ఆకుపచ్చ సూర్యోదయం

12 Mar, 2017 18:46 IST|Sakshi
ఆకుపచ్చ సూర్యోదయం
అంత మృదుస్వభావిలా కనిపించిన మదీనా, శిక్షకుడిగా మారాక యుద్ధం చేయిస్తున్న సేనానిని మరిపించాడు. చిన్న తప్పిదం చేసినా కొట్టినంత పనిచేశాడు. రెండు రోజులలోనే గన్‌ లోడ్‌ చేయడం, గురి పెట్టడం, పేల్చడం నేర్పేశాడు..... బాగా నేర్చుకున్నావు బాబయ్యా మర్దన! ఇంక చాలేమో! అంటున్నది సోమమ్మ. ఆ, చాలు చాలు.....’’ అన్నాడు రామరాజు తేరుకుని. ఏం బాబయ్యా పరధ్యానంగా ఉన్నారు?’’ హఠాత్తుగా అడిగింది సోమమ్మ. లోపల నుంచి ఉడికించిన చింతపండు గుజ్జు పట్టుకొచ్చి మంచం దగ్గర పెడుతూ అన్నాడు దాలినాయుడు, మామ్మా! వెంకటాచలం అయ్యవారు వచ్చారు, నిన్ను చూడ్డానికి!  చాటింపేశారేంటి, బెణుకు సంగతి? రమ్మను పెద్దాయన్ని!అంది సోమమ్మగారు, నొచ్చుకుంటూ.
 
మర్రి వెంకటాచలం గారు ఆ ప్రాంతంలో చాలా మర్యాద ఉన్న మనిషి. పదవీ విరమణకి దగ్గరగా ఉన్న ఉపాధ్యాయుడు. అంతా అయ్యవారనే పిలుస్తారు. ఊరు నాగాపురం. కృష్ణదేవిపేటకి పక్కనే. భాస్కరనాయుడికి ఆప్తుడు. దాలినాయుడు మరో ముక్కాలి పీట తెచ్చి వేశాడు, రామరాజుకు పక్కనే. నమస్కారం! ఓహో! రామరాజుగారి వైద్యమేనా! ఇంకేం? చిటికెలో నయమవదూ! అంటూ వచ్చి కూర్చున్నారు అయ్యవారు. భలేవారే! నా వైద్యానికి భయపడి రెండు రోజులు కబురే చేయలేదు! అన్నాడు రామరాజు, ఫిర్యాదు చేస్తున్నట్టు. అయ్యో! అదేం లేదు బాబయ్యా! చిన్న బెణుకు. అదే పోద్దని..! అన్నదామె నొచ్చుకుంటూ. ఉడికిన చింతపండు గుజ్జు తీసి చెమ్చాతో కొద్దిగా పాదం పైన రాశాడు రామరాజు.
 
ఈ మాత్రం వేడి ఉండాలి! తట్టుకోగలవా అమ్మా! అడిగాడు రామరాజు. అలాగే, తప్పుతుందా బాబయ్యా! అన్నదామె, ఓర్చుకుంటూ. మరి కొంచెం గుజ్జు పూసిన తరువాత, హఠాత్తుగా తలెత్తి, కళ్లతో చూపిస్తూనే అడిగాడు రామరాజు ‘‘ఆ తుపాకీ ఎవరిది? మా మావగారి కాలం నాటిది!’’ మామూలుగా చెప్పిందామె. భాస్కరుడి గారి తాతగారు వేటాడేవారులెండి. తరువాత, ఒకటి రెండు సందర్భాలలో ఫితూరీదారులు ఇళ్ల మీద పడకుండా రక్షించింది కూడాను! అన్నారు అయ్యవారు.
 
చాలా జరిగినట్టున్నాయి! మామూలుగానే అన్నాడు రామరాజు కూడా. మీరు రావడానికి ఒక్క సంవత్సరం ముందు, అంటే 1916లో కూడా మన్యంలో ఫితూరీ జరిగింది! అన్నారు అయ్యవారు. అటు మళ్లింది సంభాషణ. లాగరాయి ఫితూరీ అదే! ఈ ఊళ్లోనే ఉండేవాడు గరమండ మంగడు. చాలా అల్లరి చేశాడు. చిత్రంగా ఫితూరీలన్నీ పోలీసుల మీద కక్షతో మొదలై తరువాతే ఎటో నడిచేవి... భాస్కరుడిగారి తండ్రిగారూ, మా తండ్రిగారూ చెప్పుకుంటూ ఉండేవారు. అన్నారు వెంకటాచలం. మంగడి పేరు విన్నాను. ఎవరతడు? అడిగాడు రామరాజు.కొండవాడే.
 
ఇప్పటివా ఈ గొడవలు. అటు రంప, ఇటు గూడెం కొండలు – తిరుగుబాట్లకి పోటీ పడుతున్నట్టు ఉండేవట అన్నారు అయ్యవారు. అప్పుడే గుండె గుభిల్లుమనే ఆ మాట గుర్తుకు వచ్చింది సోమమ్మగారికి. రామరాజు తల్లి కృష్టదేవిపేట వచ్చినప్పుడు చెప్పిన మాట– ‘ఈ పిల్లాడి ధోరణి ఇంకా ఎక్కడికి వెళుతుందో? ఉగ్రవాది అవుతాడని తునిలో జాతకం చెప్పారమ్మా! కంగారు పడుతున్నట్టు, వినరాని మాటలేవో విని భరించలేనట్టు హఠాత్తుగా అన్నారామె. బాబూ! ఇంకేదైనా మాట్లాడుకోండి! పితూరీలు... తిరుగుబాట్లు... ఆ ఊసులే వద్దు! ఆమె మాట వెనుక భీతి అక్కడ అందరి నోళ్లని కట్టేసింది.
 
ఆ బూజు పట్టిన తుపాకీ కళ్ల ముందు కదిలితే చాలు... తూటా కంటే వేగంగా ఒక సమీపగతం దగ్గరకి దూసుకు వెళుతోంది ఊహ. కొండగాలి మోసుకొచ్చిన విప్లవ గీతమేదో చెవిలో దూకుతున్నట్టుంది. ఎంత విచిత్రం! జాతీయ చైతన్యంతో ప్రజలను ఐక్యం చేయడమే లక్ష్యంగా బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భవిస్తున్న  క్షణాలలోనే... కొండగ్రామాలకూ అలాంటి చైతన్యమే కావాలంటూ ప్రతి«ధ్వనించిందొక పెనుకేక.
 
అడవి కాసిన అరుణోదయాలు    
మంచుతెర... మన్యం మీద మేలిముసుగులా. పగటి వేళలోనూ ఎముకలు కొరికేస్తోంది చలి పులి. అందరూ గొంగళ్ల కింద ముడుచుకుని ఉన్నారు. 1885, డిసెంబర్‌ మాసాంతంలో ఓ రోజు. అది సడక. మారుమూల కొండగ్రామం. అంత చలినీ కొద్దిసేపైనా మరచిపోయేటట్టు చే సి, కదలిక తెచ్చే ఘటన హఠాత్తుగా సంభవించింది. ఆ ఊరి రాకపోకలకి అదొక్కటే దారి. ఆ బాట వెంటే పై ఊరు వెళుతున్న సడక గ్రామ బారిక అడుగు వేయబోయి అలాగే నిలిచి పోయాడు.
 
ఆ చిన్న కొండ పైనుంచి సడక గ్రామంలోకి తీసుకొచ్చే కాలిబాటలో ఒక రూపం అస్పష్టంగా. కళ్లు విప్పారించి చూశాడు బారిక. ఏదో ఆవహించిన మనిషిలా విసవిసా వస్తున్నాడా మనిషి. గుర్తు పట్టాలని మళ్లీ విప్పారించాడు కళ్లు. మంచుతో సాధ్యం కావడం లేదు. సన్నగా పొడవుగా ఉన్నాడా వస్తున్న మనిషి. లేత పసుపు రంగుపంచె కట్టుకుని, భుజాలæ నిండా నల్లటి గొంగడి కప్పుకున్నట్టు లీలగా తెలుస్తోంది. పొత్తిళ్లలో పసిబిడ్డను పట్టుకున్నట్టు రెండు చేతులలోను ఏదో మోస్తూ, అంత వేగంలోనూ జాగ్రత్తగా వేస్తున్నాడు అడుగులు.
 
ఇంకా దగ్గరయ్యాడా మనిషి. నుదురంతా ఖాళీ లేకుండా దట్టంగా పసుపు. మధ్యగా నిమ్మకాయంత కుంకం బొట్టు– మంచుకి తడిసి చిన్నగా కారుతూ. బాగా పెరిగిన తెల్లటి జుట్టు, గెడ్డం వర్షంలో తడిసినట్టు ముద్దగా ఉన్నాయి. చివరికి అతడెవరో గుర్తుపట్టాడు బారిక. చలి మాట మరచి చేతులు జోడించి ఒక్కసారిగా ఉరికాడు, ముందుకి. ఆ మనిషికి ఎదురు వెళ్లి కాళ్లకి మొక్కి, వినయంగా చేతులు కట్టుకుని నడవడం మొదలుపెట్టాడు, పక్కన. అతడు పక్క ఊరి శివసారి. అంటే పూజారి. వృద్ధుడు. పేరు సలాబి బోడడు. కొండదొర వర్గం. రెండు అరిచేతులలో పెట్టుకున్న ఆ వస్తువు – దండం. రెండడుగుల తెల్లకర్ర. పైన బండగా, పోను పోను పాము తోకలా సన్నగా ఉంది. నిండా పసుపు, కుంకం బొట్లు. చలికి బిగుసుకుపోయిన కొండచిలువ పిల్లలాగే ఉంది. 
 
మీ శివసారి ఇంటికి! ఆ ఒక్క మాటే అన్నాడు బోడడు. ఊళ్లోకి పరుగుతీశాడు బారిక. పది బారల దూరంలో ఇల్లు ఉందనగానే బారిక వేసిన కేక అక్కడ ప్రతిధ్వనించింది, మాలడు గారూ! రండి... రండి! ఇంట్లోనే ఉన్న మాలడు, సడక గ్రామ శివసారి, కంగారుగా బయటకు వచ్చాడు. పూర్తి పేరు పోతుకూరి మాలడు. 35 ఏళ్లుంటాయి. పొట్టిగా బలంగా ఉన్నాడతడు. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి పరవశించిపోయాడు. కొన్ని అడుగులు ముందుకు వేసి నిలబడ్డాడు మాలడు, చేతులు జోడించి. అతడికి ఎదురుగా వచ్చి ఆగాడు బోడడు. వెంటనే బోడడి పాదాల ముందు తల ఆన్చి మొక్కాడు మాలడు. 
 
రెండు చేతులలో దండం అలాగే ఉంచుకుని దీవించాడు బోడడు. గురుబ్రహ్మ, గురుర్విష్ణో, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్‌ పరబ్రహ్మ తస్మై శ్రీగురవేనమః దుర్యోధన సంపద కలిగి, భీమన్న బలం కలిగి, అంటింది అమృతమై, ముట్టింది ముత్యమై, శత వెయ్యేళ్లు చల్లగా వర్ధిల్లు. పాడిపంటలు వర్ధిల్లుతూ, పూచిన పూవల్లా, కాచిన కాయల్లా, పున్నమి వెన్నెల్లా వెలగాలి. దీవెన తరువాత లేచిన మాలడు ఆ దండం అందుకోబోయాడు, మర్యాద పూర్వకంగా. ఇవ్వడానికి తిరస్కరిస్తున్నట్టు ఒక అడుగు వెనక్కివేశాడు బోడడు.
 
ఉలిక్కిపడి, తన చేతులు వెనక్కి తీసుకుని, తొందరపాటుకు పరిహారమన్నట్టు రెండు చేతులతో లెంపలు వేసుకున్నాడు మాలడు. అప్పటికే సడక గ్రామంలో ఆడా మగా అంతా అక్కడి వచ్చారు. మునసబు ముర్ల బాలయ్య ఆ ఇద్దరికీ ఐదారడుగుల దూరంలో నిలబడ్డాడు చేతులు కట్టుకుని. ఏమిటి సెలవు? చేతులు మళ్లీ జోడిస్తూ అడిగాడు మాలడు. ఏం చెబుతాడో బోడడు అని అంతా ఎదురు చూస్తున్నారు, చెవులు రిక్కించి. 
 
రెండు నిమిషాల తరువాత, కళ్లు మూసుకుని నిశ్చలంగా అన్నాడు బోడడు, ‘‘నాకు దేవుడు కనిపించాడు! ఒక్కసారిగా మౌనం. మాలడినే కాక, గ్రామస్థులందరినీ కూడా ఉద్దేశించి చెబుతున్నట్టు చెప్పాడు బోడడు, ఆ దండాన్ని అలాగే పట్టుకుని. ఆ గొంతులో ఆవేదన, ఆవేశం. చింతలు పూస్తే చెడ్డకాలం... మామిళ్లు పూస్తే మంచికాలమని సామెత. కానీ ఇప్పుడు అంతా చెడ్డకాలమే. ఈ సమయంలో శుభవార్త చెప్పాడు దేవుడు. ఇవాళ అడవిబిడ్డ అడవిలో అడుగు పెడితే నేరం. కొమ్మ కొడితే రూపాయి జరిమానా. అడవిలో గొడ్డలి లేస్తే చాలు, కలప పన్ను. పంట మీద మొదలు పన్ను,  కల్లు మీద చిగురు పన్ను... గంప పళ్లు తెచ్చుకుంటే అణా పన్ను.
 
కావడి వేసుకుంటే రెండణాల పన్ను. భూమి మీద పన్ను. లేగదూడ మేస్తే పన్ను. ఇంటికోసం చిన్న దూలం కొట్టుకుంటే పన్ను. కట్టుబడి పేరుతో ముఠా మీదా పన్నే. అంతా పన్నుల రాజ్జెం. ఎప్పుడైనా ఉందా? ఇది సాగకూడదని దేవుడు చెప్పాడు. ఇందుకోసం మనం చేయవలసింది ఒక్కటే.... తెల్లోళ్ల జబర్దస్తు ప్రభుత్వం మీద పితూరీ ఎత్తాలి. నీ భూమి నీకు దక్కాలంటే బాణాలు అందుకోమన్నాడు, దేవుడు. మీ మాన్యాల మీద, మీ ఆడవాళ్ల మానాల మీద కన్నేసిన ఎర్రబుట్టలోళ్లని తరిమి కొట్టాలని దేవుడి సెలవైంది.
 
మన తాతముత్తాలు ఈ నేల మీద పుట్టి, ఇందులోనే కలసిపోయారు. నీ కట్టె, నా కట్టె ఏ భూమిలో కలవాలి? అసలు ఈ అడవి తెల్లోడిదా? కాదు. మన దేవుడుది!  తెల్లోడి దగ్గర తుపాకులు ఉండొచ్చు. కానీ మనకాడున్న విల్లంబులు గురి పెడితే విజయం మనదేనని దేవుడు చెప్పాడు. ఇదే శుభవార్త. ఈ అడవిలోనే తిరగాడుతున్న మన పెతర్లు (కాలం చేసిన తండ్రులు, అంటే ఆత్మలు) శపించకుండా ఉండాలంటే పితూరీ లేవదీయమన్నాడు దేవుడు. అని మౌనం దాల్చాడు బోడడు.
 
ఆ మౌనాన్ని సంకేతంగా గుర్తించి మునసబు బాలయ్య, మాలడు ఆయన ముందుకు వెళ్లి నిలిచారు. పూజకు వేళయింది. మిగిలిన విషయం పున్నం రోజున మాట్లాడుకుందాం! అన్నాడు. అంటే సరిగ్గా వారం తరువాత. అప్పుడు అడిగాడు మాలడు, ఈ దండం.....?! ఇది మహిమ గల దండం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఐదుగురు వంతున మొక్కాలి, పంచపాండవుల్లాగా.  చుట్టుపక్కల గ్రామాల వాళ్లూ రావాలి. అన్నాడు కళ్లకు అద్దుకుంటూ బోడడు. మళ్లీ బోడడే అన్నాడు. ఈ దండానికి గొప్ప కత ఉంది. నేను మళ్లీ పున్నానికే నోరు విప్పుతాను. అప్పుడు చెబుతాను. మాలడి ఇంటిలోనే ఒక మూల పీనె (అరుగు)ను వెంటనే పేడతో అలికించారు. దాని మీద పండగలలో దేవతల పీఠం కోసం వేసినట్టు నేరేడాకులు పరిచి ప్రతిష్టించారు దండాన్ని.
 
పున్నమి వరకు బోడడు విరామం ప్రకటించడం ఓ వ్యూహం. ఈ ఏడు రోజులలో తన ఆశయం కనీసం పాతిక ముప్పయ్‌ గ్రామాలకు వెళ్లాలి. అదే జరుగుతోంది గూడెం కొండలలో. మహానదికీ, గోదావరికీ మధ్య ఉన్న తూర్పు కనుమలలో రంప, గూడెం ప్రాంతాలు పక్క పక్కనే ఉన్నాయి. ఇందులో రంప– గోదావరి లోయ. గూడెం కొండల విలాసం – విశాఖ మన్యం. కొమ్మలన్నీ స్పష్టంగా కనిపించే మహా వృక్షం వంటిది రంపలోయ. ఇక్కడ 230 వరకు ఉన్నాయి గ్రామాలు.
 
కోయలదే ఆధిపత్యం. మహా గుబురు వంటిది గూడెం. గూడెం కొండలు ఎలుగులు దూరని ఎర్రచిడుగులు. ఈ కీకారణ్యంలో 400కు పైగా గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ బగతలదే ప్రాబల్యం. సడక చుట్టూ ఉన్న గ్రామాలలో వృద్ధులంతా గొంతు సవరించుకున్నారు.రంపలోయ గాథలు, గూడెం కొండల కథలు గుండె లోతుల్లోంచి వచ్చాయి. ఆ మొదటి గాథే యువకులని రోమాంచితం చేసింది. రాజమండ్రి తాలూకా సరిహద్దుల నుంచి, మన్యంలో గొలుగొండ తాలూకా సరిహద్దుల వరకు ఉంది– యాభయ్‌ రెండు మైళ్ల రంప దేశం. 
 
1798 నాటి గాథ...  అడవంతా పచ్చదనం. ఆ వర్ష రుతువులో ఉరుము లేని పిడుగుల్లా రెండు కంపెనీల సిపాయీలు వచ్చి శిబిరాలు వేశారు. థక్‌.. థక్‌.. థక్‌..... ఉదయం, సాయంత్రం కొండ అంచుల మీద తుపాకులు, కత్తులు పట్టుకుని కవాతు చేయడం, గ్రామాలలోకి వచ్చి అలజడి చేయడం. కొత్తపల్లి, ఇందుకూరిపేట అనే మారుమూల గ్రామాల ప్రజలు ఈ పరిణామాలను చూసి చేష్టలుడిగిపోయారు. ఆ బలగాలు లెఫ్టినెంట్‌ మెక్లియోడ్‌ నాయకత్వంలో పనిచేస్తున్నాయి. రంపకొండలు  తమ జెండా కిందకి వచ్చిన సంగతిని అంత బీభత్సంగా ప్రకటించదలిచింది ఈస్టిండియా కంపెనీ. 
 
ఇది నచ్చలేదు అడవిబిడ్డలకి. అందుకే ఓ వేకువనే కొన్ని గ్రామాల కొండప్రజలు ఏకమై వచ్చి ఇందుకూరిపేట  శిబిరం మీద దాడి చేశారు. ఆ తిరుగుబాటుకు నాయకుడే పండుదొర. అదొక నిరసన, అంతే. మళ్లీ ఆ ఏడాది ఆగస్టు 31న పురుషోత్తమపట్నం అనే ఊరు మీద కంపెనీ బలగాలు ఉపయోగిస్తున్న రేవులోనే... పండుదొర నాయకత్వంలోనే వాళ్ల మీద దాడి చేశారు ఫితూరీదారులు. కానీ, విల్లంబులతో పోరాడుతున్న కొండ ప్రజలని సులభంగానే మెక్లియోడ్‌ బలగం అణచివేసింది. కానీ ఆ హింస దారుణం. అది చూసే కొండలు మౌనం దాల్చాయి. అడవి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది.... దాదాపు పదిహేనేళ్లు....
 
1813లో ఓ రోజు..... అప్పుడే వెలిసింది వాన. మట్టి గుబాళింపు, కొండలంతా. చినుకుల వల్ల కాబోలు ఆ నల్లగుర్రం మరింత నల్లగా కనిపిస్తోంది. వేగంగా వస్తోంది ఆ కొండగ్రామంలోకి. లంకణాలు చేసి చిక్కినట్టుగా ఉన్న ఆ మనిషి అడవి మేతతో బలిసి ఉన్న ఆ గుర్రం మీద వీరావేశంతో ఊగిపోతున్నాడు. అలంకారానికి ధరించే టెంగి గొడ్డలి మాత్రం వెండిలా మెరుస్తోంది. ఒక చేతిలో కళ్లెం, రెండో చేతిలో ఆ టెంగి గొడ్డలి. ఆ అశ్వికుని వెనుక రెండుమూడు వందల మంది ఉన్నారు. ఎక్కువ మంది చేతిలో విల్లంబులే ఉన్నాయి. నలుగురైదుగురి చేతిలో మాత్రం పాత తుపాకులున్నాయి. ఏ గ్రామంలో ప్రవేశించినా జనం సాగిలబడుతున్నారు. అతడు రంప జమిందారు లేదా మన్సబ్‌దారు రాజా రాంభూపతిదేవ్‌. 
 
నాలుగైదురోజులుగా తిరుగుతూ, ఈ గ్రామాలు ఇక నావి, నేనే పాలకుడిని అని వాటి పొలిమేరలలో నిలిచి ప్రకటిస్తున్నాడు. అవి ఒకప్పుడు అతడి వంశీకులు ఏలుబడిలోవే. అంతలోనే ఈస్టిండియా కంపెనీ బలగాలు రాంభూపతిదేవ్‌ను బంధించాయి. రాజమండ్రి తీసుకుపోయి, ఒప్పందానికి ఒప్పించాయి. దేవ్‌ ఈస్టిండియా కంపెనీ ప్రతినిధిగా ఉండడానికి అంగీకరించాడు. అతడు స్వాధీనం చేసుకున్న గ్రామాలకు అతడినే మొఖాసాదారుని చేయడానికి కంపెనీ అంగీకరించింది. దాదాపు ముప్పయ్‌ ఐదేళ్లు గడిచాయి. 1835, మార్చి నెల....ఎండలు ముదిరిపోతున్నాయి.
 
భూదేవి పండుగ జరుగుతోంది, చాలా గ్రామాలలో. రంపదేశం ఆ సంరంభంలో ఉండగానే కబురు తెలిసింది. రాజా రాంభూపతిదేవ్‌ కన్ను మూశాడు. వారసుడు ఎవరు? అదో వేధించే ప్రశ్న. కారణం, దేవ్‌ మొదటి సంతానం– కూతురు. పేరు శ్రీజగ్గా అమ్మ. ఈడొచ్చినా పెళ్లి చేసుకోలేదు. ఆమెకో పదమూడేళ్ల తమ్ముడు. ఇతడికి కూడా రాంభూపతిదేవ్‌ అనే పేరు పెట్టారు. కానీ అతడు రాజా రాంభూపతిదేవ్‌ అక్రమ సంతానం. ఏది జరగకూడదని మునసబులూ, ప్రజలూ కోరుకున్నారో అదే జరిగింది. ఈస్టిండియా కంపెనీ అధికారులు జగ్గా అమ్మనే తండ్రికి వారసురాలిగా మన్సబ్‌దార్ని చేశారు.
 
ఓ ఆడదానికి ఒంగి ఒంగి దణ్ణాలు పెట్టడం ఎలా? అదే ప్రశ్న. కానీ ఈ అసమ్మతిని గట్టిగా వినిపిస్తే ఆమె తమ్ముడిని మన్సబ్‌దారుని చేస్తారని శంక. ఇంకో ఎత్తు కూడా వేశారు. పోనీ పెళ్లైనా చేసుకోమని జగ్గా అమ్మని అంతా కోరారు. అల్లుడిని రంగం మీదకు తేవచ్చుననీ, ఈమెను పరదా వెనక్కి నెట్టేయవచ్చుననీ వారి ఆలోచన. ఈ ఒత్తిడి భరించలేక ఆమె తన తమ్ముడికి అనుకూలంగా మన్సబ్‌దారి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. మహిళకు ఒంగి ఒంగి సలాములు చేసే పని తప్పిందనుకుంటే, ఇప్పుడు ఉంపుడుగత్తె కొడుకును సింహాసనం మీద కూర్చోబెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. 
 
ఒప్పుకోలేదు ప్రజలు. ఇంకో ఎత్తు వేశారు. శ్రీజగ్గా అవివాహిత. అదే ఆయుధమైంది. ఆమె మంచిది కాదని ప్రచారం మొదలైంది.మునసబులంతా కలసి అక్కాతమ్ముళ్లని రంపదేశం నుంచి బహిష్కరించారు. రాంభూపతి కంపెనీ అధికారులకి ఫిర్యాదు చేశాడు.పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు కంపెనీ మిందారీని తమ చేతుల్లోకి తీసుకుని పిల్ల రాంభూపతి మైనార్టీ తీరే వరకు జాగ్రత్తగా కాపాడతానంది. ఈ నిర్ణయమే నాలుగేళ్ల తరువాత చినికిచినికి గాలివానై ఫితూరీ దాకా వెళ్లింది. 
మరిన్ని వార్తలు