లేజీ  లక్షణాలు వస్తాయా?

24 Dec, 2017 01:03 IST|Sakshi

సందేహం 

l severe pregnancy sickness అనే మాట విన్నాను. దీని గురించి తెలియజేయగలరు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. అయితే నేను పరిమితికి మించి ఎక్కువగా నిద్రపోతాను. ఇలా నిద్ర పోవడం ఆరోగ్యానికి మంచిదని కొందరు, పుట్టబోయే బిడ్డకు లేజీ లక్షణాలు వస్తాయని కొందరు అంటున్నారు. వాస్తవం ఏమిటి అనేది వివరించగలరు. – ఆర్‌.సంధ్య, గూడూరు
severe pregnancy sickness అంటే కొంతమంది గర్భిణులలో ఆ సమయంలో జరిగే హార్మోన్లలో మార్పుల వల్ల కలిగే ఇబ్బందులు, లక్షణాలు. ఇందులో కొందరిలో నీరసం, నిద్ర ఎక్కువగా రావటం, కొందరిలో నిద్ర పట్టకపోవడం, వాంతి వచ్చినట్లు ఉండటం, కొన్ని వాసనలు పడకపోవడం, వాంతులు కావడం, ఆకలి లేకపోవడం, తినలేక పోవడం వంటి అనేక రకాల లక్షణాలు రక్తంలో విడుదలయ్యే హార్మోన్ల మోతాదును బట్టి , శరీరతత్వాన్నిబట్టి  వాటి తీవ్రత ఉంటుంది. ఈ లక్షణాలు ఎక్కువగా మొదటి మూడు నెలలు ఉంటాయి. తర్వాత మెల్లగా తగ్గిపోతాయి. ఎక్కువగా నిద్ర పోవడం వల్ల బేబీకి లేజీ లక్షణాలు రావడం అంటూ ఏమీ ఉండదు. కాకపోతే ఎక్కువగా నిద్రపోతూ, సమయానికి ఆహారం తీసుకోకపోతే, నీరసం, ఎసిడిటీలాంటివి ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. నిద్ర పోయినా సమయానికి కొంచెం కొంచెంగా ఆహారం తీసుకోవడం మంచిది.

∙పీరియడ్స్‌ టైమ్‌లో బయటికి వెళ్లకుండా వీలైనంత విశ్రాంతి తీసుకోవాలంటారు. కానీ ఇది ఉద్యోగం చేసే వారికి కష్టం కదా! ఒకవేళ సెలవు పెట్టాల్సి వస్తే ఎన్నిరోజులు పెడితే మంచిదో తెలియజేయగలరు. ‘పీరియడ్‌ మిత్స్‌’లో ముఖ్యమైన వాటి గురించి తెలియజేయగలరు. – డీఎన్, చిత్తూరు
పీరియడ్స్‌ టైమ్‌లో తప్పనిసరిగా బయటకు వెళ్లకూడదు అనే ఆంక్షలు ఏమీ లేవు. కాకపోతే చాలామందికి ఆ సమయంలో అసౌకర్యంగా ఉండటం, బ్లీడింగ్‌ ఎక్కువగా అవ్వటం, కొద్దిగా నడుము నొప్పి, కడుపులో నొప్పి, వికారం, నీరసం వంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, విశ్రాంతి తీసుకుంటే కొద్దిగా ఉపశమనం దొరుకుతుంది. అంతేకాని అందరూ విశ్రాంతి తీసుకోవాలనికాని, ఉద్యోగం చేసేవారు సెలవు పెట్టి మరీ విశ్రాంతి తీసుకోవాలని తప్పనిసరి ఏమీ లేదు.పీరియడ్స్‌లో  అసౌకర్యం ఏమీ లేకపోతే మాములు రోజులాగే ఉండవచ్చు. అసౌకర్యం ఎక్కువగా, నొప్పి ఎక్కువగా, బ్లీడింగ్‌ మరీ అధికంగా అవుతూ ఉండి, ఆఫీసుకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంటే లక్షణాల తీవ్రతను బట్టి ఒకటి లేదా రెండు రోజులు కుదిరితే సెలవు పెట్టుకోవచ్చు.ఈ ఆధునిక కాలంలో కూడా పీరియడ్స్‌ మీద అనేక రకాల అపోహలు ఉంటున్నాయి. ఈ సమయంలో స్నానం చేయకూడదు అని, ఆ సమయంలో ఎవరినీ ముట్టుకోకూడదని, ఈ సమయంలో పెరుగు తినకూడదని, వాకింగ్, ఎక్సర్‌సైజ్‌లాంటివి చేయకూడదు అని... ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి. ఇవి కేవలం అపోహలు మాత్రమే.ఈ సమయంలో రోజూ స్నానం చేయడం మంచిది. దాని వల్ల  బ్లీడింగ్‌ వల్ల జననాంగాల వద్ద చెమ్మ తగ్గి ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఉంటుంది. మిగతా రోజులలాగానే ఈరోజులలో కూడా ఆహారంలో అన్నీ తీసుకోవచ్చు. వాకింగ్, ఎక్సర్‌సైజ్‌లు అలవాటు ఉన్నవారు, ఈ సమయంలో ఎక్కువ బ్లీడింగ్, నొప్పివంటి అసౌకర్యాలు లేకపోతే చిన్నగా వాకింగ్, తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు.

∙ప్రెగ్నెన్సీ సమయంలో చేసే ప్రత్యేకమైన ధ్యానం ఏదైనా ఉందా? నేను కొంత కాలంగా మార్నింగ్‌ సిక్‌నెస్‌తో బాధపడుతున్నాను. మార్నింగ్‌ సిక్‌నెస్‌ పోవడానికి anti-nausea medication  ఒక పరిష్కారం మార్గం అని చదివాను. దీని గురించి వివరంగా తెలియజేయగలరు.– పీఆర్‌వీ, విజయనగరం
ప్రెగ్నెన్సీ సమయంలో చేసే ప్రత్యేక ధ్యానం అంటూ ఏదీ లేదు. ఈ సమయంలో ధ్యానం చేసేటప్పుడు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని, చెడు ఆలోచనలు రానివ్వకుండా, పాజిటివ్‌ థింకింగ్‌ అలవర్చుకోవడం తల్లీబిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి మంచిది.ధ్యానంతో పాటు ప్రాణాయామం వంటి బ్రీతింగ్‌ వ్యాయామాలు చేయడం ఇంకా మంచిది. గర్భం దాల్చిన మొదటి మూడు నెలలలో చాలామందికి తల తిప్పడం, వికారం, వాంతి వచ్చినట్లు ఉండటం, కొన్ని వాసనలు పడకపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ప్రొద్దున్న ఉంటాయి. వీటిని మార్నింగ్‌ సిక్‌నెస్‌ అంటారు. గర్భం దాల్చిన తరువాత పిండం నుంచి విడుదలయ్యే జిఛిజ హార్మోన్‌ ప్రభావం వల్ల ఈ లక్షణాలు ఏర్పడతాయి. జిఛిజ విడుదలయ్యే మోతాదును బట్టి లక్షణాల తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, లక్షణాలను తగ్గించడానికి వాడే మందులను anti-nausea medication అంటారు. వీటిని వాడక ముందు, చిన్న చిన్న చిట్కాలను పాటించిన తరువాత కూడా లక్షణాలు తగ్గకపోతే అప్పుడు మందులు వాడటం మంచిది. ఆహారం కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవడం, మసాలా, నూనె, వేపుళ్లు, కారం తగ్గించి సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. ఎక్కువగా మజ్జిగ, కొబ్బరినీళ్లు, పండ్లు, పండ్లరసాలు తీసుకోవడం మంచిది. 

రాత్రి తొందరగా భోజనం చేసి, పడుకునే ముందు వేడిగా ఒక గ్లాసు పాలు లేదా పండు తీసుకోవడం మంచిది. ప్రొద్దున కూడా లేచిన వెంటనే  మరీ ఎక్కువ ఆలస్యం లేకుండా వేరే పనుల మీద ధ్యాస పెట్టడం మంచిది. అయినా ఇబ్బందిగా ఉంటే విటమిన్‌ బి12, పైరిడాక్సిన్, డాక్సిలమైన్‌ కలిసిన మందులు లేదా రానిటిడిన్‌ లేదా ఓన్‌డన్‌సెట్రాన్‌ (వాంతులు అవుతుంటే) మందులు తినే అరగంట ముందు లేదా పరగడుపున వేసుకోవచ్చు. వీటివల్ల కడుపులోని బిడ్డపైన దుష్ప్రభావాలు పెద్దగా ఏమీ ఉండవు.

మరిన్ని వార్తలు