పెరిగే వయసును ఆపేసే దాల్చిన చెక్క...

10 Sep, 2016 23:25 IST|Sakshi
పెరిగే వయసును ఆపేసే దాల్చిన చెక్క...

న్యూ ఫేస్
వంటకాలలో వాడే దాల్చిన చెక్కలో చర్మకాంతిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీనిని సౌందర్య ఉత్పాదనలలో తప్పనిసరిగా వాడుతుంటారు. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు చర్మాన్ని త్వరగా ముడతలు పడనివ్వదు. అమితంగా ఉండే మినరల్స్, విటమిన్ల వల్ల చర్మం సహజకాంతిని కోల్పోదు. దీంతో ఎక్కువ కాలం యవ్వనకాంతితో వెలిగిపోతారు. ఆహారంలోనూ దాల్చిన చెక్కను ఉపయోగిస్తూ ఉండాలి.  జిడ్డు, కాంబినేషన్ చర్మం గలవారికి దాల్చినచెక్క ప్యాక్ మహత్తరంగా పనిచేస్తుంది.

కావల్సినవి:
* టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి
* రెండు టేబుల్ స్పూన్ల తేనె
 తయారీ:
* దాల్చిన చెక్క, తేనె కలపాలి. మృదువైన మిశ్రమం తయారుచేయాలి.
* ముఖాన్ని శుభ్రపరుచుకుని తడి లేకుండా తుడవాలి. తర్వాత దాల్చిన చెక్క మిశ్రమాన్ని కళ్ల చుట్టూతా వదిలేసి ముఖమంతా రాయాలి.
* అలాగే గొంతు, మెడకు కూడా పట్టించాలి.
* కనీసం 15 నిమిషాల సేపు ఆరనివ్వాలి. దీంతో దాల్చిన చెక్క, తేనెలోని పోషకాలు చర్మంలోకి ఇంకుతాయి.
* తర్వాత గోరువెచ్చని నీటిని ముఖం మీద చిలకరించి, మృదువుగా మర్దనా చేస్తూ, కడిగేయాలి.
* తర్వాత చల్లని నీటితో కడిగి, మెత్తని టవల్‌తో తుడవాలి.
* మీ ముఖ చర్మం మృదువుగా కనిపిస్తుంది. వారానికి 2-3 సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే చర్మ కాంతి పెరగుతుంది.
* ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఎండకు కందిపోయిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. మచ్చలు, యాక్నె సమస్యలు తగ్గుతాయి.

మరిన్ని వార్తలు