారు. మెనోపాజ్‌ సమయంలో ఈ హార్మోన్లు ఎందుకు తగ్గుతాయి. ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? నివారణకు ఏంచేయాలి? – కె.మాలతి, హైదరాబాద్‌
ఆడవారిలో గర్భాశయం ఇరువైపుల ఉన్న అండాశయాల నుంచి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్, కొద్దిగా టెస్టోస్టిరాన్‌ హార్మోన్స్‌ సక్రమంగా విడుదల అవుతుంటాయి. సాధారణంగా ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి వారి జన్యువుల స్థితిని బట్టి అండాశయాల పనితీరు మెల్లగా అది సంవత్సరాల నుంచి తగ్గడం మొదలయ్యి, 50 దగ్గర పడేకొద్ది వాటి పనితీరు చాలావరకు, పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఈ హార్మోన్స్‌ విడుదల చాలావరకు తగ్గిపోతుంది. దీనివల్ల పీరియడ్స్‌ పూర్తిగా ఆగిపోయి, మెనోపాజ్‌ దశను చేరుకుంటారు.కొందరిలో 55 సంవత్సరాలకు కూడా మెనోపాజ్‌ దశకు చేరుకుంటారు. కొందరిలో 40 సంవత్సరాలకే పీరియడ్స్‌ ఆగిపోయి ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌కు చేరుకుంటారు.ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఆడవారి శరీరంలో అనేక రకాల ప్రక్రియలకు అవసరం. ఇది శరీర, ఎముకల, చర్మ, దృఢత్వానికి, పీరియడ్స్‌ సక్రమంగా రావడానికి, రొమ్ములు, జననేంద్రియాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కొద్ది మోతాదులో విడుదలయ్యే టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ (ఇది ఎక్కువగా మగవారిలో ఉంటుంది). ఆడవారి కండరాల, ఎముకల దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి, లైంగిక తృప్తికి ఉపయోగపడుతుంది.ప్రకృతిపరంగా, సహజసిద్ధంగానే వయసు పెరిగే కొద్ది అవయవాల పనితీరు ఎలా మందగిస్తుందో, అలాగే అండాశయాల పనితీరు తగ్గి హోర్మోన్స్‌ తగ్గిపోయి మెనోపాజ్‌ దశకు చేరుతారు. దీనిని నివారించలేము. కాకపోతే ఇవి తగ్గడం వల్ల వచ్చే సమస్యలకు డాక్టర్‌ సలహా మేరకు, సరైన పౌష్టికాహారం, వ్యాయామాలు, యోగా, ధ్యానం అవసరమైతే హార్మోన్స్‌ మందుల ద్వారా తీసుకోవడం వల్ల సమస్యల తీవ్రతను తగ్గించుకోవచ్చు.

ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. నేను బాగా సన్నగా ఉంటాను. ‘ఈవిడే సన్నగా ఉంటుంది. ఇక పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందో’ అని కొందరు చాటు మాటుగా అనుకుంటున్నారు. తల్లి సన్నగా ఉండడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఏవైనా సమస్యలు ఎదురవుతాయా? ఈ సమయంలో బరువు పెరిగే ప్రయత్నాలు చేయవచ్చా? – పి.నీరజ, శ్రీకాకుళం
గర్భాశయంలో పెరిగే బిడ్డకు పోషకపదార్థాలు తల్లి తీసుకునే ఆహారం, మాయ ద్వారా తల్లి నుండి బిడ్డకు రక్తనాళాల ద్వారా చేరుతుంది. కొందరిలో మాయ సరిగా లేకపోవడం, రక్తనాళాలు సరిగా వ్యాకోచించకుండా ఉండటం, వాటిలో రక్తం గూడు కట్టడం వంటి అనేక కారణాల వల్ల బిడ్డకు రక్తసరఫరా లేకపోవడం వల్ల బిడ్డ బరువు పెరగక పోవచ్చు.అలాగే గర్బాశయం చిన్నగా ఉండడం, దాని పొరల్లో లోపాలు ఉన్నప్పుడు కూడా అవి సరిగా సాగకుండా బిడ్డ బరువు పెరగకపోవచ్చు.కొందరిలో తల్లిలో జన్యుపరమైన కారణాల వల్ల కూడా బిడ్డ బరువు ఎక్కువగా పెరగకపోవచ్చు. తల్లిలో ఇన్‌ఫెక్షన్స్, బీపీ పెరగటం వంటి అనేక కారణాల వల్ల బిడ్డ బరువు పెరగకపోవచ్చు. తల్లి ముందు నుంచి సన్నగా ఉన్నా, గర్భం దాల్చిన తర్వాత పైన చెప్పిన కారణాలు ఏమీ లేకపోతే డాక్టర్‌ పర్యవేక్షణలో పౌష్టికాహారం బాగా తీసుకుంటూ ఐరన్, కాల్షియం, విటమిన్‌ టాబ్లెట్స్‌ సరిగ్గా వాడుతుంటే బిడ్డ మంచి బరువుతో పుడతాడు.అలాగే ఆహారంలో అన్నంతో పాటు ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పాలు,పండ్లు, డ్రైఫ్రూట్స్‌ వంటి పౌష్టికాహారం కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. అలాగే మాంసహారులయితే, రోజు ఒక గుడ్డు, మాంసం, చేపలు వంటివి తీసుకోవచ్చు.తల్లి సన్నగా ఉండి పైన జాగ్రత్తలు తీసుకోకపోతే, బిడ్డ బరువు తక్కువగా పుట్టడం, తల్లిలో బిడ్డలో కూడా రక్తహీనత, ఎముకలు బలహీనంగా ఉండడం, కాన్పు సమయంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఏర్పడవచ్చు.
డా‘‘ వేనాటి శోభబర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌ హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు