ఆ మాత్రల గురించి చెప్పండి?

24 Nov, 2019 05:59 IST|Sakshi

లేటు వయసులో గర్భం దాల్చవలసి వచ్చినప్పుడు, ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ పరీక్షలు చేయించుకోవాలి? 
ఏ పరిస్థితుల్లో  ‘హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ యూనిట్‌’లో చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది? ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రల ఉపయోగం గురించి తెలియజేయండి. – కె.శాంభవి, ఖమ్మం
లేటు వయసు అంటే ఇప్పటి కాలంలో 30–35 సంవత్సరాలు దాటిన తర్వాత శరీరంలో మార్పుల వల్ల అధిక బరువు, హార్మోన్ల అసమతుల్యత, అండాల నాణ్యత, సంఖ్య తగ్గడం, బీపీ పెరగడం, సుగర్‌ పెరగడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఇలాంటప్పుడు గర్భం కోసం ప్రయత్నం చేసినప్పుడు, గర్భం రావడానికి ఆలస్యం కావడం, గర్భం దాల్చిన తర్వాత అబార్షన్లు, బిడ్డలో అవయవ లోపాలు, ప్రెగ్నెన్సీలు బీపీ, సుగర్‌ ఇంకా పెరిగి తల్లికి, బిడ్డకు కాంప్లికేషన్స్‌ పెరగడం, నెలలు నిండకుండానే కాన్పులు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారు గర్భం దాల్చక ముందే అధిక బరువు ఉంటే త్వరగా  బరువు తగ్గడం, ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి థైరాయిడ్‌ వంటి హార్మోన్‌ పరీక్షలు, రక్తంలో సుగర్‌ వంటి ఇతర సమస్యలు తెలుసుకోవడానికి అవసరమైన రక్తపరీక్షలు, గర్భాశయం అండాశయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్‌ పెల్విక్, అండం పెరిగి సరిగా విడుదలవుతుందో లేదో తెలుసుకోవడానికి ఫాలిక్యులర్‌ స్టడీస్‌ వంటివి చేయించుకుని, సమస్యలు ఏవైనా నిర్ధారణ అయితే వాటిని అశ్రద్ధ చేయకుండా త్వరగా చికిత్స తీసుకుని త్వరగా గర్భం అందడానికి ప్రయత్నం చేయాలి.

24 గంటలు గైనకాలజిస్టు, పిల్లల డాక్టర్, ఇంటెన్సివ్‌ కేర్‌ స్పెషలిస్ట్, అనుభవజ్ఞులైన నర్సులు, మిగతా స్టాఫ్, అన్ని పరిస్థితులకు అవసరమయ్యే పరికరాలు, ప్రెగ్నెన్సీలో ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొని చికిత్స చేసే ప్రదేశాన్ని హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ యూనిట్‌ అంటారు. గుండెజబ్బులు, బీపీ బాగా పెరిగిన వాళ్లు, రక్తంలో గూడు కట్టే సమస్యలు ఉన్నవాళ్లు, ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్‌ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నవాళ్లు, బాగా ఆయాసం, ఉబ్బసం సమస్య ఉన్నవాళ్లు, ఇంకా ఇతర కాంప్లికేషన్స్‌ ఉండేవాళ్లు హైరిస్క్‌ ప్రెగ్నెన్సీ యూనిట్‌ ఉన్న ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడం వల్ల ప్రాణాంతకంగా మారే పరిస్థితుల నుంచి చాలా వరకు బయటపడవచ్చు. ఫోలిక్‌ యాసిడ్‌ అనేది విటమిన్‌ బి కాంప్లెక్స్‌కు సంబంధించిన విటమిన్‌–బి9. ఇది శరీరంలో డీఎన్‌ఏ తయారీకి, కణాల వృద్ధికి, ఇతర అనేక ప్రక్రియలకు దోహదపడుతుంది. ఫోలిక్‌ యాసిడ్‌ లోపం ఉన్నప్పుడు తల్లిలో రక్తహీనత, శిశువుల్లో నాడీ వ్యవస్థ, మెదడులో లోపాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. గర్భం కోసం ప్రయత్నించే మహిళలు గర్భం రావడానికి మూడు నెలల ముందు నుంచే ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు రోజుకొకటి చొప్పున తీసుకుంటూ, గర్భం వచ్చాక తొమ్మిదినెలల పాటు తీసుకోవాలి.

నా వయసు 37 సంవత్సరాలు. ఈమధ్య రక్తస్రావం అవుతుంటే వైద్య పరీక్షలు చేయించుకున్నాను. ‘గర్భాశయం వాపు’ ‘అబ్‌నార్మల్‌ యుటెరైన్‌ బ్లీడింగ్‌ ఒవేరియన్‌ కాజెస్‌’ అని చెప్పారు. ఇది రావడానికి కారణాలు ఏమిటి? ప్రమాదకరమా? చికిత్స పద్ధతులు ఈ విధంగా ఉంటాయి? – జీబి, గుంటూరు
అనేక కారణాల వల్ల మహిళల్లో అధిక రక్తస్రావం జరుగుతుంది. గర్భాశయంలో వచ్చే అనేక సమస్యలకు, మార్పులకు వాడుక భాషలో గర్భాశయంలో వాపు (బల్కీ యుటెరస్‌) అంటారు. దానివల్ల వచ్చే అధిక రక్తస్రావాన్ని అబ్నార్మల్‌ యుటెరైన్‌ బ్లీడింగ్‌ అంటారు. కొందరిలో అనేక కారణాల వల్ల యోని భాగం నుంచి లేదా రక్తం ద్వారా గర్భాశయంలోకి, ఫెలోపియన్‌ ట్యూబ్స్‌లోకి, తద్వారా పొత్తికడుపులోకి ఇన్ఫెక్షన్‌ పాకి గర్భాశయంలో వాపు రావడం, అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. దీనిని పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌ (పీఐడీ) అంటారు. కొందరిలో ప్రతినెలా బ్లీడింగ్‌ ద్వారా ఎండోమెట్రియమ్‌ పొర బయటకు వచ్చినట్లే, కొందరిలో గర్భాశయ కండరం ఎండోమెట్రియం పొరలోకి చేరుతుంది. దానివల్ల ప్రతినెలా బ్లీడింగ్‌ అయ్యి, గర్భాశయం గట్టిగా అయ్యి వాపులా ఉంటుంది. దీనిని ‘అడినోమయోసిస్‌’ అంటారు. కొందరిలో అనేక కాన్పుల వల్ల కూడా గర్భాశయం సాగుతుంది. దానిని ‘బల్కీ యుటెరస్‌’ అంటారు. కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అండాశయాల పనితీరులో మార్పుల వల్ల అబ్నార్మల్‌ బ్లీడింగ్‌ అవవచ్చు. ఇది ప్రమాదకరం కాదు గాని, నిర్లక్ష్యం చేస్తే రక్తహీనత, నీరసం, విసుగు, కోపం, డిప్రెషన్‌ వంటి సమస్యలు రావచ్చు. గర్భాశయం వాపు కారణాన్ని బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫెక్షన్‌ ఉంటే యాంటీబయెటిక్స్‌ కోర్సు సక్రమంగా వాడాల్సి ఉంటుంది. మొదట బ్లీడింగ్‌కు కారణం తెలుసుకోవడానికి ఎండోమెట్రియమ్‌ పొరలో ఏదైనా సమస్య ఉందా, క్యాన్సర్‌కి సంబంధించిన మార్పులు ఏమైనా మొదలయ్యాయా అని తెలుసుకోవడానికి డీ అండ్‌ సీ అని గర్భాశయాన్ని శుభ్రపరచే ప్రక్రియ చేయించాక, ఎండోమెట్రియల్‌ బయాప్సీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఈ బయాప్సీ రిపోర్టు బట్టి చికిత్స విధానం మందుల ద్వారానా లేక గర్భాశయాన్ని తొలగించాల్సి ఉంటుందా అనేది నిర్ధారించాల్సి ఉంటుంది. అడినోమయోసిస్‌ సమస్య ఉన్నవాళ్లకు వారి వయసును బట్టి, లక్షణాల తీవ్రతను బట్టి హార్మోన్ల మాత్రలు, నెలనెలా ఇంజెక్షన్ల ద్వారా చికిత్స ఇచ్చి చూసి, ఫలితం కనిపించకపోతే గర్భాశయాన్ని తొలగించడం జరుగుతుంది.

ప్రసుత్తం నేను ప్రెగ్నెంట్‌. ముర్రుపాలు అనే మాట వినడమేగానీ దాని గురించి తెలియదు. అది బిడ్డకు ఏ రకంగా ఉపయోగ పడుతుంది? ముర్రుపాలు కాన్పు తరువాత ఎప్పుడు పట్టాలి? పాలు అధికంగా వచ్చేందుకు ఎలాంటి పౌష్ఠికాహారం తీసుకోవాలో తెలియజేయగలరు. – పి.నీలిమ, వరంగల్‌
కాన్పు అయిన మొదటి మూడు నాలుగు రోజులు తల్లి రొమ్ముల నుంచి లేత పసుపు రంగులో జిగట వంటి ద్రవం వెలువడుతుంది. దీనినే ముర్రు పాలు లేదా కొలెస్ట్రమ్‌ అంటారు. ఇందులో ప్రొటీన్స్, పిండి పదార్థాలు, తక్కువ కొవ్వు, విటమిన్స్‌ వంటి పోషకాలతో పాటు పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచి, క్రిములు పెరగకుండా, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా రాకుండా కాపాడే యాంటీ బాడీస్‌ ఎక్కువగా ఉంటాయి. బిడ్డ పుట్టిన గంట నుంచే తల్లి రొమ్మును పట్టించడం వల్ల ముర్రుపాలు సరిగా స్రవించి, బిడ్డకు అన్ని పోషకాలు అందు తాయి. బిడ్డలో జీర్ణశక్తి కూడా బాగుండేలా దోహద పడతాయి. చాలామంది ఇవి ఇగిరిపోయిన పాలు, చెడు పాలు అని బిడ్డకు పట్టకుండా తీసివేస్తూ ఉంటారు. అది సరికాదు. కాన్పు తర్వాత ప్రతి మూడు గంటలకు పాలు వచ్చినా, రాకపోయినా బిడ్డను తల్లి రొమ్ముకు పట్టించి చీకించడం ద్వారా తల్లిలో ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్‌ వంటి హార్మోన్లు విడుదలై పాలు రావడం జరుగుతుంది. తల్లి ఆహారంలో అన్నంతో పాటు ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, తాజా పండ్లు, పాలు, పెరుగు, మంచినీళ్లు, మాంసాహారులైతే కొద్దిగా మాంసాహారం తీసుకోవడం వల్ల పాలు సమృద్ధిగా వస్తాయి. ఆహారంతో పాటు తల్లి మానసిక ఒత్తిడి లేకుండా, సరైన నిద్ర ఉండటం వల్ల కూడా పాలు సరిపడా వస్తాయి.

మరిన్ని వార్తలు