ఆకుపచ్చ సూర్యదయం

9 Sep, 2017 23:12 IST|Sakshi
ఆకుపచ్చ సూర్యదయం

సీరియల్‌ – పదమూడవ అధ్యాయం
‘అడవికి నిప్పెట్టేవాడు భారతీయుడైనా నాకు నిమిత్తం లేదు......’రేవళ్ల కంతారంలో కొండదళాన్ని విడిచి వెళుతూ మాజీ మొఖాసాదారు కొటికల బాలయ్య అన్న ఈ మాట చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. హఠాత్తుగా అనిపించింది రామరాజుకి– బాలయ్య ధర్మాగ్రహం మాటేమిటి? అడవి నేటి జీవితం. రేపటి ఆశ. దానిని తగులబెడతానంటే ఏ కొండవాడు సహించగలడు? ఆ ధర్మాగ్రహం ముందు ఓడిపోయానేమోననే అనిపించింది ఒక్క క్షణం.కానీ... కానీ... వెయ్యేళ్ల  బానిసత్వం చేసిన, ఇప్పటికీ చేస్తున్న  వేనవేల గాయాలతో బాధ పడుతున్న స్వజాతిని మేల్కొలిపే పేరుతో మరిన్ని గాయాలు చేయడమేమిటి అంటోంది అంతరాత్మ.

సంకెళ్లు వేసినవాడు గాయం చేస్తాడు. సంకెళ్లు తెంచుకోమని చెప్పేవాడు కూడా గాయపరిస్తే ఎలా? ఇదే తన ప్రశ్న. ఇంకా బతకడం ఆరంభించలేకపోయిన సాటి దేశీయులను చంపడం ఏమిటి అని ప్రశ్నిస్తోంది మనసు. నాలుగు గంటల పాటు నడిచి తనొక్కడే చీకట్లో కొత్తరేవళ్ల మీదుగా ఆ ప్రదేశానికి వచ్చాడు. అదొక గ్రామ శివారని తెలుస్తోంది. వెన్నెల్లో జొన్న చేను కనిపిస్తోంది. నాలుగడుగులు వేసిన తరువాత ఆ చింతచెట్లు, ఆ పక్కగా ఇల్లు ఇవన్నీ చూడగానే గుర్తుకు వచ్చింది. అది మంప ఊరు.అక్కడికి కొంచెం దూరంలోనే ఉంది పోలీసు శిబిరం. రెండు నిమిషాలు ఆగి చుట్టూ చూశాడు రామరాజు.

చేను మధ్య కనిపిస్తోంది మంచె. ఎవరూ లేరు. కాళ్లీడ్చుకుంటూ మంచె దగ్గరకు వెళ్లాడు. ఎక్కి పడుకున్నాడు........ వెన్నెల కాస్తోంది, అడవంతా. రామరాజు అంతరంగం మాత్రం ఆలోచనలతో కాలిపోతోంది.‘అడవి దగ్ధం కాకూడదు’ ఆ వెన్నెల రాత్రితో చెప్పాడు రామరాజు.ఉదయం రేవళ్ల కంతారంలో ఆగ్రహించి వెళ్లిపోతున్న బాలయ్యను ఆపి చెప్పాలనుకున్న మాట ఇప్పుడు మనసులో మెదులుతోంది. అది కూడా ఆ వెన్నెలతోనే చెప్పాడు రామరాజు–‘ఈ అడవి దగ్ధం కాకూడదు ఇది నిజం. భారతీయులను బాధించకూడదు. ఇది కూడా నిజమే!’

2
ఏదో జంతువు కోసం కొమ్మని చుట్టుకుని కదలకుండా పొంచి ఉన్న పెను కొండచిలవను మరిపిస్తోంది – చీకట్లో కొండల వరస. మంప గ్రామం శివారు ప్రాంతం. కొద్ది దూరంలోనే  కనిపిస్తున్నాయి ఆ కొండలు. గ్రామానికీ, కొండలకీ మధ్య కొంతమేర దట్టంగా చింతచెట్లు. దశాబ్దాల నాటి మహా వృక్షాలు. ఆ చెట్లతోటే మంప ఊరు అంతమవుతుంది. కొండల దగ్గరగా జొన్నచేలు. చేల మధ్యలోనే ఉంది ఆ నీటికుంట.చింతల తోపుకు ఒక పక్క ఆ చివరన ఉంది ఇంగువ రాజన్న పడాలు ఇల్లు. అతడూ ఉద్యమంలో పనిచేస్తున్నవాడే.                                       
            
తెల్లవారుతోంది.
చింతలతోపులో ఒక చెట్టు కింద నిలబడి కళ్లు చిట్లించుకుని చూస్తున్నారు ఆ ఇద్దరు– ఆ ప్రాంతంలో నిఘా నిర్వహిస్తున్న ఇంటెలిజెన్స్‌ పెట్రోలింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆళ్వారునాయుడు, ఈస్ట్‌కోస్ట్‌ దళానికి చెందిన జమేదార్‌ కుంజ మేనన్‌. నరాలు తెగిపోయేటంత ఉత్కంఠ ఇద్దరికీ.ఎవరో కబురందించినట్టే నాలుగైదు నిమిషాల క్రితమే అక్కడికి వచ్చారు ఆ ఇద్దరు. వెలుగు వచ్చే లోగా అంతా జరిగిపోతే బావుండునని ఆరాటపడుతున్నాడు కుంజ మేనన్‌. చీకట్లో చుట్టూ చూస్తున్న ఆళ్వారునాయుడు భుజం మీద నెమ్మదిగా తట్టాడు కుంజమేనన్‌– అటు చూడమన్నట్టు.కొద్దిదూరంలో కనిపిస్తున్న ఆ మంచె మీద నుంచి దిగుతున్నాడు– ఆ మనిషి. అతడు శ్రీరామరాజు.ఆ మంచె ఉన్న చేను సన్యాసయ్యది.కాళ్లూ చేతులూ వణికిపోతుంటే, కన్నార్పకుండా అటే చూస్తున్నారు ఇద్దరూ.తెల్లటి అడ్డుకట్ట కట్టుకున్నాడు. పైన అనాచ్ఛాదితంగా ఉంది.

అత్యంత నిష్పూచీగా నడిచి వస్తున్నాడు, ఊరివైపు. సందేహం లేదు. సమాచారం నిజమే. అతడు రామరాజే అనుకున్నాడు కుంజ మేనన్‌.వందగజాల అవతల, ఒక చేనుకు పక్కనే ఉంది నీటి కుంట. దాని దగ్గరకు వచ్చాడు. ఒక్క నిమిషం ఆలోచించి, పంచెతో అలాగే నెమ్మదిగా దిగాడు అందులోకి.ఏం జరుగుతుందో తెలుసునన్నట్టు నీటిలో నిశ్చలంగా నిలబడి ఉన్నాడు రామరాజు.జమేదార్‌ నోటిలోనే సిద్ధంగా ఉన్న విజిల్‌ దిక్కులు పిక్కటిల్లేటట్టు మోగింది, ఒక్కసారిగా. నాయుడు, మేనన్‌ మెరుపు వేగంతో వెళ్లి కుంటలో దూకి, రామరాజు పెడ రెక్కలు విరిచి పట్టుకున్నారు.హోల్‌స్టర్‌ల నుంచి రివాల్వర్లు తీసి ఆయన కణతలకి చెరోవైపున పెట్టారు ఇద్దరూ. ‘‘నీవు సీతారామరాజువు కదా!’’ అడిగాడు మేనన్‌.‘‘ఔను!’’ ప్రశాంతంగా చెప్పాడు రామరాజు.

శ్వేత ప్రభుత్వానికి ఇరవై మాసాల నుంచి చుక్కలు చూపిస్తున్న ఆ యోధుడు, కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ శూరుడు సర్వసాధారణంగా లొంగిపోయాడు. అదే వింతగా ఉంది ఇద్దరికీ. కానీ మాటలకందనంత భయంగా కూడా ఉంది. ఇతడేనా అన్న అనుమానం ఎక్కడో!చింతచెట్ల చాటున దాగి ఉన్న ఈస్ట్‌కోస్ట్‌ దళాలు, సాధారణ పోలీసులు వచ్చి తుపాకులు ఎక్కు పెట్టి కుంట చుట్టూ మోహరించారు. కొందరు కొండలలో నుంచి దాడి జరుగుతుందేమోనని అటు తుపాకులు పట్టుకుని సిద్ధంగా  నిలబడ్డారు. రెండు పటాలాలు....  దాదాపు యాభయ్‌ అయిదు మంది..... తుపాకులు ఎక్కుపెట్టారు. ‘‘నాయుడూ! ఒక మంచం తెప్పించు. వెంటనే....!’’ అన్నాడు మేనన్‌.రాజన్న పడాలు ఇంటి అరుగు మీదే ఉన్న నులక మంచం పట్టుకొచ్చాక రామరాజుని కుంట నుంచి బయటకు తీసుకొచ్చారు. ఎన్నెన్ని కథలు రామరాజు గురించి! ఆయన భద్రాద్రి రాముడి అవతారం. మహిమలున్నాయి. పట్టిస్తే దొరికే పది వేల రూపాయల మాటెలా ఉన్నా, ఎట్టకేలకు దొరికిన రామరాజుని వదిలిపెడితే ముప్పు తప్పదు. ఎంత గొడవ? ఎన్ని చిక్కులు?

3
బిగించి కట్టేసిన తాళ్ల మధ్య రామరాజు ఆకాశం కేసి చూస్తున్నాడు నిర్లిప్తంగా . మేనన్‌ తానే కాపలా ఉండి, నాయుడిని మంప పోలీసు శిబిరానికి పంపించి, రామరాజు సజీవంగా దొరికినట్టు మద్రాసుకు టెలిగ్రామ్‌ ఇచ్చే ఏర్పాటు చేశాడు. వైర్లెస్‌ నుంచి మంప నుంచి నర్సీపట్నం, కొయ్యూరు, కృష్ణదేవిపేట, అడ్డతీగెల వరకు సమాచారం వెళ్లిపోయింది. మంపలో మోహరించి ఉన్న దాదాపు డబ్బయ్‌ మంది సాయుధ దళాల సభ్యులు అక్కడికి చేరుకున్నారు.

వెలుగు వస్తోంది.ఆయాసపడుతున్నా దాదాపు పరుగులాంటి వేగంతో అడుగులేస్తున్నారంతా. ఏ క్షణంలో ఏం జరిగిపోతుందోనన్నంత ఉత్కంఠతో ఉన్నారంతా. మంచం భుజానికి ఎత్తుకున్న పోలీసుల అడుగుల్లో కొంచెం వేగం తగ్గినా వాళ్ల దగ్గరకొచ్చి కొట్టినంత పని చేస్తున్నాడు కుంజ మేనన్‌. భయం... భయం.... ఆ శబ్దం వినిపిస్తే, ఏ చాటు నుంచి ఏ బాణం వచ్చి తగులుతుందోనని బెదురు. ఎక్కడ తుపాకీ పేలుతుందోనని అదురు.  మంప నుంచి కొయ్యూరుకు ఆరు మైళ్లు. దారంతా వెదురు తోపులు. పందిరి వేసినట్టున్నాయి పొదలు. మధ్య మధ్య నీటి చెలమలు. దారంతా ఎగుడూ దిగుడూ.

అరవై మంది వరకు సాయుధులు వెనకాముందూ చూసుకుంటూ జాగరూకతతో నడుస్తున్నారు.ముందు కుంజ మేనన్‌ నడుస్తున్నాడు రివాల్వర్‌ పట్టుకుని. ఆళ్వారు నాయుడు సాయుధ బలగాలను మన్వయపరుస్తున్నాడు. చెమటలు కారిపోతున్నాయి. పెదాలు ఎండిపోతున్నాయి అందరికీ.ఆ ఆరుమైళ్లు రావడానికే దాదాపు నాలుగు గంటలు పట్టింది.అప్పటికే ఎండ తీక్షణమయింది.కొయ్యూరు ఇంకో మైలున్నర దూరం ఉందనగా అక్కడి శిబిరం నుంచి దాదాపు యాభయ్‌ మంది అస్సాం రైఫిల్స్‌ పెట్రోలింగ్‌ విభాగం సాయుధులు వచ్చి కలిశారు. అప్పుడు కుంజ మేనన్‌ కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు.

కేరింతలు, ఒకరినొకరు అభినందించుకోవడం అప్పుడు మొదలయ్యాయి.ఆ ఉత్సాహంలో ఇరవై నిమిషాలలోనే కొయ్యూరు ఊర్లోకి వచ్చి పడ్డారంతా.అక్కడ ఎదురయ్యాడు మేజర్‌ గూడాల్, పదిమంది బృందంతో.మంచం కిందకి దించారు. ఉదయం పదిగంటలు దాటుతోంది. సూర్యకిరణాలు కళ్లలో ÷డుచుకుంటున్నాయి. ముఖాన్ని  కాలుస్తున్నాయి.వేసవి ఎండ కళ్లలో పడుతుంటే కళ్లు మూసుకుని ఉన్నాడు రామరాజు. అప్పటికే తెల్లటి శరీరం ఎర్రగా అయిపోయింది. చెమటతో ముద్దయి ఉంది. అతడి కేసి చూశాడు మేజర్‌ గూడాల్‌. ‘‘కంగ్రాట్స్‌ కుంజ మేనన్‌. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. ఒక్కసారి వీడిని నా శిబిరం దగ్గరికి తీసుకునడువు!’’ అన్నాడు.

‘‘అందుకు అనుమతి లేదు కదా సార్‌!’’ అన్నాడు కొంచెం తడబడుతూనే మేనన్‌.‘‘ఫర్వాలేదు. ఒక్కసారి తీసుకు పద!’’ గొంతునిండా అధికార దర్పం నింపుకుని అన్నాడు మేజర్‌ గూడాల్‌.‘‘క్షమించాలి! అది నా పరిధిలో లేదు. మద్రాస్‌ నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం నేరుగా కేడీపేట తీసుకువెళ్లి, స్పెషల్‌ కమిషన్‌ దొరవారికి అప్పగించడమే నా పని.’’మంచం పైకి లేపమన్నట్టు సైగ చేస్తూ అన్నాడు కుంజ మేనన్‌. ‘‘షటాప్‌! స్పెషల్‌ కమిషనర్‌కి అప్పగించడం గురించి నా దగ్గర చెబుతావేమిటి?  ఓ మేజర్‌తో మాట్లాడుతున్నానని గుర్తుంచుకో. ఆఫ్ట్రాల్‌ ఓ జమేదార్‌వి. చెప్పింది చెయ్యి! లేకపోతే మా వాళ్లే చేస్తారు!’’ మంచం మీద చెయ్యి వేసి అదుముతూ అన్నాడు గూడాల్‌.

ఆ వాగ్వివాదం సమయంలోనే ఇహలోకంతో రుణం తీరిపోవడానికి కొన్ని ఘడియలే మిగిలి ఉన్నాయని అంతరాత్మ చెబుతోంది రామరాజుకి. వాయురనిల మమృత మథేదం భస్మాంతం శరీరమ్‌... ఓం క్రతోస్మర కృతం స్మర క్రతోస్మర కృతం స్మర.... ఈశావాస్యోపనిషత్‌లోని ఆ శ్లోకం గుర్తుకు వచ్చింది రామరాజుకి. ఆ శ్లోకాన్నీ, దాని అర్థాన్నీ ఎందరికో చెప్పాడాయన... ఇక నా ప్రాణవాయువు సర్వవ్యాపి, శాశ్వతమూ అయిన ప్రాణంలో లీనమగుగాక. ఈ శరీరం బూడిద అగుగాక. ఓం. ఓ మనసా! గుర్తుకు తెచ్చుకో. నీ పూర్వ కర్మలను గుర్తుకు తెచ్చుకో. ఓ మనసా గుర్తుకు తెచ్చుకో.....

శుభకర్మలను చేసిన ఉపాసకుడు మరణ సమయంలో చేసే ప్రార్థనలు ఇవి– ఈ శ్లోకం; దీని తరువాత శ్లోకం. ఆ శ్లోకం కూడా ఎవరో దూరంగా ఉండి వల్లె వేస్తున్నట్టే అనిపిస్తోంది, ‘అగ్నేనయ సుపథారాయే అస్మాన్‌... విశ్వాని దేవవయునాని విద్వాన్‌... యుయోధ్యస్మజ్జుహురాణమేనో... భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ......’ ఓ అగ్నీ! మేము చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించడానికి మమ్మల్ని మంచి మార్గం ద్వారా తీసుకుపో. మాచే చేయబడిన కర్మలన్నీ నీకు తెలుసు. ఓ దేవా! మాలోని మాయదారి పాపములను నిర్మూలించు. మా మాటలతో నీకు మరల మరల నమస్కరిస్తూ ఉన్నాము..’‘‘సరే సార్‌!’’ అన్నాడు కుంజమేనన్‌.ఇక్కడ కూడా అన్నీ దశాబ్దాల నాటి చింతచెట్లు. వాటి మధ్యలోనే లోతట్టున ఉంది పోలీసు శిబిరం.అక్కడికి మోసుకువెళ్లారు మంచాన్ని.అందరిని అక్కడ ఉండమని ఆదేశించి, తన మనుషులు నలుగురితో మంచాన్ని  తన గుడారం ఎదురుగా పెట్టించాడు గూడాల్‌.

4
కొయ్యూరు నుంచి వచ్చిన సమాచారంతో పక్కలో బాంబు పడినట్టయింది.  వైర్లెస్‌ రిసీవర్‌ని అక్కడే పడేసి ఒక్క ఉదుటన బయటకొచ్చాడు ఫర్బీస్‌. ఏవేవో జాగ్రత్తలు చెప్పి అప్పుడే బయటకొచ్చాడు రూథర్‌ఫర్డ్‌. తటాల్న రూథర్‌ఫర్డ్‌ ఎదుట నిలిచి అరిచినట్టు చెప్పాడు ఫర్బీస్, ‘‘రామరాజుని కొయ్యూరు దగ్గర మేజర్‌ గూడాల్‌ ఆపేశాడట.’’ రూథర్‌‡ఫర్డ్‌ ముఖం మరింత ఎర్రబారింది. ఆవేశంతో ఊగిపోయాడు.వెంటనే గుర్రాలని సిద్ధం చేయమన్నాడు. రెండే రెండు నిమిషాలలో ఆరుగుర్రాలు తెచ్చారు.ఫర్బీస్‌ ఒక్క గుర్రం ఎక్కడం తెలుసు రూథర్‌ఫర్డ్‌కి. జాన్, చాడ్విక్, టాల్బట్, సాండర్స్‌ గుర్రాలు ఎక్కారు. అదేమీ చూడకుండా ఉరికించాడు గుర్రాన్ని రూథర్‌ఫర్డ్‌.. మండుటెండలో దుమ్ము రేపుకుంటూ కొయ్యూరు వైపు ఉరికాయి ఆరు గుర్రాలు.           
                                              
5                                                           
జమేదార్‌ కుంజ మేనన్‌ మీద చూపించిన ఆగ్రహం ఇంకా వదలలేదు మేజర్‌ గూడాల్‌కి. తీసుకువచ్చిన నలుగురు పోలీసులని ఆజ్ఞాపించాడు గూడాల్, ‘‘ఆ చెట్టుకు కట్టేయండి!’’మంచం నుంచి విముక్తి కల్పించి, అక్కడే చింతచెట్టుకు కట్టేశారు, చేతులు పెడవిరిచి. ఆ డేరాకు వెనకే ఉంది ఆ చెట్టు. విసురుగా రామరాజు దగ్గరకు వచ్చి జుట్టు పట్టుకుని అడిగాడు గూడాల్‌ ఆవేశంతో ఊగిపోతూ.‘‘నీ సమస్య ఏమిటి?’’ ‘‘బ్రిటిష్‌ జాతి పాలనే నాకు సమస్య. అది నా ఒక్కడి సమస్య కాదు. మొత్తం భారతీయుల సమస్య.’’ నీరసంతో వాలిపోతున్నా తీవ్రంగా అతడి కేసి  చూస్తూ అన్నాడు రామరాజు. తనలో జీవశక్తి నశించిపోతున్న సంగతి అర్థమయింది,  ఆ క్షణంలో.

‘‘ఇండియన్‌ కుక్కా! బ్రిటిష్‌ జాతి పాలన సమస్య కాదు. అది ఎవరికైనా భగవదనుగ్రహం. దీని పేరే వైట్‌మ్యాన్స్‌ బర్డెన్‌! విన లేదా?’’‘‘నీ దేశ ఖజానాకి చేరిన ప్రతి సెంట్‌ చెబుతుంది, మీ పాలన భగవదనుగ్రహమో, రాక్షస పాలనో! ఆ రాక్షస పాలన మీదే మా పోరాటం!’’ అన్నాడు రామరాజు, అంతే తీవ్రంగా.‘‘ఈ అలజడంతా అందుకేనా?’’ మళ్లీ అన్నాడు గూడాల్, వ్యంగ్యంగా.‘‘నా మాతృభూమి స్వాతంత్య్రం కోసమే మా పోరాటం! ఇది అరాచకం కాదు.’’‘‘మైదానాలలో జరుగుతోంది కదా! అక్కడికి పోకుండా ఈ అడవుల్లో, ఈ కొండ జంతువులతో నీకు పనేమిటి?’’‘‘భారతభూమీ మాదే. భారతీయతకు తాత్వికతని ఇచ్చిన ఈ అడవీ మాదే. రెండూ వేర్వేరు కాదు. అడవిలో పుట్టినా, మైదానంలో పుట్టినా అంతా భారతీయులే.’’ ‘‘భారతీయతా? అదేమిటి?’’

‘‘మాదైన జీవనం. మాదైన ధనం. మాదైన జ్ఞానం. మాదైన ఆరోగ్యం’’‘‘ఇవన్నీ ఎవరు చెప్పారు? ఎక్కడ రాశారు?’’‘‘మా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవే చెప్పాయి.’’‘‘నువ్వు నా సహనాన్ని పరీక్షించకు!’’ హెచ్చరిస్తున్నట్టు అన్నాడు గూడాల్‌.‘‘నీవు అడిగిన ప్రశ్నలకు ఇవి సమాధానాలు’’‘‘అడవిలో ఎందుకు ఉన్నావ్‌? ఇదీ నా ప్రశ్న! అర్థం కాదా?’’ అన్నాడు గూడాల్‌ మండిపడుతూ.‘‘అడవంటే నా వరకు ఆధ్యాత్మిక నిలయం. దేవతలు విహరించే భూమి. అందుకే ఉన్నాను.’’‘‘కాదు, బెంగాల్‌ తీవ్రవాదులను కలుసుకోవడానికి అనువైన ప్రాంతం!’’‘‘నా సహనాన్ని కూడా పరీక్షించవద్దు. మీ భ్రమలకీ, భయాలకీ నేను బాధ్యుడినికాదు.’’ అన్నాడు రామరాజు, ఆగ్రహంతో.

అలాంటి స్థితిలో ఉండి కూడా నిర్భయంగా మాట్లాడుతున్న రామరాజు ధైర్యం కొంచెం భయపెడుతోంది. ఒక నిమిషం తరువాత అన్నాడు గూడాల్‌.‘‘వాడినెక్కడ దాచావ్‌! ఆ గదర్‌పార్టీ పృథ్వీసింగ్‌ని?’’ ‘‘మీ నీడను చూసి మీరు భయపడ్డారు. అందుకు కారణం నన్ను అడిగి ఏం లాభం?’’‘‘ఆయుధాలు వస్తాయని చెబుతారట మీరంతా! ఎక్కణ్ణించి వస్తున్నాయి? అడవిలో చెట్లకి కాస్తున్నాయా?’’ ‘‘మీ జాతి నెత్తుటి అడుగులు పడిన తరువాత అడవులన్నీ ఆయుధాలనే కాస్తున్నాయి!’’‘‘తప్పు. మేం ఇక్కడ నడిచాకే, మీకు నాగరికత అంటే ఏమిటో తెలిసింది!’’‘‘నోర్ముయ్‌! నాగరికతే తెలిసి ఉంటే, కోర్టుకి తీసుకెళ్లకుండా ఇక్కడ నన్నెందుకు బంధించావు చెప్పు!’’ ‘‘చెప్పాలా? సరే, నా చేతిలో చావబోతున్నవాడివి, ఆ మాత్రం చెప్పవచ్చు.

 నువ్వొక ఉన్మాదివి. నీ ఉన్మాదం పరాకాష్టకి చేరిందని ఎప్పుడో ప్రభుత్వానికి చెప్పాను. పిచ్చికుక్కను కాల్చి చంపినట్టు చంపడమే నీకు సరైన మందు. ఒరేయ్‌! నీ పిచ్చితో మమ్మల్ని ఎంత ఏడిపించావో తెలుసా? గ్రేట్‌వార్‌కి వెళ్లివచ్చిన వాడిని నేను... ఈ కొండల్లో పడి జంతువుల్లాంటి మనుషులని వెదికి పట్టే పనికి దింపావు! ఈ వెధవ అడవిలో నిన్ను పట్టుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డామో తెలుసా? చివరికి ఇలా! ఏం సాధించావ్‌? నీ పిచ్చితో బ్రిటిష్‌ సామ్రాజ్యానికి ఎంత నష్టమో తెలుసా? మళ్లీ నీ మీద  విచారణ ఒకటా? నిన్ను మంప దగ్గరే... అరెస్టు చేసిన మరుక్షణమే కాల్చిపారేసి ఉండాల్సింది. నేనైతే అదే చేసేవాడిని. ఇప్పటికీ మించిపోలేదు.’’‘‘పిరికిపందలా మాట్లాడుతున్నావు నువ్వు! భగవంతుడి పాలన అంటే ఇదేనా?’’ అన్నాడు రామరాజు.

‘‘నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావ్‌! సరే, ఒక్క అవకాశం ఇస్తున్నాను. నువ్వు నా చేతిలో లొంగిపోతున్నట్టు ప్రకటించి, క్షమాపణలు అడుగు. లేకపోతే చావడానికి సిద్ధంగా ఉండు!’’‘‘పుట్టిన వాడికి మరణం తప్పదన్న మహోన్నత తత్వానికి జన్మనిచ్చిన నేల నాది. చావు పేరు చెప్పి భయపెట్టాలని అనుకోకు!’’ అన్నాడు రామరాజు.‘‘చివరి అవకాశం కూడా పోగొట్టుకున్నావు.’’ చివాల్న అక్కడే ఉన్న గార్డు చేతిలో ఉన్న 303 రైఫిల్‌ని తీసుకున్నాడు గూడాల్‌. రామరాజు గుండెల మీద పెట్టి అన్నాడు, ‘‘ఇంకా ఆలస్యం చేసే మూర్ఖుణ్ని కాను నేను. నీ ఇష్టదైవాన్ని తలుచుకో!’’ఒక మనిషి ప్రాణం తీస్తున్నానన్న స్పృహ, సంకోచం ఈషణ్మాత్రం కూడా కనిపించడం లేదు అతడిలో. శ్రీరామరాజు పెదవుల మీద అదే శ్లోకం – వాయురనిల మమృత మథేదం భస్మాంతం శరీరమ్‌.....
 

మరిన్ని వార్తలు