కొ కొ కొ కొ....కె కె కె కె!

23 Feb, 2020 09:47 IST|Sakshi

ఇది మీ పేజీ

బజార్లూ, గడ్డివాములూ, పెంటగడ్డలూ తిరిగీ తిరిగీ, పుంజులూ పెట్టలూ కోడిపిల్లలూ సాయంత్రం ఇంటికిజేరేవి. కొ కొ కొ కొ అని పిలుసుకుంటూ మా అమ్మ వాటికి నూకలు జల్లేది. వాటికి జొన్నలు, నూకలు జల్లడం అంటే నాగ్గూడా ఆనందంగా ఉండేది.  అవి కె కె కె కె అనుకుంటూ మా అమ్మ చుట్టూ తిరిగేవి. లీడర్‌ లాగా కనబడే కోడిపుంజు తన రంగురంగుల కిరీటాన్ని ఊపుతూ, తల బాగా పైకి లేపి కె కె కె కె అనుకుంటూ కోళ్లను అన్నింటినీ పరికించి సూసేది. పిల్లలకోడి మాత్రం పిల్లల మధ్యలో ఉండి, తినీ  తిననట్టు తింటూ పిల్లలకు నూకలు అందుతున్నయా లేదా అని చూస్తూండేది. పిల్లల మధ్యకు ఇంకో కోడి వస్తే దాని ఎంటబడి గెదిమేది.

మా నాయన, నేను, మా అక్కలు వాటి పక్కనే నులక మంచం మీదగూసోని చూస్తుండేది. అప్పుడు మాకు ఏ కందులో, పెసలో, ఉలవలో ఏంచినయిబెట్టేది మా అమ్మ. నూకలన్నీ తిన్న తరువాత కోళ్ళన్నీ ఒక్కటొక్కటిగా ఆ గూట్లొకి జేరేవి. కొన్ని కిలాడి కోళ్లు మాత్రం అందులోకి చేరేవి కావు. వాటికోసం మల్ల కొన్ని నూకలని కోళ్ల గూట్లొకి జల్లేది మా అమ్మ. దాంతో అవిగూడా గూట్లొకి వెళ్ళేవి. అప్పుడు ఒక గిన్నెలో నీళ్లుబోసి గూటిలోపలబెట్టి బండతో మూసేసి, బండ కిందబడకుండా ఒక కర్రని అడ్డు బెట్టేది. కొన్నిసార్లు ఒకటి రెండు కోళ్లు బెదిరి పోయి గూట్లొకి వచ్చేవి కావు. వాటిని పట్టుకుందామని ప్రయత్నిస్తే అవి ఇంకా బెదిరి గుమ్మి మీదికో గోడ మీదికో ఎగిరేయి. కొన్నిసార్లు రాత్రంతా అక్కడే ఉండేయి. మల్ల పొద్దున్నే గూట్లో నుండి వదిలిన కోళ్లతో పాటు కలిసి వాటి పనిలో అవి ఉండేవి. తెల్లవారుజామున కోళ్లు కూయంగనే మా నాయనా లేసి ఎడ్లనితోలుకొని మోటగట్టడానికి బొయ్యేటోడు.

గుడ్లకొచ్చిన కోడి నెమ్మదిగా, బరువుగా కె కె కె అనుకుంటూ మధ్యాహ్నం పూట ఇంట్లోకొస్తుండేది. ఎవరూ జూడట్లేదని నిర్ధారించుకొని దానికి కేటాయించిన గంపలోకి బోయేది. గుడ్డుబెట్టి చాలా తేలిగ్గా ఎల్లిపోయేది. కొన్ని కోళ్లు గడ్డివాముల్లోనే గుడ్లు బెట్టేయి. వాట్ని సాయంత్రం ఎతికి తెచ్చుకునేది. అప్పుడప్పుడు ఈ గుడ్లకాడ అమ్మలక్కలకు వాదనలు అయ్యేది. ఇట్ల ఇరవై ముప్పై గుడ్లు బెట్టినంక కోడి పొదుగుడుకొచ్చేది. కోడి పొదిగితే గుడ్లన్నీ పిల్లలయ్యేది. రంగురంగుల ఆ ముప్పై పిల్లలు ఇంట్లెదిరుగుతుంటె ఇంద్రధనుస్సు తిరుగుతున్నట్టే ఉండేది. కోళ్ళకి మనుషులతోనే గాక, శానా ప్రమాదాలు వచ్చేవి. ఉన్నట్టుండి అర్దరాత్రి గూట్లోని కోళ్ళన్నీ క్కెక్కెక్కెక్కెక్కెక్కే అని మొత్తుకునేయి.

ఇంగ కోళ్ల గూట్లెకి పాము బోయిందని ఇంటిల్లిపాదీ లేసి, లాంతరు ముట్టిచ్చి, బారెడు పొడుగు కర్రలుదీసుకొని గూడుకాడికి బోయేది. బండ మూతదీసి, కిరసనాయిలు లాంతరు వొత్తి పెద్దగజేసి దగ్గరికి బెట్టి సూస్తే కోళ్ళన్నీ లోపల ఒక మూలకు నక్కి బెదిరిపోయి ఉండేయి. గూడు మూతదీస్తే కోళ్లు బయటకు రావాలెగదా, కానీ, అవి రావు. ఆ లాంతరు ఎలుతురులో భయం భయంగా జూసి పామును కనిపెట్టేది. అది సుట్టలు సుట్టలు జుట్టుకొని ఉండేది. కర్రతో  ఒడుపుగా పాము నడుముని ఒత్తిపెట్టి ఇంకో కర్రతోని గొట్టేది. ఒత్తిపట్టకుంటే అది అమాంతం మీదికే వస్తది. ఇంగ దాన్ని జంపి ఊరి బయట బొందలో ఏసొచ్చేది. ఈ గోలకి సుట్టుపక్కల మూడిండ్లోళ్లులేసేవాళ్ళు.  పిల్లులు, పాములు, కుక్కలు తినంగ, కూరపాట్ల రోగం దగిలి సావంగ ఆ కోళ్ళల్లో సగమే మిగిలేయి. ఇంగ ఆ కోళ్ళనిగొనడానికి బేరగాళ్ళు సైకిలు మీద పెద్ద బుట్ట గట్టుకొని, దాని సుట్టూ వలగట్టుకొని, సాయంత్రం కోళ్ళన్నీ గూళ్లల్ల జేరినంక వచ్చేది. కోల్లగూట్లెకి తలబెట్టి, సెయ్యిజాపి ఒక్కోకోడి కాళ్ళుబట్టి బయటకు లాగేటోన్ని.

ఒక్కోసారి రెండు, మూడు, పది కోళ్ళమటుకు అమ్మేది. వాట్ని అమ్మితే వచ్చే డబ్బులు ఇంటి అవసరాలకు అక్కరకొచ్చేవి. ఒక్కోసారి సుట్టాల్ల కోసం పట్టపగలు కోన్ని పట్టుకోవాల్సి వచ్చేది. అది ఏ గడ్డివాములో, ఏ పెండగడ్డమీద మేస్తుందో సూసి మెల్లగా ఇంట్లోకి తోలుకొని వచ్చేది. కానీ, ఈ శకలు ఎందుకుబడుతుండ్రో కొన్ని సదువుకున్న కోళ్లు గ్రహించి క్కెక్కెక్కెక్కె అని భీకరంగా అరుస్తూ, రెక్కలన్నీ ఊడిపోతున్నా లెక్కజేయకుండా ఎగిరిపోయ్యేయి. ఒక్కోసారి అకస్మాత్తుగా మీదికే ఎగిరేయి. వాటికాళ్ల గోర్లు కత్తుల్లావుండి మొకం మీన్నో, సేతులమీన్నో గీసుకొనేవి. ఉరుకుతున్న కోడికి సూటిజూసి కర్ర ఇసిరేది. అది తగిలి కొన్నిసార్లు కోడి కిందబడేది. ఇంగ ఉరికి దాన్నిపట్టుకునేది. కొన్ని సదువుకున్న తెలివైన కోళ్లు కర్రదలక్కుండా తప్పిచ్చుకొని పోయేటివి. ఇగ దాన్ని ఒదిలి ఇంకో అమాయకపు కోన్నిజూసి మెల్లగ పనమటింట్లెకి దోలి తలుపుబెట్టేది. అది విషయాన్ని గ్రహించి, గుడ్లెర్రజేసి అమాంతం మీదికి వస్తున్నా లెక్కజేయకుండా రొండు సేతులతో దొరకబట్టి, దాని రొండు కాళ్ళని జతజేసి ఒక సెయ్యితోని, ముక్కుతో పొడవకుండా మెడకాయని ఇంకోసెయ్యితోని కదలకుండా పట్టుకొనేది.

ఇంగ కోణ్ణిగొయ్యడం అనేది ఒక కళ. అది అందరికీ రాదు. ఇంగ దాని బూరుబీకి, కట్టెలపొయ్యిమీద కాపి, పసుపు, ఉప్పు దాని ఒంటికిబూసి కడిగేది. ఇగ సేదు, పొట్టపేగులు తీసి ముక్కలుగోసేది. ఇంగ ఈపని నడుస్తుండంగనే నేను బడి నుంచి వచ్చి పుస్తకాల సంచి కొయ్యకుదలిగిచ్చి, కాసేపు కోన్ని గోస్తున్న అమ్మ పక్కన గూసునేది. అప్పటికే సుట్టాన్ని దీసుకొని గుమ్మి సారకోసం మా నాయన పొయ్యుంటడు. ఇంగ నేను గాల్లో తేలుకుంటూ దోస్తులకాడికి బోయి, కాసేపు ఆడుకోని ఇంటికి వొచ్చేటోన్ని. ఇంట్లె కోణ్ణి గోసిన సంగతి మాత్రం దోస్తులకు సెప్పెటోణ్ణిగాదు. ఎందుకంటే మొత్తం పుల్లెగాండ్ల కొడుకులే, వాసనదగిల్తే సాలు వచ్చి గుమ్మికాడ నిలబడతరు. అందుకని నేను సచ్చినా సెప్పకపొయ్యేటోన్ని. గుమ్మి ఇంటికి మధ్యలో ఉండేది. దాంట్లె ఎప్పుడూ ఒక పుట్టెడన్నాఒడ్లు ఉండేయి.

దాని పక్కనే ఒక పెద్ద రోలు ఉండేది జొన్నలుదొక్కడానికి. ఇంతలో మా నాయన, సుట్టం మాంచి బిర్రుగా వచ్చేటోళ్లు. వాళ్లకి గుమ్మి పక్కన నున్నగ ఊకి, నులకమంచం ఏసేది. దానిమీద ఊళ్లల్లకొచ్చి వాయిదాలమీద అమ్మేవాళ్ళకాడ కొన్న దుప్పటి ఏసేది. ఇంగ దానిమీద కూసోని మా నాయన, కిర్రు సెప్పుల సుట్టం చర్చలు జేస్తుండే వాళ్ళు. ఆయన సెప్పులు మంచం పక్కనే ఉండేవి. వాటికి గులాబీ పూలమాదిరి ఎర్రటి పూలు ఉండేవి. వాటిని తొడుక్కొని నడుస్తుంటే కిర్రు కిర్రు అనే సప్పుడు శాలా దూరం ఇనపడేది. ఆయన ఏ కాలంలో అయినా గొడుగు పట్టుకొనే వచ్చేవాడు. తలకు పేద్ద రుమాలు జుట్టేవాడు. వడిదిరిగిన మీసకట్టుతో గంభీరంగా ఉండేవాడు. ఆయన శానా పంచాదిలకు పెద్దమనిషి. వాళ్ళు సుట్టుపక్కల ఊర్లల్ల జరిగిన పంచాయితీలు, పెద్దమడుసులు ఇచ్చిన తీర్పులు, అందులో మంచి చెడ్డలు, కుటుంబ ఆర్ధిక పరిస్థితి, సేయబోయే పిల్లల పెండ్లిళ్ల గురించి మాట్లాడుకునేటోళ్లు.

దాంట్లో వంశ గౌరవం ఎక్కువగా ఇనపడుతుండేది. ఆ చర్చలల్లో నాకు, అక్కలకీ, అమ్మకీ పెద్దగా పాత్ర ఉండేది గాదు. అయ్యి మాకు తెలియవని, అసలు మాకు వాటి అవసరం లేదనీ వాళ్ళ ఉద్దేశ్యం. ఇంగ ముచ్చట్లు అయ్యేలోపుల ముక్కుపుటాలదిరే వాసనతోని కోడి కూర రడీ అయ్యేది. వంటింట్లో రెండు పీటలు యేసి, వాళ్ళని బువ్వకు పిలిసేది. వాళ్ళు గాబుకాడికి పోయి కాళ్ళూ సేతులూ కడుక్కొని వచ్చి పీటలమీద కూసునేది. ఇంగ కటకటమని బొక్కలు గొరుక్కుంట, జుర్రుకుంట వాళ్ళు తింటుండేది. ఇంగ నా ఆత్రం ఆగట్లేదని ఒక పళ్లెంలో అన్నంబెట్టి, కూర ఏసి నాకు ఇచ్చేది మా అమ్మ. గిప్పుడు కుర్రకారు ఏసే షార్ట్స్‌ నేను అప్పుడే ఏసేది. కాకుంటే గప్పుడు వాట్ని లాగులు అనేటోళ్లు.

ఇంగ మంచం మీద గూసోని, నల్లగా మాసిన లాగున్న రెండు తొడలమీద బెట్టుకొని, ఊరిచ్చుకుంట ఊరిచ్చుకుంటా తినేటోన్ని. రోజుటి కంటే నాలుగుముద్దలు ఎక్కువదినేది. కోడిపులుసు ఘాటుకు ముక్కు నుండి గారే సీమిడిని కుడి భుజానికి రుద్దేది. అక్కడ అట్టగట్టేది. సెయ్యిని, పళ్ళాన్ని నాక్కుంట నాక్కుంట గాబుకాడికెల్లి, పళ్లెం అక్కడబడేసి, సెయ్యిమీద నీళ్లుజల్లుకొని, లాగుకు తుడుసుకుంట, కోళ్లగూడు పక్కనుండి బజార్లబడేటోన్ని. అప్పుడు సెయ్యి వాసన జూసుకుంటే కోడికూర వాసన గుబాళిస్తుండేది. ఆ వాసన తెల్లారి బడికిబొయ్యేదాకా ఉండేది. దోస్తుగాళ్లు ఎవరన్నా కోడికూరదిన్ననంటే నమ్మకుంటే, ఈ సెయ్యి వాని ముక్కుదగ్గరబెట్టేది. అంతే, సచ్చినట్టు నమ్మేది!
- యేదుల గోపిరెడ్డి, హైదరాబాద్‌
 
మాతో పంచుకోండి! 
ఈ పేజీ మీకోసమే! మీ జీవితంలో మీకెదురైన, మీ అనుభవంలోకి వచ్చిన సరదా సంఘటనలను, అనుభూతులను మాతో పంచుకోండి! 
ఇక్కడ ఈ పేజీలో వాటిని ప్రచురిస్తాం. మీతో పాటు సాక్షి పాఠకులందరినీ ఆ సంఘటనను తెలుసుకొని (మీరైతే తలచుకొని) ముఖంపై నవ్వులు పూసుకునేలా చేస్తాం!! మీ అనుభవాలు పోస్ట్‌ ద్వారా కానీ, మెయిల్‌ (funday.kathalu@gmail.com) ద్వారా కానీ ఫన్‌డేకు పంపించండి! 

మరిన్ని వార్తలు