జ్ఞాపకం: భారతీయుల కారు... విశేషాలు బోలెడు!

15 Jun, 2014 01:08 IST|Sakshi
జ్ఞాపకం: భారతీయుల కారు... విశేషాలు బోలెడు!

మీకు ఆంబీ తెలుసా... అదేంటని అడక్కండి. ఆంబీ అంటే అంబాసిడర్ కారు. ఇది దాని ముద్దుపేరు. ఇటీవలే ఈ కారు ఉత్పత్తి బంద్ చేస్తూ... ఆ కారు ఉత్పత్తి దారు హిందూస్తాన్ మోటార్స్ నిర్ణయం తీసుకుంది. ఆ వార్తను ప్రజలు ఒక మనిషి మరణంలా, ఎమోషనల్‌గా చూడటమే ఆ కారు గొప్పతనం. ఈ సందర్భంగా దాని విశేషాలు...
 
 చిన్నప్పుడు ఎవరైనా పిల్లలను కారు బొమ్మ గీయమని అడిగితే వారు గీసే బొమ్మ కారు ఏంటో తెలుసా? అంబాసిడర్‌దే. ముందు ఇంజిను, వెనుక డిక్కీ, మధ్యలో బాడీ. పిల్లలు చాలా సులువుగా నేర్చుకునే మొదటి బొమ్మ... బహుశా ఇదే కావచ్చు. మీ ఇంట్లో శాంత్రో, స్విప్టు వంటి హ్యాచ్ బ్యాక్ కార్లున్నా, వాటిలో మీ పిల్లలు తిరుగుతున్నా వారు గీసే కారు బొమ్మ మాత్రం అంబాసిడర్‌దే. అంతగా భారతీయులతో ఆ కారు పెనవేసుకుపోయింది. అంతెందుకు ఇప్పటివరకు ఎన్నో కంపెనీలు ఎన్నో కార్ల ఉత్పత్తిని ఆపేశాయి. కానీ అవేవీ బిజినెస్ పేజీని దాటి రాలేదు. అవేవీ ఫీచర్ స్టోరీ కాలేదు. ఎందుకంటే అవన్నీ కేవలం కార్లు అంతే. కానీ ‘ఆంబీ’ కేవలం కారు కాదు, ఓ ఫీలింగ్, ఓ చిహ్నం.
 
 అంబాసిడర్ చివరి కారును కోల్‌కతా శివారులోని ఉత్తర్‌పుర ప్లాంటులో తయారుచేశారు. ఈ కారు మోడల్‌ను 1956లో బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ నగరంలో ఉన్న మోరీస్ మోటార్ రూపకల్పన చేసింది. ఈ కారుకు బ్రిటన్‌లో కొన్ని మూలాలున్నా ఇది ఇండియా కారు. ఇండియన్ కంపెనీ తయారుచేసిన కారు. 1958 నుంచి సీకె బిర్లా గ్రూపునకు చెందిన హిందూస్తాన్ మోటార్స్ ఇండియాలో అధికారికంగా అమ్మకాలు మొదలుపెట్టింది. ఈ కారు ప్రపంచంలోనే అత్యధిక కాలం వినియోగంలో ఉన్నవాటిలో ఒకటి. అంతకుముందున్న హిందూస్తాన్ ల్యాండ్ మాస్టర్ స్థానాన్ని ఈ కారు ఆక్రమించింది. అనంతరం అనూహ్యంగా ప్రజాభిమానం చూరగొని పెద్ద సంఖ్యలో అమ్ముడుపోయింది.
 
 అప్పటి కార్లలో ఎక్కువ లెగ్‌రూమ్, సీటింగ్ స్పేస్, డిక్కీ ఉండి ఇండియా రోడ్లకు అనుగుణంగా ఉన్న మరో కారు లేదు. దీంతో విదేశీ కార్లున్నా గ్రామాలకు కూడా ప్రయాణించగలిగిన ఆంబీలను నేతలు ఎన్నుకునేవారు. పైగా సదుపాయాలున్న ఇండియన్ కారు కావడంతో దానివైపే మొగ్గుచూపేవారు. కారు మంచి బందోబస్తుగా ఉండేది. దీంతో ఎలాంటి ఇండియన్ రోడ్లయినా ఇది తట్టుకునేది.
 
 2011లో కాలుష్య ప్రమాణాల ప్రకారం లేనందున 2011లో దీనిని 11 భారతీయ నగరాలు నిషేధించాయి. దీంతో కొత్త ప్రమాణాలతో కొత్త మోడల్స్ కొన్ని విడుదలయ్యాయి. అలా అంబాసిడర్ చివరి మోడల్ ‘అంబాసిడర్ ఎన్‌కోర్’ 2013లో విడులైంది. మూడు నాలుగేళ్ల నుంచి భారీ నష్టాల్లో కూరుకుపోయి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో 2014 మే 25న ఈ కారు బంద్ అయ్యింది.
 
 కొన్ని విశేషాలు:
     2003 వరకు భారత ప్రధాన మంత్రి కాన్వాయ్ కార్లు ఇవే. ఆ ఏడాది తర్వాత జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ పీఎం కాన్వాయ్ అయ్యింది.
     మారుతి 800 అతి తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో ఆంబీ ఆర్థిక పతనం మొదలైంది.
     ఇది బీబీసీ టాప్ గేర్ షోలో ‘వరల్డ్ బెస్ట్ ట్యాక్సీ’గా కూడా అభినందనలు అందుకుంది.
     నటుడు శరత్‌కుమార్‌కు ఈ కారంటే మహా ఇష్టమట. ఆ కారు కనిపిస్తే ఒకసారి నడపాలనుకుంటారట.
     ఇది అతిఎక్కువ కాలం ‘ఫ్యామిలీ కార్’గా మన్ననలు పొందింది. పెద్ద బంగళా ఉందంటే... అంబాసిడర్ ఉండాల్సిందే.
     {పతి భారతీయుడికి తెలిసిన కారు ఇదొక్కటే.
     విడుదలైన ప్రతి రంగులోనూ బాగా కనిపించిన ఏకైక కారు ఇదేనట.
     అంబాసిడర్ కారు తోలడం అంటే ప్రపంచంలో ఇక ఏ కారైనా సులువుగా హ్యాండిల్ చేయొచ్చు.
     ఆంబీ, వీఐపీ కార్, ఫ్యామిలీ కార్, ట్యాక్సీ కార్... ఇవన్నీ దాని ముద్దు పేర్లు.
     ‘ఎర్ర బుగ్గ’ ఈ కారుకు సెట్ అయినట్టు మరే కారుకు సెట్ కాదట!

మరిన్ని వార్తలు