రాముడు మెచ్చిన గోదావరి

12 Jul, 2015 00:19 IST|Sakshi
రాముడు మెచ్చిన గోదావరి

ఆరు రుతువులలోనూ గోదావరి శోభ సీతాసౌందర్యంతో పోల్చి చెప్పాడు వాల్మీకి. నిండు గోదావరి, శరత్కాల గోదావరి, ఇసుక మేటలు వేసిన గోదావరి ఇలా అన్ని కాలాల్లోనూ గోదావరి ఎలావుందో సీత అలా కనిపించింది శ్రీరాముడి కంటికి.
 
మాయాగోవును తిరిగి బ్రతికించిన నది కాబట్టి గౌతమీ గంగను గోద అని కూడా పిలిచారు. శబరి కలసిన గోదానదినే గోదాశబరి అన్నారు. కాలగతిలో ‘శ’వర్ణం లుప్తమైపోగా, ‘బ-వ’లకు మధ్య అభేదం వల్ల గోదావరి అయ్యింది. అలా శ్రీరామ భక్తురాలైన శబరి పేరును కలుపుకున్న గోదావరిని స్మరించినప్పుడల్లా శ్రీరామ తారక మంత్రాన్ని జపించిన ఫలితం లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్కర శుభ సందర్భంలో గోదావరితో శ్రీరామునికి గల అనుబంధాన్ని మననం చేసుకుందాం.
 
‘ఏషా గోదావరీ రమ్యా ప్రసన్న సలిలా శుభా’ అంటాడు శ్రీరాముడు. పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వెళుతూ, ‘‘సీతా! ఆ గోదావరీ మాతకు నమస్కరించు’’ అని చెబుతాడు. ఆనాడు వనవాస కాలంలో గోదావరీ సైకత సీమల్లో తామిద్దరూ పంచుకున్న మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటాడు. వాల్మీకి రామాయణంలో సీత కోరిక మేరకు శ్రీరాముడు పుష్పక విమానాన్ని అత్రి మహాముని ఆశ్రమం వద్ద అనసూయా సాధ్విని చూడటానికి మాత్రమే ఆపినట్టు రాశాడు. అయితే దక్షిణ భారతదేశంలో గోదావరీ తీర ముక్తేశ్వర తీర్థంతో పాటు అనేక శివప్రతిష్ఠలు శ్రీరామ చరితంతో ముడిపడి ఉన్నాయి.

చిత్రకూట పర్వతం వద్ద శ్రీరామ పాదుకలను భరతుడు తీసుకువెళ్లింది మొదలు, అత్రి ఆశ్రమంతో మొదలుపెట్టి అగస్త్య ఆశ్రమం వరకూ అనేక ముని ఆశ్రమాలను సందర్శించాడు రాఘవుడు. తాపసుల తపస్సులకు విఘాతం కలిగించే నిశాచరుల వినాశకరునిగా వినుతికెక్కాడు. పద్నాలుగేళ్ల వనవాస దీక్షలో పన్నెండేళ్ల కాలం పాటు అనునిత్యం యుద్ధాలతో దండకారణ్యమంతటా సంచరించాడు.
 
చివరిగా అగస్త్య మహాముని ఆశ్రమాన్ని దర్శించాడు. ‘‘శ్రీరామా! నిరంతర ప్రయాణాలతో సీతమ్మ అలిసిపోయిందయ్యా. ఇప్పుడు ఆమెకు కొంత విశ్రాంతి అవసరం. ఇక్కడికి దగ్గరలో పవిత్ర గోదావరీ తీరం ఉంది. అక్కడ ఫలసమృద్ధి గల వృక్షాలు ఉంటాయి. సాధు జంతువులు నిర్భీతిగా సంచరిస్తూ ఉంటాయి. మనుష్య సంచారం ఉండదు. సీత కూడా ఆ ప్రదేశాన్ని మెచ్చుకుంటుంది. ఆ పంచవటి వద్ద ఒక పర్ణశాల నిర్మించుకుని మిగిలిన నీ వనవాస దీక్షను నిర్వహించు’’ అని బోధించి దివ్యాస్త్రాలను అనుగ్రహించి పంపిస్తాడు అగస్త్య ముని.
 
అక్కడి నుంచి దక్షిణంగా బయలుదేరిన సీతారామ లక్ష్మణులు పంచవటి ప్రాంతానికి రాగానే శ్రీరాముడు అంటాడు కదా... ‘‘లక్ష్మణా! అదిగో రమ్యమైన గోదావరి. తీరమంతా విరగబూచిన చెట్లతో నిండివుంది. హంసలు, కారండవాలు, చక్రవాకాల వంటి జలపక్షులతో శోభస్కరంగా ఉంది. లేళ్లు మందలు మందలుగా, నిర్భయంగా తిరుగుతున్నాయి. ఈ ప్రాంతం గోదావరికి అతి దూరంలోనూ లేదు. అతి సమీపంలోనూ లేదు. కనుక ఇక్కడ మనం పర్ణశాల నిర్మించుకోవచ్చు’’ అని.
 
లక్ష్మణుడు పర్ణశాల నిర్మించిన తరువాత శ్రీరాముడు ముందుగా గోదావరీ స్నానం చేశాడు. రామలక్ష్మణులు భక్తితో దేవతలకు, పితృదేవతలకు తర్పణలు సమర్పించారు. ఉదయిస్తున్న సూర్యునికి నమస్కరించి సర్వదేవతలనూ స్తోత్రం చేశారు. గోదావరీ మాతకు పసుపు, కుంకుమలతో పాటు పువ్వులు సమర్పించి సీత పూజించింది.
 
గోదావరీ తీరంలో సుమారు ఏడాది కాలం పాటు కొనసాగిన సీతారామ వనవాసాన్ని విస్తృతంగా వర్ణించాడు వాల్మీకి కవి. ఆరు రుతువులలోనూ గోదావరి శోభ సీతాసౌందర్యంతో పోల్చి చెప్పాడు. నిండు గోదావరి, శరత్కాల గోదావరి, ఇసుక మేటలు వేసిన గోదావరి... ఇలా అన్ని కాలాల్లోనూ గోదావరి ఎలావుందో సీత అలా కనిపించింది శ్రీరాముడి కంటికి.
 
కవి సామ్రాట్ విశ్వనాథ గోదావరికి, శ్రీరామునికి గల అనుబంధాన్ని మరోమెట్టు పైకి చేర్చారు. ఏ నది అయినా సాగరునికి ఇల్లాలే అవుతుంది. సూర్యవంశంలో ఉపవంశమైన సగరవంశానికి చెందిన శ్రీరాముడు తనకు వరుసకు మరిది అవుతాడని అనుకుంటుంది గోదావరి. అటువంటి మరిదికి నేరుగా ఎదురుపడలేక హేమంత రుతువులో మంచుతెరలు అడ్డుపెట్టుకుందని వర్ణిస్తారు.
 
గులకరాళ్లు పైకి కనిపించేలా సీలమండల లోతుగా ఉండే గోదావరిలో విహరించడం సీతారాములకు ఇష్టమైన దినచర్యగా చెబుతారు. గాలికి ఊగులాడే రెల్లుపూలతో, సాయంత్రపు సూర్యకాంతికి వైఢూర్య కాంతితో మెరిసిపోయే ఇసుక తిన్నెలలో కబుర్లు చెప్పుకోవడం తరచుగా వారికిష్టం.
 
అలా ఆనందంగా సాగిపోతున్న సమయంలో శూర్పణఖ రాక శ్రీరామావతార పరమార్ధ ఘట్టానికి తెర తీస్తుంది. మాయాజంగమ వేషధారియై వచ్చి రావణుడు ఎత్తుకుపోతున్న వేళ సీతమ్మ తన బాధను గోదావరితో చెప్పుకుంటుంది.
 ‘హంసకారండవాకీర్ణం వందే గోదావరీం నదీం
 క్షిప్రం రామాయశం సత్వం సీతాం హరతి రావణః’ అని వేడుకుంటుంది.
 మారీచుడి గుట్టు బయటపడి వెనక్కి వచ్చిన శ్రీరాముడు కూడా పర్ణశాల వద్ద సీత లేకపోవడం చూసి...

 ‘గోదావరీయం సరితాం వరిష్ఠా ప్రియా యా మమ నిత్యకాలం
 అప్యత్రగచ్ఛేదితి చింతయామ్యైకినీ యాతిహిసాకదాచితం’ అంటాడు.
 సీత నీటికోసం గోదావరికి వెళ్లిందేమో, తామరపూల కోసం వెళ్లిందేమో! అయినా నేను లేకుండా ఒంటరిగా వెళ్లదు కదా! అనుకుంటూనే గోదావరి ఒడ్డున సీతకోసం వెతుకుతాడు. ‘‘అమ్మా! గోదావరీ నా సీత ఏది?’’ అని గోదావరిని ప్రశ్నిస్తాడు.
 
అక్కడినుంచి సీతాన్వేషణలో గోదావరి ముఖ్య ఉపనదిగా మారిన శబరిని కలుసుకోవడం మనసు పులకించే కథా సంవిధానం. రావణ వధ అనంతరం, పట్టాభిషేకం తరువాత కూడా గోదావరితో శ్రీరాముని అనుబంధం కొనసాగింది. సీతాపరిత్యాగం తరువాత అడవులకు చేరిన సీతమ్మ, రాముడు ఒకరికి తెలియకుండా ఒకరు గోదావరీ తీర ప్రదేశాల్లో తిరిగి ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు.
 
సీతావియోగ బాధ భరించలేని రాజారాముడు గోదావరీ తీరానికి తప్పకుండా వెళతాడని తమసానది ఊహిస్తుంది. తన స్నేహితురాలైన మురళానది వద్దకు వెళ్లి, ఆ సంగతి చెప్పి శ్రీరాముని కాస్త కనిపెట్టుకుని ఉండమని చెబుతుంది.
 అప్పుడు మురళానది గోదావరి వద్దకు వచ్చి, ‘‘గోదావరీ! నువ్వు అప్రమత్తురాలివై ఉండు. రాముణ్ని నీ అలల గాలుల చేత, ఎగిసే వలితుంపరల చేత, తమ్మిపూల కమ్మతావుల చేత, చల్లని గాలుల చేత సేదతీర్చు’’ అని చెబుతుంది.

భవభూతి రచించిన ఉత్తర రామచరితంలోని ఈ నాటకీయమైన ఘట్టం స్త్రీ హృదయ ఔన్నత్యాన్ని, నదుల గొప్పతనాన్ని తెలియచెపుతుంది.
 లవకుశులకు రాజ్యం అప్పగించి, అవతార పరిసమాప్తి చేసిన శ్రీరాముడు వింధ్యాసుతుడైన భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసి సతత రామదాస పోషకుడై వెలుగొందుతున్నాడు. ప్రతి నిత్యం రమ్య గోదావరీ ప్రసన్న సలిలాలతో అభిషేక, అర్చనలు జరిపించుకుంటూ ముచ్చటపడుతున్నాడు.
 - తెన్నేటి సత్య శ్రీనివాస్

మరిన్ని వార్తలు