హెచ్చరిక లేని జబ్బు హెపటైటిస్‌

22 Jul, 2017 23:34 IST|Sakshi
హెచ్చరిక లేని జబ్బు హెపటైటిస్‌

ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో హెపటైటిస్‌ ఒకటి. వైరస్‌ కారణంగా సోకే హెపటైటిస్‌ వ్యాధిలో ఎ, బి, సి, డి, ఇ రకాలు ఉన్నాయి. అన్ని రకాల హెపటైటిస్‌ను లెక్కలోకి తీసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య దాదాపు 50 కోట్ల వరకు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా. వీరిలో ముఖ్యంగా హెపటైటిస్‌–బి, హైపటైటిస్‌–సి రకాలతో బాధపడుతున్న వారు సుమారు 35 కోట్ల వరకు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్‌ బారిన పడి ఏటా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య పది లక్షలకు పైగానే ఉంటోంది. గత ఏడాది హెపటైటిస్‌ కారణంగా 13.4 లక్షల మంది మరణించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ లెక్కలు చెబుతున్నాయి.

 హెచ్‌ఐవీ, క్షయ వ్యాధులతో మరణిస్తున్న వారి కంటే ఈ సంఖ్య ఎక్కువగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి సోకిన చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. రక్తపరీక్షలు జరిపిస్తే తప్ప వ్యాధి సోకిన విషయం తెలుసుకోవడం సాధ్యం కాదు. హెపటైటిస్‌ లక్షణాలు ఒక్కోసారి కొద్దికాలం ఉండి తగ్గిపోవచ్చు. ఒక్కోసారి దీర్ఘకాలం కూడా ఉండవచ్చు. హెపటైటిస్‌ సోకినట్లు గుర్తించిన వెంటనే తగిన చికిత్స తీసుకోకుంటే కాలేయం పూర్తిగా దెబ్బతిని ప్రాణాంతక పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. హెపటైటిస్‌ ముదిరితే కాలేయంపై మచ్చలు ఏర్పడటం, లివర్‌ క్యాన్సర్‌ తలెత్తి చివరకు కాలేయం పూర్తిగా విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి.

ఇవీ విశేషాలు...
ప్రధానంగా హెపటైటిస్‌ వైరస్‌ కారణంగా సోకే వ్యాధి. అపరిశుభ్రమైన నీరు, ఆహారం, రక్తమార్పిడి,  లైంగిక చర్యలు, ఒకరు వాడిన సిరంజీలు మరొకరు వాడటం, మితిమీరి మద్యం తాగడం, కొన్ని రకాల మందులు వాడటం, ఆటో ఇమ్యూన్‌ వ్యాధులకు లోనవడం వంటి కారణాల వల్ల హెపటైటిస్‌ సోకే అవకాశాలు ఉంటాయి.

తల్లిపాల ద్వారా చిన్నారులకు కూడా ఈ వ్యాధి సోకుతుంది. కొందరిలో మద్యం అలవాటు లేకపోయినా ఇతర కారణాల వల్ల కూడా ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి.

హెపటైటిస్‌–ఎ, ఇ రకాల వైరస్‌లు ఎక్కువగా కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తాయి. హెపటైటిస్‌–ఎ, బి, డి రకాలకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్లతో వీటిని పూర్తిగా నిరోధించే అవకాశాలు ఉన్నాయి.

హెపటైటిస్‌ సోకిన చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. అయితే, కొందరిలో ఆకలి లేకపోవడం, చర్మం కాస్త పసుపు రంగులోకి మారడం, అలసట, కడుపు నొప్పి, వికారం,  వాంతులు, డయేరియా, కీళ్లనొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

దీర్ఘకాలికంగా బాధించే ఇతర రకాల హెపటైటిస్‌ను కూడా మందులతో నయం చేసే అవకాశాలు ఉన్నాయి. మెరుగైన ఔషధాలు, చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపు 95 శాతం మేరకు హెపటైటిస్‌–సి కేసులను వైద్యులు పూర్తిగా నయం చేయగలుగుతున్నారు. హెపటైటిస్‌ను 2030 నాటికి పూర్తిగా నిర్మూలించాలని డబ్ల్యూహెచ్‌ఓ లక్ష్యంగా పెట్టుకుంది.

కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా, ఇతర పరాన్నజీవుల ద్వారా కూడా హెపటైటిస్‌ సోకే అవకాశాలు ఉంటాయి. అరుదుగా ఈ వ్యాధి జన్యు కారణాల వల్ల సోకే అవకాశాలు కూడా లేకపోలేదు.

సాధారణంగా రక్తపరీక్షల ద్వారా హెపటైటిస్‌ను గుర్తిస్తారు. దీర్ఘకాలికంగా ఎలాంటి లక్షణాలు లేకుండా ఉన్నవారిలో హెపటైటిస్‌ను గుర్తించడానికి లివర్‌ బయాప్సీ పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది.

హెపటైటిస్‌ నిర్మూలన లక్ష్యంగా డబ్ల్యూహెచ్‌ఓతో పాటు వరల్డ్‌ హెపటైటిస్‌ అలయన్స్‌ కృషి చేస్తోంది. ఈ ఏడాది నవంబర్‌ 1 నుంచి 3 వరకు బ్రెజిల్‌లోని సావో పాలోలో జరిగే ప్రపంచ హెపటైటిస్‌ సదస్సుకు బ్రెజిల్‌ ప్రభుత్వం కూడా చేయూత అందిస్తోంది.

మరిన్ని వార్తలు