ఆ సమయంలో నొప్పి రాకుండా ఉండాలంటే...

19 May, 2019 00:55 IST|Sakshi

 ∙సందేహం

పీరియడ్స్‌ టైమ్‌లో నొప్పి రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిట్కాల గురించి తెలియజేయగలరు. ప్రైమరీ డిస్మెనోరియా అంటే ఏమిటి? –పీఎల్, ఒంగోలు
పరీక్షలు ఏమి చేసినా, కారణాలేవీ లేకుండా, సమస్య ఏమీ లేకుండా పీరియడ్‌ సమయంలో పొత్తి కడుపులో నొప్పి రావడాన్ని ప్రైమరీ డిస్మెనోరియా అంటారు. పీరియడ్‌ సమయంలో ప్రోస్టోగ్లాండిన్స్‌ అనే హార్మోన్లు విడుదలవుతాయి. వీటి ప్రభావం వల్ల రక్తనాళాలు కుంచించుకుని, గర్భాశయంలోని ఎండోమెట్రియమ్‌ పొరకి రక్తప్రసరణ తగ్గిపోయి బ్లీడింగ్‌ రూపంలో ఈ పొర ఊడిపోయి బయటకు వస్తుంది. అలాగే గర్భాశయం కుంచించుకుంటూ బ్లీడింగ్‌ను బయటకు పంపుతుంది. ఈ ప్రోస్టోగ్లాండిన్స్‌ విడుదలయ్యే మోతాదును బట్టి కొందరిలో ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొందరిలో కొద్దిగా ఉంటుంది. కొందరిలో అసలే నొప్పీ ఉండదు. కొందరిలో గర్భాశయంలో గడ్డలు, ఎండోమెట్రియాసిస్, గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్‌ వంటి ఎన్నో కారణాల వల్ల కూడా పీరియడ్స్‌ సమయంలో నొప్పి ఉంటుంది. దీనిని సెకండరీ డిస్మెనోరియా అంటారు. కారణాన్ని బట్టి పీరియడ్స్‌ నొప్పికి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. నొప్పి అసలు రాకుండా ఉండటానికి జాగ్రత్తలు ఏమీ ఉండవు. కాకపోతే నొప్పి తెలియకుండా ఉండటానికి వాకింగ్, యోగా, ధ్యానం, వ్యాయామాలు వంటివి చేస్తూ మితమైన పోషకాహారం తీసుకుంటూ ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం మంచిది. పీరియడ్స్‌ సమయంలో రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం, ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, క్యాల్షియం, విటమిన్‌–బి, మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవడం, అల్లం, పసుపు, సోంపు, కొద్దిగా చెక్క వంటివి తీసుకోవడం, పొత్తికడుపుపై మసాజ్, వేడి కాపడం పెట్టడం, వేడినీళ్ల స్నానం చేయడం వంటి చిట్కాలను పాటించడం ద్వారా కూడా నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.

నేను బ్యాంకు ఉద్యోగిని. సోషల్‌ సర్వీస్‌ అంటే ఇష్టం. అక్కడక్కడా గర్భిణి స్త్రీలను చూసినప్పుడు.... తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదనే అనుమానం వస్తుంటుంది. ప్రెగ్నెంట్‌గా ఉండి కూడా కూలీ పనులకు వెళుతున్న, ఎండలో బట్టలు ఉతుకుతున్న గర్భిణులను చూసినప్పుడు... నేనే చొరవ తీసుకొని వారి దగ్గరకు వెళ్లి ‘ఇలా చేయకూడదమ్మా’ అని చెబుతుంటాను. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన పది ప్రధాన జాగ్రత్తల గురించి చెబితే... నేను వాటిని నిరక్షరాస్యులైన గర్భిణి స్త్రీలకు తెలియజేస్తాను. – ఆర్‌.శైలజరాణి, మంగపేట
ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణులు తీసుకోవలసిన జాగ్రత్తలు: 1. గర్భ నిర్ధారణ జరిగిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహాలను పాటించడం.
2. ఆహారంలో ఎక్కువగా ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు, పాలు, పలచని మజ్జిగ, మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవడం.
3. ఫోలిక్‌ యాసిడ్, ఐరన్, క్యాల్షియం మాత్రలను తొమ్మిదినెలల పాటు తీసుకోవడం. దీని వల్ల రక్తహీనత లేకుండా తల్లి, బిడ్డ ఎముకలు గట్టిగా ఉండటానికి దోహదడుతుంది.
4. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా చెకప్‌లు, రక్తపరీక్షలు చెయ్యడం, మందులు ఇవ్వడం, గుడ్లు పాలు ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఏవైనా సమస్యలు ఉన్నా, వాటికి చికిత్స తీసుకోవచ్చు.
5. బ్లడ్‌ గ్రూప్, హీమోగ్లోబిన్, సుగర్, సీయూఈ, హెచ్‌ఐవీ, హెపటైటిస్, వీడీఆర్‌ఎల్‌ వంటి రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవడం వల్ల ముందుగానే రక్తహీనత, ఇన్‌ఫెక్షన్లు వంటివి ఉంటే చికిత్స తీసుకోవచ్చు.
6. డాక్టర్‌ దగ్గరికి సక్రమంగా చెకప్‌లకు వెళ్లి బరువు, బీపీ వంటివి చూపించుకోవడం.
7. బిడ్డలో అవయవ లోపాలు, ఆరోగ్యం తెలుసుకోవడానికి కనీసం ఐదవ నెలలో ఒకసారి, తొమ్మిదవ నెలలో ఒకసారి అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయించుకోవడం.
8. నెలలు నిండే కొద్దీ మధ్యాహ్నం ఒక గంట, రాత్రి ఎనిమిది గంటలు నిద్ర తప్పనిసరి. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల బిడ్డకి, తల్లికి కూడా రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది,.
9. నెలలు పెరిగే కొద్దీ బిడ్డ కదలికలు గమనించుకుంటూ, కదలికలు తెలియకపోయినా, యోని భాగం నుంచి నీరులా కారిపోవడం, బ్లీడింగ్‌ అవడం, కడుపులో నొప్పి, కాళ్లు బాగా వాచడం వంటి లక్షణాలు కనిపిస్తే, తొందరగా ఆస్పత్రికి వెళ్లడం. మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, ఆయాసం లేనంత వరకు పనులు చేసుకుంటూ ఉండటం వల్ల కాన్పు సులభంగా అయ్యే అవకాశాలు ఉంటాయి.
10. కాన్పు ఇంట్లో కాకుండా ఆస్పత్రిలో అయ్యేలా చూసుకోవడం మంచిది. దీనివల్ల తల్లికి, బిడ్డకి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటమే కాకుండా, తల్లిలో అధిక రక్తస్రావం, హైబీపీ వంటి కాంప్లికేషన్లకు తగిన చికిత్స వెంటనే తీసుకోవడానికి వీలవుతుంది. దీనివల్ల తల్లీబిడ్డల మరణాల రేటును తగ్గుతుంది. తల్లీబిడ్డా క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటారు.

నేను ప్రెగ్నెంట్‌. ఈమధ్య ఒక ఆర్టికల్‌లో preeclampisa  డిసీజ్‌ గురించి చూశాను. ఇది తల్లి, బిడ్డలకు ఎందుకు వస్తుంది? మన దేశంలో కూడా ఈ సమస్య ఉందా? ఇది రాకుండా ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలి?        – కె.మమత, విశాఖపట్టణం
గర్భిణి సమయంలో కొందరిలో బీపీ పెరిగి, అది కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుంది. దాని వల్ల మూత్రంలో ఆల్బుమిన్‌ ప్రొటీన్‌ ఎక్కువగా పోవడం జరుగుతుంది. ఈ సమస్యనే ‘ప్రీ ఎక్లామ్సియా’ అంటారు. ఇది ఎవరికి ఎందుకు వస్తుందనేది ముందుగా కచ్చితంగా చెప్పడం కష్టం. సాధారణంగా ఎక్కువ బరువు ఉన్నవారిలో, మరీ చిన్న వయసులో గర్భం దాల్చినా, లేటు వయసులో గర్భం దాల్చినా, కుటుంబంలో ఎవరికైనా బీపీ ఉన్నా, కొన్ని హార్మోన్లలో మార్పుల వల్ల, తల్లిలో రక్తనాళాలు సన్నబడటం వల్ల తల్లిలో బీపీ పెరగడం, అలాగే బిడ్డకు రక్తప్రసరణ తగ్గడం జరుగుతుంది. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే బీపీ బాగా పెరిగి, కిడ్నీ, లివర్, మెదడు వంటి ఇతర అవయవాలపై ప్రభావం చూపడం వల్ల తల్లిలో పీఐహెచ్, ప్రీ ఎక్లామ్సియా, తర్వాత ఎక్లామ్సియా (గుర్రపువాతం) అంటే ఫిట్స్‌ వంటి ప్రాణాపాయకరమైన కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి. ఇందులో బిడ్డ బరువు పెరగకపోవడం, బిడ్డ కడుపులోనే చనిపోవడం వంటివి జరగవచ్చు. ఒక్కోసారి నెలలు నిండకుండానే కాన్పు చేయాల్సి రావచ్చు. భారతదేశంలో 8–10 శాతం గర్భిణులకు ప్రీఎక్లామ్సియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఇది రాకుండా జాగ్రత్త పడలేము కాని, సక్రమంగా డాక్టర్‌ దగ్గర బీపీ, బరువు చెకప్‌ చేయించుకుంటూ, బీపీ పెరుగుతుంటే దానికి సరిగా మందులు తీసుకుంటూ డాక్టర్‌ పర్యవేక్షణలో ఉంటే, కాంప్లికేషన్స్‌ పెరుగుతూ ఉంటే దానికి తగిన చికిత్స చేయడం, అలాగే కాన్పు ముందుగానే చెయ్యడం వల్ల తల్లికి ప్రాణాపాయం తప్పుతుంది. అధిక బరువు ఉన్నవాళ్లు ప్రెగ్నెన్సీ రాకముందే బరువు తగ్గడం, ప్రెగ్నెన్సీలో అధిక బరువు పెరగకుండా ఉండటం, కుటుంబంలో బీపీ చరిత్ర బాగా స్ట్రాంగ్‌గా ఉన్నా, ఇంకా కొన్ని రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీలో మూడవ నెల నుంచి ఎకోస్పిరిన్‌ మాత్రలను డాక్టర్‌ సూచించడం జరుగుతుంది. దీనివల్ల రక్తనాళాలు సంకోచించకుండా తల్లికి, బిడ్డకు సక్రమంగా రక్తప్రసరణ జరిగి, ప్రీఎక్లామ్సియా కాంప్లికేషన్స్‌ మరీ ఎక్కువ కాకుండా బయటపడే అవకాశం ఉంటుంది.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బోహైదర్‌నగర్‌
హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు