బొద్దుగా ఉన్నా... ముద్దుగా ఉంటా!

18 Oct, 2015 01:01 IST|Sakshi
బొద్దుగా ఉన్నా... ముద్దుగా ఉంటా!

ఇంటర్వ్యూ
నాటక రంగం నుంచి సినీ రంగానికి దూసుకొచ్చింది హ్యూమా ఖురేషీ.
గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, ఏక్ థీ డాయన్, దేడ్ ఇష్కియా వంటి చిత్రాల్లో నటించి మంచి మార్కులతో పాటు అవార్డులూ కొట్టేసింది.
ప్రస్తుతం అజహర్, మేడమ్ ఎక్స్, విక్టరీస్ హవుస్ తదితర చిత్రాల్లో నటిస్తోన్న ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ... తన ఇష్టాలను, అభిప్రాయాలను ఇలా పంచుకుంది!

 

 
* హీరోయిన్లంతా స్లిమ్‌గా ఉండాలనుకుంటారు. కానీ మీరలా అనుకోరనిపిస్తోంది చూస్తుంటే..?
బొద్దుగా ఉన్నా చూస్తున్నారుగా ప్రేక్షకులు! దాన్నిబట్టి అర్థమవుతోంది కదా, హీరోయిన్ స్లిమ్‌గానే ఉండాలన్న రూలేం లేదని! అయినా నేను బొద్దుగా ఉన్నా ముద్దుగానే ఉంటాలెండి.

* మీకు నచ్చే ఫుడ్?
మా అమ్మ చేసే అచారీ చికెన్ అంటే పడి చచ్చిపోతాను. కాస్త ఆయిలీగా, స్పైసీగా ఉంటుందనుకోండి... అయినా లాగించేస్తా.

* మరి వండటం వచ్చా?
బాగా తినేవాళ్లంతా బాగా వండేవాళ్లు అయ్యుండక్కర్లేదుగా! తినడం వచ్చినంత బాగా వండడం రాదు నాకు.

* మీరు ముక్కుసూటిగా మాట్లాడతారని అందరూ అంటుంటారు..?
నిజమే. అన్ని విషయాల్లోనూ క్లారిటీ ఉన్నప్పుడు మాటలు సూటిగానే వస్తాయి. తప్పు చేసినవాళ్లు, నిజాన్ని దాచిపెట్టేవాళ్లే తడబడతారు.

* మీ ప్లస్సులు, మైనస్సులు?
కెమెరా ముందు ఉన్నంతసేపూ నటననే శ్వాసిస్తాను. అదే నా బలం. బలహీనతల గురించి ఎక్కువ ఆలోచించను. ఆలోచించకూడదు కూడా. నేను ఇందులో వీక్ అనుకుంటే అందులో ఎప్పటికీ వీక్‌గానే ఉంటాం. అన్నీ వచ్చు, అన్నీ చేయగలను అనుకోవాలి.

* ఇండస్ట్రీలో మీకు నచ్చేది, నచ్చనిది?
డిఫరెంట్ పాత్రలు చేయడం ద్వారా ఒక్క జీవితాన్ని వంద రకాలుగా చూస్తాం. ఎన్నో రకాల వ్యక్తుల్ని కలుస్తాం. ఎన్నెన్నో నేర్చుకుంటాం. అది నాకు నచ్చే విషయం. కానీ ప్రైవసీ అన్నది పూర్తిగా పోతుంది. అందరి కళ్లూ మననే వెంటాడు తుంటాయి. అది కాస్త ఇబ్బందిగా ఉంటుంది.

* విమర్శలను ఎలా ఎదుర్కొంటారు?
విమర్శ మంచిదైతే ఆలోచిస్తాను. అర్థం లేనిదైతే లైట్ తీసుకుంటాను.

* మీరు చాలా బోల్డ్‌గా నటిస్తారనే విమర్శ ఉంది. దాని గురించి...?
మంచి చెప్పాలంటే కొన్నిసార్లు చెడును చూపించాల్సి ఉంటుంది. చెడు ఎలా ఉంటుందో చూపించి, ఇలా చేస్తే ఫలితాలు ఇలా ఉంటాయని తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంటారు దర్శకులు. అలా చేయడం తప్పు కాదు. ఆ క్రమంలో కొన్ని సన్నివేశాల్లో బోల్డ్‌గా నటించాలి అని డెరైక్టర్ చెప్తే సరే అంటాను. చెప్పే మంచిని వదిలేసి, చెప్పిన విధానం గురించే మాట్లాడటం సద్విమర్శ కాదు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు.

* ఎలాంటి విషయాలకు బాధపడతారు?
మనుషులు దూరమైతే బాధగా ఉంటుంది. మొన్నామధ్య నా స్నేహితుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. షూటింగ్‌లో బిజీగా ఉండి తన అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయాను. అది ఇప్పటికీ నన్ను బాధిస్తోంది. మనుషులు, బంధాల విషయంలో చాలా సెన్సిటివ్ నేను.

* ఎలాంటి వాటికి కోపం వస్తుంది?
అర్థం లేని కామెంట్లకి. మా నాన్న వ్యాపారి. దాంతో ఆయనే నా సినిమాలన్నిటికీ ఫైనాన్స్ చేస్తున్నారని కొందరు రాశారు. మానాన్న ఎందుకు ఫైనాన్స్ చేస్తారు? నేను ఎంతో కష్టపడి బాలీవుడ్‌లో ఎంటరయ్యాను. ఇంకెంతో కష్టపడి నిలదొక్కుకున్నాను. నన్ను నమ్మి దర్శకులు అవకాశాలు ఇస్తున్నారు. ఇవేమీ తెలుసుకోకుండా ఇలా రాయడం ఏమైనా బాగుందా! ఇలాంటి పిచ్చి కామెంట్లు వింటే ఒళ్లు మండుకొస్తుంది.

* దేనికి భయపడతారు?
బల్లి అంటే చచ్చేంత భయం. అది ఎక్కడో గోడమీద కనిపిస్తే నా గుండె ఇక్కడే ఆగిపోతుంది. ఇంక దేనికీ అంత భయపడను.

* మీ గురించి ఎవరికీ తెలియని ఓ సీక్రెట్?
నేను ఒంటరిగా ఉండలేను. ఒంటరిగా ఉన్నానన్న ఆలోచన నన్ను చాలా డిస్టర్‌‌బ చేస్తుంది. కానీ ఎప్పుడూ ఎవరో ఒకరు వెంట ఉండరు కదా! అందుకే లైట్లు వేసుకుని, టీవీ ఆన్ చేసి పెట్టి పడుకుంటాను. లేదంటే నిద్ర పట్టదు.
 

మరిన్ని వార్తలు