పద్యానవనం: ఏం చెప్పారన్నదే...

9 Mar, 2014 00:04 IST|Sakshi
పద్యానవనం: ఏం చెప్పారన్నదే...

లోకములన్నియున్ గడియలోన జయించిన వాడ, వింద్రియా నీకము, చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్దు జేయు నీ భీకర శత్రులార్వుర బ్రభిన్నుల జేసిన బ్రాణికోటిలో  నీకు విరోధి లేడొకడు నేర్పున జూడుము దానవేశ్వరా!
 
 శత్రువులెవరు? మితృలెవరు? తేల్చుకోవడంలోనే విజ్ఞత ఉంటుంది. వెనకట ఎవరో ఒకావిడ పిల్లను చంకలో పెట్టుకొని ఊరంతా వెతికిందట! హిరణ్యకశ్యపుని స్థితి కూడా అలాగే ఉందన్నట్టు పరోక్షంగా తెలియజేస్తాడు ఆయన సుపుత్రుడు ప్రహ్లాదుడు. ఎక్కడో కనిపించని వారిని శత్రువుగా నీకు నీవే ఖరారు చేసుకొని, ఓడించి గెలుస్తానని వెతుకులాడుతావ్, నీలోనే దాగి వున్న అసలు శత్రువుల్ని గుర్తించవు, గెలిచేందుకు యత్నించవు అన్నది భావన. కొలవాల్సింది ఎవర్ని? గెలవాల్సింది ఎవర్ని? సర్వ శాస్త్ర పారంగతుడైన హిరణ్యకశ్యపునికే సూక్ష్మం చెబుతాడు బుడతడై ఉండి. గెలవాల్సిన వారినింకా తన తండ్రి గెలువనే లేదంటాడు. ఆ చెప్పడం, లేదా చెప్పించడం అనండి చాలా గొప్పగా ఉంటుంది పోతన శైలి.
 
  పదాలు కూడా సందర్భోచితంగా వాడతాడు. ఇక్కడ చూడండి, దానవేశ్వరా! అంటాడు. అంటే రాక్షసుల్లోనే అత్యున్నతుడివి. మరింకేముంది, గెలవాల్సిన వారిని గెలిచి ప్రాణికోటిలో ఇక విరోధులే లేకుండా చేసుకుంటే దేవతల్నీ అధిగమించగలవని గుర్తు చేయడం అన్నమాట. ఆయనేమో అది వినడాయె! తాను వినకపోగా, ప్రహ్లాదుణ్ని హరినామ స్మరణ చేయొద్దంటాడు. ప్రగాఢ శత్రువని తాను తలబోచే హరి, తనకు వెరచి ఎక్కడో దాక్కున్నాడని ఆయన కోసం లోకాలన్నీ వెతుకుతాడు. విసిగి వేసారి, ‘పోనీ భక్తుడవై కీర్తిస్తున్నావు కదా! ఎక్కడున్నాడో నీ హరిని చూపు?’ అని ప్రహ్లాదుణ్నే నిలదీస్తాడు.
 
  ‘‘ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటేన్’’ అంటాడు. ఇక్కడ కూడా పోతన పదప్రయోగం చూడండి, ఎన్నెన్నో పేర్లున్న విష్ణువును ఇక్కడ చక్రి అంటాడు, వలయాకృతిలో ఉన్న సృష్టి సమస్తం వ్యాపించి ఉన్నాడనే అర్థం స్పురింపజేయడానికి కావొచ్చు. ఇక్కడున్నాడు... అక్కడ లేడు అనే తేడాలు లేకుండా సర్వత్రా వ్యాపించి ఉన్నాడంటూనే, చివర్లో ప్రహ్లాదుని నోట ఒక మాట వాడాడు. ‘...వింటే’ అన్నాడు. అసలు వినాలి కదా! శ్రద్దగా జాగ్రత్తగా వినాలి, విశ్వాసంతో వినాలి. అప్పుడు విచక్షణ చేయాలి. అంతే గాని, మొండిగా, గుడ్డెద్దు చేలో పడ్డట్టు వినడానికే సిద్దంగా లేకుంటే... కనిపించకుండానే విశ్వవ్యాప్తమై ఉన్న భవగవంతుడ్ని నిరూపించడమెలా?


 ఇంతకీ, హిరణ్యకశ్యపుని శత్రువులెవరు? ఎక్కడున్నారు? వారెందరు? ఏంజేస్తున్నారు? వారినెలా గెలవాలి? గెలిస్తే ఏంటి ప్రయోజనం? ఈ ఆరు ప్రశ్నలకూ సమాధానం ఉందీ పద్యంలో. తక్కువ సమయంలో లోకాలన్నింటినీ జయించిన పరాక్రమశాలివని గుర్తు చేస్తూనే... ఇంకా నీవు గెలవని, గెలవాల్సిన ఆర్గురు శత్రువులు ఎక్కడో కాదు నీలోనే ఉన్నారని చెబుతాడు ప్రహ్లాదుడు.
 
  ఇంద్రియ నిగ్రహం, మనసును అదుపులో పెట్టుకోవడం సాధించలేకపోతున్నావంటాడు. అంతశ్శత్రువుల్ని గెలవడానికి అవే నిజమైన ఆయుధ సంపత్తి. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు అంతశ్శత్రువులు. అవి ఆయనలోనే ఉండి కట్టడి చేస్తున్నాయి. ఇంద్రియ నిగ్రహంతో మనసుపై నియంత్రణ సాధించి, ఆ ఆరింటి పీచమణచగలిగితే... సమస్త ప్రాణకోటిలో శత్రువులే ఉండరు. ఈ ఆర్గురు అంతశ్శత్రువులు హిరణ్యకశ్యపునికే కాదు మన అందరిలోనూ ఉంటారు. ఏ శత్రువును ఏ మేరకు గెలవగలిగామనే దాన్ని బట్టి మన వ్యక్తిత్వ వికాసం, పరిణతి, జీవన సాఫల్యం ఆధారపడి ఉంటాయి.
 - దిలీప్‌రెడ్డి
 

మరిన్ని వార్తలు