హ్యాపీనెస్ తమన్నా

17 May, 2015 04:02 IST|Sakshi
హ్యాపీనెస్ తమన్నా

ఇంటర్వ్యూ
హిందీలో తమన్నా అంటే కోరిక అని అర్థం. మన తమన్నాకి హ్యాపీగా ఉండాలనేదే కోరిక. హ్యాపీనెస్... శాడ్‌నెస్... ఈ రెండింటికీ కాంపిటీషన్ పెడితే గెలుపు ‘శాడ్‌నెస్’దే.ఎందుకంటే - గెలిచిన క్షణాలు కొద్దిసేపే. బాధ... చాలాకాలం వెంటాడుతూనే ఉంటుంది. అయితే, హ్యాపీనెస్ వేల్యూ హ్యాపీనెస్‌దే. అందుకే తన ఓటు ఎప్పుడూ హ్యాపీనెస్‌కే అంటున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. తమన్నాకు ‘సాక్షి’ ఫోన్ చేస్తే, హ్యాపీగా ఆమె చెప్పిన ముచ్చట్లు...
 
హలో తమన్నా.. హౌ ఆర్ యు?
చాలా బాగున్నానండీ.

ఒకవైపు సినిమాలు... మరోవైపు ‘వైట్ అండ్ గోల్డ్’ జ్యువెలరీ బిజినెస్‌తో బిజీగా ఉన్నట్లున్నారు?
 అవును. ఫుల్ బిజీ. క్షణం తీరిక లేక లేదు. అయినా హ్యాపీ.
     
ఈ ఫోన్ చేసింది ఎందుకో తెలుసా? హ్యాపీనెస్ గురించి మాట్లాడుకోవడానికి. హ్యాపీనెస్ గురించి ఏం చెబుతారు?
జీవితంలో ప్రతి ఒక్కరికీ కావాల్సిన అంశం ఇది. ఎవరి జీవితంలో ఇది సంపూర్ణంగా ఉంటుందో వాళ్లు అదృష్టవంతులు.
     
మరి.. మీ సంగతేంటి?
నేనూ అదృష్టవంతురాల్నే. ఆల్‌మోస్ట్ హ్యాపీగా ఉంటాను. ఎప్పుడైనా కొంచెం మూడాఫ్ అయినా ఏదో ఒక హ్యాపీ మూమెంట్‌ని గుర్తుకు తెచ్చుకుని మామూలు మూడ్‌లోకి వచ్చేస్తా. అలా అని నేను విపరీతంగా ఆనందపడిపోను, విపరీతంగా బాధపడను. బ్యాలెన్డ్స్‌గా ఉంటా. అదే ఆరోగ్యానికి మంచిది.
     
మీ జీవితంలో ఇప్పటివరకూ మీరు బాగా ఆనందపడిన క్షణాల గురించి?
ఈ మధ్య సొంతంగా ‘వైట్ అండ్ గోల్డ్’ జ్యువెలరీ బిజినెస్ ఆరంభించినప్పుడు చాలా ఆనందపడ్డా. ఏదైనా మంచి వ్యాపారం చేయాలనేది నా చిన్నప్పటి కల. ఆ కల నెరవేర్చుకోగలిగా. మా అమ్మా, నాన్న, అన్నయ్య సహకారంతో ఈ వ్యాపారం మొదలుపెట్టా.
     
నగల వ్యాపారమే చేయాలని ఎందుకనుకున్నారు?
ఈ వ్యాపారానికి ట్రెండ్‌తో సంబంధం లేదు. పైగా డిజైనర్ జ్యువెలరీకి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఫ్యాషన్ ప్రపంచంలో వస్తున్న మార్పుల గురించి నాకు అవగాహన ఉంది. ఇది కూడా ‘క్రియేటివ్ వరల్డే’.
     
మళ్లీ హ్యాపీనెస్ గురించి మాట్లాడుకుందాం... వ్యక్తిగతంగా మర్చిపోలేని ఆనందాల గురించి?
 మా అన్నయ్య, నేను చిన్నప్పుడు ముంబయ్‌లో రాత్రిపూట ‘చాట్’ తినేవాళ్లం. పోటీ పడి పానీపూరీలు లాగించేవాళ్లం. ఎగ్ బుర్జీలు, పావ్ బాజీలు.. ఇలా ఏది పడితే అది తినేసేవాళ్లం. ఐస్‌క్రీములు తిన్న రాత్రులు ఎన్నో. ‘స్ట్రీట్ ఫుడ్’ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కాదు.. ఇప్పుడు కూడా నేనూ, అన్నయ్య రాత్రిపూట ముంబయ్‌లో హల్ చల్ చేస్తుంటాం.
     
లోలోపల బాధపడుతూ పైకి ఆనందం నటించిన సందర్భాలున్నాయా?
ఓ సంఘటన ఉంది. ఆ మధ్య మా అమ్మమ్మ చనిపోయారు. ఆ సమయానికి నేనో అవార్డు ఫంక్షన్‌లో డాన్స్ చేయాలి. ముందే అంగీకరించడం వల్ల రద్దు చేసుకోలేకపోయాను. స్టేజి మీద నవ్వుతూ డాన్స్ చేశాను. ఫంక్షన్ ముగిసేవరకూ పెదాలపై చిరునవ్వు చెరగనివ్వలేదు.
     
సెలబ్రిటీస్ అంటే ఎప్పుడూ హ్యాపీగా ఉన్నట్లే కనిపించాలి. ఒకవేళ ‘అదో రకం’గా కనిపిస్తే ఏదేదో కల్పించేస్తారు కదా?
అది వంద శాతం కరెక్ట్. పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు చిరునవ్వు చెరగనివ్వకూడదు. అసహనం అనిపించినా బయటపెట్టకూడదు. ఒకవేళ సహనం కోల్పోయి బయటపెట్టామనుకోండి... అప్పుడు ‘తమన్నా సరిగ్గా బిహేవ్ చేయదు’ అని ముద్ర వేసేస్తారు. మా ‘సహనమే మాకు శ్రీరామ రక్ష’ అని భావిస్తాను.

డబ్బుంటే ఆనందం దానంతట అదే వస్తుందంటారు.. నిజమా?
అది వాళ్ల వాళ్ల మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. డబ్బు లేకపోతే జీవితం లేదు కాబట్టి, తప్పనిసరిగా డబ్బు కావాల్సిందే. కానీ సౌకర్యవం తంగా జీవించేంత ఉంటే చాలు. అత్యాశకు పోతే అనర్థాలొస్తాయి. డబ్బుంటే ఓ భద్రతాభావం ఉంటుందని నా ఫీలింగ్. దేవుడు అందర్నీ ఐశ్వర్యవంతుల్నిచేయడు కాబట్టి, ఉన్నదాంతో తృప్తి పడితే మంచిది.

     
ఎవరైనా మీ దగ్గర ఆనందం నటిస్తే పసిగట్టగలుగుతారా?
నా సన్నిహితులు నటిస్తే పసిగట్టేస్తా. ఎందుకంటే, వాళ్ల మనస్తత్వాల మీద నాకు కొంతవరకూ ఐడియా ఉంటుంది కదా. బయటివాళ్లయితే కష్టమే.
 
ఫైనల్‌గా హ్యాపీనెస్ గురించి మీ విశ్లేషణ?
ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు. మనం ఆరోగ్యంగా ఉండటానికి కారణమయ్యే వాటిలో ‘హ్యాపీనెస్’ కూడా ఒకటి. అందుకే... వీలైనంత ఆనందంగా ఉండటానికి ట్రై చేయాలి.
 
అందరూ మీలా హ్యాపీగా ఉంటే, ‘గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ సర్వే’లో మన దేశమే ముందుండేదేమో?
అవును నిజమే (నవ్వుతూ).
- డి.జి. భవాని
కవర్ ఫొటో: శివమల్లాల

మరిన్ని వార్తలు