భంగ తపస్వి

18 Feb, 2018 00:45 IST|Sakshi

పురానీతి

పూర్వం కండు అనే ఒక తపస్వి ఉండేవాడు. గొప్ప వేదాంతి అయిన ఆ ముని, జగన్నాథుని మనసులో నిలిపి, నిష్ఠతో తపస్సు చేసేవాడు. ఆయన తపః ప్రభావానికి దేవేంద్రుడు భయపడి.. దానిని భంగం చేయడం కోసం మదన, వసంతులను తోడిచ్చి ప్రమ్లోచన అనే ఒక అప్సరసను కండుముని తపస్సు చేసే ప్రాంతానికి పంపించాడు. అక్కడికి వచ్చిన ప్రమ్లోచన ఆ వనసౌందర్యానికి ముగ్ధురాలయిపోయి, ఒక పూలచెట్టు కింద కూర్చుని.. లోకాలు పరవశించేటట్లుగా గానం చేసింది. కండుముని ఆ మనోహరమైన గానం విని, వెదుక్కుంటూ, ప్రమ్లోచన వద్దకు వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడే వున్న మన్మథుడు ముని హృదయంలో పూలబాణాలు నాటడంతో ముని మనసు అప్సరసపై లగ్నమైపోతుంది. ఆ పారవశ్యంతో ముని ఆమె పాణిగ్రహణం చేసి, తనతోపాటు ఆశ్రమ కుటీరానికి తీసుకుని వెళ్లాడు. మునివేషంలో ఉండటం వల్ల ప్రమ్లోద తనను అసహ్యించు కుంటుందేమోనని.. తన తపశ్శక్తిని అంతా వెచ్చించి యౌవనరూపాన్ని ధరించి.. ఆమెతో సుఖించాడు కండు ముని. అలా వందేళ్లు గడిచిన తరువాత ఆమె.. ‘‘ఇక నేను స్వర్గలోకానికి వెళతాను. సెలవివ్వండి’’ అని అడిగింది. ‘‘ఇంకొంత కాలం ఇక్కడే వుండు’’ అన్నాడు ముని. ఆయన మాటకు ఎదురు చెప్పలేక అతనితోనే వుండిపోతుంది. అలా ఆమె వెళ్తానన్నప్పుడల్లా. ముని వద్దంటూ తన దగ్గరే ఉండమంటాడు. ఒకనాటి సాయంత్రం కండుముని, ప్రమ్లోచనతో.. ‘‘ఓ వనితామణీ! సాయంకాలం అవుతోంది. సంధ్యవార్చి వస్తాను. ఉదయం నుంచి నీతోనే సరిపోయింది’’ అని అన్నాడు. 

ఆ మాటలకు ప్రమ్లోచన నవ్వుతూ... ‘‘మునీంద్రా! నువ్వు నన్ను ప్రభాతవేళ చూసింది నిజమే. అది ఎన్ని సంవత్సరాల కిందటి మాటో తెలుసా? ఈ మధ్యలో తొమ్మిదివందల సంవత్సరాలకు పైగా గడిచి పోయాయి.. అంటూ అసలు విషయమంతా చెప్పి, ముని ఏమంటాడోనన్న భయంతో గడగడ వణికిపోతుంది. కండుముని ఆమె చెప్పింది విని, సిగ్గుపడి, ‘ఓ తరుణీ! ఇదంతా నా దోషమే! ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్వు ఇంద్రుడు చెప్పినట్టుగా నీ పనిని నెరవేర్చావు. ఇక నువ్వు నీ స్వర్గానికి వెళ్లు. ’’ అని అంటాడు. దాంతో ఆమె ఆకాశమార్గం ద్వారా అమరావతి చేరుకుంది.  తీవ్ర పశ్చాత్తాపంతో వేగిపోతున్న కండుముని, పురుషోత్తమ క్షేత్రానికి వచ్చి, మనస్సంతటినీ పురుషోత్తముని మీద లీనం చేసి. తీవ్రమైన తపస్సు చేసి, భగవంతుని ప్రత్యక్షం చేసుకుని, మోక్షం పొందుతాడు.
నీతి: కామక్రోధాల మీద అదుపు లేనివాడికి సమయం మీద కానీ, ప్రకృతి మీద కానీ, ఇంద్రియాల మీద కానీ అదుపు ఉండదు. భగవత్సాక్షాత్కారం లభించదు. 
– డి.వి.ఆర్‌. భాస్కర్‌ 

మరిన్ని వార్తలు