నైపుణ్యం: మనిషికి తొలి మిత్రుడు

8 Jun, 2014 01:30 IST|Sakshi
నైపుణ్యం: మనిషికి తొలి మిత్రుడు

మనకు చరిత్ర రాతలు అందుబాటులో ఉన్నప్పటి నుంచి మనిషితో అనుబంధం ఉన్న జీవి... శునకం. పద్నాలుగు వేల ఏళ్ల క్రితమే ఇది మనిషితో కలిసి జీవించింది. ప్రాచీనుడికి, ఆధునికుడికి ఇదే అసలైన నేస్తం. ఇప్పుడైతే జంతు దశను దాటి... పోలీస్ బాధ్యతను కూడా నిర్వర్తిస్తోంది. మరి ఆ పోలీసుల దగ్గర ఉండే శునకాలు, మనం చూసే శునకాలు ఒకటేనా? పల్లెకు వెళ్తే కేవలం కుక్క. పట్టణానికి వస్తే బొచ్చుకుక్క, హచ్ కుక్క, వీధికుక్క. నగరానికి వెళితే... ఒక పెద్ద జాబితా!
 
 మరి వేట కుక్కల సంగతేంటి? ప్రతి జాతి కుక్క పోలీసు కాలేదు. వేటకుక్కలు వేరు. ఆ జాతులు వేరు. అందుకే పోలీసింగ్ చేసే శునకాల గురించి కొన్ని విషయాలివి. పోలీసింగ్‌లో గాని, వేట గాళ్లు గాని ముఖ్యంగా హౌండ్స్, గన్ డాగ్స్, ఫీస్ట్స్, టెరియర్స్, కర్స్, డాక్స్ హాంట్ జాతులకు చెందిన కుక్కలనే తీసుకుంటారు. హౌండ్స్, గన్ డాగ్స్‌లో ఉప జాతులున్నాయి. సైట్ హౌండ్స్, సెంట్‌హౌండ్స్, లర్చర్... ఈ మూడు హౌండ్స్ జాతివి. రిట్రీవర్స్, సెటెర్స్, స్పానియల్స్, పాయింటర్స్, వాటర్ డాగ్స్... ఇవి గన్ డాగ్స్ జాతికి చెందినవి. వీటన్నిటికీ కొన్ని ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా వేగం, చురుకుదనం, చూపు... వల్ల ఇవి ప్రత్యేకమైనవి.
 
 ఇక ఇండియన్ పోలీస్ డాగ్స్ నాలుగు రకాలు. లాబ్రడార్ రిట్రీవర్, డాబర్‌మాన్ పిన్షర్, జర్మన్ షెపర్డ్, కాకర్ స్పానియల్. ఇవి అత్యుత్తమ సామర్థ్యాలు కలిగినవి మాత్రమే కాదు, సుదీర్ఘమైన, కఠినమైన పోలీస్ ట్రైనింగ్‌కు తట్టుకోగలిగినవి. వీటికి ట్రైనింగ్ ఇవ్వడానికి 1970లో నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ (ఎన్‌టీసీడీ)ను స్థాపించారు. ఇది పోలీస్ డాగ్‌లకు ట్రైనింగ్ ఇవ్వడంతోపాటు... వాటి సంరక్షకులకు కూడా ట్రైనింగ్ ఇస్తుంది. వీటికి ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల వయసు మధ్య శిక్షణ మొదలుపెడతారు. మొత్తం పద్నాలుగు రకాల శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ఒక్కోటీ నాలుగు వారాల నుంచి 36 వారాల వరకు అవసరాన్ని బట్టి శిక్షణ ఉంటుంది. డాగ్స్ అంటే కేవలం బాంబులను కనిపెట్టేవే కాదు, నార్కోటిక్స్ కేసుల్లో, పరిశోధనకు, సహాయక చర్యలకు, పెట్రోలింగ్‌కు, విష పదార్థాలను గుర్తించడానికి, మైన్ డిటెక్టింగ్‌కు ఉపయోగపడతాయి. ప్రతిభను బట్టి  వీటికీ గోల్డ్ మెడల్స్ ఉంటాయట.
 
 లాబ్రడార్ రిట్రీవర్: గన్ డాగ్ జాతికి చెందిన వీటిని లాబ్రడార్ లేదా లాబ్ అనిపిలుస్తారు. ఇవి అదుపు తప్పవు. పిల్లలతో, వృద్ధులతో  మన్ననగా ప్రవర్తిస్తాయి. అంధత్వం, ఆటిజం ఉన్నవారికి తోడుగా ఉండటానికి వీటిని ప్రపంచ వ్యాప్తంగా వాడుతారు. ఏదైనా కనుక్కోవడంలో వీటికి చురుకుదనం ఎక్కువ. కెనడాలో ఉద్భవించిన ఈ జాతి ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, యుకె బాగా ఉపయోగిస్తున్నారు.
 
 డాబర్‌మాన్ పిన్షర్: ఇది మంచి పెంపుడు జాతి. అత్యంత విశ్వసనీయ జాతి. చాలా తెలివిగలది, అప్రమత్తత ఎక్కువగా ఉంటుంది. వీటిని గార్డ్ డాగ్స్, పోలీస్ డాగ్స్‌గా ప్రపంచంలో అనేక దేశాల్లో వాడతారు. అతిఎక్కువ దేశాల్లో ఇవి కనిపిస్తాయి. వీటి స్వస్థలం జర్మనీ.జర్మన్ షెపర్డ్: ఇది కూడా జర్మనీలో పుట్టినదే. ఇది మిగతా వాటితో పోలిస్తే కాస్త కొత్త జాతి. తెలివితేటలు, శక్తియుక్తులతో ఈ శునక జాతి ప్రపంచంలోనే పేరు పొందింది. ప్రత్యేకించి రెస్క్యూ ఆపరేషన్‌లలో భద్రతా దళాలకు, అన్వేషణలో పోలీసులకు ఈ జాతి శునకాలు పోలీసులకు నమ్మకమైన నేస్తాలుగా మారాయి. కోకర్ స్పానియెల్: అమెరికన్ కోకర్ స్పానియెల్, యునెటైడ్ కింగ్‌డమ్ కోకర్‌స్పానియెల్ అనే రెండు రకాల శునకాలున్నాయి ఈ జాతిలో. పురాతన జాతికి చెందిన వేట కుక్కల బ్రీడ్‌లను సంకరీకరణ చేయించి ఈ క్రాస్ బ్రీడ్‌ను జనింపజేశారు. వేట విషయంలో పాశ్చాత్యులకు ఇవి సహాయకారులుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు