వర్ణం: గేమ్ ‘స్పిరిట్’

20 Jul, 2014 00:22 IST|Sakshi
వర్ణం: గేమ్ ‘స్పిరిట్’

స్పెయిన్‌లో స్వతంత్ర ప్రతిపత్తిగల ‘ల రియోజా’ ప్రాంతంలోని దృశ్యం ఇది. అక్కడి నేలలో ద్రాక్షలు విరివిగా పండుతాయి. అందుకే వైన్ తయారీకి ప్రసిద్ధి గాంచింది. ‘పంట’ చేతికొచ్చాక ‘లా బ్యాటలా డెల్ వినో డె హరో’ జరుగుతుంది. ‘వైన్ యుద్ధం’గా పిలిచే ఈ వేడుకలో స్థానికులు, యాత్రికులు సంబరంగా పాల్గొంటారు. బొమ్మ తుపాకులతో లీటర్లకొద్దీ వైన్‌ను దేహపుపాలు చేస్తారు. అదొక రకం మజా!
 
 తోపుడు బైక్
 నిత్య రణరంగంగా ఉండే దేశం కాంగోలో రవాణాకు ఉపయోగిస్తున్న కర్ర వాహనం ఇది! దీన్ని షుకుడు అని పిలుస్తున్నారు. కిలోలకొద్దీ కూరగాయలు, నేలబొగ్గు లాంటివాటిని మోసుకెళ్లడానికి తరుణోపాయంగా ఇది రూపొందింది. అక్కడి గోమా నగరంలోని దృశ్యం ఇది.
 
 కీలెరిగి...
 ఒక మనిషిని చాలా పద్ధతిగా కాల్చుతున్నట్టు లేదూ! ఇది చైనాలో చేసే ఫైర్ థెరపీలో భాగం. వైద్యుడు రోగి ఒంటిమీద మద్యాన్ని పోసి ‘అంటిస్తాడు’. అది శరీరం లోపలి ‘చలి’ని తొలగిస్తుందట. కొన్ని రకాల రుగ్మతలకు ఈ ప్రాచీన మంట వైద్యం చక్కగా పనిచేస్తుందని చెబుతారు. అందుకే చైనాలో ఇది కోట్లాది రూపాయల వ్యాపారం కూడా!

మరిన్ని వార్తలు