సులువుగా స్వీట్‌ కార్న్‌- చికెన్‌ కట్లెట్‌

1 Mar, 2020 10:52 IST|Sakshi

స్నాక్‌ సెంటర్

స్వీట్‌ కార్న్‌– చికెన్‌ కట్లెట్‌
కావలసినవి:  చికెన్‌ – పావు కిలో(బోన్‌ లెస్‌ ముక్కలని మెత్తగా ఉడికించిపెట్టుకోవాలి), స్వీట్‌ కార్న్‌ – 1 కప్పు, బంగాళ దుంప – 1 (ముక్కలు కోసి, మెత్తగా ఉడికించుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, పసుపు – పావు టీ స్పూన్, కారం – 1 టీ స్పూన్‌, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, అల్లం– వెల్లుల్లి పేస్ట్‌ – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత, పాలు – 2 టేబుల్‌ స్పూన్లు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్‌ స్పూన్లు, నీళ్లు – సరిపడా, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ: ముందుగా మిక్సీ బౌల్‌ తీసుకుని అందులో చికెన్, స్వీట్‌ కార్న్, బంగాళ దుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని, అందులో పసుపు, కారం, జీలకర్రపొడి, గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు నచ్చిన షేప్‌లో కట్లెట్స్‌ చేసుకుని.. ఒకసారి పాలలో ముంచి, మొక్కజొన్న పిండి పట్టించి.. నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర తురుము లేదా ఉల్లిపాయ ముక్కలు వంటివి గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.

ఆపిల్‌ కేక్‌

కావలసినవి: యాపిల్స్‌ – 6, గోధుమ పిండి, మొక్కజొన్న పిండి, మైదా పిండి, బ్రౌన్‌ సుగర్‌ – అర కప్పు చొప్పున, బటర్‌ – పావు కప్పు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ – 1 టీ స్పూన్‌, గుడ్లు – 3, పాలు – 1 కప్పు
ఆప్రికాట్‌ జామ్‌ – పావుకప్పు (మార్కెట్‌లో లభిస్తుంది)

తయారీ: ముందుగా ఆపిల్స్‌ శుభ్రం చేసుకుని నాలిగింటిని మెత్తగా, గుజ్జులా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బటర్‌ కరిగించుకుని ఒక పెద్ద బౌల్‌లో పోసుకుని అందులో బ్రౌన్‌ సుగర్, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో గుడ్లు, గోధుమపిండి, మొక్కజొన్న పిండి, మైదాపిండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, పాలను కొద్దికొద్దిగా వేస్తూ మొత్తం కలపాలి. ఇప్పుడు ఆపిల్‌ గుజ్జు, ఆప్రికాట్‌ జామ్‌ కూడా వేసుకుని బాగా కలుపుకుని ఓవెన్‌లో పెట్టుకునేందుకు అవసరమైన పాత్రలో ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రెండు ఆపిల్స్‌ని అర్థచంద్రాకారంలో ముక్కలు చేసుకుని, వాటిని పైన అలంకరించుకుని 35 నుంచి 40 నిమిషాల పాటు ఓవెన్‌లో ఉడికించుకోవాలి. సర్వ్‌ చేసుకునేటప్పుడు అభిరుచిని బట్టి కేక్‌పైన క్రీమ్స్, డ్రై ఫ్రూట్స్‌ వంటివి డెకరేట్‌ చేసుకోవచ్చు.

కీరదోస హల్వా

కావలసినవి: కీరదోసకాయలు – 4 (పైతొక్కను తొలగించి, తురుములా చేసుకోవాలి), నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు, పాలపొడి – 1 కప్పు, పాలు – 2 కప్పులు, పంచదార – 4 టేబుల్‌ స్పూన్లు(అభిరుచి బట్టి పెంచుకోవచ్చు), గోధుమ రవ్వ – 5 టేబుల్‌ స్పూన్లు, జీడిపప్పు, బాదం, పిస్తా – అభిరుచిని బట్టి
తయారీ: ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. పాన్‌లో  పాలు, కీరదోస తురుము వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో పాలపొడి, గోధుమ రవ్వ, పంచదార వేసుకుని గరిటెతో తిప్పుతూ కలపాలి. ఆ మిశ్రమంలో పాల శాతం పూర్తిగా తగ్గి పొడిపొడిలాడుతున్న సమయంలో బాదం, పిస్తా లేదా జీడిపప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే ఈ కీరదోస హల్వా చాలా రుచిగా ఉంటుంది.

మరిన్ని వార్తలు