ప్రేమించింది... కానీ..!

6 Dec, 2015 01:53 IST|Sakshi
ప్రేమించింది... కానీ..!

క్రైమ్ ఫైల్
అక్టోబర్ 12, 2012... కెంటకీ (యు.ఎస్.)...
 రాత్రి 8:53 అయ్యింది. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఫోన్ రింగవుతోంది. ‘‘ఏయ్ సూజీ... ఫోన్ తియ్యి’’ అన్నాడు రోనాల్డ్.  ‘‘షటప్ రోనీ... పొద్దుట్నుంచీ ఎన్ని ఫోన్లు అటెండ్ అయ్యానో తెలుసా? మాట్లాడి మాట్లాడి మాట పడిపోయేలా ఉంది. రెండు వారాల నుంచి సెలవు అడుగుతుంటే ఇవ్వట్లేదు. ఇంకో రెండు రోజులు ఇలాగే పని చేస్తే ఇక నా ఇంట్లో పార్టులేవీ పని చేయవు’’... అంది సూజీ గుడ్లు తేలేస్తూ.
 
నవ్వాడు రోనాల్ట్. ‘‘నువ్వెప్పుడూ ఇంతే. నేను చూస్తాను ఉండు’’ అంటూ ఫోన్ దగ్గరకు వెళ్లబోయాడు. ఆగు అన్నట్టు చేయి చాపింది సూజీ. ‘‘ఎందుకు... నా పని కూడా నువ్వే చేస్తున్నావని బిల్డప్ ఇద్దామనా? నేనే చూస్తాలే’’ అంటూ ఫోన్ తీసింది. అవతలి నుంచి ఓ ఆడగొంతు.
 ‘‘మేడమ్... మేడమ్... నా పేరు షయానా. నేను... నేను...’’
 ‘‘ఏం జరిగింది? ఎందుకలా కంగారు పడుతున్నారు? చెప్పండి’’ అంది సూజీ కాల్ రికార్డర్ ఆన్ చేస్తూ.
 
‘‘నేను... నేను నా బాయ్‌ఫ్రెండ్ ర్యాన్‌ని చంపేశాను’’... వణుకుతున్న గొంతుతో అందామె.
 ‘‘ఏంటీ... చంపేశారా?’’
 ‘‘అవును. తను నన్ను చంపబోయాడు. నన్ను నేను కాపాడుకునే ప్రయత్నంలో నేనే తనని చంపేశాను. వెంటనే రండి’’ అంటూ గబగబా అడ్రస్ చెప్పి, మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసిందామె.
 
‘‘రోనీ... కాండో హైల్యాండ్ హైట్స్‌లో మర్డర్ జరిగిందట. సర్‌కి ఇన్‌ఫామ్ చెయ్యి’’ అరిచినట్టే చెప్పింది సూజీ. సరే అంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు రోనాల్డ్. విషయాన్ని అధికారుల చెవిన వేశాడు. వాళ్లు హుటాహుటిన బయలుదేరారు. అరగంట తిరేగసరికల్లా హైల్యాండ్ హైట్స్‌లో ఉన్నారు.
 ఆ ఇంట్లో అడుగు పెడుతుంటే రక్తపు వాసన గుప్పుమంది. అందరూ ఖర్చీఫులు తీసుకుని ముక్కులు మూసుకున్నారు.

 ‘‘షయానా... షయానా’’... పిలిచాడు ఇన్‌స్పెక్టర్.
 ‘‘ఇక్కడున్నాను సర్’’ అంది దుఃఖంతో పూడుకుపోయిన ఓ గొంతు. ఆ స్వరం వినిపించిన వైపు చూశారంతా. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంది షయానా. పోలీసులను చూస్తూనే మెల్లగా లేచి నిలబడింది.
 అందరూ అటువైపు నడిచారు. అక్కడ... డైనింగ్ టేబుల్ పక్కనే... రక్తపు మడుగులో పడివున్నాడు ర్యాన్ పోస్టన్. తుపాకీ గుండు దూసుకు వెళ్లిన గుర్తు నుదుటిపై స్పష్టంగా కనిపిస్తోంది.

ఛాతిమీద మూడు చోట్ల బుల్లెట్లు చేసిన గాయాలు ఉన్నాయి. వాటిలోంచి రక్తం ఉబికి వస్తోంది.
 ‘‘ఓ గాడ్... ఎలా జరిగింది?’’... అన్నాడు ఇన్‌స్పెక్టర్.
 అతడలా అడగడంతోనే బావురుమంది షయానా. ‘‘ఇదంతా నా వల్లే జరిగింది సర్. ఈ దారుణం చేసింది నేనే. నేనే నా ర్యాన్‌ని చంపేసుకున్నాను’’ అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది షయానా.
 
లేడీ అసిస్టెంట్ వైపు చూసి సైగ చేశాడు ఇన్‌స్పెక్టర్. ఆమె వెళ్లి షయానాను దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఆమె తేరుకున్న తర్వాత అడిగాడు ఇన్‌స్పెక్టర్... ‘‘అసలేం జరిగిందో చెబుతారా?’’
 ‘‘ర్యాన్, నేను ప్రేమించుకున్నాం సర్. కొన్నాళ్లుగా కలిసే ఉంటున్నాం. తను నా ప్రాణం. తనూ నన్ను ప్రాణంలాగే చూసుకునేవాడు. కానీ ఏమయ్యిందో ఏమో... ఈ మధ్య తనలో మార్పు వచ్చింది.

నన్ను నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు. ఏదైనా అడిగితే తిడతాడు, కొడతాడు. అన్నీ భరించాను. కానీ రాత్రి ఏకంగా చంపడానికే వచ్చాడు. తుపాకి గురిపెట్టాడు. నన్ను చంపొద్దని చేతులు పట్టుకున్నాను. అయినా వినలేదు. మీదకు రాబోయాడు. దాంతో తన చేతిలోని తుపాకీ లాక్కున్నాను. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో తెలియక ఆవేశంలో కాల్చేశాను’’... ఏడుస్తూ చెప్పింది.
 ‘‘ఊ... ఆత్మరక్షణ కోసం చేసినా నేరం నేరమే కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. దయచేసి మాతో రండి’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్. సరేనంది షయానా. మరుక్షణం ఆమె చేతికి బేడీలు పడ్డాయి.
      
క్యాంప్‌బెల్ కౌంటీ కోర్ట్...
‘‘నా క్లయింట్ నేరస్తురాలిగా బోనులో నిలబడివుంది. కానీ నిజానికి తను బాధితురాలు. ర్యాన్ పోర్టన్ కోసం తన జీవితాన్నే ఇచ్చేసింది. కానీ అతనామెను చిత్రహింసలు పెట్టాడు. వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఈమెను వదిలించుకోవడం కోసం ఏకంగా చంపేయాలని చూశాడు. అతన్నుంచి తనను తాను కాపాడుకోవడానికే నా క్లయింట్ అతణ్ని కాల్చింది తప్ప కోపంతోనే, చంపాలన్న ఉద్దేశంతోనో కాదు. కాబట్టి తనని క్షమించి వదిలి పెట్టమని...’’
 
‘‘నో’’.... ఒక్కసారిగా కోర్టు దద్దరిల్లింది. ఆవేశంగా వాదిస్తోన్న లాయర్ మాట్లాడ్డం ఆపి అయోమయంగా చూశాడు. అందరి దృష్టీ ఆ అరుపు వచ్చిన వైపు పడింది. కోర్టు గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు ఓ వ్యక్తి. యాభయ్యేళ్ల వరకూ ఉంటుంది వయసు. పుష్టిగా, పొడవుగా ఉన్నాడు. ముఖంలో కోపం. కళ్ల నిండా నీళ్లు.
 ‘‘లాయర్ వాదిస్తున్నప్పుడు మధ్యలో మాట్లాడటం తప్పు.

మొదటిసారి కాబట్టి ఎక్స్‌క్యూజ్ చేస్తున్నాను. ఎవరు మీరు? ఏదైనా చెప్పాలా?’’... అడిగాడు జడ్జి.
 ‘‘చెప్పాలి సర్. చాలా చెప్పాలి. చాలా చాలా నిజాలు చెప్పాలి. దయచేసి నాకు అనుమతినివ్వండి’’ అన్నాడా వ్యక్తి ఆవేశంగా. చెప్పమన్నట్టు సైగ చేశాడు జడ్జి. ఆ వ్యక్తి ముందుకు వచ్చాడు. ‘‘నా పేరు జే పోర్టన్ సర్. చనిపోయిన ర్యాన్‌కి కన్నతండ్రిని.’’
 ఆశ్చర్యంగా చూశాడు జడ్జి.

‘‘మీరు తన కన్నతండ్రా? మరి ఇందాక తండ్రినని చెప్పిన వ్యక్తి ఎవరు?’’
 ‘‘ఆయన తన స్టెప్ ఫాదర్ సర్. నా భార్యా నేనూ విడిపోయాం. తను వేరే పెళ్లి చేసుకుంది. కానీ ర్యాన్ మాత్రం నా బిడ్డే. నేను విదేశాలకు వెళ్లాను. అందుకే ఇప్పటి వరకూ కోర్టుకు రాలేకపోయాను. ఇవాళ ఫైనల్ హియరింగ్ అని వచ్చాను. కేసు ఇలా తప్పుడు దారిలో వెళ్తోందని తెలిస్తే ఎప్పుడో వచ్చేవాడిని.’’
 ‘‘అంటే మీ ఉద్దేశం?’’
 
కళ్లొత్తుకున్నాడు జే. ‘‘నా బిడ్డ మరణానికి కారణం నాకు తెలుసు సర్. ఆ కారణం ఎవరో కాదు... ఇదిగో, ఈ అమ్మాయే... షయానా. నా కొడుకు జీవితంలోకి తుఫానులా వచ్చింది. అల్లకల్లోలాన్ని సృష్టించింది. చివరికి వాడినే మింగేసింది. తనని వదలొద్దు సర్. నా కొడుకును నాకు దూరం చేసిన ఈ పిల్లని వదలొద్దు.’’
 
జే అరుపులతో కోర్టు హాలు దద్దరిల్లింది. కేసు చివరకు వచ్చేసింది. ఆత్మ రక్షణ కోసం షయానా తన బాయ్‌ఫ్రెండ్‌ని చంపిందని దాదాపు నిరూపించేశాడు ఆమె తరఫు లాయర్. కానీ ఇదేంటి? ఇప్పుడిలా కొత్త వెర్షన్ చెప్తున్నాడీయన?
 
అందరి బుర్రల్లోనూ ఇదే ప్రశ్న. జడ్జిలో కూడా. ‘‘ఏమంటున్నారు మిస్టర్ జే? కాస్త వివరంగా చెప్తారా?’’ అన్నాడు న్యాయమూర్తి.
 ‘‘చెప్తాను సర్. ఈమెను నా కొడుకు ప్రేమించిన మాట నిజమే. కానీ ఈమె ఓ మూర్ఖురాలు. ర్యాన్‌ని ముప్పుతిప్పలు పెట్టింది. అందుకే తనని వదిలించుకోవా లనుకున్నాడు ర్యాన్. అది వీలుకాక చాలా ఇబ్బంది పడ్డాడు. నాతో ఫోన్‌లో చెప్పి బాధపడ్డాడు.

సరే, ఏదో ఒకటి చేద్దామని నేను అనుకునేలోపు ఏకంగా తనే వెళ్లిపో యాడు. వాడు ఓ ఆడపిల్లని హింసించేంత దుర్మార్గుడు కాదు సర్. న్యాయాన్ని కాపాడాలని న్యాయశాస్త్రం చదివాడు. వాడికి అన్యాయం జరగనివ్వకండి ప్లీజ్. ’’
 కథ కొత్త మలుపు తిరిగింది. అందరి మనసుల్లోనూ షయానా మీద బోలెడు అనుమానాలు మొదలయ్యాయి. దాంతో కేసు వాయిదా పడింది.

కేసును మరోసారి దర్యాప్తు చేసి నిజానిజాల్ని పది రోజుల్లోగా నిర్ధారించమని పోలీసుల్ని ఆజ్ఞాపించాడు న్యాయమూర్తి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. జే చెప్పిన మాటల్ని బట్టి, ఆ కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. అవన్నీ పచ్చి నిజాలని వారి దర్యాప్తులో తేలింది.
 ర్యాన్ పోర్టన్ న్యాయశాస్త్రం చది వాడు. అందంగా ఉంటాడు. దాంతో అమ్మాయిలు అతనంటే పడి చచ్చేవారు.

ఆ అమ్మాయిల్లో షయానా హ్యూబర్‌‌స కూడా ఉంది. అయితే మిగిలినవారిలా కలలు కని ఊరుకోలేదామె. తన కలల రాకుమారుడి మనసును గెలుచుకుంది. ఓ కాఫీ షాపులో అనుకోకుండా ర్యాన్‌తో అయిన పరిచయాన్ని స్నేహంగా మార్చుకుంది. ప్రేమగా మలచుకుంది. అతనితో సహజీవనం మొదలు పెట్టింది. ఆ తర్వాతే ఆమె నిజస్వరూపం ర్యాన్‌కి తెలిసి వచ్చింది.
 
షయానా పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు. ఆమెకి కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. చిన్నచిన్న వాటికే పెద్ద రాద్ధాంతం చేయడం ఆమె దగ్గరే నేర్చు కోవాలి ఎవరైనా. దానికి తోడు వల్ల మాలిన అనుమానం. ర్యాన్ ఎవరి ఆకర్షణలో అయినా పడిపోతాడేమో, ఏ అమ్మాైయెునా అతడికి దగ్గరైపోతుందేమో అని ప్రతిక్షణం భయపడిపోయేది. దాంతో అతడు కదిలితే కాల్చుకు తినేది. ఎవరి నైనా పన్నెత్తి పలుకరిస్తే హూంకరించేది. మొదట్లో సర్ది చెప్పేవాడు ర్యాన్.

కానీ ఉండేకొద్దీ అతడిలో ఓర్పు నశించి పోయింది. ఇక మనం కలిసి ఉండలేం, విడిపోదాం అన్నాడు. ఆమె ఒప్పుకోలేదు. నిన్ను వదిలే ప్రసక్తి లేదని తేల్చేసింది. పైగా నీ పరువు తీస్తానంటూ బెదిరించేది. దాంతో ఏం అనలేకపోయేవాడు ర్యాన్. షయానా సైకో అని, ఆమెని వదిలించుకో లేకపోతున్నానని తండ్రితో చెప్పుకుని బాధపడ్డాడు. దాంతో తానే షయానాని ఒప్పిద్దామనుకున్నాడు జే. అంతలోనే ఓ ఊహించని సంఘటన జరిగింది.
 
ర్యాన్‌కి మిస్ ఓహియో అందాల పోటీల్లో గెలిచిన ఆడ్రీతో పరిచయమైంది. ఆమెతో తన జీవితం బాగుంటుంది అనిపించింది. ఆమెతో డేట్‌కి వెళ్లాలను కున్నాడు. ఆ రోజు సాయంత్రం వెళ్లేం దుకు సిద్ధమయ్యాడు. అది షయానాకి తెలిసిపోయింది. గొడవకు దిగింది. అతడు వినిపించుకోలేదు. దాంతో ‘నాకు దక్కని నిన్ను ఎవరికీ దక్కనివ్వను’ అంటూ షూట్ చేసి చంపేసింది. దాన్ని ఆత్మరక్షణ కోసం చేసినట్టుగా క్రియేట్ చేసింది.
      
క్యాంప్‌బెల్ కౌంటీ కోర్ట్...
‘‘స్వార్థంతో ఉన్మాదిగా మారి ర్యాన్‌ని హత్య చేసిన షయానాకి నలభయ్యేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది.’’ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు విని షాకయ్యింది షయానా. జే కళ్లలో మాత్రం కన్నీటితో పాటు కాసింత తృప్తి!
 - సమీర నేలపూడి

మరిన్ని వార్తలు