డాబాలపైన సామూహిక ఇంటిపంటలు!

5 Nov, 2016 23:59 IST|Sakshi
డాబాలపైన సామూహిక ఇంటిపంటలు!

నగరహరితం
 నగరాల్లో విస్తరిస్తున్న ఇంటిపంటల సంస్కృతి కొత్త పోకడలను సంతరించుకుంటోంది. ఇంటి పంటల సాగులో ముంబైవాసులు మరో అడుగు ముందుకేశారు. ఎవరింటిపై వారే సేంద్రియ ఇంటిపంటలను సాగు చేసే ధోరణికి భిన్నంగా.. ముంబై వాసులు తోటి వారితో కలిసి సామూహిక ఇంటిపంటలను సాగు చేస్తున్నారు. ముంబైలోని అర్బన్ లీవ్స్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ నగరంలోని అనేక ప్రాంతాల్లో పాఠశాలలు, సేవా సంస్థల భవనాలపైన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొందరు ఔత్సాహికులు మాతుంగాలోని డాన్‌బాస్కో స్కూల్ భవనంపై గత రెండేళ్లుగా సామూహికంగా ఇంటిపంటలను సాగు చేస్తున్నారు.
 
  వివిధ రకాల పండ్లు, కూరగాయ మొక్కలు, ఔషధ మూలికలను సాగు చేస్తున్నారు. ప్రతి ఆదివారం సామూహిక ఇంటిపంటల క్షేత్రాల్లో అందరూ కూడి పనులు చేస్తారు. పిల్లలు, పెద్దలు వారాంతపు సెలవును ప్రకృతితో మమేకం అయ్యేందుకు ఉపయోగిస్తున్నారు. వంటింటి వ్యర్థాలతో ఇంటిపంటలకు అవసరమైన సేంద్రియ ఎరువు అమృత్‌మట్టిని భవనాలపైన మడుల్లోనే తయారు చేసుకుంటారు. ఆ తర్వాత అదే మడుల్లో నవధాన్యాలతో పచ్చిరొట్ట పెంచి.. మొక్కలను కత్తిరించి తిరిగి మట్టిలో కలిపేస్తారు.
 
  తదనంతరం పంటల సాగు ప్రారంభిస్తారు. ఈ క్రమంలో చెరకు పిప్పిని విరివిగా వినియోగిస్తారు. ఇటుకలను అందమైన వివిధ ఆకృతుల్లో పేర్చి సమృద్ధంగా ఇంటిపంటలు పండిస్తారు. కేవలం కూరగాయలు, పండ్ల సాగు కోసమే కాక.. సామూహిక ఇంటిపంటలు పక్షులకూ ఆవాసాన్ని కల్పిస్తుండడం విశేషం. సామూహిక ఇంటిపంటల సాగు ద్వారా రసాయన రహిత ఆహారాన్ని పండిస్తున్న అర్బన్ లీవ్స్ ఇండియా బృందం ముంబైని ఇతర నగరాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతోంది.
 www.urbanleaves.org
 www.facebook.com/UrbanLeavesIndia/
 
 

మరిన్ని వార్తలు