వెదురు వంతెన

11 Aug, 2019 09:31 IST|Sakshi

కథా ప్రపంచం

సైబాల్‌ ప్రతిరోజూ ఆ దారి వెంబడే నడుస్తూ ఉంటాడు. కుడివైపున లోంగాయి నది. ఒడ్డును ఆనుకుని ఒక తారు రోడ్డు, ఆ తర్వాత ఠాణా రోడ్డు, అటు నుంచి వంపు తిరిగిన వెంటనే ఒక పెద్ద బూరుగ చెట్టు– ఇవన్నీ అతడికి సుపరిచితమైనవి.
పిల్లలు బూరుగకాయల్ని బొంగరాల్లా ఆడుకుంటారు. బాల్యంలో బడికి వెళ్లేటప్పుడు అతడు కూడా ఆ కాయల్ని సేకరించేవాడు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో వాటితోనే పోటీలు పడి ఆడుకునేవారు.
సైబాల్‌ ఆ వైపు నుంచి నడుస్తున్నప్పుడు ప్రతిసారి బాల్యం రోజులే గుర్తొస్తుంటాయి. 

ఎల్లప్పుడూ అదే రద్దీ రోడ్డు, అదే ఆజాద్‌సాగర్‌ కూడలి, అదే ఠాణా రోడ్డు వద్ద ఒక వంపు, ఆస్పత్రి రోడ్డు, తర్వాత డ్యాము, కుడివైపున బనమాలీ రోడ్డు, తన ఇంటికి చేరటానికి ఒక పూర్తి మలుపు సమాంతరంగా తిరగాలి. అతడు పనిచేసే ఆఫీసూ, అతని ఇల్లూ లొంగాయి నదికి ఈ వైపు ఒడ్డున ఒకటీ, ఆవైపు ఒడ్డున ఒకటీ వ్యతిరేక దిశల్లో ఉంటాయి.
హాస్పిటల్‌ కాషాయరంగులో ఉంటుంది. సైబాల్‌కు దాన్ని దాటుకుంటూ వెళ్లడం ఇష్టముండదు. ఆ పరిసరాలకు రాగానే ఒక విధమైన ఫినాయిల్, స్పిరిట్‌ మిశ్రమ వాసనకు ఒంట్లో తిప్పినట్టు ఉంటుంది. అక్కడ రిక్షాలు వరుసగా ఉంటాయి. ఒక రిక్షాలోంచి గాయాలతో రక్తసిక్తమైన వ్యక్తిని దించుతూ ఉంటారు. మరో రిక్షా స్పృహతప్పిన మరో వ్యక్తిని తెస్తుంది. ఇంకో రిక్షాలో నిండుగర్భిణి నొప్పులు పడుతుండగా ఇరువైపులా బంధువుల ఆసరాతో దిగుతూ ఉంటుంది. వేరొక రిక్షాలో ఏడుస్తున్న పసివాడిని ఎత్తుకుని తెస్తుంటారు. 

ఒకరోజున ఒక ట్రక్కు నిండా మానవదేహాల్ని మోసుకు వచ్చారు. కొందరు అప్పటికే చనిపోయి ఉన్నారు. కొద్దిమంది మరణానికి చేరువగా ఉన్నారు. మిగిలినవి విడివిడి శరీరభాగాలు మాత్రమే. పేమారీ వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ దృశ్యాన్ని అటుగా వెళుతూ చేరువగా చూశాడు.
మరి ఆరోజు అతడు ఆఫీసుకి వెళ్లలేకపోయాడు. ఇంటికి తిరిగి వచ్చేశాడు. కొద్దికాలం పాటు ఆ దృశ్యాలే అతణ్ణి కలలుగా వేధించాయి. 
నిజానికి సైబాల్‌ హాస్పిటల్‌ రోడ్డుని విడిచిపెట్టి మరో దారి గుండా వెళ్లడం పెద్ద కష్టమేం కాదు. ఠాణా రోడ్డు వద్ద మలుపు తిరిగిన వెంటనే కుడివైపున నదిపై ఒక పాడుపడిన వెదురు వంతెన ఉంది. అది బనమాలి రోడ్డుకు చేరుస్తుంది. ఇది సైబాల్‌ ఆఫీసుకు పోవడానికి అతి దగ్గర దారి. నడవాల్సిన దూరం కూడా సగానికి సగం తగ్గిపోతుంది. కాలం కూడా కలసి వస్తుంది. కాని అతడు ఆ మార్గాన వెళ్లడు.

అందుక్కారణం వెదురు వంతెన దాటాల్సి రావడం.
ఆ వంతెన చాలా దారుణమైన స్థితిలో ఉన్నప్పటికీ జనం మాత్రం దానిపై నుంచే నిర్భయంగా రాకపోకలు సాగిస్తుంటారు. వంతెన నిర్మించి కొద్ది సంవత్సరాలే అయింది.
వంతెనలోని వెదురుకర్రలు చాలా చోట్ల పుచ్చిపోయాయి. అందువల్ల అక్కడక్కడా పెద్ద ఖాళీలు ఏర్పడ్డాయి. ఇరువైపులా ఆనించి పట్టుకోవడానికి కంచె కూడా ఉండదు. కొన్ని చోట్ల రెండు మూడు వెదురు బొంగులు మాత్రమే ఉంటాయి. వాటిపైనుంచి వెళ్లేవాడికి సర్కస్‌ ఫీట్లు తెలిసి ఉండాలి. మరికొన్ని చోట్ల వెదుర్లు బోలుగా ఉంటాయి. వాటిని కంటితో చూసి లోపాన్ని కనిపెట్టడం కష్టం. అటువంటి వాటి మీద అడుగు పడితే ఆ మానవుడు పూర్తిగా కిందకు పడిపోతాడు. అదీ ఆ వంతెన పరిస్థితి.
సైబాల్‌ జీవితాన్నయితే నెట్టుకొస్తున్నాడు గాని వంతెన మీద నుంచి తిరగడానికి ధైర్యం చేయలేకపోతున్నాడు.
ఈ వంతెన హృషీకేశ్‌లో గంగానది మీది ప్రఖ్యాత లక్ష్మణ ఝూలా వంతెనలానే కనపడుతుంది. ఎవరైనా దానిపై తొందరగా నడవటానికి ప్రయత్నిస్తే ప్రమాదకరంగా ఊగుతుంది.
నీరింకిన లొంగాయి నది వంతెన కిందుగా సుమారు ఇరవై అడుగుల లోతున కనపడుతుంది. 
వంతెన పైనుంచి వెళ్లడానికి సైబాల్‌ ఒకటి రెండుసార్లు ప్రయత్నించాడు. కొద్ది అడుగుల దూరం వెళ్లే సరికే గుండెదడ మొదలయ్యేది. ముందుకెళ్లడానికి ఏమాత్రం ధైర్యం చాలేది కాదు. ఒక్కొక్క అడుగే జాగ్రత్తగా వెనక్కు వేసుకుంటూ తిరిగి ప్రధాన రహదారికి చేరుకునేవాడు.

ఒకసారి వంతెన కొంత దూరం నుంచి వెనక్కు తిరిగి వచ్చేస్తున్న సమయంలో ఒక ముసలాయన చూశాడు. అతడు వంతెన మీద అత్యంత నైపుణ్యంతో సాఫీగా త్వరగా నడిచేస్తున్నాడు. సైబాల్‌ని చూసి నవ్వి ఇలా అన్నాడు: ‘‘భయపడుతున్నావా? అసలు కిందకు చూడవద్దు. ముందుకే నడువు. ఎదుటికి మాత్రమే చూడు’’..
ఆ మాటకు బదులుగా సైబాల్‌ ఒక పేలవమైన చిరునవ్వు నవ్వాడు.
వెదురు వంతెనని తప్పించుకోవడానికి సైబాల్‌ చుట్టూ తిరిగి పోవలసిన ప్రధాన రహదారిని ఎంచుకున్నప్పుడు వంతెన అతడిపై సవాలు విసురుతున్నట్ల కనపడుతుంది. వెక్కిరిస్తున్నట్టుగానూ అనిపిస్తుంది. దాని పైనుంచి నడిచే ఆబాల వృద్ధులు అతడి వైపు వేలు చూపిస్తూ ‘పిరికిపంద’ అని ఎత్తిపొడుస్తున్నట్లుగానూ ఉంటుంది.
కాని సైబాల్‌ ఆ దూరమైన రహదారి గుండానే ఆఫీసుకు రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. దూరంతో పాటు కాలం ఎక్కువవుతుంది. ఎండ వేడిమికి చెమటలు కక్కుతూ అలసిపోతుంటాడు. అంతేకాదు ప్రతిరోజూ ఆఫీసుకు పదీ ఇరవై నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటూ ఉంటాడు. 

ఆఫీసులో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఇలా సూచిస్తుంటారు: ‘‘సైబాల్‌! నువ్వు అడ్డంగా వంతెన మీంచి నడిచి త్వరగా ఆఫీసుకు చేరుకోవచ్చు కదా!’’ సైబాల్‌కు అటువంటి వారికి జవాబు చెప్పాలనిపించదు. చిరునవ్వే అతడి సమాధానం.
ఒకరోజు అతడు తన ఆఫీసు సహచరుణ్ణి టెలిఫోన్‌ ఎక్సే్చంజి ముందు కలుసుకున్నాడు. ఇది చుట్టూ తిరిగి వెళ్లే దారిలో ఉంది. మిత్రుడు ఇలా అడిగాడు: ‘‘సైబాల్‌! ఈ దూరం దారి వెంబడి వస్తున్నావెందుకు? దగ్గర దారిగా వంతెన ఉంది కదా!’’ అందుకు సైబాల్‌ వెంటనే అబద్ధం చెప్పాడు: ‘‘నేను ఈ దారిలో హాస్పిటల్‌లో ఒకరిని చూసి వస్తున్నాను.’’ ఎందుకు అబద్ధం చెప్పాడో అతడికే తెలీదు.
చాలాసార్లు ఇలా చుట్టూ తిరిగే దారి వెంబడి ఆఫీసుకు వెళుతున్నప్పుడు పరిచయస్తులు ఎదురైతే మొహం చేటు చేసుకుంటాడు. నేరం చేసిన వాడిలాగా బిక్కుబిక్కుమని తలవంచుకుని నడుస్తూ ఉంటాడు.

ఠాణా రోడ్డు వద్ద మలుపు తిరుగుతూ ఉండగా అతడికొక విచిత్రమైన భయం ఆవహిస్తూ ఉంటుంది. వంతెన తనని చూసి ఎత్తి పొడుస్తున్నట్టూ, వికటాట్టహాసం చేస్తున్నట్టూ భావిస్తాడు. అతడి ఒంటి మీద తేళ్లూ జెర్రులూ పాకినట్టు ఉంటుంది. ఏదో అకారణమైన ఆందోళనకు గురవుతూ ఉంటాడు. ఒక్కోసారి ఈ అంశానికి అంతు తేల్చి తెరదించాలనుకుంటాడు. అంతలోనే భయం ఆవహిస్తూ ఉంటుంది. వంతెన వైపు రెండడుగులు వేసి వెనక్కు తీసుకుంటూ ఉంటాడు. ఎవరో గుండె మీద సుత్తితో కొట్టినట్టుంటుంది. అటుగా నడుస్తున్న ప్రతి వ్యక్తీ అతణ్ణి గమనిస్తున్నట్టుగా ఉంటుంది. ఒక క్షేత్రంలో అతడు ఒంటరివాడై దిక్కులు చూస్తుండగా కొన్ని వందల వేల నయనాలు ఒకేసారి అతణ్ణి దీక్షగా తీక్షణంగా పరికిస్తున్నట్టుంటుంది. వంతెనని తప్పించుకుని రోడ్డు వైపు మళ్లుతుండగా వారంతా బిగ్గరగా నవ్వుతున్నారనిపిస్తుంది. 

ఒక రాత్రి సైబాల్, అతని భార్య మోనీ రాత్రి భోజనం ముగించుకుని పరుపు మీదకు చేరుకున్నారు. 
ఆమె అన్నది: ‘‘నువ్వు వెదురు వంతెన మీద నడుస్తున్నావా? దాని మీద అడుగుపెట్టడమంటే నాకు చచ్చేంత భయం. ఒక రోజున మనం యాత్రకు వెళుతున్నప్పుడు ఏమైందో గుర్తుందా?’’
వంతెన పేరెత్తే సరికి అతడికి సహనం పట్టు తప్పుతుంది. ‘‘మాట్లాడకుండా ఊరుకుంటావా?’’ అన్నాడు. 
మోనీ కొంతసేపు మౌనం వహించింది. అంశాన్ని మారుస్తూ తనే అన్నది: ‘‘జీతం ఎప్పుడొస్తుంది?’’
‘‘నాకూ తెలీదు! ఈ నెల జీతం రావడం ప్రశ్నార్థకమే!’’ అన్నాడు.
మోనీ అన్నది: ‘‘గతనెల కరెంటు బిల్లు కట్టనే లేదు. పాల బాకీ కూడా ఉంది. వెయ్యి రూపాయలతో ఇల్లు గడవడం కష్టంగా ఉంది.’’
‘‘నన్ను కాస్త ప్రశాంతంగా నిద్రపోనిస్తావా?’’ అన్నాడు.
గత రెండునెలలుగా సైబాల్‌ పని చేస్తున్న ఆఫీసులో ఎవరికీ జీతాలు అందడం లేదు. కొంతమందిని తొలగిస్తారని కూడా వదంతులు ఉన్నాయి. అదే నిజమైతే తీసేసిన వారి జాబితాలో తన పేరు మొట్టమొదటిదిగా ఉండవచ్చని భావిస్తున్నాడు. 

నెలవారీ మిగుల్చుకున్న సొమ్మంతా ఖర్చయిపోయింది. పీర్‌లెస్‌ పొదుపులోంచి కొద్దిమొత్తం సేవింగ్స్‌ ఖాతాలో జమయింది. దాంతోనే ఇక నెట్టుకు రావాలి. 
సైబాల్‌ తన సహోద్యోగుల్లాగా బల్లకింది వ్యవహారాలు చేస్తే ఇబ్బందుల్లేకుండా నిశ్చింతగా బతకగలిగేవాడు. కాని ఆ పని చెయ్యలేడు. చేతులు వణుకుతాయి. 
ఈ విషయంలో మోనీతో చాలాసార్లు గొడవలవుతుంటాయి. ఆమె అతడి సహచరులు అంజన్‌బాబు, సిక్దర్‌ మొదలైన వారిని ఉదహరించి, వారిలాగా అదనంగా సంపాదించమంటుంది. 
సైబాల్‌ ఇలా చెబుతుంటాడు: ‘‘కష్టపడి సంపాదించిన డబ్బుతో బియ్యంకొని అన్నం తింటే సంతృప్తిగా ఉంటుంది. నన్నెందుకు ఆ నీచపు పని చెయ్యమంటావు?’’
‘‘మరి ఇల్లు గడవడం లేదు. నీ జీతం చాలడం లేదు. మరేం చేద్దాం?’’

ఈ ప్రశ్నకు సైబాల్‌ వద్ద సమాధానం లేదు. ప్రతిరోజూ అతడు తన లోపలి అదృశ్య వ్యక్తితో పోరాడుతూ ఉంటాడు. ఇంటికి రాగానే కరెంటు ఉండదు. వంటగ్యాస్‌ నిండుకుంటుంది. కిరోసిన్‌ లేదు. ఏమీ ఉండవు. చివరికి అతడి పేరు కూడా ఓటరు జాబితాలో లేదు.
ఎల్లప్పుడూ సైబాల్‌ ఓడిపోతూనే ఉంటాడు. అటు జీవితంలోనూ, ఇటు వంతెన దాటడంలోనూ.
ప్రతి మానవుడూ తన జీవిక కోసం ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఏ గడ్డిపోచనైనా పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. గాఢమైన నిద్రలో కూడా భార్య మోనీని ఆమే ఆ గడ్డిపోచ అన్నట్టు ఆసరా చేసుకుంటూ ఉంటాడు.

ఈ రోజు ఏదో సమ్మె జరుగుతోంది. ఒక రాజకీయ పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆ చిన్న పట్టణంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. 
రహదారి వెంబడి కొన్ని సైకిళ్లు మాత్రమే తిరుగుతున్నాయి. ఆ పార్టీ మనుషులు స్కూటర్ల మీద జెండాలు పట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్నారు. వారిలో చాలామంది స్థానిక రౌడీలు, అసాంఘిక శక్తులు. గత రాత్రి ఒక అత్యవసర సర్క్యులర్‌ ఆఫీసు నుంచి అందింది. ప్రభుత్వోద్యోగులందరూ తప్పనిసరిగా విధులకు హాజరు కావాలన్నది దాని సారాంశం.
కాబట్టి సైబాల్‌ ఉదయం ఆఫీసుకు వెళ్లి మధ్యాహ్న విరామంలో ఇంటికొస్తున్నాడు. రోడ్ల మీద జన సంచారమే లేదు. అందరూ ఇళ్లలో టీవీలకు అతుక్కుపోయారు. ప్రతి ఇంటికీ ఒక కేబుల్‌ కనెక్షన్‌ ఉంది. ఈ విషయమై మోనీతో ఒకటి రెండుసార్లు స్వల్ప జగడాలయ్యాయి. ఆమెకు కనెక్షన్‌ కావాలి. కాని దానివల్ల పిల్లల చదువులు పాడవుతాయని ఆమెకు నచ్చచెప్పాడు.
ఎండ తీవ్రంగా ఉంది. రోడ్డు మీది తారు మరిగి పాదచారుల చెప్పులకు అంటుకుంటోంది. సైబాల్‌ జేబులో ఇంటికి కావలసిన కిరాణా వస్తువుల జాబితా ఉంది. కాని వాటికి కావలసిన డబ్బు మాత్రం లేదు.

ఎవరో దారినపోయేవాడు టైమెంతైందని అడిగాడు. తన వాచీ పనిచేయడం లేదని సైబాల్‌ చెప్పాడు. ఎందుకలా చెప్పాడో అతనికే తెలీదు.
ఠాణారోడ్డు వంపు తిరిగి బూరుగుచెట్టు వైపు చూశాడు. అది ఎర్రగా మండుతున్నట్టుగా ఉంది. నీలిరంగు ఆకాశం వెనుక ఉండగా, చెట్టు ఎరుపుదనం అందంగా అద్భుతంగా ఉంది. అది అతడిలో ఒక చిత్రపట భ్రాంతి కలిగిస్తోంది. మధ్యాహ్న భోజన విరామానికి మోగించిన బడిగంట అతడి చెవుల్ని చిల్లులు పొడిచింది. మలుపు తిరిగిన వెంటనే అలవాటు ప్రకారం వెదురు వంతెన వైపు చూపు మరల్చకుండా ఉండలేకపోయాడు. కాని వంతెన విసిరిన సవాలును స్వీకరించడానికి సిద్ధంగా లేడు. అయినా వంతెన సైగ చేసి అతణ్ణి పిలుస్తున్నట్టుగా ఉంది. 
సైబాల్‌ మనసులో ఒక చిత్రం చోటు చేసుకుంది. అతడు ఒక విశాలమైన మైదానంలో కేంద్రబిందువుగా ఉన్నాడు. కొన్ని వందల జతల కళ్లు అతడివైపే చూస్తున్నాయి. అంతటా నిశ్శబ్దం. మొట్టమొదటిసారిగా అతడికి భయం తెలియలేదు. చుట్టూ పరికిస్తున్నాడు.
హఠాత్తుగా ఒక సైకిలు అతణ్ణి దాటుకుంటూ వెళ్లింది. ఈలోకంలోకి వచ్చాడు.

వెదురు వంతెన అతడు నిలుచున్న చోటికి కొంచెం కిందుగా దగ్గరగా ఉంది. ఈరోజు వంతెన మీద నడిచి తనను తానే జయించుకుని నిరూపించాలనుకున్నాడు. అతడిలో ఒక తెగింపు మేల్కొంది. దవడలు బిగుసుకున్నాయి. రక్తపీడనంలో ఒక ఉత్తుంగ తరంగం తలలోని నాడీజాలంలో సలుపు పుట్టించింది. వంతెన వైపు కిందుగా ఉన్న మెట్లపైకి దిగబోయాడు. అతని శరీరం విల్లులా వంగింది. తన కుడికాలిని వంతెన మీద ఆనిస్తూ ఉండగా వెన్నులో వణుకు పుట్టింది. వంతెన ఒక విధమైన పగిలే శబ్దం చేసింది. పాదాలు ఒక స్పష్టమైన అనునాదాన్ని పాటించాయి. ఈరోజు సైబాల్‌ తప్ప వంతెన మీద ఇంకెవరూ లేరు. నుదుటి మీద చెమట బిందువులు ఏర్పడ్డాయి. గుండె దడదడ కొట్టుకుంది. చెమటతో వేసుకున్న చొక్కా పూర్తిగా తడిసిపోయింది. కొన్ని అడుగులు నెమ్మదిగా వేశాడు. 

ఒక్కసారిగా ఆకాశంవైపు చూశాడు. తన చుట్టూ ప్రతిదీ గిరగిరా  తిరుగుతున్నట్లు అనిపించింది.
మిట్టమధ్యాహ్నం సూర్యకిరణాలు దహించి వేస్తున్నాయి. సూర్యుడే చెమటలు కక్కుతున్నట్టుంది. తాగిన వాడిలా నడవడం మొదలుపెట్టాడు. కనుబొమల పైనుంచి స్వేదబిందువులు కిందకు ప్రవహించి పెదవులపై పడుతున్నాయి. ఉప్పు రుచి తగిలింది. 
వంతెన వెదుర్లలో అతని ముందు పెద్ద ఖాళీ ఉంది. ఆ పక్కనే ఒక పెద్ద వెదురు ఉంది. దాని మీద నుంచే అతను సమతూకంతో నడవాలి. వెదురుపైనున్న చాపవంటి అల్లిక కుళ్లిపోయి ఛిద్రమైపోయింది. దానిపైన జాగ్రత్తగా కుడికాలు పెట్టాడు. కాని తన శరీరపు పూర్తి భారాన్ని మోపలేదు. ఒక్క దుముకుతో ముందుకు గెంతాడు. 
ఒక్కసారిగా కిందకు చూశాడు. తల తిరిగింది. గుండె శరీరం వెలుపలకు వచ్చేస్తుందనిపించింది. ఒక వ్యకి వేగంగా తిరుగుతున్న జెయింట్‌ వీల్‌తో కిందకు దిగుతున్న అనుభూతి కలిగింది. ఉదరంలో శూన్యం ఏర్పడి దేవినట్లయింది. 

వంతెనలో తీవ్రమైన ప్రకంపనలు ఏర్పడ్డాయి. మరి నిలదొక్కుకోలేక సైబాల్‌ కింద కూర్చుండిపోయాడు. ఎవరైనా వస్తున్నారేమోనని చుట్టూ చూశాడు. నిజానికి ఆ వంతెన మీద ఒకరికొకరు చేయూతనిచ్చే అవకాశం లేదు. ఎవరి ధైర్యంతో వారు ముందుకెళ్లాలి. తప్పదు. కనీసం ఆధారంగా పట్టుకోవడానికి, నిల్చోవడానికి ఇరువైపులా సరిహద్దు వెదుర్లు కూడా లేవు. 
ఇంకా సగం దూరం వెళ్లాలి. వెనకకు తిరిగిపోవాలా? ముందుకు సాగిపోవాలా? కొన్ని క్షణాల పాటు తర్కించుకున్నాడు. అదృశ్యంగా కొన్ని వందల కళ్లు తననే చూస్తున్నాయి. తన ఓడిపోకూడదు.
ముందుకుపోవాలనే నిశ్చయించుకున్నాడు.

కొంతదూరంలో బనమాలీ రోడ్డులో కొందరు మనుషులు కిందివైపు వస్తున్నారు. కాని వారు సైబాల్‌ వైపు చూడటంలేదు. మోకాళ్ల మీద భారం పెట్టి నెమ్మదిగా నిల్చున్నాడు. 
ఇప్పుడు వంతెన కదలడం ఆగింది. అతడి ముందర రెండు జతల వెదుర్లున్నాయి. వాటిమీద తన పాదాలను నెమ్మదిగా ఆనించాడు. వెంటనే ఒక వెదురు ఫెళఫెళమంటూ బద్దలైంది. కొంచెం కిందకు జారిపోయింది. వెంటనే ఒక అసంకల్పిత చర్య ద్వారా తన శరీర భారాన్ని కుడికాలి మీదకు నెట్టాడు. అంత సత్వర నిర్ణయానికి తనే ఆశ్చర్యపోయాడు. నమ్మశక్యం కాలేదు.
సైబాల్‌ వంతెన దాటడం ఒక తమాషా ఆటగా రూపొందుతోంది. చలనాలకు, అనుభూతులకు ఉత్ప్రేరకమైన ఎడ్రినలిన్‌ హార్మోన్‌ తరంగాలుగా ప్రవహిస్తూ ఉండటం అతడికే తెలుస్తోంది. ముందుకు చూశాడు. మరికొన్ని రంధ్రాలు కనపడ్డాయి. 
అయినా ముందుకు సాగాలి! ఇదే జీవితాశయం.

సూర్యుడు ఇంకా తీక్షణంగా ఉన్నాడు. అతడు విపరీతంగా చెమటలు కక్కుకుంటున్నాడు. ఎడమవైపు ఎత్తుగా దూరంగా డ్యామ్‌ కనిపిస్తోంది. మరోవైపు కాషాయరంగు ఆస్పత్రి కనిపిస్తోంది. సాధారణంగా రోజూ నడిచే దారి కూడా కనిపిస్తోంది.
కాని ముందుకు వెళ్లాలి. అంతే! వంతెనలో ఒక భాగం మెత్తగా ఉంది. బహుశ ఉదయం కురిసిన భారీ వర్షానికి ఇది సాక్ష్యం కావచ్చు. వంతెనపైన అల్లిక ఇంకా తడిగా ఉంది.
సైబాల్‌ శరీరం సంతులనం తప్పుతోంది. కాని ఒక రంధ్రంలో కుడికాలు చిక్కుకుపోవడం వల్ల తూలి పడిపోలేదు. సరిగ్గా అక్కడ పాదం పట్టిన అవకాశం మాత్రమే ఉంది. పాదం మెలితిరిగింది. నడిచే శక్తిని పుంజుకోలేకపోతున్నాడు.

కాని ముందుకు వెళ్లాలి. శరీరం బరువునంతా ఎడమకాలి మీద ఆనించి నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తున్నాడు. ప్రతి అడుగూ అత్యంత జాగ్రత్తగా వేస్తున్నాడు. పెద్దగా ఇబ్బంది పడకుండానే పెద్దా చిన్నా కాని మరో రంధ్రాన్ని దాటుకుని పోయాడు. ఆ తర్వాత మరొకటి.. అలా అలా... ఇప్పుడతనికి బనమాలి రోడ్డు కనపడుతోంది. మరికొద్ది అడుగుల దూరంలోనే అవతలి ఒడ్డు ఉంది. అక్కడ కొద్ది మెట్లే ఉన్నాయి.

ఈ స్థితిలో సైబాల్‌ కొన్ని సెకన్ల పాటు ఏకాగ్రత కోల్పోయాడు. వంతెన నుంచి దూరంగా చూశాడు. అతడి భారమంతా ఎడమవైపే ఉండటం వల్ల వంతెన పెద్దగా ధ్వని చేస్తూ పగలడం ప్రారంభించింది. అతడి కాలు ఒక పగులు గుండా కిందకు కూరుకుపోయింది. మోకాలు దాటి తొడవరకు దిగబడిపోయింది. వంతెన ప్రమాదకరంగా ఊగుతోంది. ఎడమ చేత్తో ఒక వెదురును పట్టుకున్నాడు. మెకాలి వరకు ఎడమకాలు మెలితిరిగింది.

అయినా అతడు ధైర్యం కోల్పోలేదు. చేతి మీద భారం పెట్టి నెమ్మదిగా కాలుని పైకి తీసుకున్నాడు. వంతెన ఊగుతూనే ఉంది. 
ఎడమచేతి నుంచి రక్తం కారుతోంది. ఎడమకాలు కూడా మంటపెడుతోంది. బహుశ చర్మం ఊడిపోయి ఉండవచ్చు. మోకాలికి కూడా గట్టి దెబ్బ తగిలింది. 
సైబాల్‌ ఎట్టకేలకు వంతెన దాటిపోయాడు. కొద్దిసేపు అలాగే నిలబడిపోయాడు. 

ఆ తర్వాత అతడి పెదవుల మీద ఒక చిరునవ్వు విరిసింది. వెనక్కి తిరిగి తాను దాటి వచ్చిన వెదురు వంతెన వైపు ఒక్కసారి చూశాడు. 
సైబాల్‌ వంతెనని జయించాడు. జీవితాన్ని కూడా గెలవగలనని భరోసా ఏర్పడింది. 
సైబాల్‌ తలెత్తుకుని విజయగర్వంతో ముందుకు అడుగులు వేశాడు. శరీరమూ, మనసూ తేలికగా ఉన్నాయి.

బెంగాలీ మూలం : సుబ్రతకుమార్‌ రాయ్‌
అనువాదం: టి.షణ్ముఖరావు

మరిన్ని వార్తలు