ఇక సెలవని...

6 Sep, 2015 00:25 IST|Sakshi
ఇక సెలవని...

 గ్రేట్ లవ్ స్టోరీస్
* మనిషి మరణించవచ్చు.
* ప్రేమ మరణించదు.
* జ్ఞాపకంగానైనా బతికే ఉంటుంది.
సెప్టెంబర్ 11, 2001. టీవీ ఆన్ చేసి వార్తలు వింటూ, ఏదో పని చేసుకుంటోంది బెవెర్లీ. అంతలో ఓ పిడుగులాంటి వార్త. ఉగ్రవాదులు ట్విన్ టవర్స్‌పై దాడి చేశారు. వణికిపోయింది బెవర్లీ. భర్త షాన్ కళ్ల ముందు మెదిలాడు.

అతడు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లోని సౌత్ టవర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పొద్దున్న నవ్వుతూ బై చెప్పి వెళ్లాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో! వెంటనే అక్కడికి వెళ్లేందుకు సమా యత్తమయ్యింది బెవెర్లీ. అంతలోనే ఆమె ఫోన్ రింగయ్యింది. చేసింది షాన్.
 
‘‘షాన్... ఎక్కడున్నావ్? ఎలా ఉన్నావ్?’’ అంది కంగారుగా.
 ‘‘105వ ఫ్లోర్‌లో ఉన్నాను. ఇంటికి వచ్చేస్తాను, కంగారుపడకు’’ అన్నాడు ఎంతో కూల్‌గా. ప్రమాదం నుంచి బయట పడడానికి అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నట్లు చెప్పాడు. దాంతో కాసింత ధైర్యం వచ్చింది బెవెర్లీకి. షాన్ ఫోన్ పెట్టేశాడు. మెట్లమార్గం ద్వారా వెళ్లి ప్రాణాలు రక్షించుకోవడానికి  ప్రయత్నం చేశాడు.

కానీ పొగ, వేడి తట్టుకోలేక వెనక్కి వచ్చేశాడు. లాక్ వేసి ఉండడంతో రూఫ్ డోర్స్ ద్వారా తప్పించుకునే ప్రయత్నమూ విఫలమైంది. మనసు ఏదో కీడు శంకించింది. వెంటనే బెవెర్లీ గుర్తొచ్చింది. ఫోన్ చేశాడు. ‘‘దారి ఏమైనా కనిపించిందా షాన్?’’ గొంతులో కోటి ఆశలు నింపుకొని అడి గిందామె. ‘‘లేదు... పొగ మరింత దట్టంగా వస్తోంది’’ అన్నాడు షాన్. అతడు ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. మృత్యువు అతనికి అతి చేరువలోకి వచ్చిన విషయం అర్థమైంది. ‘‘ఐ లవ్యూ షాన్. ఐ నీడ్ యూ. నువ్వు లేకుండా నేనుండలేను’’ అంది పొంగుతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ.
 
‘‘నేను ఎక్కడికీ వెళ్లను. ఎప్పుడూ నీతోనే ఉంటాను. బతికి వస్తే భర్తగా, మరణిస్తే జ్ఞాపకంగా’’... అన్నాడు షాన్. తన మాటలతో ఆమెలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె కళ్లనీళ్లతో  ఆ మాటలను వింటూనే ఉంది. కొద్ది నిమి షాల్లో కొన్ని యుగాలకు సరిపడా విలువైన మాటలు మాట్లాడుకున్నారు వాళ్లు.
 
పొగ  ఎక్కువైంది. షాన్ గొంతు తడబడుతోంది. దగ్గు తెరలు తెరలుగా వస్తోంది. మాట రావడమే కష్టంగా ఉంది. ‘‘నీకేమైనా అయితే నేనూ చనిపోతాను’’ అంది ఏడుస్తూ బెవెర్లీ. ‘‘అలా చేయనని నాకు మాటివ్వు’’ అని ఒట్టు వేయించు కున్నాడు షాన్. ముద్దు పెట్టి ఐలవ్యూ అన్నాడు. ఐ లవ్యూ టూ అనాలనుకుంది బెవెర్లీ. కానీ అంతలోనే పెద్ద శబ్దమేదో వినిపించింది. గుండెల్లో వేయి అగ్ని పర్వతాలు పేలినట్లయింది. షాన్ షాన్ అని అరుస్తూనే ఉంది. బదులు లేదు. విషయం అర్థమైంది. షాన్ వెళ్లిపోయాడు. తనను విడిచిపెట్టి వెళ్లిపోయాడు.
 
కొండంత దుఃఖం. చనిపోవాలని ఉంది. కానీ భర్తకు  ఇచ్చిన మాట కోసం గుండె రాయి చేసుకుంది. మనసు లోతు ల్లోంచి బాధ తన్నుకొస్తున్నా నిభాయించు కుంది. భర్త లేని వెలితిని పోగొట్టుకోవ డానికి తాను మరికొందరికి తోడుగా నిలబడాలని నిర్ణయించుకుంది. నాటి నుంచీ సామాజిక సేవలో మునిగి పోయింది. ముఖ్యంగా సెప్టెంబర్ 11 బాధితులకు న్యాయ సహాయం అందిం చేందుకు నడుం కట్టింది. ప్రభుత్వంతో పోరాడి ఎందరికో న్యాయం చేకూర్చింది. అలా ఎనిమిదేళ్లు సేవే లోకంగా గడిపింది. కానీ ప్రతిక్షణం భర్తను తలచుకుంటూనే ఉంది. అతణ్ని చేరే రోజు త్వరగా రావాలని దేవుణ్ని వేడుకుంటూనే ఉంది.
 
చివరికి ఆ రోజు వచ్చింది.. 2009లో! షాన్ పుట్టినరోజును అతని బంధువులతో కలిసి జరుపుకోవాలని కాంటినెంటల్ ఫ్లైట్ 3407లో బఫెలో సిటీకి బయలుదేరింది బెవెర్లీ. బయలుదేరిన కాసేపటికే ఆ విమానం కూలిపోయింది. బెవెర్లీ ప్రాణాలు కోల్పోయింది.
 బహుశా ఆమె ఆ క్షణంలో భయపడి ఉండదు. బాధపడీ ఉండదు. షాన్‌ని చేరుకుంటానని సంతోషపడి ఉంటుంది. ‘నీ చెంతకే వస్తున్నాను ప్రియా’ అంటూ ఆనందంగా కన్నుమూసి ఉంటుంది!

 

మరిన్ని వార్తలు