ఆవిష్కరణం: గొడుగు అమ్మాయిలదట!

30 Nov, 2013 23:25 IST|Sakshi
ఆవిష్కరణం: గొడుగు అమ్మాయిలదట!

 అంబ్రెల్లా అనే పదం లాటిన్ నుంచి వచ్చింది. అంబ్రా అంటే నీడ అని, ఎల్లా అంటే చిన్న అని అర్థం. అంటే అంబ్రెల్లాకు ‘చిన్న నీడ’ అని అర్థమన్నమాట. గొడుగుకు చాలా చరిత్రే ఉంది. గొడుగు పుట్టింది ఎండ నుంచి రక్షణకు.. క్రీస్తుపూర్వమే వీటిని వాడినట్టు తెలుస్తోంది. రికార్డుల ప్రకారం చైనాలో తొలిసారి క్రీ.శ. 21లో గొడుగు వాడారు! అయితే వారు వాన కోసం వాడారు. తొలి వాటర్‌ప్రూఫ్ గొడుగు వాళ్లే తయారుచేశారు.
 
 చిత్రమేంటంటే.. గొడుగులు ఆడాళ్ల కోసం తయారుచేశారట. దానిని తొలిసారి వాడిన పురుషుడు ఇంగ్లండ్‌కు చెందిన జోనాస్ హాన్‌వే (1712-1786) అనే ఒక ట్రావెలర్, రచయిత. అప్పట్లో ఆయన రచయితగా కంటే గొడుగు వాడిన పురుషుడిగా ప్రపంచానికి ఎక్కువ ఫేమస్ అయ్యాడట. మొదటి గొడుగుల దుకాణం కూడా లండన్లోనే వెలిసింది. 1830 లో పుట్టిన ఈ దుకాణం ఇప్పటికీ ఉంది. (53, న్యూ ఆక్స్‌ఫర్డ్ వీధి, లండన్). 1852 వరకు గొడుగు హ్యాండ్ చెక్కదే. వీటిని ఆర్టిస్టిక్‌గా చేయడానికి ప్రత్యేకంగా ఉండేవారట. వారికి మంచి ఆదాయం కూడా ఉండేది. 1852లో శామ్యూల్ ఫాక్స్ తొలిసారి స్టీల్ రాడ్‌ను గొడుగులో వాడాడు.
 
  1928లో హాన్స్ హాప్ట్ పాకెట్ గొడుగుల్ని తయారు చేశాడు. 1969లో అమెరికాకు చెందిన బ్రాడ్‌ఫోర్డ్ ఫిలిప్స్ గొడుగుల తయారీకి పేటెంట్ సంపాదించాడు. అక్కడి నుంచి మార్కెట్లో వివిధ రకాల గొడుగులు అందుబాటులోకి వచ్చాయి. మొదట్లో గొడుగులు పెద్దగా నలుపు రంగుల్లో ఉండేవి. తర్వాత వాటి సైజు తగ్గుతూ వచ్చింది. తర్వాత రకరకాల డిజైన్లలో ఆకర్షణీయంగా తయారయ్యాయి.
 
 కొసమెరుపు: అప్పటికీ ఇప్పటికీ గొడుగు రాచరికానికి చిహ్నమే. ఓ మనిషి చేత గొడుగు పట్టించుకోవడం అంటే ఆ ఠీవి వేరు! ఇప్పటికీ దర్శకులను సెట్స్‌లో గొడుగు లేకుండా ఎవరూహించుకుంటారు?

మరిన్ని వార్తలు