పోలీసు గుండెలో పవిత్రప్రేమ!

26 Oct, 2014 01:11 IST|Sakshi
పోలీసు గుండెలో పవిత్రప్రేమ!

టీవీక్షణం
సినిమాలు, సీరియళ్లలో సిన్సియర్ పోలీస్ అంటే చాలా సీరియస్‌గా కనిపిస్తాడు. మాట్లాడితే గొంతు ఖంగుమంటుంది. కోపంగా చూస్తే అవతలివాడి గుండె ఝల్లుమంటుంది. ఏసీపీ కబీర్‌ని చూసినా ముద్దాయిలకు అలానే ఉంటుంది. కానీ అతణ్ని తెరమీద చూసే ప్రేక్షకుడికి మాత్రం పొట్ట పగిలిపోతుంది నవ్వలేక. అతడు వేసే సెటైర్లు కడుపుబ్బ నవ్విస్తాయి. అతని సన్నివేశాలు ఇంకా ఇంకా ఉంటే బాగుణ్ను అనిపిస్తుంటాయి. ఇంతకీ ఈ ఏసీపీ కబీర్ ఎవరో తెలుసా? లైఫ్ ఓకే చానెల్లో ప్రసారమయ్యే ‘లౌట్ ఆవో త్రిషా’ సీరియల్లోని హీరో.
 
కోటీశ్వరుడైన ప్రతీక్ స్వాయికా కూతురు త్రిష కనిపించకుండా పోతుంది. కిడ్నాప్ అయ్యిందో, తనంతట తనే వెళ్లిపోయిందో, అసలు ప్రాణాలతో ఉందో లేదో తెలియక ప్రతీక్ కుటుంబం అల్లాడిపోతుంది. ముఖ్యంగా త్రిష తల్లి అమృత (భాగ్యశ్రీ) వేదన వర్ణనాతీతం! ఆమె బాధను అర్థం చేసుకుంటాడు కబీర్. తన సిన్సియారిటీ ఫలితంగా ఓ క్రిమినల్ చేతిలో తన భార్య, కూతురు ప్రాణాలు కోల్పోవడంతో, వేదనాభరితమైన జీవితం గడిపే అతడిని... అమృత వేదన కదిలిస్తుంది. ఎలాగైనా త్రిషను వెతికి తీసుకు రావాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో అమృతను ప్రేమించడం మొదలుపెడతాడు. ఆమె భర్తతో పాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మోసగాళ్లు, కుటిల మనసులు కలవారని తెలుసుని, వారి నుంచి అమృతను కాపాడుకుంటూ ఉంటాడు. మరి అతడి ప్రేమ అమృతకు అర్థమవుతుందా? ఆమె కూతురిని కబీర్ వెతికి తెస్తాడా? అసలు త్రిషను ఎవరు ఎత్తుకెళ్లారు? అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగిపోతోందీ సీరియల్.
 
కబీర్‌గా ఎజాజ్ ఖాన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చకచక కదిలే అతడి వేగం ఆకట్టుకుంటుంది. కళ్లతోనే సగం నటన పలికించేసే విధానం ప్రేక్షకుడిని అలరిస్తుంది. పైగా మాట్లాడే ప్రతి మాటా సెటైరే కావడంతో... పాత్ర సీరియస్సే అయినా, మనకు మాత్రం భలే వినోదాత్మకంగా ఉంటుంది. ఒక సిన్సియర్ ఆఫీసర్‌గా, హీరోయిన్‌ని మూగగా ఆరాధించే ప్రేమికుడిగా తన పాత్రకి వంద శాతం న్యాయం చేస్తున్నాడు ఎజాజ్. ఒక్క మాటలో చెప్పాలంటే... కబీర్ పాత్రకు అతడు పర్‌ఫెక్ట్!

మరిన్ని వార్తలు