ఆతిథ్య పరిశ్రమకు రారాజు

22 Jan, 2017 01:58 IST|Sakshi
ఆతిథ్య పరిశ్రమకు రారాజు

భారతదేశ ఆతిథ్య రంగానికి కురువృద్ధుడాయన. ఆతిథ్య పరిశ్రమలో  ఎన్నో మెట్లు  అధిరోహించిన చాలామందికి గురుతుల్యుడయ్యారు. దేశంలో పరాయి పాలన కొనసాగుతున్న కాలంలోనే స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి హోటల్‌ పరిశ్రమలో ప్రపంచ స్థాయి దిగ్గజాలకే దిగ్భ్రమ కలిగించిన ధీశాలి ఆయన. అట్టడుగు స్థాయి నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించి ఆకాశమే హద్దుగా చరిత్ర సృష్టించిన వ్యాపారవేత్త మోహన్‌సింగ్‌ ఒబెరాయ్‌.

ఆతిథ్య పరిశ్రమకు పెద్దదిక్కు, ఒబెరాయ్‌ హోటల్స్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు రాయ్‌బహదూర్‌ మోహన్‌సింగ్‌ ఒబెరాయ్‌ 1898 ఆగస్టు 15న అవిభక్త భారతదేశంలో పంజాబ్‌ ప్రావిన్స్‌లోని భవున్‌ గ్రామంలో జన్మించారు. మోహన్‌సింగ్‌ ఆరునెలల పసికందుగా ఉన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నారు. అష్టకష్టాలు అనుభవిస్తూనే రావల్పిండిలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. లాహోర్‌ కాలేజీ నుంచి ఇంటర్మీడియేట్‌ పూర్తి చేశారు. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో కాలేజీ చదువును కొనసాగించలేక చిన్నా చితకా పనులు చేసుకుంటూ టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్‌ నేర్చుకున్నారు. అప్పట్లో పంజాబ్‌ ప్రాంతంలో ప్లేగు మహమ్మారి విజృంభించడంతో 1922లో ప్రాణాలు అరచేత పట్టుకుని సిమ్లా చేరుకున్నారు. సిమ్లాలోని సెసిల్‌ హోటల్‌లో చిరుద్యోగంలో చేరారు. ఆతిథ్యరంగంతో అలా మొదలైన ఆయన అనుబంధం కడ వరకు కొనసాగింది.

తొలి అడుగులు...
సిమ్లాలోని ద సెసిల్‌ హోటల్‌లో బెల్‌ బాయ్‌గా అట్టడుగు స్థానం నుంచి ఒబెరాయ్‌ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ హోటల్‌లో బస చేసిన అపరిచిత వ్యక్తి ఒకరు అర్ధరాత్రి ఒబెరాయ్‌ను పిలిచి వంద పేజీల రాతప్రతిని ఇచ్చి ఉదయం ఐదు గంటలకల్లా టైపు చేసి ఇవ్వమని చెప్పారు. అక్షరదోషాలు లేకుండా  చెప్పిన సమయానికంటే ముందే శ్రద్ధతో పని పూర్తి చేసినందుకు మెచ్చి వంద రూపాయలు బహుమతిగా ఇచ్చాడా అతిథి. అది అప్పట్లో ఒబెరాయ్‌ రెండు నెలల జీతానికి సమానం. అంత పెద్ద మొత్తాన్ని టిప్‌గా ఇచ్చిన ఆ లక్ష్మీపుత్రుడు.. పండిట్‌ మోతీలాల్‌ నెహ్రూ అనే విషయం అప్పుడు ఒబెరాయ్‌కు  తెలియదు.  తనకు సంబంధం లేని విధులను కూడా శ్రద్ధతో చక్క»ñ డుతున్న ఒబెరాయ్‌ సమర్థతను హోటల్‌ మేనేజర్‌ గ్రోవ్‌ గమనించారు. తాను కొనుగోలు చేసిన క్లార్క్స్‌ హోటల్‌లో మేనేజర్‌గా నియమించారు. దీంతో ఒబెరాయ్‌ జీవితం మలుపు తిరిగింది. హోటల్‌ నిర్వహణకు అవసరమైన అన్ని మెలకువలనూ ఒబెరాయ్‌ ఇక్కడి నుంచే ఒంటబట్టించుకున్నారు.

తొలి ఐదు నక్షత్రాల హోటల్‌...
గ్రోవ్‌ మరణంతో 1934లో అమ్మకానికొచ్చిన క్లార్క్స్‌ హోటల్‌ను భార్య నగలు, ఆస్తులు తెగనమ్మి కొనుగోలు చేశారు. 1938లో కలకత్తాలో 500 గదుల హోటల్‌ను అద్దెకు తీసుకోని అనతికాలంలోనే లాభాల బాట పట్టించారు. 1943లో అసోసియేటెడ్‌ హోటల్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ను కొనుగోలు చే సి ఆతిథ్య పరిశ్రమలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. 1965లో న్యూఢిల్లీలో అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే తొలి ఐదు నక్షత్రాల హోటల్‌ను ప్రారంభించి తన జైత్రయాత్రకు శ్రీకారం చుట్టారు. అదే ఊపులో 1973లో ముంబైలో 35 అంతస్థుల ఒబెరాయ్‌ షెరటాన్‌ హోటల్‌ స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. విమానాల్లో భోజన సేవలను అందించే కార్యకలాపాలను 1959లో తొలిసారి ఒబెరాయ్‌ సంస్థే ప్రారంభించింది.

ప్రపంచ టాప్‌ టెన్‌ జాబితాలో...
ఇవీన్నీ ఒకెత్తయితే దేశవిదేశాల్లోని రాజప్రాసాదాలు, పురాతన కట్టడాలను పునరుద్ధరించి అద్భుతమైన హోటళ్లుగా తీర్చిదిద్దారు. సిమ్లాలోని సెసిల్, కలకత్తాలోని ఒబెరాయ్‌ గ్రాండ్, కైరోలోని చారిత్రక మెనాహౌస్‌ వంటివి మచ్చుకు కొన్ని. ప్రజా వ్యతిరేకతను సైతం ఖాతరు చేయకుండా మెల్‌బోర్న్‌లోని చారిత్రక కట్టడం విండ్సర్‌ను కొనుగోలు చేశారు. భారత్‌తో పాటు శ్రీలంక, నేపాల్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, దుబాయ్, ఇంగ్లాండ్,  ఈజిప్ట్, మారిషస్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, హంగేరీ దేశాల్లో  ముప్పయికి పైగా లగ్జరీ హోటళ్లను నెలకొల్పారు.

సేవారంగంలోనూ కృషి
వ్యాపార విస్తరణకు మాత్రమే పరిమితం కాకుండా సేవారంగంలోనూ ఇతోధికంగా కృషి చేశారు ఒబెరాయ్‌. శారీరక, మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారు. 1962, 1972లలో రాజ్యసభకు, 1968లో లోక్‌సభకు ఎన్నికై, చట్టసభల్లోనూ తన వంతు సేవలందించారు. ఆతిథ్య రంగంలో దేశంలోనే తొలిసారిగా మహిళలకు ప్రవేశం కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. తన దార్శనికతతో దేశంలోని ఆతిథ్య పరిశ్రమను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లిన ఒబెరాయ్‌ నూటమూడేళ్లు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించి, 2002 మే 3న కన్నుమూశారు. పారిశ్రామికవేత్తగా ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 2001లో ఆయనను పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.

మరిన్ని వార్తలు