సంచలన వార్త

7 Nov, 2015 23:10 IST|Sakshi
సంచలన వార్త

ఇద్దరం టోపీలు ధరించి ఆయన కార్లో బయలుదేరాం. కొద్ది దూరంలో చీకట్లో కారాపి చెప్పాడు.
 ‘‘ఆ వస్తున్నది జిమ్.’’ డేష్ బోర్డు తెరిచి అందులోని ఓ పెట్టెలోంచి పిస్తోలు గుళ్లని తీసి పిస్తోలు లోడ్ చేసి, మా పక్కనించి వెళ్లే జిమ్‌ని రెండుసార్లు కాల్చి కారుని ముందుకి పోనిచ్చాడు. మర్నాడు జిమ్ కుటుంబ సభ్యులని ఇంటర్వ్యూ చేయడానికి సిరిల్ నన్ను పంపాడు.
 
 స్థానిక దినపత్రికలో ఖాళీ ఉందని మిత్రుల నించి తెలుసుకున్నాక సెంట్రల్ విల్‌కి వచ్చాను. సూపర్ మార్కెట్ పై అంతస్థులో వెనక భాగంలో ఉన్న ఆ పత్రికా కార్యాలయానికి వెళ్లి, దాని ఎడిటర్ మిస్టర్ సిరిల్ ఫ్లాగ్‌ని కలిశాను. అది చాలా చిన్న ఆఫీసు. రెండు బల్లలు, నాలుగు కుర్చీలు. వెలిసిపోయిన వాల్ పేపర్. అనేక షెల్ఫుల నిండా కాగితాల కట్టలు. అవి ఆ ఆఫీస్‌కి పత్రికా ఆఫీస్ అనే వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
 
 ‘‘అతను మాయం అవబట్టి నీకు ఉద్యోగం ఇస్తున్నాను’’ ఆయన నన్ను ఇంటర్వ్యూ చేయకుండానే చెప్పాడు.
 ‘‘ఎవరు?’’ అడిగాను.
 ‘‘నీ ముందు పనిచేసిన సబ్ ఎడిటర్ కమ్ విలేకరి. నీ డిజిగ్నేషన్ కూడా అదే.’’
 ‘‘అతను ఎందుకు మాయం అయ్యాడు?’’ అడిగాను.
 ‘‘ఎవరికీ తెలీదు. మా పత్రికకి ఇంకో మనిషి అవసరం ఉంది. మొదటగా వచ్చింది నువ్వు. ఇవాల్టి నించే పని ఆరంభించు. అన్నట్లు నీ పేరు?’’ సిరిల్ అడిగాడు.
 
 ‘‘గెర్చర్.’’
 ‘‘నీకూ పత్రికకీ మధ్య గల సంబంధాన్ని నువ్వు చక్కగా అర్థం చేసుకోవాలి. అది పవిత్రమైంది. దీన్ని కొనసాగించడం ఉత్తమమైన పని. తర్వాతే ఏదైనా. గొర్రెలకి నిత్యం తిండి పెట్టినట్లుగా పాఠకులకి మనం సెన్సేషనల్ వార్తలని ఇస్తుండాలి. మనిషి కుక్కని కరిచాడు లాంటివి. ఐతే అవి ఎవరి నించి సంపాదించామో మాత్రం బయట పెట్టకూడదు. నువ్వు అలా ఒట్టు పెట్టాలి’’ సిరిల్ కోరాడు.
 
 ‘‘పెట్టాను’’ నా చేతిని ముందుకి చాపి చెప్పాను.
 ‘‘మంచిది. దానికి కట్టుబడి ఉండు. లేదా నీకే ప్రమాదం.’’
 ఇద్దరం కరచాలనం చేశాం.
 
 కొద్ది రోజుల్లో నేను నా ఉద్యోగాన్ని చక్కగా నిర్వర్తించడం నేర్చుకున్నాను. ఊళ్లో జరిగేవన్నీ నేను గమనించి వార్తలుగా రాస్తే, వాటిని చదివి మార్చకుండా సిరిల్ ప్రచురించేవాడు. ఐతే ఆ చిన్న ఊళ్లో పెద్ద వార్తలు అరుదు. కొద్ది వారాల తర్వాత ‘అసలీ చిన్న ఊరికి దినపత్రిక అవసరం ఏముంది?’ అని నాకు అనిపించసాగింది. ఆ పత్రికలో ప్రచురితం అయ్యేవన్నీ ఒకే రకం వార్తలు. పుట్టుకలు, విడాకులు, పెళ్లిళ్లు, చావులు, బదిలీలు, యానివర్సరీలు, ఇంకా సినిమా రివ్యూలే. ఒక్కోసారి కొన్ని వారాలు చావు, పుట్టుకల వార్తలు లేకుండానే పత్రిక వెలువడేది. వరదలు, గొడ్డలితో హత్య లాంటివి ఉండేవి కావు. క్రిస్ట్‌మస్, జీసస్ లాంటి విషయాల మీద బడి పిల్లలతో ఇంటర్వ్యూలు ప్రచురించసాగాం.
 
 ‘‘సర్. మన పత్రిక సర్క్యులేషన్ ఐదు వేల నించి నాలుగున్నర వేలకి తగ్గింది’’... ఓ రోజు నేను సిరిల్‌తో చెప్పాను.
 
 ‘‘అలాగా? ఐతే మళ్లీ పెంచడానికి ఏదైనా చేయాలి. నువ్వు రాకమునుపు కూడా ఇలా పత్రిక సర్క్యులేషన్‌కి మబ్బులు కమ్మేవి. ఏదో చేసి ఆ మబ్బు లని తొలగిస్తూ వస్తున్నాను’’ చెప్పాడు.
 ‘‘ఎలా?’’ ఆసక్తిగా అడిగాను.
 
 ‘‘ఊహల్ని ఉద్యోగం చేయనివ్వాలి. ఎవరి శవాన్నైనా వెలికి తీసి ఆర్సనిక్ పాయిజన్ ఉందేమో పరిశీలించమని రాయాలి. అయినా వద్దు. ఇది ఇదివరకు ఉపయోగించాం. పద.’’
 ఇద్దరం టోపీలు ధరించి ఆయన కార్లో బయలుదేరాం. కొద్ది దూరంలో చీకట్లో కారాపి చెప్పాడు.
 ‘‘ఆ వస్తున్నది జిమ్.’’
 
 డేష్‌బోర్డు తెరిచి అందులోని ఓ పెట్టెలోంచి పిస్తోలు గుళ్లని తీసి పిస్తోలు లోడ్ చేసి, మా పక్కనించి వెళ్లే జిమ్‌ని రెండుసార్లు కాల్చి కారుని ముందుకి పోనిచ్చాడు. నిర్ఘాంతపోయిన నాతో చెప్పాడు.
 
 ‘‘నీ ఒట్టు గుర్తుందిగా? ఇక పత్రిక అమ్మకాలు పెరుగుతాయి. అన్నట్లు ఈ సెన్సేషనల్ హత్య గురించి చక్కగా రాయి.  గుర్తు తెలియని వ్యక్తి లేదా వ్యక్తుల చేతిలో హత్యకు గురయిన గుడ్ ఓల్డ్ జిమ్ గురించి రాయి.’’
 
 మర్నాడు జిమ్ కుటుంబ సభ్యులని ఇంటర్వ్యూ చేయడానికి సిరిల్ నన్ను పంపాడు. కొద్ది వారాలు నేను భయం భయంగా గడిపానని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
 
 ‘‘చూశావా గెర్చర్? పత్రిక సర్క్యులేషన్ పెరగడానికి మనకి మనం ఒక్కోసారి సహాయం చేసుకోవాల్సి వస్తుంది’’... సర్క్యులేషన్ పెరగ్గానే చెప్పాడు.
 కొన్ని నెలల తర్వాత మళ్లీ సర్క్యులేషన్ పడిపోయింది.
 
 ‘‘పాఠకులకి మేత కోసం మళ్లీ ప్రయత్నించాలి’’ సిరిల్ చెప్పాడు.
 ఇటీవలే అతని సబ్ ఎడిటర్ మాయం అయ్యాడు. ఇంకోసారి అలా జరగనివ్వడు అనుకున్నాను. అరగంట ఆలోచించి టోపీ పెట్టుకుని సిరిల్ నాకు సౌంజ్ఞ చేసి బయటికి నడిచాడు. ఇద్దరం ఆయన కారెక్కాం. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుని దాటే ఓ మహిళని సిరిల్ కారు గుద్దింది! నేను భయంగా సీట్లో వెనక్కి జారగిలబడ్డాను.
 
 ‘‘గమనించావా? ఆమె కదులుతోంది. కాని వెనక్కి వెళ్లడం పెట్రోల్ వృథా చేయడమే. కారుని వేగంగా నడిపే టీనేజర్ల మీద ప్రత్యేక వ్యాసం రాయి. నువ్వు అది బాగా రాయగలవు.’’
 ఆ వార్త చాలా వారాలు మా పత్రిక సర్క్యులేషన్‌ని నిలిపింది. బ్యూరో ఆఫ్ డ్రైవింగ్ లెసైన్స్‌లోని లంచగొండితనం మీద నేను రాసిన వ్యాసం సిరిల్‌కి బాగా నచ్చింది. ఓ రోజు అడిగాడు.
 ‘‘నీకీ ఉద్యోగం బావుందా?’’ బాధ్యతలన్నీ తెలిశాయా?’’
 తల ఊపాను.
 
 ‘‘ఐతే మళ్లీ పని చూడు. సర్కులేషన్ తగ్గు ముఖం పట్టింది.’’
 ఆ సాయంత్రం నేను ఆఫీసులో ఎక్కువసేపు ఉండి పాత సంచికలన్నీ తిరగేయసాగాను. ఆరేళ్ల పిల్ల హత్యల్లాంటి కొన్ని వార్తలు చాలా బాధాకరమైనవి. హాస్పిటల్‌ని తగలబెట్టిన దోషి. సర్కస్‌లో సింహం బోనుని అజ్ఞాత వ్యక్తి తెరిచాడు. ఆ సింహాన్ని పోలీసులు చంపేలోగా అది నలుగుర్ని చంపింది. ఈ వార్త ఎనిమిది నెలలు సర్క్యులేషన్‌ని నిలబెట్టింది.
 
 మిస్టర్ సిరిల్ ఎడిటర్‌‌స గిల్డ్ నించి మానవీయ కోణంలో వార్తలని రాసినందుకు బహుమతి అందుకునే ఫోటో ఒకటి ఓ సంచికలో ఉంది.
 
 ఆ రాత్రంతా నేను నా గదిలో అటు, ఇటు నడుస్తూ సర్క్యులేషన్‌ని ఎలా పెంచాలా అని ఆలోచిస్తూండిపోయాను. అంతదాకా నీటిలో మునిగి చావడం, కిడ్నాపింగ్‌లు ఆ ఊళ్లో జరగలేదు. బాంబు కూడా పేల్లేదు.
 
 ఆలోచించి ఆలోచించి అలసటతో నిద్రపోయాను. చివరికి అవి సిరిల్‌కి సూచించాను.
 మరికొన్ని నెలల తర్వాత మళ్లీ సర్క్యులేషన్ పడిపోసాగింది.
 ‘‘గెర్చర్. బాంబు పేలిన వార్తమీద పాఠకులకి మొహం మొత్తినట్లుంది. ఈసారి ఏం చేద్దాం?’’ అడిగాడు.
 
 ‘‘నాకు ఓ మంచి ఆలోచన వచ్చింది సార్’’ చెప్పాను.
 ‘‘ఏమిటది?’’ ఆయన అడిగాడు కంగారుగా.
 ‘‘ఇది’’ కాగితాన్ని ఇచ్చి చెప్పాను.
 నల్లటి బోల్డ్ లెటర్స్‌లో ‘అవార్డ్ పొందిన పత్రికా సంపాదకుడి హత్య- తన ఆఫీసులోనే.’
 ఆయన కంగారుగా లేస్తూంటే బలమైన పేపర్ వెయిట్‌తో ఆయన తలమీద కొట్టాను. మళ్లీ మళ్లీ మళ్లీ.
 (డొనాల్డ్ హోనిగ్ కథకి స్వేచ్ఛానువాదం)
 

మరిన్ని వార్తలు