అలా... బయటికొచ్చాడన్నమాట!

23 Feb, 2020 10:23 IST|Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

స్వామి నిత్యానంద కోసం గుజరాత్, కర్ణాటక పోలీసుల గాలింపు కొనసాగుతుంది. ఇదే కాకుండా...ఇంటర్‌పోల్‌ ఆఫీసర్లు బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేశారు. తాను దేశం విడిచిపోలేదని, హిమాలయా పర్వత సానువుల్లో తపస్సు చేసుకుంటున్నాని సభ్యసమాజానికి వీడియో సందేశం పంపాడు నిత్యానంద. ఇప్పుడు హిమాలయ పర్వత సానువుల్లో ఏం జరుగుతుందో చూద్దామా మరీ...
స్వామి నిత్యానంద సీరియస్‌గా తపస్సు చేసుకుంటున్నాడు. అతడి ముందు ‘ప్లీజ్‌ డోన్ట్‌ డిస్టర్బ్‌ మీ’ అనే బోర్డ్‌ ఉంది. దేవుడు ప్రత్యక్షమైతే ఒక వరం కోరుకోవాలనేది ఆయన ప్లాన్‌. తాను అడగదలచిన వరాన్ని మనసులో పదేపదే మననం చేసుకుంటున్నాడు...
‘‘స్వామి! నాకు చిన్న వరం ఇవ్వు.  కర్ణాటక రాష్ట్రంలో నాకు  బిడదిలో ఆశ్రమం ఉంది. ఈ హిమాలయాల్లో కూడా అలాంటిదే ఒక ఆశ్రమాన్ని స్థాపించాలనేది నా కల. నాకు వరం త్వరగా ఇస్తారని ఆశిస్తున్నాను...’’
రోజులు గడిచాయి. వారాలు గడిచాయి. నెలరోజులు గడిచాయి... దేవుడు ప్రత్యక్షం కాలేదు!
విసుగెత్తిన నిత్యానంద తపస్సు విరమించాడు. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది అతని పరిస్థితి. తిరిగి వెళితే పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. అలా అని ఇక్కడ ఉండాలనిపించడంలేదు. అబ్బో ఏం చలి!
‘‘విక్రమార్కా! ఇప్పుడు చెప్పు, ఇంతకీ నిత్యానంద హిమాలయాల్లోనే ఉన్నాడా? బయటి ప్రపంచంలోకి వచ్చాడా? తెలిసి కూడా నా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయావో...చైనాకు పంపిస్తా...’’ అని హెచ్చరించాడు బేతాళుడు.
‘‘నిత్యానంద పోలీసులకు దొరికిపోయాడు’’  చెప్పాడు విక్రమార్కుడు.
‘‘అదెలా?’’ ఆశ్చర్యపోయాడు బేతాళుడు.
అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు:
‘‘నిత్యానంద బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న మాటేగానీ...ల్యాప్‌ టాపు పుణ్యమా అని సీఐఏ నుంచి చింతపండు ధరల వరకు ప్రతి విషయం ఆయనకు తెలుసు. ఈ విషయం పోలీసులకు లేటుగా తెలిసింది. అంతే....‘హిమాలయాల్లో ప్రాణాంతకమైన హిమోనా వైరస్‌’ అనే ఫేక్‌ న్యూస్‌ను బ్లాస్ట్‌ చేశారు. ఈ వైరస్‌ తనకెక్కడ సోకిందోనని భయపడిపోయి,  హిమాలయాలలో నుంచి పారిపోయి వచ్చి, కనిపించిన ఆస్పత్రిలోకల్లా వెళ్లి ‘నాకు గాని వైరస్‌ సోకిందా...’ అని టెస్టులు చేయించుకుంటున్న  క్రమంలో ఒక హాస్పిటల్‌లో పోలీసులకు దొరికిపోయాడు నిత్యానంద. ‘‘నేనే లొంగిపోదామని వస్తున్నాను. ఈలోపు మీరు వచ్చారు. నా కోసం మీరు వచ్చినా, మీ కోసం నేను వచ్చినా...మ్యాటర్‌ సేమ్‌ కదా...’’ అని పళ్లికిలించాడు నిత్యానంద!

బడా బ్యాంక్‌ రాబరీ!
ముంబైలో  బ్యాంకు రాబరీ జరిగింది. ఈ రాబరీపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపడానికి యస్పీభయంకర్‌ అనే అధికారిని ప్రభుత్వం నియమించింది. ఆరోజు బ్యాంకుకు వచ్చిన వారిలో మన తెలుగు పౌరుడు సుబ్బారాయుడు కూడా ఉన్నాడు. ఆయనను ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు భయంకర్‌.
భయంకర్‌: మీరు ఆ దొంగల్ని చూశారా?
సుబ్బా: మీ మీద ఒట్టండి... చూశానండి... ఓ ముగ్గురు కుర్రాళ్లు ముసుగులు ధరించి వచ్చారండీ...వారితో పాటు ఒక ఏనుగు కూడా వచ్చిందండి.
భయంకర్‌: ఏనుగా????!!!!!
సుబ్బా: ఏనుగేనండీ...మీ మీద ఒట్టండి!
భయంకర్‌: అది ఆఫ్రికన్‌ ఏనుగా? ఇండియన్‌ ఏనుగా?
సుబ్బా: అది మనకెలా తెలుస్తదండీ! ఏనుగూ...ఏనుగూ...నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అని అడగలేం కదండీ...హ్హీ హ్హీ....హ్హీ...
భయంకర్‌: నవ్వింది చాలుగానీ, నేను చెప్పింది శ్రద్ధగా విను...ఆఫ్రికా ఏనుగుల చెవులు పెద్దగా ఉంటాయి...మన ఏనుగుల చెవులు వాటితో పోల్చితే చిన్నగా ఉంటాయి. ఇప్పుడు చెప్పు...అది మన ఏనుగా? ఆఫ్రికన్‌ ఏనుగా?
సుబ్బా: ఎలా చెబుతామండీ?
భయంకర్‌: చూశానంటున్నావు కదా...
లలల: అది కూడా మాస్కు ధరించి వచ్చిందండీ...
– యాకుబ్‌ పాషా

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా