కరోనా వైరస్‌ సోకకుండా...

23 Feb, 2020 10:32 IST|Sakshi

సందేహం

కరోనా వైరస్‌ సోకకుండా గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రయాణాలు చేయవచ్చా?
– కె.తేజస్విని, మంచిర్యాల
కరోనా వైరస్‌ – ఇతర ఫ్లూ వైరస్‌లాగానే ఇది కూడా ముక్కు, గొంతు, శ్వాసకోశనాళాలను, ఊపిరితిత్తులకు సోకి, వాటిపై ప్రభావం చూపి జలుబు, దగ్గు, తలనొప్పిలాంటి లక్షణాలను కలిగిస్తుంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, రోగనిరోధక శక్తిని బట్టి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరిలో వారం పది రోజుల్లో ఈ లక్షణాలు వాటంతట అవే తగ్గిపోతాయి. కొందరిలో ఈ వైరస్‌ ఊపిరితిత్తులకు సోకుతుంది. దాని ఇన్ఫెక్షన్‌ వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరి, ఊపిరితిత్తుల పనితీరు తగ్గిపోవడం వల్ల ఆయాసం, ఊపిరి ఆడకపోవడం, మిగిలిన అవయవాలకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోయి పరిస్థితి ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయి. కరోనా వైరస్‌ ముఖ్యంగా వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా పనిచేసే తెల్ల రక్తకణాలపై ప్రభావం వాటిని నశింపజేస్తుంది. దీనివల్ల ఇతరత్రా రోగకారక క్రిములు శరీరంలోకి చేరి, ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి.

దీనివల్ల వ్యాధి లక్షణాల తీవ్రత పెరిగి ప్రాణాపాయం ఏర్పడవచ్చు. కరోనా వైరస్‌ మొదట జంతువుల నుంచి మనిషికి చేరింది. ఇప్పుడు మనిషి నుంచి మనిషికి దగ్గు, తుమ్ము, జలుబు నుంచి వెలువడే స్రావాల నుంచి కరోనా వైరస్‌ వ్యాపిస్తుంది. మొదట ఇది చైనాలోని ఫుహాన్‌ అనే ప్రాంతంలో కొన్ని జంతువుల నుంచి మనుషులకు సోకింది. అక్కడి నుంచి ప్రయాణించి భారతదేశానికి వచ్చిన వారి వల్ల భారతదేశంలో ఉన్నవారికి కూడా ఇప్పుడిప్పుడే ఈ వైరస్‌ సోకుతోంది. మామూలు వాళ్లతో పోల్చితే గర్భిణుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీనివల్ల వీరికి ఏ వైరస్‌ అయినా తొందరగా సోకుతుంది. కరోనా వైరస్‌ కూడా వీరికి తొందరగా సోకే అవకాశాలు ఎక్కువ. (కోవిడ్‌-19 : కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు!)

కరోనా వైరస్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
రద్దీగా ఉన్న ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లకుండా ఉండటం, వెళ్లాల్సి వస్తే నోటికి, ముక్కుకు మాస్క్‌ ధరించడం, జలుబు, దగ్గు ఉన్నవారికి కనీసం మూడు మీటర్లు దూరంగా ఉండటం, వీలైనంత వరకు వారు తాకకుండా చూసుకోవడం ముఖ్యం. తినే ముందు ఎప్పుడూ చేతులను ముప్పయి సెకన్ల పాటు సబ్బుతో రుద్దుకుని శుభ్రం చేసుకోవడం, నీళ్లు లేని చోట ఆల్కహాల్‌ ఉన్న హ్యాండ్‌ శానిటైజర్‌తో చేతులను ముప్పయి సెకన్ల పాటు తుడుచుకోవడం ముఖ్యం. జలుబు, దగ్గు ఉన్నవారి వస్తువులను వాడకపోవడం మంచిది. ఒకవేళ వాటిని తాకితే వెంటనే చేతులను శుభ్రపరచుకోవాలి. ఇన్ఫెక్షన్లు ఉన్నవారితో కరచాలనం, హగ్గింగ్‌ చేయకపోవడం మంచిది. మాంసాహారాన్ని బాగా శుభ్రపరచి, బాగా ఉడికిన తర్వాత మాత్రమే తినాలి. ఈ జాగ్రత్తల వల్ల కరోనా వైరస్‌ మాత్రమే కాకుండా స్వైన్‌ ఫ్లూ వంటి ఇతరత్రా ఫ్లూ వైరస్‌లు సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే మితమైన పోషకాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి బాగుంటుంది.

మా పిన్ని కూతురుకు బాబు పుట్టాడు. అయితే పిల్లాడికి ‘డౌన్స్‌ సిండ్రోమ్‌’ అని చెబుతున్నారు. ఈ సిండ్రోమ్‌ గురించి వినడం ఇదే మొదటిసారి. దీని గురించి వివరంగా తెలియజేయగలరు. ఈ సిండ్రోమ్‌ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు?
– డి.సౌందర్య, విజయవాడ

సాధారణంగా తండ్రి వీర్యకణం నుంచి 23 క్రోమోజోమ్‌లు, తల్లి అండం నుంచి 23 క్రోమోజోమ్‌లు కలిసి బిడ్డలో 23 జతల– అంటే 46 క్రోమోజోమ్‌లు ఏర్పడతాయి. కొందరిలో వీర్యకణం, అండం ఫలదీకరణ జరిగే సమయంలో 21వ క్రోమోజోమ్‌ వద్ద ఒక జత బదులుగా ఇంకో క్రోమోజోమ్‌ అదనంగా కలుస్తుంది. దీనినే ‘ట్రైజోమ్‌’ లేదా డౌన్స్‌ సిండ్రోమ్‌ అంటారు. తల్లి వయసు 35 ఏళ్లు దాటినట్లయితే పుట్టబోయే బిడ్డకు డౌన్స్‌ సిండ్రోమ్‌ వచ్చే అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటాయి. డౌన్స్‌ సిండ్రోమ్‌ ఉన్న శిశువులో ముఖ కవళికలు తేడాగా ఉండటం, ముక్కులో ఉండే ఎముక లేకుండా ముక్కు చప్పిడిగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. వీరిలో గుండెలో రంధ్రాలు, గుండెకు సంబంధించిన సమస్యలు, కిడ్నీలో వాపులు, మెదడు పనితీరు సరిగా లేకపోవడం, మానసిక ఎదుగుదల లేకపోవడం వల్ల బుద్ధిమాంద్యం, వినికిడి లోపాలు వంటి అనేక సమస్యలు ఉంటాయి.

డౌన్స్‌ సిండ్రోమ్‌తో పుట్టిన పిల్లలను తల్లిదండ్రులు చాలా ఓర్పుగా పెంచుకోవలసి ఉంటుంది. ఇది రాకుండా తీసుకునే జాగ్రత్తలంటూ ఏమీ లేవు. కాకపోతే ముందుగానే గుర్తించడానికి తల్లి గర్భంతో ఉన్నప్పుడు మూడో నెల చివర్లో ఎన్‌టీ స్కాన్, డబుల్‌ మార్కర్‌ టెస్ట్‌ అనే రక్తపరీక్ష లేదా ఐదో నెలలో ‘టిఫా’ స్కాన్‌తో పాటు క్వాడ్రుపుల్‌ టెస్ట్‌ వంటి పరీక్షలు చేయించుకోవడం వల్ల డౌన్స్‌ సిండ్రోమ్‌ ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలుస్తుంది. ఈ పరీక్షల్లో లోరిస్క్‌ అని వస్తే డౌన్స్‌ సిండ్రోమ్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు, హైరిస్క్‌ అని వస్తే ఎక్కువగా ఉన్నట్లు లెక్క. 

డౌన్స్‌ సిండ్రోమ్‌ మూడో నెల చివర్లో కొరియానిక్‌ విల్లి బయాప్సీ లేదా ఐదో నెలలో ఆమ్‌కియో సెంటెసిస్‌ అని ఉమ్మనీరు పరీక్ష చేయించుకోవలసి ఉంటుంది. కాకపోతే ఈ పరీక్షలు చేయించుకునేటప్పుడు నూటికొకరికి అబార్షన్‌ జరిగే అవకాశాలు ఉంటాయి. డౌన్స్‌ సిండ్రోమ్‌ నిర్ధారణ అయిన తర్వాత చికిత్స అంటూ ఏమీ ఉండదు. ఇది ముందుగా తెలుసుకోవడం వల్ల చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల పెంపకం జీవితాంతం భారం కావడం వల్ల అబార్షన్లు చేయించుకుంటారు. కొంతమంది ఎలా ఉన్నా పెంచుకోవాలనుకుని గర్భాన్ని ఉంచేసుకుని, బిడ్డను చూసుకోవడానికి మానసికంగా సన్నద్ధమవుతారు.
- డా. వేనాటి శోభ, బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో, హైదర్‌నగర్‌, హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు