నీడతో ఏడడుగులు

20 May, 2018 00:05 IST|Sakshi

ఆ ఇంట్లో ఉన్నన్ని పుస్తకాలు ఏ ఇంట్లోనూ ఉండవనిపిస్తుంది. ఒక్కో పుస్తకం వెన్ను మీద ఆ పుస్తకం పేరు కనిపించేలా చక్కగా అన్నీ ర్యాకుల్లో నిలబెట్టి ఉంటాయి. ఎవరికి ఇష్టమైంది వాళ్లు తీసుకుని చదువుకుని, మళ్లీ అక్కడే పెట్టేసేలా ఆ అమరిక ఉంటుంది. ఆ ఇంట్లో అన్ని పుస్తకాలున్నా ఆ పుస్తకాలన్నీ చదివినవాళ్లు, చదువుతుండేవాళ్లు ఆ ఇంట్లో ఒక్కరే.. మనోధర్మ. అవన్నీ ఆయన సమకూర్చుకున్నవే. ఆయన భద్రపరిచినవే. సమకూర్చున్నది తనకోసమే అయినా, భద్రపరుస్తున్నది ఎవరికోసమో ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు.nమనోధర్మకు అరవై ఏళ్లుంటాయి. గృహస్థుగా అన్ని ధర్మాలూ నెరవేర్చి కాలధర్మానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సిద్ధం కావడం అంటే, రాబోతున్నదాని కోసం ఎదురుచూడ్డం కాదు. జీవితం ఓ కొలిక్కి వచ్చాక సహజంగా వచ్చే ఆలోచనలకు మనిషి ఎదురు వెళ్లకపోవడం. ఇప్పుడీ కథ మనోధర్మ గురించి కాదు. మనోధర్మ చదవడం కోసం కొన్నేళ్లుగా ఆ ఇంట్లోని ఒక ర్యాకులో ఎదురు చూస్తూ ఉన్న ఒక పుస్తకం గురించి.

ముప్పై ఏళ్లుగా మనోధర్మ తన ర్యాకుల్లో ఆ పుస్తకాన్ని చూస్తున్నాడు. ముప్పై ఏళ్లుగా దాన్ని బయటికి తీస్తున్నాడు, మొదటి రెండు పేజీలు తిరగేస్తున్నాడు, తిరిగి లోపల పెట్టేస్తున్నాడు. అంతే తప్ప చదవడం లేదు. ఆ పుస్తకం తన ఇంట్లోకి ఎలా వచ్చిందో అతడికి గుర్తు లేదు. తనైతే తెచ్చి ఉండడని ఆయన అనుకుంటూ ఉంటాడు. ఏమో.. తెచ్చానేమో అని కూడా అప్పుడప్పుడు అనుకుంటాడు. ‘నీడతో ఏడడుగులు’ అనే టైటిల్‌తో ఉన్న ఆ తెలుగు తర్జుమా పుస్తకం మనోధర్మ పుట్టకముందు నాటిది. పాలు ఎర్రగా మరిగిన రంగులోకి తిరిగి ఉన్నాయి ఆ పుస్తకంలోని పేజీలు. అప్పటికే అది పదమూడో ముద్రణ! అన్ని ముద్రణలు బహుశా ఇంగ్లిష్‌ వెర్షన్‌వి అయి ఉంటాయి. ఎవరో పాశ్చాత్యుడు రాశాడు. ఏడడుగులు అన్న సంప్రదాయం పాశ్చాత్యులలో ఉన్నట్లు లేదు. తెలుగు పాఠకులు కనెక్ట్‌ కావడం కోసం అలా తర్జుమా చేసినట్లున్నారు.

‘నీడతో ఏడడుగులు’ ఏంటోనని మొదటిసారి ముప్పై ఏళ్ల క్రితం ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని కవరు పేజీ తిప్పాడు మనోధర్మ. ‘దెయ్యంతో కాపురం చేసిన ఓ ధైర్యవంతుడి అనుభవాలు’ అని లోపలి పేజీలో ఉంది. పుస్తకాన్ని విసిరి కొట్టేశాడు. దెయ్యాలంటే అతడికి నమ్మకం లేదు. ఏ పుస్తకాన్నైనా ఒక్కసారైనా పేజీలు తిరగేయకుండా ఉండలేని మనోధర్మ.. నీడతో ఏడడుగుల్ని ఎప్పుడు చేతుల్లోకి తీసుకున్నా మొదటి రెండు పేజీలు మాత్రమే తిప్పేవాడు. అప్పటికే అతడి ఉత్సాహం చచ్చిపోయేది. బొత్తిగా ఆసక్తి లేని పుస్తకాల్ని అతడు కనీసం వెనుక నుంచైనా పేజీలు తిప్పేవాడు. అలాక్కూడా ఈ పుస్తకాన్ని తిప్పలేదు.

ఇరవై ఏళ్ల క్రితం ఒకసారి అనుకోకుండా ఆ పుస్తకాన్ని మళ్లీ చదివే ప్రయత్నం చేశాడు మనోధర్మ. పేజీ తిప్పగానే మళ్లీ అదే వాక్యం కనిపించి ఆగిపోయాడు. ‘దెయ్యంతో కాపురం చేసిన ఓ ధైర్యవంతుడి అనుభవాలు’! నవ్వుకున్నాడు. దెయ్యంతో పిరికివాడు కాపురం చేస్తే చదవడానికి ఆసక్తిగా ఉంటుంది కానీ, ధైర్యవంతుడు కాపురం చేస్తే అందులో చదవడానికి ఏముంటుందనుకుని మళ్లీ ఆ పుస్తకాన్ని విసిరికొట్టాడు.ఇప్పుడీ అరవై ఏళ్ల వయసులో మరోసారి ఆ పుస్తకం ఆయన కంట పడింది.

కొద్దిసేపు ఆయన ఆ పుస్తకాన్ని చూసీచూడనట్లు ఉండిపోయాడు. ఆ పుస్తకమంటే మనోధర్మకు తేలిక భావం ఏర్పడడానికి కారణం అది దెయ్యాలపై రాసిన పుస్తకం అని మాత్రమే కాదు. ఆడవాళ్లను చులకన చెయ్యడం ఆయనకు ఇష్టం ఉండదు. పుస్తక రచయితకు నిజంగానే దెయ్యంతో కొన్ని అనుభవాలు ఉండొచ్చు. కానీ దెయ్యాన్ని భార్యతో పోలిక తెచ్చే విధంగా టైటిల్‌ పెట్టడం ఆయనకు నచ్చలేదు. అయితే ఆయనకు తెలియని విషయం, పుస్తకం చదివితేనే గానీ తెలుసుకోలేని విషయం ఏంటంటే.. రచయిత రాసింది తన భార్య గురించే. భార్యను దెయ్యంతో పోల్చాడు తప్ప, దెయ్యాలను భార్యతో పోల్చలేదతను. ఆ సంగతి.. మరో రెండు పేజీలైనా తిరగేస్తే తెలిసి ఉండేది మనోధర్మకు.

పుస్తకాన్ని చూసీ చూడనట్లు కాసేపు అలా ఉండిపోయిన మనోధర్మ ఏమనుకున్నాడో ఏమో, ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని పడక్కుర్చీలోకి జారగిల పడ్డాడు. గుండె ఎందుకో బరువుగా ఉన్నట్లు అనిపించింది. పుస్తకం గానీ గుండెలపై లేదు కదా అని చూసుకున్నాడు. లేదు. తన చేతుల్లోనే ఉంది. చదువుతూ చదువుతూ నిద్రలోకి ఒరిగినప్పుడు మాత్రమే ఆయన గుండెలపై పుస్తకం ఉంటుంది. గుండెలపై ఎంత పెద్ద పుస్తకం ఉన్నా ఎప్పుడూ బరువు అనిపించని మనోధర్మకు ఈ పుస్తకం చేతుల్లో ఉండగానే గుండె బరువుగా అనిపిస్తోంది!
ఒకసారి లేచి కూర్చున్నాడు.

గుండెల నిండా గాలి పీల్చుకుని మళ్లీ వెనక్కు వాలాడు. పుస్తకం తెరిచి ఎప్పుడూ తిప్పేవి కాకుండా మరో రెండు కొత్త పేజీలు తిప్పాడు. ‘ముందుమాట’ కనిపించింది. అందులో ఇలా ఉంది: ‘మొదటి ముద్రణలో ముందుమాట లేదు. రెండో ముద్రణ నాటికి ముందుమాట రాయవలసిన అవసరం ఏర్పడింది. తర్వాత ప్రతి ముద్రణలోనూ ఈ ముందుమాట ఉంది. అయితే  ముందుమాటను ఇక్కడ రాయకపోవడానికి ఒక కారణం ఉంది’.. అని ఉంది! మనోధర్మకు ఏం అర్థం కాలేదు. అక్కడ రాయని దానికి  ‘ఇక్కడ రాయడం లేదని చెప్పడం దేనికి? ఎక్కడ రాశాడో చెప్పాలి గానీ’ అనుకున్నాడు. ఇంకో పేజీ తిప్పబోతే నిద్రపట్టేసినట్టుగా అయింది. పుస్తకాన్ని గుండెలపై ఉంచుకుని నిద్రలోకి వెళ్లిపోయాడు. మళ్లీ లేవలేదు మనోధర్మ!

ఇంట్లోవాళ్లు వచ్చి చూసే సరికి మనోధర్మ గుండెలపై ఉన్న పుస్తకం ఫ్యాను గాలికి రెపరెపలాడుతూ ఉంది. వెనుక అట్ట పైకి లేచినప్పుడల్లా ఆఖరి పేజీలోని ‘ముందుమాట’ బయటికి కనిపిస్తోంది! చిన్న పేరా అది. ‘విపరీతంగా అమ్ముడుపోతున్న ఈ పుస్తకాన్ని కొన్నవాళ్లే గానీ చదివినవాళ్లు ఒక్కరూ లేరు. తన గురించి నేను రాసినదాన్ని ఎవరూ చదవకుండా నా భార్య అడ్డుకుంటోంది. ఇది నా అనుమానం కాదు. చనిపోయిన నా భార్యే వచ్చి స్వయంగా నాకు చెప్పిన విషయం’ అని రాసి ఉంది. దాని కింద మరో చిన్న వాక్యం.. అతి చిన్న అక్షరాలతో ఉంది. ‘నా భార్య కంట పడకూడదనే.. ఈ ముందుమాటను వెనుక పేజీలో ఉంచాను’.

మరిన్ని వార్తలు