తొందరపాటు ఫలితం

18 Jun, 2017 01:02 IST|Sakshi
తొందరపాటు ఫలితం

అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు ఓరోజున వేటకు వెళ్లాడు. క్రూరమృగాలను వేటాడుతూ  పరివారం నుంచి దూరంగా వెళ్లిపోయాడు.  విపరీతమైన ఆకలి, దప్పిక కలిగాయి. ఆకలి దప్పులను తీర్చుకునేందుకు తగిన ప్రదేశాన్ని వెదుకుతూ వెళుతుంటే ఒక ఆశ్రమం కనిపించింది. అది శమీకుడనే మహర్షి ఆశ్రమం. ఆ సమయంలో ఆ ముని తపోదీక్షలో ఉన్నాడు. తీవ్రమైన అలసటతో ఉన్న పరీక్షిత్తు నేరుగా  మహర్షి దగ్గరకు వెళ్లాడు. తనకు బాగా ఆకలిగా ఉందని, ముందుగా దాహం తీర్చమని మునిని అడిగాడు. దాదాపు సమాధి స్థితిలో ఉన్న ముని రాజు వచ్చిన విషయమే గమనించలేదు.

ఆయన తనను ఏవో అడుగుతున్నాడని గ్రహించే స్థితిలో  లేడు. తీవ్రమైన ఆకలి దప్పులు ముప్పిరిగొనడం వల్ల పరీక్షిత్తు తన ఎదురుగా ఉన్నది ముని అని, ఆయన సమాధిస్థితిలో ఉన్నాడనీ, తనకు బదులివ్వగలిగే స్థితిలో లేడనీ గమనించే స్థితిలో లేడు. పైపెచ్చు తాను మహారాజునని, తాను వస్తే ఆ ముని లేచి నిలబడలేదని, తనకు ]lమస్కరించలేదని, ఆసనం ఇవ్వలేదనీ అనుకున్నాడు. ఆయనలో అహంకారం మొదలైంది. ఆ మహర్షిని ఎలా అవమానించాలా అని తలంచాడు. అక్కడకు సమీపంలో చచ్చిపడున్న పాము ఒకటి కనిపించింది. చచ్చిపోయిన పామయినా మెడలో వేస్తే చల్లగా తగులుతుంది. అప్పుడు మహర్షికి తెలివి వస్తుంది. అప్పుడు ఆయనను గేలిచేయవచ్చు అనుకున్నాడు. దాంతో ఓ కర్ర ముక్కతో ఆ మృతసర్పాన్ని పైకి ఎత్తాడు.

ఒక ప్రభువు, ధర్మరాజు మనుమడు, అభిమన్యుడి కుమారుడు అయిన పరీక్షిత్తు చెయ్యరాని పని చేసిన క్షణమది. ఉచితానుచితాలు మరచిపోయి ఆ చచ్చిన పామును తీసి ఆ ముని మెడలో వేశాడు. అంతటితో ఆయన అహం శాంతించింది. ఈలోగా పరివారం ఆయనను వెతుక్కుంటూ అక్కడకు వచ్చింది. ఆయన అంతఃపురానికి వెళ్లిపోయాడు. కిరీటం తీసి పక్కన పెట్టాడు. అప్పుడు ఆయన ను ఆవరించి ఉన్న కలిమాయ తొలగిపోయింది. దాంతో తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. ఎంతో పశ్చాత్తాప పడిపోయాడు. ఈలోగా జరగవలసిన అనర్థం జరిగిపోయింది.

జరిగిన విషయమంతా మునిబాలకుల ద్వారా తెలుసుకున్నాడు శమీకుడి కుమారుడు శృంగి. ఆశ్రమానికి వచ్చి తన తండ్రి మెడలోని  పామును చూసి ఆగ్రహంతో ఆ పని చేసిన వారు ఎవరైనా సరే, ఏడు రోజులలోగా తక్షకుడనే పాము కాటుకు చచ్చిపోతాడని శపించాడు. మహా తపశ్శక్తి సంపన్నుడయిన శృంగి శాపానికి తిరుగులేదు. శమీకుడు అది తెలుసుకుని రాజేదో అహంకారంతో చేశాడని నీవు కూడా క్షణికావేశంతో శాపం పెడతావా? అని మందలించాడు. అటు రాజు, ఇటు శృంగి ఇద్దరూ కూడా తమ తొందరపాటుకు సిగ్గుపడ్డారు. ముని బాలుడి శాపం విషయం తెలిసిన పరీక్షిత్తు నారదాది మునుల సలహా మేరకు శుకబ్రహ్మ నుంచి పురాణాన్ని విన్నాడు. మోక్షాన్ని పొందాడు. అదే శ్రీ మద్భాగవతం.

మరిన్ని వార్తలు