ఉత్తరం: మీ వాళ్ల ఆరోగ్యం మీ చేతిలో..!

10 Aug, 2013 22:38 IST|Sakshi

ఇంటిల్లిపాదికీ ఆహారాన్ని సిద్ధం చేసేది ఇంటి ఇల్లాలే. అందుకే ఇల్లాళ్లందరికీ ఓ ప్రశ్న. మీరు మీ వాళ్లకు ఎలాంటి ఆహారాన్ని పెడుతున్నారు? మంచి ఆహారమే అని మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అని కచ్చితంగా పరిశీలించుకునేవారు మనలో కేవలం 21 శాతం మందే అని ఈ మధ్య ఓ సర్వేలో తేలింది. ఆరోగ్యమనేది ఆహారం చేతిలోనే ఉంటుంది. అందుకే మంచి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకోవాలి అంటే, అసలు ఏ ఆహార పదార్థం వల్ల ఏ ఉపయోగం ఉందో, ముందు తెలుసుకోవాలి. అందుకే మీకోసం ఈ వివరాలు...


     కొత్తిమీర యూరినరీ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాదు, కడుపులో ఉన్న గ్యాస్‌ని కూడా తగ్గిస్తుంది. అరుగుదలకు సహాయపడుతుంది!
 
     పరగడుపునే అరటిపండు తినకూడదు. దానివల్ల శరీరంలో చక్కెర శాతం అధికమవుతుంది. వీలైనంత వరకూ ఏదైనా తిన్న తర్వాతనే తినాలి. షుగర్ పేషెంట్లు అసలు తిననే కూడదు. మరో విషయం... పసుపురంగు కంటే పచ్చరంగులో ఉండే అరటిపండ్లే ఆరోగ్యానికి మంచివి!
     క్యాబేజీలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి ఎంత తిన్నా సమస్య ఉండదు. దీనిలోని విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్ ఆరోగ్యానికి చాలా మంచివి!
     ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఉడికించడం వల్ల మనం వాటిని కోల్పోతాం. అందుకే ఉల్లిపాయల్ని మరీ ఎక్కువ ఉడికించొద్దు!
     పుచ్చకాయ గింజలు ఒంట్లోని కొవ్వును కరిగిస్తాయి. కడుపులో ఉండే నులిపురుగులను కూడా చంపుతాయి. వీటిలో ఉండే జింక్ ప్రొస్టేట్ గ్రంథిని కాపాడుతుంది!
     ఫంగస్, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి ముల్లంగికి ఉంది. అందుకే ఇది చాలా అలర్జీలను తగ్గిస్తుంది!
 
     చిలగడ దుంపల్లో విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి. అలాగని వీటిని మితిమీరి తింటే ఉదరవాపు, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి!
     సబ్జా గింజలు వేడిని నియంత్రిస్తాయి. పొంగు, ఆటలమ్మ వచ్చినప్పుడు తీసుకుంటే మంచి ఫలితముంటుంది!
     దోసకాయలోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. చర్మాన్ని కూడా ఆరోగ్యవంతంగా చేస్తుంది!
     మధుమేహానికి కాకరకాయ మంచి మందులా పనిచేస్తుందని మనకు తెలుసు కదా! ఇది కీళ్ల నొప్పులకు కూడా మంచిదే. అంతేకాదు, మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది!
     బీట్‌రూట్‌లో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, ఫోలిక్ ఆమ్లం, బీటా కెరోటిన్... లేనిదేమీ ఉండదు. ఎర్ర రక్త కణాలను వృద్ధి చేసి రక్తహీనత బారిన పడకుండా చూస్తుంది. అధిక కొవ్వును కరిగిస్తుంది. దీనిలోని పీచు పదార్థం మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇందులోని బీటైన్ అనే పదార్థం గుండె జబ్బులు రాకుండా కాపాడటమే కాక... మూత్ర పిండాలు, కాలేయంలో ఉన్న మలినాలను తొలగిస్తుంది!
 
     కళ్లకు మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుపరుస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. అధిక చెమట సమస్యను కూడా నివారిస్తుంది. ఇన్ని మంచి లక్షణాలున్నదేమిటో తెలుసా... కరివేపాకు! అందుకే మీవాళ్లు కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తే ఊరుకోకండి. బలవంతపెట్టయినా తినిపించండి!
 ఇలా మనకు మేలు చేసేవి చాలా ఉన్నాయి. వీటి మోతాదును పెంచితే జీవితకాలాన్ని కూడా పెంచినట్టే. మీవాళ్ల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మీదే కదా!

మరిన్ని వార్తలు