గ్రేట్ లవ్‌స్టోరీస్

19 Mar, 2016 23:26 IST|Sakshi
గ్రేట్ లవ్‌స్టోరీస్

‘హౌ స్వీట్ ఇటీజ్ టు లవ్ సమ్‌వన్’

బెస్‌మెర్(యు.ఎస్)కు చెందిన ప్రముఖ గాయకుడు పి.జె. స్పారగిన్స్ గొంతులో ప్రేమ పాట తీయగా వినిపిస్తోంది. కొత్తగా వినిపిస్తోంది. గొప్పగా వినిపిస్తోంది. చాలామంది పి.జె అభిమానుల్లాగే ఆ స్వరమాధురిలోని  ఆహ్లాదాన్ని ఆస్వాదించింది ట్రేసీ.


ట్రేసీకి పాటలంటే ఇష్టం. పాటలను స్పారగిన్స్ గొంతు నుంచి వినడం అంటే   ఇంకా ఇష్టం. ఆ ఇష్టమే అతడికి దగ్గర చేసింది. వారిని ప్రేమికుల్ని చేసింది. ఆపైన దంపతులనూ చేసింది.

 
స్పారగిన్స్‌లో ట్రేసీకి అమితంగా నచ్చేది ఏమిటంటే... ఆమె మానసిక స్థితికి తగినట్లు పాటలు పాడేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే... తన పాటలతో ట్రేసీని ఎప్పుడూ జోష్‌లో ఉంచేవాడు.

 
అంతలో ట్రేసీ చెల్లి కిడ్నీ సమస్యతో బాధపడుతూ చనిపోయింది. ఆ విషాదాన్ని తట్టుకోలేక విషాదపు చీకట్లోకి వెళ్లిపోయింది ట్రేసీ. అది స్పారగిన్‌‌సని చాలా బాధించింది. ఆమె నవ్వకపోతే అతడు తట్టుకోలేడు. అందుకే ఆమెకు ఎన్నో విధాల ధైర్యం చెప్పేవాడు. పాటలతో ఆహ్లాదపరిచేవాడు. ‘ఆస్తులు...  అంతస్తులు... పదవులు... హోదాలు... జీవితంలో ఏదైనా మరిచిపో... కాని నవ్వడం మాత్రం మరిచిపోకు’ అని చెప్పేవాడు.

 
భర్త మాటలతో మళ్లీ ఆనందపు వెలుగుల్లోకి వచ్చింది ట్రేసీ. ఎప్పట్లానే మనసారా నవ్వసాగింది. కానీ నవ్వులను చూసి విధికి కన్నుకట్టిందేమో.. మరోసారి కన్నీటిని వాళ్ల జీవితాల్లో కుమ్మరించింది.

 
ట్రేసీని అనారోగ్యం చుట్టుముట్టింది. లుపస్ వ్యాధితో బాధపడుతోన్న ఆమెకు కిడ్నీ మార్పిడి చేయడం అత్యవసరం, లేకపోతే బతకదు’ అని హెచ్చరించారు వైద్యులు. ఎప్పుడూ ధైర్యం చెప్పే స్పారగిన్స్ ఈసారి తానే ధైర్యాన్ని కోల్పో యాడు. అతడి మనసు దుఃఖనదిగా మారింది. స్నేహితులు ఓదార్చి ధైర్యం చెప్పారు. గుండె నిబ్బరం చేసుకుని ట్రేసీని బతికించుకునే పనిలో పడ్డాడు.

 
కానీ దురదృష్టం మరోసారి వెక్కిరించింది. ట్రేసీకి మ్యాచ్ అయ్యే కిడ్నీ ఎక్కడా దొరకలేదు. దాంతో తన కిడ్నీని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు స్పారగిన్స్. అయితే ‘పర్‌ఫెక్ట్ మ్యాచ్’ అని మొదట చెప్పినప్పటికీ  హై బీపీ కారణంగా  స్పారగిన్స్ తన కిడ్నీని ఇవ్వడం కుదరదని చెప్పారు వైద్యులు. బరువు తగ్గితే ఫలితం ఉంటుందని సలహా ఇచ్చారు. దాంతో బరువు తగ్గే ప్రయత్నాలు మొదలెట్టాడు. అందుకోసం నానా తంటాలు పడ్డాడు. ఎలాగైతేనేం... ముప్ఫై కిలోల వరకు బరువు తగ్గాడు.స్పారగిన్‌‌స ప్రయత్నం ఊరికే పోలేదు. డాక్టర్లు ఆపరేషన్‌కి ఓకే అన్నారు. నాలుగు గంటల పాటు జరిగిన ఆపరేషన్ విజయవంతం అయింది.

 
బిర్మింగ్‌హామ్ ఆస్పత్రి నుంచి తిరిగి ఇంటికి వెళుతున్నప్పుడు ఆస్పత్రి సిబ్బంది  ఈ దంపతులకు ఈస్టర్  కానుక ఇచ్చారు. ఆ కానుకలో రెండు హృదయాలు కనిపిస్తాయి. అవి ప్రేమలోని గొప్పదనాన్ని చాటి చెప్పుతున్నట్లుగా కనిపిస్తాయి. అసలైన ప్రేమకు స్పారగిన్‌‌స, ట్రేసీలే నిలువెత్తు ఉదాహరణ అని నిర్ధారిస్తున్నట్టుగా అనిపిస్తాయి.

             

మరిన్ని వార్తలు