ఆకుపచ్చ సూర్యదయం

24 Jun, 2017 23:49 IST|Sakshi
ఆకుపచ్చ సూర్యదయం

నర్సీపట్నం డీఎస్పీ కార్యాలయం. కొన్ని నిమిషాలలోనే మొదలుకాబోతున్న ఆ సమావేశం ఎంత కీలకమైనదో తలుచుకుంటేనే గుబులు రేగుతోంది. వస్తున్నవాడు– మద్రాస్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో దేశీయ వ్యవహారాల విభాగం సభ్యుడు కల్నల్‌ ఎ.ఆర్‌.కె. నాప్‌. దామనపల్లి ఘటన జరిగిన సరిగ్గా వారానికే ప్రత్యేకంగా ప్రభుత్వం పంపించింది. ఒక టేబుల్, కుర్చీ; వాటికి ఎదురుగా పదిహేను వరకు కుర్చీలు వేసి ఉంచారు. అడ్డతీగెల నుంచి ఈవ్‌లింగ్‌; కొయ్యూరు నుంచి డాసన్‌; కృష్ణదేవిపేట నుంచి ఫర్బీస్, అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌  కీనే; గుర్తేడు నుంచి హ్యూమ్‌; పెద్దవలస నుంచి సాండర్స్‌; గూడెం నుంచి టాల్బట్, చాడ్విక్‌; లంబసింగి నుంచి మార్టిన్‌–ఇలా ముఖ్యమైన పోలీసు అధికారులంతా వచ్చారు.కవర్డ్, హైటర్‌ల కాల్చివేత సమాచారంతో మరునాడే, అంటే 25వ తేదీన చేరిన టెలిగ్రామ్‌ ఫోర్ట్‌ సెయింట్‌ జార్ట్‌ని కలవరపరచింది. కీలక నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చిందని అర్థమైంది. వేసవికని ఊటీ వెళ్లిన గవర్నర్‌ విల్లింగ్డన్‌ ఇంకా అక్కడే ఉన్నాడు. ఆ టెలిగ్రామ్‌ పట్టుకుని 26వ తేదీనే హుటాహుటిన వెళ్లి, విల్లింగ్డన్‌తో చర్చించి, వెంటనే నర్సీపట్నం బయలుదేరాడు. వెంట మద్రాసు డిప్యూటీ పోలీసు కమిషనర్‌ ఎ.జె.హెపెల్‌ ఉన్నాడు.

ఉదయం పది గంటలకి సమావేశం. కవర్డ్, హైటర్‌ల సమాధులకి సెల్యూట్‌ చేసి, ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా గడియారం గంట కొట్టగానే ప్రహారీ లోపలకి అడుగుపెట్టాడు కల్నర్‌ నాప్‌.విశాఖ జిల్లా కలెక్టర్‌ సి.ఎ. హ్యాండర్సన్, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆర్మిటేజ్, ఏజెన్సీ కమిషనర్‌ స్టీవర్డ్స్‌ సెల్యూట్‌ చేసి లోపలికి తీసుకువచ్చారు కల్నల్‌ నాప్‌నీ, హెపెల్‌నీ.కల్నల్‌ నాప్‌ ఆరున్నర అడుగుల మనిషి. నోటిలో ఎబొనీ చర్చ్‌వార్డెన్‌ టుబాకో పైప్‌. దాని నల్లటి బౌల్‌ చూడ ముచ్చటగా, చక్కగా ఉంది. లోపలికి రాగానే అధికారులంతా సెల్యూట్‌ చేశారు.
అందరినీ పరిచయం చేశాడు ఆర్మిటేజ్‌.

అధ్యక్ష స్థానంలో కూర్చుని, పైప్‌ గట్టిగా పీల్చి చాంబర్‌ లోపల బూడిదని యాష్‌ట్రేలోకి పోసి పక్కన పెట్టాడు పైప్‌. అప్పుడే అందరి కేసి చూస్తూ, చిన్నగా నవ్వుతూ అన్నాడు నాప్‌.‘‘ఈ శిలారూపాలేమిటి నాముందు? మామూలుగా కూర్చోండి!’’ అన్నాడు. కాస్త ఊపిరి తీసుకున్నారంతా. ఒక నిమిషం తరుéత మళ్లీ నాప్‌ అన్నాడు– ‘‘గాయాలు ఎలా ఉన్నాయి!’’ ‘‘తగ్గిపోయినట్టే సార్‌!’’ అన్నాడు ఆర్మిటేజ్, చటుక్కున.‘‘గాలింపు ఆపేసి.. వారమైంది. ఎందుకు తగ్గవు!’’ అన్నాడు అంతే వేగంగా, నాప్‌.కంగుతిన్నారు అక్కడ కూర్చున్నవాళ్లు. ‘‘స్టీవర్డ్స్‌! ఇప్పటిదాకా ఏం జరిగింది? ఎలా జరిగింది? ’’ అడిగాడు నాప్‌. చింతపల్లి స్టేషన్‌ మీద దాడి దగ్గర నుంచి దామనపల్లి దాడి వరకు అంతా వివరించాడతడు.‘‘సరిగ్గా ఒక్క నెల.... ఐదు ఘటనలు. ఒక్కచోట కూడా నిరోధించలేకపోయారా?’’ అన్నాడు నాప్‌. అందరూ మౌనంగా ఉండిపోయారు.

‘‘లంబసింగి రోడ్డు పనిలో జరిగిన హింసే కారణమట. నిజమా?’’ అడిగాడు నాప్‌.‘‘గూడెం డిప్యూటీ తహసీల్దారు బాస్టియన్‌ రాక్షసుడిలాగా ప్రవర్తించాడని చెబుతారు.’’ అన్నాడు ఆర్మిటేజ్‌.‘‘అందుకే తిరుగుబాటుదారుడిలో దేవుణ్ణి చూశారా వీళ్లు?’’ నవ్వుతూ అడిగాడు నాప్‌.‘‘అసలు ఈ రగడని అణచడానికి తిరుగుబాటుదారులకున్న ఈ ఒక్క బలహీనత చాలు. ఆ దేవుడే వీళ్లని రక్షిస్తాడట, విల్లూ బాణాలూ పట్టుకుని.....’’ అన్నాడు కీనే.అతడి కేసి తీక్షణంగా చూసేసరికి, ఠక్కున నోర్మూశాడు కీనే. నాప్‌ అడిగాడు ‘‘గ్రేట్‌వార్‌లో పనిచేశావా?’’.

‘‘లేదు, వెళ్లలేదు.’’ అన్నాడు కీనే.
‘‘పోనీలే. చూడు కీనే. ఈ కొండవాళ్లు రామరాజుని దేవుడనుకుంటూ బాణాలూ, విల్లులూ పట్టుకుని వాళ్లే యుద్ధం చేస్తున్నారు. మనమైతే దేవుళ్ల చేతే యుద్ధం చేయించాం! మోన్స్‌ యుద్ధం అదే. మనం మిషనరీ వాళ్లల్లా ఆలోచించకూడదు. మిలట్రీవాళ్లలా వ్యవహరించాలి. భౌతిక ప్రపంచంలో దైవభావన ఒక శూన్యం. అదే మనసు దాకా వెళితే తుపాను. వాళ్లందరిని అడుగులో అడుగు వేసి నడిపిస్తున్నదీ దైవభావనే.’’ అన్నాడు నాప్‌. ‘‘చాటు నుంచి యుద్ధం చేస్తాడు. అదే ఇబ్బంది.’’ అన్నాడు సాండర్స్‌ విషయం మారుస్తూ.‘‘కాబట్టి, మనం ఎలాంటి యుద్ధం చేస్తున్నామో ముందు తెలుసుకోవాలి. అప్పుడు ఎలా గెలవాలో తెలుస్తుంది. సంప్రదాయ సైన్యానికి వ్యతిరేకంగా ఇర్రెగ్యులర్స్‌ చేసేదే గెరిల్లా యుద్ధం. శ్రీరామరాజు చేస్తున్నది గెరిల్లా యుద్ధమే. దీన్ని ఇద్దరు మంచి ఆఫీసర్లు చచ్చిపోయాక గుర్తించారా తీరిగ్గా?’’ తీక్షణంగానే అడిగాడు నాప్‌. ‘‘మాకూ ఇప్పుడిప్పుడే కొండలలో పోరాడటం తెలుస్తోంది. కొన్ని వారాలలోనే అణచివేస్తాం’’ అన్నాడు ఆర్మిటేజ్‌.

‘‘అంత ధీమా ఏమిటి?’’ ఒక్క నిమిషం తరువాత ప్రశ్నించాడు నాప్‌.‘‘ఎవరూ లేనప్పుడు రెండు పోలీసు స్టేషన్లు కొడితేనే వీరుడా? ఆ శ్రీరామరాజు సరిగ్గా తుపాకీ కాల్చగలడని కూడా అనుకోను.’’ అన్నాడు స్టీవర్డ్స్‌.‘‘పోనీ.... ఈ క్లిపింగ్‌ చూసి ఏమనుకోగలవో చెప్పు!’’ అంటూ హెపెల్‌ వైపు తిరిగి, ‘‘మద్రాస్‌ మెయిల్‌ క్లిపింగ్‌ ఇటియ్యి!’’ అన్నాడు నాప్‌. బ్రౌన్‌ రంగు దళసరి కాగితం మీద అతికించి ఉంది క్లిప్పింగ్‌.పోలీసు స్టేషన్లను దోచుకున్న తరువాత మద్రాస్‌ మెయిల్‌ పత్రిక ప్రచురించిన చిన్న కథనం.ఆ క్లిపింగ్‌ స్టీవర్డ్స్‌కు అందిస్తూ ‘‘చదువు, అందరికీ వినిపించేలా!’’ అన్నాడు నాప్‌.చదవడం మొదలుపెట్టాడు స్టీవర్డ్స్‌.‘‘ఎవరీ యువకుడు?

‘‘విశాఖ మన్యం, రంప ప్రాంతంలో తిరుగుబాట్లు చేస్తున్న ఈ క్షత్రియ యువకుడు గోదావరి ప్రాంతం వాడు. ఇతడికి తుపాకీ కాల్చడం వచ్చు. ఒక రిటైర్డ్‌ పోలీసు దగ్గర నేర్చుకున్నాడని తెలుస్తోంది. గ్రేట్‌వార్‌ కాలంలో ఇతడు ఎక్కడ ఉన్నదీ ఇప్పటికీ అంతుపట్టని విషయమే. జర్మనీ సాయంతో ఇంగ్లండ్‌ ఆధిపత్యాన్ని కూలదోయవచ్చునని గట్టిగా నమ్మే సంస్థలతో ఇతడికి సంబంధాలు ఉన్నాయి. ప్రపంచ యుద్ధంలో పాల్గొనే ఉద్దేశంతో పోరాడేందుకు తర్ఫీదు పొందాడని చెప్పే కొన్ని ఆధారాలు కూడా దొరుకుతున్నాయి......’’‘‘చాలు!’’ అని చెప్పి, అందర్నీ చూస్తూ అన్నాడు నాప్‌ ‘‘ నేనిచ్చే సలహా ఒకటుంది– మనకి ప్రపంచ యుద్ధజ్వరం వదలాలి.’’.అందరి ముఖాలలో కత్తి వేటుకు నెత్తురు చుక్క లేదు. మళ్లీ తనే అన్నాడు నాప్, ‘‘స్టీవర్డ్స్‌! కీనే! కొండలలో పోరాడటం తెలిసిన బలగాలు కావాలని మీరు ఇచ్చిన నివేదిక సరైనదేనని ప్రభుత్వం నమ్ముతోంది. తర్ఫీదు లేని జిల్లా పోలీసులను తొందరపడి ఈ పనికి వినియోగించారు. ఇది మీ తప్పిదం.’’ అంటూ ఒక నిమిషం ఆగాడు నాప్‌.‘‘సరే, ముందు ఈ తిరుగుబాటును అణచాలి. అదే మొదటి కర్తవ్యం. వినండి!’’ అంటూ చెప్పాడు నాప్‌.

‘‘శ్రీరామరాజుతో సహా మొత్తం ఆ ఎనభయ్‌ మందికి ఎవరూ సాయం చేయరాదని ప్రచారం చేయించాలి. తిరుగుబాటుదారులకు సాయం చేస్తే రాజద్రోహమవుతుందన్న సంగతీ, శిక్ష చాలా తీవ్రంగా ఉంటుందన్న సంగతీ ఎంత తొందరగా ప్రజలు గ్రహించగలిగేటట్టు చేస్తే అంత మంచిది. మోప్లా తిరుగుబాటు అణచివేత కోసం ఏర్పాటు చేసిన మలబారు దళాలు అక్టోబర్‌కల్లా ఇక్కడుంటాయి. సాయపడిన గ్రామాల మీద అపరాధ రుసుం విధించండి. గాలింపులతో ఉక్కిరిబిక్కిరి చేయండి! పూనాలో ఉన్న సదరన్‌ కమాండ్‌ సైనిక కేంద్రంతో íß జ్‌ ఎక్స్‌లెన్సీ గవర్నర్‌ వారు చర్చిస్తున్నారు.

 వైర్‌లెస్‌ సెట్లు కూడా అందుబాటులోకి వస్తాయి. తిరుగుబాటు కేసులనే విచారించడానికి విశాఖపట్నంలోఎల్‌.హెచ్‌. ఆరంట్‌ జడ్జిగా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నాం. మద్రాసు డిప్యూటీ పోలీసు కమిషనర్‌గా ఉన్న ఏజే హెపెల్‌ను ఏజెన్సీ కమాండర్‌ ఆపరేషన్స్‌ హోదాలో నియమించారు. మీరు ఆరోగ్యం గురించి, గాయాల గురించి ఇంక భయపడక్కరలేదు. ఆస్పత్రి సౌకర్యం పెంచారు.’’టేబుల్‌ మీద పెట్టిన పైప్‌ తీసుకుని జేబులో పెట్టుకుంటూ చివరిగా అన్నాడు నాప్‌. ‘‘భయం... భయం సృష్టించండి! భయపెట్టడంతోటే సగం విజయం సాధించాలి. వీళ్లు చచ్చిపోవాలి భయంతో.’’
2
‘‘రాజమండ్రి వెళ్లి, సెంట్రల్‌ జైలు మీద దాడి చేస్తాడా రామరాజు!? చేయగలడా అని!’’ అన్నాడు విశాఖ ఏజెన్సీ కమిషనర్‌ స్టీవర్ట్‌. ‘‘అంత సాహసం కొండదళానికి ఉందని నేనైతే అనుకోను!’’ తాపీగా అన్నాడు ఏజెన్సీ డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ సాండర్స్‌.  అంతలోనే పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆర్మిటేజ్‌ కంఠం కంగుమంది. ‘‘ఆ ఖాకీ యూనిఫారాలు విప్పదీసి గోచీలు పెట్టుకోండి! అలా మాట్టాడ్డానికి సిగ్గులేదూ! ఆ పృథ్వీసింగ్‌ ఆజాద్‌ ఒక టెర్రరిస్టు. వాడిని ఆ కొండదళం విడిపించుకుపోయే కుట్రతో ఉంది అంటుంటే మీకు బుర్రకెక్కదేం?’’ కుర్చీలో నుంచి లేచి పై కప్పు ఎగిరిపోయేటట్టు అరిచాడు ఆర్మిటేజ్‌. ఆర్మిటేజ్‌లో అంత అసహనం చూడటం అదే మొదటిసారి. విశాఖపట్నం నుంచి ఆ ఉదయమే ఆగమేఘాల మీద వచ్చి చేరుకున్నాడు.

 ఆ ముందు రాత్రే స్టీవర్ట్, సాండర్స్, మార్టిన్, కోల్‌బ్రూక్, హ్యూమ్, ఫోర్బ్స్, స్వేనీ, కీనే, జాన్‌లకి వైర్‌లెస్‌ సమాచారం చేరింది. అంతా ఉదయం పదకొండు గంటలకల్లా లంబసింగిలో గప్పీదొర బంగ్లాకి చేరుకున్నారు. తెల్లజాతి అధికారులని తప్ప మరెవరినీ పిలవలేదు.రాజమండ్రి సెంట్రల్‌ జైలు మీద దాడి చేస్తానని శపథం చేశాడట రామరాజు. ఆ జైలులో బందీగా ఉన్న గదర్‌ పార్టీ నాయకుడు పృథ్వీసింగ్‌ ఆజాద్‌ను విడిపించుకుని వెళతాడట.

దాదాపు తొమ్మిదేళ్ల క్రితం కెనడా, అమెరికా దేశాలలో ఉన్న భారతీయులు స్థాపించిన విప్లవ సంస్థ – గదర్‌ పార్టీ. గదర్‌ అంటేనే పంజాబీ భాషలో విప్లవం అని. ‘‘రాజమండ్రిలో పృథ్వీసింగ్‌ని విడిపించడమంటే, రాజవొమ్మంగిలో వీరయ్యదొరని విడిపించడం వంటిదేననుకుంటున్నారా?  రాజమండ్రి జైల్లోనే చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. గదర్‌ పత్రిక ఎడిటర్‌ జగత్‌రామ్‌ భరద్వాజ్‌ కూడా ఆ జైల్లోనే ఉన్నాడు. ఇందరు ఉండగా రామరాజు పృథ్వీసింగ్‌ని విడుదల చేయబోతున్నాడన్న మాట ఎందుకు వచ్చింది? వీరయ్య ముసలి డేగ. పృథ్వీసింగ్‌ మానవ రక్తం రుచి మరిగిన నడివయసు పులి.’’ మళ్లీ అన్నాడు ఆర్మిటేజ్‌.

హెపెల్‌ కలగజేసుకుని పరిస్థితిని సర్దుబాటు చేయడానికి ప్రయత్నించాడు. ‘‘మిస్టర్‌ ఆర్మిటేజ్‌! ఇది జరగనివ్వకూడదు. అందుకు ఎంత ప్రయత్నం అవసరమో అంత ప్రయత్నమూ మేం చేస్తాం. మొదట దేవీపట్నం దగ్గర నిఘా పెంచుదాం. రాజమండ్రిలో జైలు దగ్గర సిపాయీలే కాపలా ఉన్నారని మీకు ముందే సమాచారం అందింది.’’ అన్నాడు.‘‘రాజమండ్రి నుంచి తొందరలోనే వాడినీ, ఆ గదర్‌ పార్టీ వాళ్లనీ నాగపూర్‌ జైలుకి తీసుకుపోతారని విన్నాను. అప్పటిదాకా వేయి కళ్లతో కాపలా కాసుకోవాలి. ’’అన్నాడు ఆర్మిటేజ్‌.
 3

‘‘మలబారు పటాలాలు వస్తున్నాయని తెలిసి, ఇలా గూడెం కొండలు వదిలిపెట్టి రంప వైపు వస్తోందంటావా, కొండదళం?’’ ఆందోళనగా అన్నాడు జి.టి.హెచ్‌. బ్రేకన్, గోదావరి జిల్లా కలెక్టర్‌.‘‘రామరాజు కదలికలు అంతుపట్టకుండా ఉన్నాయి కదా !’’ బ్రేకన్‌ కంగారును ఇంకాస్త పెంచే మాట అన్నాడు రంపచోడవరం తహసీల్దారు దంతుర్తి అప్పలనర్సయ్య పంతులు. అడ్డతీగలకు ఐదు మైళ్ల దూరంలో ఉన్న తిమ్మాపురం ప్రభుత్వ అతిథి గృహంలో బస చేశాడు బ్రేకన్‌. చీకట్లు పడుతున్న వేళ పంతులుని అక్కడికే రప్పించాడు.

‘‘సరే, ఆ ఇంటెలిజెన్స్‌ ఎస్‌ఐ పేరేమిటన్నావ్‌!’’ అడిగాడు బ్రేకన్, విసుగ్గా.‘‘సదావర్తి ఆదినారాయణ!’’ చెప్పాడు అప్పలనర్సయ్య.  ఏం చెప్పాడు?’’ మళ్లీ అడిగాడు బ్రేకన్‌.‘‘శ్రీరామరాజు చెప్పిందే – పైడిపుట్టకు వెళతాను. అక్కడ పంచాంగం చూసి, ముహూర్తం పెట్టి అడ్డతీగలకు గానీ, రంపచోడవరం గానీ వెళతాను. ఈ విషయం మీద మీ అధికారులకి రిపోర్టు ఇవ్వు!– ఇదే దొరవారు.’’ అక్షరం అక్షరం ఒత్తి పలుకుతూ చెప్పాడు పంతులు. ‘‘నువ్వేం చెప్పావు వాడికి?’’ ఆత్రంగా అడిగాడు బ్రేకన్‌.‘‘అడ్డతీగలా? రంపచోడవరమా? అది కూడా తెలుసుకుని వచ్చి చెప్పమన్నాను.’’ అన్నాడు పంతులు.

‘‘ఏమైనా చెప్పాడా?’’ అడిగాడు బ్రేకన్‌.‘‘అడ్డతీగలకే వెళతానని........!’’ అన్నాడు పంతులు.
‘‘ఇదెవరు చెప్పారు?’’ బ్రేకన్‌ అడిగాడు.‘‘రామరాజే చెప్పాడు, ఆదినారాయణకి.’’వాక్యం పూర్తి చేశాడు పంతులు.‘‘ఏమిటి? ఆ ఇంటెలిజెన్స్‌ వాడు నేరుగా రామరాజునే అడిగి వచ్చాడా? ఏ పోలీసు స్టేషన్‌ కొడతారు బాబూ అని నేరుగా తిరుగుబాటుదారుడినే అడుగుతారా? తలకాయ ఉందా?’’ మండిపడ్డాడు బ్రేకన్‌. అసలు వారంరోజుల నుంచి విచ్చల విడిగా తిరుగుతోంది కొండదళం. పూనాలోని దక్షిణ కమాండ్‌ నుంచి వైర్‌లెస్‌ సెట్లు వచ్చాయి. హీలియో దీపాలు వచ్చాయి. అయినా కొండదళాన్ని నిరోధించే ప్రయత్నం చేయలేకపోతోంది యంత్రాంగం. ‘‘సార్‌! ఊరి బారిక మిమ్మల్ని కలవాలంటున్నాడు!’’ కంగారు పడుతూ వచ్చి చెప్పాడు క్యాంప్‌ క్లర్క్‌.

‘‘మతి పోతోందా? బారిక నన్ను కలవడం ఏమిటి? సంగతేమిటో కనుక్కుని పంపెయ్‌!’’ అసలే చికాకులో ఉన్న బ్రేకన్‌ గట్టిగా అరిచేశాడు.‘‘సార్‌! శ్రీరామరాజు పంపించాడట! ఏదో మీకే చెప్పాలట.’’ బ్రేకన్‌ అరుపులతో బెంబేలెత్తిపోయిన క్యాంప్‌ క్లర్క్‌ అసలు విషయం చెప్పాడు.‘‘రామరాజు దగ్గర నుంచి నాకు కబురా? తీసుకురా!’’ అన్నాడు బ్రేకన్‌.బారిక లోపలికి వచ్చి వంగి వంగి దండాలు పెట్టి చిన్న చీటీ అందించాడు వినయంగా.మడత విప్పి చూశాడు బ్రేకన్‌. ఇంగ్లిష్‌లో ఉంది.కలెక్టర్‌ బ్రేకన్‌కి!‘‘నేను అడ్డతీగలకు రెండు మైళ్ల దూరంలోనే ఉన్నాను. పోలీసు స్టేషన్‌ని కొడతాను. రేపు మధ్యాహ్నం, అంటే అక్టోబర్‌ 16, 1922 మధ్యాహ్నం వరకు పైడిపుట్టలో ఉంటాను. తలపడటానికైనా రావచ్చు. మాట్లాడటానికైనా రావచ్చు.
– అల్లూరి శ్రీరామరాజు. ’’

హఠాత్తుగా తుపాకులు పేలాయి, అడ్డతీగల పొలిమేరలలో.
బలగాలని తరలించుకోవడానికి వైరిపక్షానికి చాలినంత అవకాశం ఇస్తున్న తీరులో రాత్రి పదిగంటల వేళ శ్రీరామరాజు తన దళంతో అడ్డతీగలలో అడుగుపెట్టాడు. దాదాపు తొంభయ్‌ మంది ఉన్నారు. ఆ విషయాన్ని ప్రకటిస్తూనే తుపాకులు మోగాయి. పది నిమిషాలలోనే పోలీస్‌ స్టేషన్‌ ముందుకు వచ్చింది కొండదళం.  మళ్లీ పేలాయి తుపాకులు.స్టేషన్‌ విడిచి పారిపోయారు పోలీసులు. వాళ్ల వెంటే ఇద్దరు రిజర్వు పోలీసులు వెళ్లిపోయారు. ‘‘లోపల వెతకవలసిన అవసరం లేదు.’’ అన్నాడు రామరాజు.డబ్బయ్‌ మైళ్లు నడిచి డస్సి పోయి ఉన్నారు సభ్యులు. అంతా గబగబా మూటలు విప్పుకుని అన్నం తిని స్టేషన్‌ అరుగు మీదే గొంగళ్లు కప్పుకుని నిద్రకి ఉపక్రమించారు.
 4
 అడ్డతీగల పోలీస్‌ స్టేషన్‌ మీద దాడి చేసిన నాలుగో రోజే....అంటే అక్టోబర్‌ 19వ తేదీ..... తెలతెలవారుతుండగా శ్రీరామరాజు దళం రంపచోడవరంలో ప్రవేశించింది. మూడువందల మంది ఉన్నారు వెంట.ఊరికి మూడుమైళ్ల దూరంలో ఉన్న జలపాతం దగ్గర మొదట ఆగాడు రామరాజు. దట్టమైన అడవి. ఎర్రటి వేకువ వెలుతురును పచ్చటి ప్రతి ఆకు నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఆస్వాదిస్తున్నట్టే ఉంది. ఎక్కడో, ఏదో శాఖ మీద పక్షి గొంతెత్తిందప్పుడు. ఒక లిప్త తరువాత దానికి జవాబుగా మరో పక్షి గొంతు పలికింది.

ఒక జలపాతం కిందే స్నానం చేశాడు రామరాజు. అక్కడికి కొద్దిదూరంలోనే ఉంది మడుగుమల్లేశ్వరస్వామి ఆలయం. అక్కడికి కూడా వెళ్లి విభూతి నుదుట రాసుకున్నాడు. అంత దాకా ఓపికగా వేచి ఉన్న ఒక స్థానికుడు కాగబెట్టిన ఆవుపాల చెంబు అందించాడు భక్తిగా. ముందు చెప్పిన ప్రకారం ఎర్రేసు, మల్లుదొర వెళ్లి రంపచోడవరం తహసీల్దారు అప్పలనర్సయ్య పంతులును తీసుకుని వచ్చారు. ఎర్రని ఖద్దరు నిక్కరు, దాని మీద ఎర్రటి ఖద్దరు లాల్చీ ధరించి ఉన్నాడు రామరాజు. కాళ్లకి పోలీసు బూట్లు. పైన ఒక నల్లటి గొంగడి కప్పుకుని ఉన్నాడు. మెడలో పోలీసులు తగిలించుకునే తూటాల క్రాస్‌బెల్ట్‌ ఉన్నట్టు అర్థమవుతోంది.‘‘నమస్కారం తహసీల్దారు గారు!’’ అన్నాడు రామరాజు నవ్వుతూ.

‘‘ఎలా ఉన్నారు మీరు? పైడిపుట్ట నుంచి వెళ్లాక మళ్లీ ఇదే మిమ్మల్ని చూడటం. నిజంగా చాలా సంతోషం రామరాజుగారు!’’ రెండు చేతులు పట్టుకుని అన్నాడు పంతులు. అక్కడ, అడ్డతీగల పోలీసు స్టేషన్‌లోను ఇద్దరికీ బాగా పరిచయం.‘‘మీరు ఉత్తములు. నిజాయితీపరులు. ఆ తెల్లజాతికి వాస్తవాలు చెప్పకూడదా!’’ సలహా ఇస్తున్నట్టే అన్నాడు రాజు.‘‘నా ఉద్యోగం ఉండాలా?’’ నవ్వుతూ అన్నాడు పంతులు.‘‘బ్రిటిష్‌ వాళ్లని పంపేశాక గాంధీగారు మీ ఉద్యోగం మళ్లీ మీకే ఇస్తారులెండి!’’ నవ్వుతూనే బదులిచ్చాడు రామరాజు.‘‘నిన్న జాన్‌ సేనాని వచ్చాడట కదా!’’ అడిగాడు రామరాజు.

మరిన్ని వార్తలు