చివరికి మురికి కాలువలోని పాలు తాగారు

25 Aug, 2019 11:15 IST|Sakshi

కథా ప్రపంచం

లండింగ్‌ రైల్వే జంక్షన్‌లో ప్లాట్‌ఫారమ్‌ మీద పేరుకున్న అర్ధరాత్రి చీకట్లని అక్కడి విద్యుత్‌ దీపాల కాంతి పూర్తిగా తరిమేయలేకపోతుంది.
మూడో నంబర్‌ ప్లాట్‌ఫారమ్‌ మీద ఒక మూలంగా ఆ యువతి మెలకువ లాంటి నిద్రలో ఉంది. దోమ కుట్టిందేమో కళ్లు తెరవకుండానే చెంప మీద కొట్టుకుంది. దోమ చిక్కిందేమోనని రెండు వేళ్లతో తడుముకుంది. దోమ దొరక లేదు. కానీ చెక్కిలి మీద మురికి మాత్రం పోగయ్యింది. ఆమెకు ఇక నిద్ర పట్టలేదు.
రెండేళ్ల పిల్లవాడు ఆమె పరుచుకున్న కొంగుపైనుంచి చల్లని నేల మీదకు జారిపోయాడు. వాడు పాలు చీకుతూ ఉండగానే ఇద్దరూ నిద్రపోయారు. గత రెండు రోజులుగా ఆమెకు ఒంట్లో బాగా లేదు. ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోతోంది.
ప్లాట్‌ఫారమ్‌ మీదికి ఒక రైలు వచ్చి ఆగింది. టీవాలా ‘వేడిటీ.. వేడిటీ’ అంటూ ఒక్కసారిగా పెట్టెలోకి చొరబడ్డాడు. ఆ పెట్టెకున్న కిటికీల్లో ఎక్కువ భాగం మూసి ఉన్నాయి. అలసిన ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు.

రైలు రాగానే వెళ్లి అడుక్కునే శక్తి కూడా ఆమెకిప్పుడు లేదు. జ్వరం తీవ్రత పెరుగుతోంది. మధ్యాహ్నం నుండే తినడానికి ఏం దొరక్కపోవడం వల్ల సాయంత్రానికి పిల్లవాడు ఏడవడం మొదలుపెట్టాడు. ఆమె వద్ద పాలు కూడా ఆర్చుకుపోయాయి. కానీ వాడు చీకటం మానలేదు. వాడ్ని ఆమె ఆపలేకపోతుంది. కానీ ఏమైనా దొరకొచ్చనే ఆశతో నిద్రలోనే దగ్గరకు తీసుకుని గుండె మీద చీరని తొలగించింది. పిల్లవాడు కూడా చీకి ఒక చుక్కా రాక విఫలమయ్యాడు. ఆకలితోనే నిద్రలోనికి జారిపోయాడు.
ఆగిన రైలు కొద్దిసేపటిలోనే బయలుదేరుతుంది. ఆమె అతి కష్టం మీద ప్లాట్‌ఫారమ్‌ స్తంభాన్ని పట్టుకుని నిలుచుంది. ఎదురుగా ఉన్న రైలు పెట్టెలో తెరచి ఉన్న కిటికీ ఆమె కంట పడింది. ఎత్తి ఉన్న షట్టర్‌ లోంచి ఒక ప్రయాణికుడు తొంగి చూస్తున్నాడు. నిజానికి అతడు ఆమె వైపే చూస్తున్నాడు.
ఆమె యవ్వనంలో అందంగా ఉండేది. సూది ముక్కూ, పెద్ద కళ్లూ, బంగారు రంగు శరీరం. ఆ అందమే ఆమెకు వరమూ శాపమూ అయ్యింది. వయసు ఇప్పుడు పాతికా ముప్ఫై మధ్య ఉంటాయి. కాని యాభై పైబడిన స్త్రీలా తయారయ్యింది. 
ప్రయాణికుడు తన వైపు చూస్తున్నాడని ఆమె గమనించింది. అప్పటికే ఆమె గుండెల మీద చీర పక్కకు తొలగిపోయి ఉంది. దాన్ని సరిచేసుకోవాలని ప్రయత్నించి మళ్లీ ఆగిపోయింది. మగవాడి బలహీనతలు ఆమెకు తెలుసు. చూపుతో ఆనందించడానికి వయసుతోనూ, అందంతోనూ, అంతస్తుతోనూ మగవాడికి పనిలేదు. నెమ్మదిగా పిల్లవాడ్ని పక్కనపెట్టి కిటికీ వైపు కదిలింది. చేపని పట్టడానికి ఎర మాదిరిగా ఆమె తన ఎదభాగాన్ని సరిగా కప్పుకోకుండానే ముందుకు అడుగేసింది.

కిటికీ ముందు నిల్చుని చొట్టలు పడిన సత్తు గిన్నెని తీసింది. వీలైనంత దీనంగా ముఖం పెట్టి అతడి ముందుంచింది. అతడు తడబడ్డాడు. లో నుంచి ఒక స్త్రీ గొంతు ఏదో అడుగుతున్నది. ‘నిద్రరావడం లేదు’ లాంటి మాట ఏదో గొణిగాడు.
ఆమె పళ్లెంలో ఒక యాభైపైసల నాణెం పడింది. దాన్ని చీర కొంగున కట్టుకుని, కిటికీ నుంచి దూరంగా వచ్చేసింది.
రైలు కదులుతున్న కూత వినపడింది.
ఇదే ప్లాట్‌ఫారమ్‌ పైన ఆమె జీవితంలో రెండు సంవత్సరాలకు పైగా గడిచాయి.
నిజానికి ఆమె శరణార్థుల కుటుంబానికి చెందింది. తండ్రితో పాటు ‘అస్లాం’ చేరుకున్నది. ఆమెకు పెళ్లి చేసిన తర్వాత తండ్రి కూడా చనిపోయాడు. భర్త ఏదో గొడవల్లో పోలీస్‌ కాల్పుల్లో మరణించాడు. దుండగుల చేతిలో ఇల్లు కూడా తగలబడిపోయింది. ఆమె నిండు చూలాలుగా పారిపోయి వచ్చింది. తననీ, తన కడుపులోని బిడ్డనీ కాపాడుకుంది. జీవన తరంగాల మీద పడుతూ లేస్తూ చివరికి చపర్‌ముఖ్‌ రైల్వే జంక్షన్‌ అనే తీరానికి చేరుకుంది. అక్కడ కొద్ది కాలమే ఉంది. ఆకలి బాధ తట్టుకోలేక బిక్షాటన మొదలుపెట్టింది. అక్కడ నుండి లండింగ్‌ జంక్షన్‌ వచ్చింది. ఇక్కడ మెజారిటీ జనాభా కోసం మతాన్ని మార్చుకుంది. పేరు మార్చుకున్నది. ఏది మార్చుకున్నా మార్పులేదు. ఈ రైల్వేయార్డులోనే ఒక పాడుబడి విడిచిపెట్టిన రైలు పెట్టెలో పిల్లవాడ్ని ప్రసవించింది. అప్పటి నుంచీ వాడే ప్రపంచంగా జీవిస్తోంది. ఈ జంక్షన్‌ మీదుగా కొద్ది ట్రైన్లు మాత్రమే వెళ్లాయి. ఆమెకు యాచన ఒక్కటే జీవనాధారంగా ఉంది. క్రమేణా ఇతర మార్గాలూ మొదలుపెట్టింది. రైల్వే ఆవరణలోనే విడిచిన రైలు పెట్టెల్లో విటులకు వేడుకనిచ్చేది.

కొన్ని మంచి చీరలను కొనుక్కుంది. రైల్వే జంక్షన్‌కు దగ్గర్లో ఉన్న కాస్త మంచి హోటల్లో మెరుగైన భోజనం చేసేది. అప్పుడప్పుడూ సినిమాలు కూడా చూసేది. ఇన్నిచేస్తున్నా ఏదో అపరాధ భావం ఆమెని వేధిస్తుండేది. తనకు తనే పతనమైనట్లుగా భావించేది. కానీ అలవాటు పడిపోయింది. ఎప్పుడైనా అలవాటు అపరాధ భావాన్ని తొలగిస్తుంది. వరుసగా విటులు లభించకపోతే రాబడి ఉండేది కాదు. ఆహారమూ ఉండేది కాదు. కాలం గడుస్తున్న కొద్దీ ఆ వృత్తిని ఆమె శరీరం భరించలేకపోతోంది. సుస్తీగా ఉంటోంది. లోలోపల ఏదో పెనుభూతం తొలిచేస్తున్న భావం కలుగుతోంది. అంతేకాదు చాలాసార్లు తన రాబడిలో కొంత భాగం లాఠీపట్టుకుని రైల్వే ఆవరణలో తిరిగే పోలీసులకు చెల్లించవలసి వచ్చేది.

లేదా విడిచిన రైలు పెట్టెల్లో విరిగిన బెర్తుల మీద వారికీ శరీరాన్ని సమర్పించుకోవాల్సి వచ్చేది. ఏదో అంతు తెలియని క్రిములు ఆమె శరీరంలో చొరబడుతున్నాయి. నిత్యం జ్వరంగా ఉంటోంది. కొన్నిసార్లు పక్కటెముకలు పగిలిపోయేటట్లు బిగ్గరగా దగ్గుతోంది. శరీరం మీద అక్కడక్కడా మొటిమలు వంటివి లేస్తున్నాయి. కదలటానికి మోకాళ్లు వణుకుతున్నాయి. రాత్రి సంపాదనలు ఇంచుమించు నిలిచిపోయాయి. చివరికి పసివాడ్ని చంకలో పెట్టుకుని రైలు పెట్టెల ముందు యాచించడం ఒక్కటే జీవనాధారంగా మారింది.

ఆమెకు పిల్లవాడి గురించి భయం పట్టుకుంది. తనపాలు వాడికి ఇవ్వడం అంటే విషం ఇవ్వడమేనన్న భీతి పీడిస్తోంది. ప్రైవేటు వైద్యుడ్ని సంప్రదించే పరిస్థితి లేదు. ధర్మాసుపత్రులు దయనీయంగా ఉన్నాయి.
గతరాత్రి ఆమె సంపాదన ఒక్క నాణెమే. కొంతసేపటి తర్వాత లేచి ఒక అరకప్పు పాలని కొని తెచ్చి పైపు నీటితో ఆ పాలని ఒక కప్పుగా చేసింది. పిల్లవాడు ఆ పాలని ఒక్క తృటిలో తాగేశాడు. తల్లి పైకి కాళ్లూ చేతులు విసురుతూ ఆడుకోవడం మొదలుపెట్టాడు. పాలపాత్రని పైకి ఎత్తి పట్టుకుని అందులో పిల్లవాడు మిగిల్చిన ఒకటి రెండు చుక్కల పాలని తాగింది. తర్వాత పైపు వద్దకు వెళ్లి దోసిలి పట్టి మరికొంచెం నీళ్లు తాగింది. సరిగ్గా అప్పుడే ఒక వార్త ఆమె చెవిని పడింది. దేవాలయంలో గణేష్‌ విగ్రహం పాలు తాగుతోంది అని!! 
ఆమె ముఖం మీద నీటిని చల్లుకుంది. చిరిగిన చీర కొంగుతో చేయి తుడుచుకుని పిల్లవాడ్ని దగ్గరపెట్టుకుని ప్లాట్‌ఫారమ్‌ మీద కూర్చుంది.

బుక్‌ స్టాల్‌ కుర్రాడు పక్కనే ఉన్న స్వీట్‌ స్టాల్‌ యజమానితో అంటున్నాడు. ‘‘దాదూ! నువ్వీ సంగతి విన్నావా? మన ఊర్లో ఒక అద్భుతం జరుగుతోంది. మన దేవాలయంలో గణేష్‌ ప్రతిమ పాలు తాగుతున్నాడట. ఆ దృశ్యం చూడ్డానికి వెళ్దామా?’’
‘‘తప్పకుండా వెళ్దాం పద!’’
ఈ వార్త ఆ రైల్వే జంక్షన్‌లో తృటిలోనే దావానలంలా వ్యాపించింది. అందరి నోటా అదే మాట. నమ్మిన వారు కొందరు. నమ్మని వారు కొందరు. ఇటూ అటూ కాక పెదవులు చప్పరించిన వారు కొందరు.. ఆ దృగ్విషయానికి శాస్త్రీయ కారణాలు చెప్పిన వారు మరికొందరు. వాటిని ఖండించిన వారు ఇంకొందరు. ఆ మధ్యాహ్నం ముందుగా ప్రకటించిన రైళ్లు ఏం లేవు. ప్లాట్‌ఫారమ్‌  మీద జనం సన్నగిల్లారు. చాలా మంది తమ దుకాణాల షట్టర్లు మూసి వేసి దేవాలయం వైపు పరుగులెత్తారు. రోజు గడుస్తోంది. స్టేషన్‌ ఖాళీగా ఎడారిలా ఉంది. దుకాణాలన్నీ మూతపడ్డాయి. డ్యూటీలో ఉన్న స్టేషన్‌ మాష్టార్‌ పదవీ విరమణకు చేరువలో ఉన్నాడు. ఆయనొక్కడే స్టేషన్‌లో మిగిలిపోయాడు. అతడు స్టేషన్‌ విడిచి వెళ్లే అవకాశం లేదు. కాబట్టి కూర్చీలో కూర్చుని బద్ధకంగా రెండు చేతుల్తో ముఖం కప్పుకున్నాడు.

ఇక యాచించడానికి ఎవరూ లేరు. ఆమె ప్లాట్‌ఫారమ్‌ విడిచి వెళ్లకతప్పదు. బిడ్డని చంకన వేసుకుని, చేతిలో సత్తుపళ్లెంతో నెమ్మదిగా దేవాలయం వైపు అడుగులు వేసింది.
వీధులు అసాధారణంగా జనాలతో నిండి ఉన్నాయి. స్కూటర్‌ ఆటో రిక్షల కూతలతో రణగొణధ్వనులతోనూ రోడ్లు కళకళలాడుతున్నాయి. గణేష్‌ దేవాలయం ముందర అప్పుడే స్నానాలు ముగించుకుని మంచి దుస్తులు వేసుకున్న కన్యలు, ఎర్రని అంచు తెల్ల చీరలు ధరించిన స్త్రీలు, పట్టుపంచెల మడి కట్టుకున్న పురుషులు క్యూ కట్టారు. స్త్రీలకూ పురుషులకూ వేరువేరు క్యూలైన్లు ఉన్నాయి. మధ్యాహ్న భోజన విరామం తర్వాత చాలా మంది రైల్వే ఉద్యోగులు పని ఎగ్గొట్టి భక్తుల వరుసలో చేరిపోయారు. చాలా పొడవాటి క్యూలు ఏర్పడ్డాయి. ప్రతి ఒక్కరి చేతిలోనూ ఒక చిన్న పాత్రతో గానీ, గ్లాసుతో గానీ పాలున్నాయి.
పాల పాత్ర విగ్రహం  తొండం అగ్రభాగాన్ని తాకగానే పాలు మాయమవుతున్నాయనీ, అంటే గణపతి తాగేస్తున్నాడనీ అందరూ పదే పదే విన్నారు. విన్నదే ప్రచారం చేశారు.

ఇటువంటి పరిసరాల్లోకి ఆమె బిడ్డని ఎత్తుకుని ప్రవేశించింది. దేవాలయం వెలుపల ఉన్న జనం చాలా ఉత్సాహంగా ఉన్నారు. కళ్ల ఎదుటే జరుగుతున్న అద్భుతం వారిని చకితుల్ని చేస్తుంది. దేశవాప్తంగా అన్ని చోట్లా గణపతి విగ్రహాలు పాలను తాగుతున్నట్లు దేశం నలుమూలల నుంచి వార్తలు వచ్చి చేరుతున్నాయి.
దేవాలయ ద్వారం వద్దనే పాల దుకాణాలు వెలిశాయి. పోటాపోటీగా అమ్ముతున్నారు. రెండు రూపాయలకు అర కప్పు పాలు దొరుకుతున్నాయి. నిమిషాల వ్యవధిలో పెద్ద గంగాళాలు ఖాళీ అయిపోతున్నాయి. పిల్లవాడు అందరిచేతుల్లోనూ పాలని చూశాడు. బిగ్గరగా ఏడుపు లంకించుకున్నాడు.
ఈ పవిత్రమైన పరిసరాల్లో ఒక పసిపిల్లవాడి ఆకలి కేకలు అసందర్భంగా ఉన్నాయి. కొందరు భక్తులకు వాడి రోదన చికాకు కలిగిస్తోంది. 
ఆమె వాడ్ని సముదాయించడానికి ప్రయత్నించింది. ఊరడిస్తున్న కొద్దీ వాడి ఏడుపు స్థాయి పెరిగిపోతోంది. చాచి లెంపకాయలు కొట్టింది. పిల్లవాడు ఇంకా పెద్దగా ఏడ్చాడు. భక్తుల చిరాకు ఇంకా పెరిగిపోయింది. భక్తికి భంగం కలుగుతున్నందుకు కోపంగా చూస్తున్నారు. కొందరైతే పైకే రుసరుసలాడుతూ ‘పిల్లవాడ్ని సముదాయించవమ్మా!’ అని కసురుతున్నారు.
అక్కడ చేరిన ప్రజలందరూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. అందుకు భంగం కలుగుతున్నందుకు సహించలేకపోతున్నారు. ‘‘ఫో.. పోవమ్మా!’’ అని ఒకరు.. ‘‘ఇలాంటి చోటికి నిన్నెవ్వరు రానిచ్చారు? బయటికి పో!’’ అని మరొకరు.. ఆమె మీద రగిలిపోయారు.

క్రమశిక్షణ పర్యవేక్షిస్తున్న వలంటీర్లు పరుగుపరుగున ఆమె వద్దకు చేరుకున్నారు. మాటలతోనూ కర్రలతోనూ అదిలించి ఆమెను అక్కడి నుంచి తరిమేయడానికి ప్రయత్నించారు. అయితే ఎవరూ చేయి చేసుకోలేదు. బహుశా ఈ మురికి యువతిని తాకడం వారికి ఇష్టం లేక కావచ్చు.
ఇక లాభం లేదని ఆమె గ్రహించింది. పిల్లవాడ్ని చంకనెత్తుకుని దేవాలయం ఆవరణ వెలుపలికి బయలుదేరింది.
గణపతి విగ్రహం ముందు నాణేలు ఒక పెద్ద కుప్పగా పోగయ్యాయి. ఆ తెల్లని పాలరాతి విగ్రహం దక్షిణలూ పాలలో మునిగిపోయింది.
ఇంతకీ ఆమెకు ఒక్క నాణెంగానీ పిల్లవాడికి ఒక్క చుక్క పాలు గానీ చిక్కలేదు. నిజానికి ఇంత మంది పుణ్యాత్ములున్న చోట ఆమె పళ్లెం నిండిపోవాలి. ఈ రోజు అందుకు భిన్నంగా జరిగింది.
కుమ్ముకుంటూ, తోసుకుంటూ ఒక్కరినొకరు తిట్టుకుంటూ ఉన్న జనం మధ్య నుంచి కాస్త ఎడంగా వచ్చేసింది. చంకలో ఉన్న పిల్లవాడు ఆకలితో చుట్టుకు పోతున్నారు. నెమ్మదిగా స్టేషన్‌ వైపు అడుగులు వేసింది.
ఆమె కడుపులో నుంచి ఒక పుల్లని ద్రవం గొంతులోనికి వచ్చి నోరంతా నిండిపోయింది. వాంతి వచ్చింది. తీవ్రమైన ఆకలి వల్ల ఉదరంలో విపరీతమైన నొప్పి వచ్చింది. కదిలే శక్తి లేదు.
దేవాలయం ఆవరణలోనే జనానికి కొంచెందూరంలో ఒక చెట్టు నీడలో చతికల పడిపోయింది. పిల్లవాడు చెట్టు మొదలుకు చేరబడి ఏడవడం మొదలుపెట్టాడు.

కళ్ల మీద చీకట్లు కమ్ముకుంటున్నట్లు అనిపించింది ఆమెకు. కళ్లు తెరుచుకుని ఉంచాలని గట్టిగా ప్రయత్నించింది. చెట్టు కాండాన్ని అలంబన చేసుకుని నిలదొక్కుకుంది. మరి ఏడ్చే శక్తి లేక పిల్లవాడూ సొమ్మసిల్లిపోయాడు. ఆమె కూడా చెట్టుకు చేరబడిపోయింది.
అకస్మాత్తుగా ఆమె దృష్టిలో ఒక వింత దృశ్యం పడింది. గణేష్‌ విగ్రహానికి అభిషేకం చెయ్యగా వెలుపలికి నీరు వచ్చే చిన్న కాలువలో పాలు ప్రవహంలాగా వస్తున్నాయి. ఆ ప్రవాహం ఒక పెద్ద మురికి కాలువలోనికి చేరుతోంది.
పిల్లవాడి కళ్లల్లో నీళ్లు వస్తున్నాయి. ఆమె గుండెకు పొట్టకూ మధ్య ఒక్కసారిగా నొప్పి వచ్చింది. మెలికలు తిరిగిపోయింది. మోకాళ్ల మీదనైనా ముందుకు వెళ్లడానికి శక్తినంతా కూడదీసుకుంది. చుట్టూ చూసింది. తన సత్తు పళ్లాన్ని కాలువలో పెట్టింది. చుట్టూ భక్తులెవరూ లేరని నిర్ధారించుకుంది. ఒక్క సెకెన్‌లో పళ్లెం నిండా పాలు చేరాయి.
ఆమె ఆ పాలని తీసి పిల్లవాడి చేతికి అందించింది. వాడు ఆ పళ్లాన్ని ఆమె నుంచి గుంజుకుని తాగడం మొదలుపెట్టాడు. వాడి ఆకలి తీరింది. కాళ్లు చేతులు ఆనందంగా ఆడించసాగాడు.
పాల ప్రవాహం ఆమె ఆకలిని మరింత ప్రేరేపించింది. నేల మీద పడి పొట్టను చేత్తో పట్టుకుంది. కాస్త శక్తి తెచ్చుకుని.. మురికి కాలువలోని పాలను దోసిట్లో తాగడం ప్రారంభించింది. ఎన్నాళ్లగానో ఉన్న ఆకలి విజృంభించింది. ఏదో ఆవహించినట్లుగా ఆ పాలని తాగేస్తోంది.

పాలతోనూ బురదతోనూ ఆమె శరీరం నిండిపోయింది. ఇంకా తాగుతూనే ఉంది. అంతలో శరీరం వణకడం మొదలైంది. అయినా ఆమె పాలు తాగడం ఆపలేదు. శరీరం లోపలి ఉష్ణోగ్రత పెరిగి మరింతగా వణికింది.
అత్యాశతో అమితంగా పాలని తాగడం వల్ల గుండె కింద భాగంలో భరించలేని నొప్పి వచ్చింది. కళ్లు బయటికి వచ్చినట్లు అనిపించింది. అయినా శక్తినంతా ఉపయోగించి ఇంకా తాగసాగింది. గుండె కింద నొప్పి మిగతా శరీరమంతా వ్యాపించి తిమ్మెరెక్కినట్లయింది.
లేచి నిలబడబోయింది. సాధ్యం కాలేదు. పిల్లవాడు ఒక గులకరాయిని తీసి ఆడుకుంటున్నాడు. తల్లి బాధని తెలుసుకునే వయసు వాడికి లేదు. ఆమె వాడి వైపు తిరగడానికి ప్రయత్నించింది. శరీరం పట్టు తప్పి కాలువలోపడిపోయింది. తెల్లటి పాల ప్రవాహం నల్లగా మారిపోయింది. ఇంచు మించు ఆ మురికి కాలువలో కిందకు కొట్టుకుపోబోయింది.
కాలువ ఒడ్డునున్న మట్టిని పట్టుకుని పైకి లేవడానికి ప్రయత్నించింది. ఆమె తల వంగిపోయింది. శరీరం నియంత్రణ లేకుండా వణకసాగింది. విపరీతమైన చలి ఆవహించింది. ఆ దశలో ‘‘బాబూ! నా తండ్రీ’’ అని అరవబోయింది. మాటపైకి రాలేదు. ఆమె శరీరం మరి కొద్దిసేపు వణికి ఆ తర్వాత శాశ్వతంగా.. పూర్తిగా చలన రహితంగా మారిపోయింది.
బెంగాలీ మూలం : దీపేందు దాస్‌
అనువాదం: టి.షణ్ముఖరావు 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా