ఆజన్మం: ధోవతిలో ఆఫీసుకు..

31 Aug, 2013 23:14 IST|Sakshi
ఆజన్మం: ధోవతిలో ఆఫీసుకు..

ఇది బాధే; కానీ బాధ అంటే ఒప్పుకోవడానికి ఎవరూ ఇట్టే సిద్ధంగా ఉండని బాధ!  మన నాన్నల తరంలో మగవాళ్లు చెడ్డీలు దాటే వయసురాగానే, ధోవతుల్లోకి మారిపోయేవారు. చదువుకున్నవాళ్లు ప్యాంట్లు తొడిగినా, ధోవతులు కట్టుకోవడం కూడా కొనసాగింది. అదే ఇప్పుడు నాకు నిక్కరు వదిలెయ్యగానే ప్యాంటు తప్ప మరో దారిలేదు. అదే అమ్మాయిలు లంగావోణీలు దాటాక చీరలు కట్టుకున్నా బాగుంటుంది; చుడీదార్లు, జీన్సులు, ఆఖరికి ప్యాంటు షర్టు వేసుకున్నా బానేవుంటుంది. నా ఉద్దేశం వాళ్లు చీర కట్టుకుంటే మనం దాన్ని ‘ఆడ్’గా చూడం. మరి మనకు ధోవతి ఎందుకు దూరమైపోయింది?
 
 మా రాజన్న ధోవతి నుంచి ప్యాంటుకు మారే పరిణామ క్రమాన్ని మా ఊరి పొలిమేర గమనించేది. ఇంట్లో ధోవతి కట్టుకుని, స్కూటర్ డిక్కీలో ప్యాంటు పెట్టుకుని, ఊరి బయట ఆ ప్యాంటులోకి మారిపోయి, పని నుంచి తిరిగి వచ్చేప్పుడు మళ్లీ ధోవతిలోకి వచ్చేసేవాడు. అంటే, తన వస్త్రధారణను ఎవరు చూస్తే అసౌకర్యంగా ఫీలవగలడో, వాళ్ల దగ్గర దాన్ని తన సహజమైన స్థితిగా నమోదు చేయించుకునేదాకా అలా కొనసాగించాడు. కాకపోతే అది ధోవతి నుంచి ప్యాంటులోకి! మరి ఇటుది అటుగా సాధ్యమా? ధోవతి కట్టుకుని ఏ సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికో వెళ్తే ఎలా ఉంటుంది? ఎక్కువమంది ఆమోదం పొందాక, సహజమైనది అసహజంగానూ, ‘అసహజమైనది’ సహజంగానూ మారిపోవడం విడ్డూరం.
 
 స్వాభావికంగా వస్త్ర ప్రీతి ఉన్నవాళ్ల సంగతి సరే; లేదంటే ఒక్క జతతో వెళ్లిపోయే జీవితం కదా! రంగుబట్టల్లో ఒక్క జతతో గడపడం సాధ్యం కాదు. ఉన్నవి అవే రెండని ఎందుకు తెలియాలి?  
  కనీసం తమిళుల్లాగా తెల్లలుంగీ అయినా కట్టుకోవడానికి ‘అధికారిక’ అవకాశం ఎందుకు లేదు మనకు? ఫకీర్లలాగా ముందువైపున కాస్త ఎత్తికట్టిన లుంగీ, కాళ్లకు తగలకుండా నడవడానికి సౌకర్యంగా ఉంటుంది కదా!
 
 మగ వస్త్రం
 గుడి మల్కాపూర్‌లో ఒకసారి ఒక ఇంటి వరండాలో ఒకాయన్ని చూశాను. ముందు ఆమె అనుకున్నాను; కానీ ఆమె కాకుండా ఉండేదేదో కూడా అంతే చప్పున స్ఫురిస్తూ ఉండటం వల్ల ఆయనేనని నిర్ధారించుకున్నాను. మరి ఈయన నైటీ వేసుకున్నాడేంటీ!
 
 నా ఆశ్చర్యపు చూపును ఆయన పసిగట్టకుండా వడివడిగా నడుస్తూండగా, దీనికి సమాధానం చెప్పడం కోసమే అన్నట్టుగా మా బాపు ఠక్కున మదిలోకి వచ్చాడు:
 బాపు ధోతి కట్టుకుంటాడు. చిన్నతనంలో ఆయనా నాలా లాగు వేసుకునివుంటాడా? మరి లాగు తర్వాత? హెచ్చెస్సీ చదివినప్పుడు? ప్యాంటు ధరించిన బాపును నేనేరకంగానూ ఊహించలేకపోయేవాణ్ని. ఏ వడ్ల కల్లాలప్పుడో, నా పది పన్నెండేళ్ల వయసు కుతూహలానికి, ‘‘సైను బట్టతోటి గుడుతర్రా; అది అటు పాయింటుగాదు, ఇటు అంగీగాదు; ఎల్ల ఒకటే బట్ట,’’ అన్నాడు.
 
 ఓహో! అయితే, ఆయన వేసుకున్నదిదీ! నిలువెల్లా తెల్లటి అంగరఖ ధరించడం చూసిందే అయినా, ఆయన తెలుపుకు బదులుగా చుక్కలది వేసుకోవడం వల్ల, దాని మీద ఆపాదించబడివున్న స్త్రీత్వపు గుణం వల్ల, ధరించిన మనిషి గురించిన లింగస్పృహ కలగజేసిన షాక్, నా పూర్వ జ్ఞాపకాన్ని తాత్కాలికంగా రద్దుచేసింది; అదే సమయంలో ఈ జ్ఞాపకాన్ని మేల్కొల్పడానికి తిరిగి అంతకంటే బలమైన పూర్వజ్ఞాపకం పూనుకోవడంతో సందేహ నివృత్తి జరిగింది.
 
 అయితే, చిత్రంగా ఆ నివృత్తి జరిగింది ప్రస్తుతంలో మాత్రమే కాదు; ఇరవై ఏళ్ల క్రితం ‘అంగరఖ’ అనేది ఒకటి ఉంటుందని నాకు తెలియకపోవడం వల్ల, బాపు చెప్పినప్పుడు సందూకు అడుగునెక్కడో అబ్‌స్ట్రాక్ట్‌గా ఉన్న దాని రూపం ఇప్పటి సంఘటన ఊతంతో ఛక్‌మని మెరిసినట్టయి సజీవంగా హేంగర్‌కు వేలాడింది.
 - పూడూరి రాజిరెడ్డి

మరిన్ని వార్తలు