ఈ బొమ్మకు ప్రాణం వద్దు, స్వరం ఇవ్వు

9 Feb, 2020 10:07 IST|Sakshi

కొత్త కథలోళ్లు

ఐసీయూలో ఉన్న కోకిల మెల్లగా కళ్లు తెరిచింది. చుట్టూ చూడటానికి ప్రయత్నిస్తూ పైకి లేవబోతుంటే లేవకుండా నోటికి ముక్కుకి తగిలించిన పైపులు అడ్డం పడ్డాయి.
‘తనెక్కడుంది...తను ఇక్కడెందుకుంది?’
 సమాధానం తెలియని ప్రశ్నలతో వున్న కోకిల హఠాత్తుగా ఒక విషయం గమనించింది. 
గుండె గొంతుకలో ఏదో అపశ్రుతి. తన జీవితాన్ని మృతప్రాయంగా మార్చినట్టు...ఏదో అడ్డం పడినట్టు మాట బయటకు రావడం లేదు. మాట్లాడాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నా మాట గొంతు దాటి బయటకు రానంటూ భీష్మించుకుంది. 
అప్రయత్నంగా తన ప్రమేయం లేకుండా మాటకు బదులు కళ్లలోని కన్నీరు ఉబికి వస్తోంది. 
పిలుస్తున్నాననుకుంటూ కోకిల ఐసీయూ బయట ఉన్న  తండ్రిని పిలిచింది. పిలిచానని అనుకుంది. మాట కదలలేదు. కోకిల కదులుతుండటం చూసిన తండ్రి ఆదుర్దాగా లోపలికి వచ్చాడు. తన తండ్రిని ఏదో అడగాలని ఆరాటంగా ప్రయత్ని స్తోంది కోకిల. కానీ సైగలు తప్ప మాటలు బయటకు రాలేమంటున్నాయి.

అప్పుడు అర్థమైంది. తను...మా...ట్లా... డ...లే...క...పో...తోం...ది. తన గొంతు మూగబోయింది.
‘ఎప్పుడూ  మనూరి సముద్రంలా గలగలా వినిపించే నీ మాటలు ఇక సముద్రానికి వినిపించవమ్మా ...ఉదయమే వీధి వీధంతా వినిపించే నీ కంఠం, కోకిలమ్మ పాడితే దేవుడిగుడిలో గంటలా వినిపిస్తదని చెప్పే  నీ కంఠం మూగపోయింది తల్లీ’ అని చెప్పే భావాలూ కూడా పలకలేని నిరాసక్తుడు...తనకు తెలిసిన మాటల్లోనే చెప్పాడు.
‘నీ గొంతు పడిపోయింది తల్లీ’ అని. 
కూతురు కంఠం పోయిన బాధలో అతని ప్రాణం ఈ లోకాన్ని విడిచిపెట్టింది.
ఒక నిశ్శబ్దం వేనవేల విషాదాలను తనలో కలుపుకుంది. గతం ఆమె ప్రపంచాన్ని చివరిసారి చూపించింది.

కోకిల పుడుతూనే రాగాన్ని ఆలపించింది. ఆ వూళ్ళో వున్న సంగీతం మాస్టారూ చెప్పినప్పుడు ఆ గిరిజన గూడేనికి అర్థం కాలేదు. కానీ ఆ గూడెంలో గాలికి ధూళికి చెట్టుకు,చేమకు,  పచ్చని పైరులకు అర్థం అయ్యింది.
కోకిల పాడితే చెట్టు మీద కోయిలలు గుంపుగా చేరేంత శ్రావ్యంగా ఉంటుంది.
దేవుడి పాటలు, పల్లెపదాలు, అమ్మోరిని స్తుతించే పద్యాలూ అలా అలవోకగా పాడేస్తుంది. ఒక్కసారి వింటే గుర్తుంచుకుంటుంది.
సంగీతం తెలియదు.
సంగతులు తెలియదు 
అది ఏ రాగమో కూడా తెలియవు. విన్నది విన్నట్టుగా, వున్నది వున్నట్టుగా పాడుతుంది. గమకాలు పలుకుతుంది. సరిగమలు పలికిస్తుంది.
నిరక్షరాస్యత పీడించే ఆ గూడెంలో అక్షరమ్ముక్క రాని కోకిలకు కోయిలలు సుస్వరాలు చెప్పేవేమో!
కోకిల ఆ గూడేనికి ఆ పర్వతప్రాంతాలకు వచ్చే టూరిస్టులకు గైడ్‌గా వ్యవహరిస్తోంది. ఎందుకంటే ఆ ప్రాంతం కోకిలకు కొట్టినపిండి. తన మాటలనే  పాటలుగా మలుస్తుంది. రాగయుక్తంగా చెబుతుంది.
ఆ అడవిలో పులులు సంచరిస్తాయి. కోకిల పాట పాడితే పులులు కూడా ఏ హానీ చేయకుండా వెళ్తాయని అంటుంటారు!
కోకిలకు  చిన్ననాటి స్నేహితురాలైన కమ్లి తన కుటుంబంతో కోకిల వాళ్లింటి పక్కనే ఉండేది. కమ్లికి కోకిల పాడే పాటలంటే ఎంతో ఇష్టం. కోకిల పాటలకు ఆ గిరిజనగూడెపు జనులందరూ మైమరిచిపోయేవారు. 
ఆ గూడెంలో కమ్లి ఒక్కర్తే కొద్దిగా చదువుకుంది. కమ్లి కోకిలకు అక్షరాలు నేర్పిస్తానంటే, చదువు చెబుతానంటే ‘వద్దు బాగా చదువుకుంటే నాకు మొగుడెలా దొరుకుతాడు’ అమాయకంగా అనేది కోకిల. 
ఒకరోజు ఒక ఫారినర్‌ ఆ గూడేనికి వచ్చింది. అక్కడ ఆ గూడేన్ని చూపించడానికి  టూరిస్ట్‌ గైడ్‌ లా పనిచేసింది కోకిల. పర్వతాలు, అడవులు, గూడెం కొట్టినపిండి కోకిలకు. అలా అన్నీ చూపిస్తూ ఎప్పుడూ ఏదో ఒక పాట పాడుతూ వుండే కోకిల గొంతులోని మాధుర్యానికి భాష తెలియకపోయిన ఆ ఫారినర్‌ ముగ్దురాలైంది.
కోకిల పాటను రికార్డు చేసింది.
ఆ పాటను సోషల్‌ మీడియాలో పెట్టింది. అంతే ఒకేరాత్రి కోకిల పాట వైరల్‌ అయ్యింది. కోకిల పాడిన పాటలు అన్నీ రికార్డు చేసింది ఆ ఫారినర్‌. చెటు ్టమీద చేమ మీద, కొండ మీద ఇలా తన మనసుకు నచ్చిన, తనకు వచ్చిన పదాలతో పాడిన పల్లెపదాల జావళి అమృతవాహిని అయ్యింది.

ఆ గొంతు ఎల్లలు దాటింది.
సంగీతానికి భాషాభేదాలు లేవు. కులమతాలు లేవు.
వేల షేర్స్‌, లెక్స్‌ లక్షల్లో...
ఆ గొంతును విని మనఃస్ఫూర్తిగా అభినందించేవారు కొందరైతే, ఆ గొంతుకు వచ్చిన పాపులారిటీని క్యాష్‌ చేసుకునేవాళ్ళు ఇంకెందరో! 
వ్యాపార ప్రపంచంలో కోకిల కంఠం వినియోగ వస్తువు అయ్యింది.
మ్యూజిక్‌ డైరెక్టర్లు  గూడేనికి క్యూ కట్టారు. టీవీ ఛానెల్స్‌ లైవ్‌లు ఇచ్చాయి.
బ్లాంక్‌ చెక్స్‌ కోకిల చేతిలోకి వచ్చాయి. కోకిల ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఆమె ఆనందం అంబరమైంది. తనకొచ్చిన పాపులారిటీ చూసి కాదు. తన గొంతు ప్రపంచమంతా వినిపిస్తూ ఉండడం చూసి. తన స్వరం గాలిలో విహరిస్తోంది ఆమె మనసులా!
తనను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ఫారినర్‌కు చేతులెత్తి దండం పెట్టుకుంది.
ఇంటర్‌వ్యూస్‌ అభినందనలు...
తెల్లవారితే తన పాట గాలిలో కలిసి ప్రపంచాన్ని పలకరిస్తుంది. తమ గూడెంలో వున్న ఒకే ఒక పెద్ద కరెంట్‌ రేడియోలో ఆ పాట వినొచ్చు అనుకుని మురిసిపోయింది కానీ ఆ కరెంట్‌ ఆమె పాలిట శత్రువు అయ్యింది. వర్షానికి ట్రాన్స్‌ఫార్మర్‌ పేలింది. గూడేనికి నిప్పంటుకుంది. కోకిల ఆ మంటల్లో ఎక్కువశాతం కాలిన శరీరంతో హాస్పిటల్‌లో చేరింది.
కానీ..విధిరాతను మార్చడం విధాత తలపులను తెలుసుకోవడం ఎవరితరం?

ఒక్కరాత్రిలో తన ప్రపంచం చీకటిలో కలిసిపోయింది. ఆమె గొంతు మూగబోయింది. ఆ వార్త సినిమా ప్రపంచంలో గుప్పుమంది. కోకిల పాట తమ సినిమాకు ఇక వ్యాపారంగా, ప్రచారంగా పనికిరాదు...అని తెల్సిన మరుక్షణమే మొహం చాటేసింది.
కోకిల జీవితానికి విషాదం ముసుగేసింది. 
రారే హితుల్‌...సుతుల్‌ సన్నిహతుల్‌...స్మశాన నిశ్శబ్దం...

హస్పిటల్‌ బిల్లు కట్టడం కూడా కనాకష్టమైంది. చెక్కులు స్టాప్‌ పేమెంట్‌తో చిత్తు కాగితాలు అయ్యాయి. గూడెంలో కోకిలకు వున్న గూడు హాస్పిటల్‌ బిల్లులకు సరిపోయింది. చిన్న గుడిసెలో ఓ చెట్టు కింద ఉంటుంది.
కోకిలకు మంచి అవకాశాలు వచ్చాయన్న వార్త తరువాత మళ్లీ ఎటువంటి వార్తలు రాకపోవడంతో ఆ ఫారినర్‌  కమ్లిని సంప్రదించింది. జరిగిన విషయం చెప్పింది కమ్లి. ఫారినర్‌ బాధ పడింది. వెంటనే స్పందించింది. హుటాహుటిన ఇండియాకు వచ్చింది. గూడేనికి వెళ్ళింది. నిస్త్రాణంగా చెట్టుకింద పడుకుని వున్న కోకిలను చూసి ఆ ఫారినర్‌ మనసు ద్రవించింది.
కోకిలకు మెరుగైన చికిత్స చేయిస్తానని అంది. సైగలతోనే వద్దని వారించింది కోకిల. మానవత్వమే మూగబోయినవేళ...తన గొంతు ఎవరికీ అవసరం లేదు అన్నది.
ఫారినర్‌ కోకిల తల మీద చేయి వేసింది. చెట్టు మీద వున్న కోయిలలను చూపించింది.
‘అవి ఎందుకు తమ స్వరాలను వినిపిస్తున్నాయి. పక్షుల కువకువలు ఏం ఆశిస్తున్నాయి? ఈ గొంతు ప్రపంచం వినాలి. మాటలొచ్చిన కోయిలను ఈ ప్రపంచం పాట ద్వారా చూడాలి.’  అని చెప్పింది.
కోమాలోకి వెళ్లిన ఆమెలోని ఆశ మళ్ళీ ఊపిరిపోసుకుంది. తన కోసం కాదు...‘తాను పాడితే వినాలని, తన గొంతును పరిచయం చేయాలనీ దూరతీరాల నుంచి వచ్చిన ఆ ఫారినర్‌ కోరిక తీర్చాలి.
తాను పాడాలి. కానీ సినిమా కోసం కాదు. ప్రపంచంలో నిద్రపోతున్న మానవత్వానికే మేలుకొలుపుగా వినిపించే పల్లెపదాలు, జానపదాలు మనుష్యుల్లోని ఆర్ద్రతను ప్రపంచానికి తెలిసేలా పాడాలి...ఓ ప్రక్క ట్రీట్‌మెంట్‌ జరుగుతుంది. మరోప్రక్క సాధన.

ఆ చెట్టు మీద వున్న కోకిలే తన డాక్టర్, తన గురువు. తన  మౌనాన్ని ఏ క్షణమైనా శ్రావ్యంగా మారుస్తుందన్న ఆశ. డాక్టర్లు పెదవి విరిచారు. కమ్లి అప్పుడప్పుడు స్నేహితురాలిని పరామర్శించి పోతుంది.
ఫారినర్‌ తనను అంటిపెట్టుకునే వుంది.
సాధన...సాధన...సాధన తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి వాగునీటిలో గొంతువరకు మునిగి...
‘బ్రహ్మదేవుడా! ఈ బొమ్మకు ప్రాణం వద్దు...స్వరం ఇవ్వు’ అని వేడుకుంది.
సాధనమున సమకూరు...
సంగీతానికి రాళ్ళూ కరుగుతాయో లేదో కానీ కోకిల కన్నీటి వేదనకు దేవుడు కరిగిపోయాడో...స్వరం చలించిపోయిందో...మెల్లిమెల్లిగా గమకాలు పలుకుతోంది!
ఫారినర్‌తో పాటు గూడెం అంతా కలియతిరిగింది. కోకిలలను పిలిచింది. గాలిని పిల్చింది. వర్షాన్ని పిలిచింది. మేఘాలను పిలిచింది. సృష్టిలోని సమస్తాన్ని ఆవాహన  చేసుకుంది ఆమె కంఠస్వరం.
ఆ రాత్రి కోకిల ఆ ఫారినర్‌ ఒడిలో తలపెట్టి పడుకుంది. దేశం కాని దేశం నుంచి వచ్చిన ఫారినర్‌ ఆమె కళ్ళకు స్వరాలమ్మలా, తన అమ్మలా  కనిపించింది.
ఆ రాత్రంతా పాడుతూనే ఉంది. ఫారినర్‌ రికార్డు చేస్తూనే వుంది.
ప్రపంచాన్ని నిద్రలేపే పాటలు.
మానవత్వాన్ని తట్టిలేపే పాటలు. 
సృష్టిని అపురూపంగా ఆవిష్కరించే పాటలు.
స్వరాలు తెలియదు.
గమకాలు తెలియదు.
సంగతులు తెలియదు. తెలిసిందల్లా మనసులోని పాటను గొంతులో నుంచి ప్రపంచానికి పంచడమే.
వ్యాపార విలువలను ప్రశ్నిస్తూ, మానవతాధర్మాన్ని  చెబుతూ, మనిషి విలువను తెలియచెప్పే పాటలు.
తెల్లవారు జామున చివరి పాట వరకూ పాడుతూనే వుంది.
‘కోకిలా ఇక చాలు రాత్రి అంతా పాడి పాడి అలిసిపోయావు’ అంటోంది ఫారినర్‌.
కానీ ఆమె ప్రశ్నకు కోకిల బదులివ్వలేదు. ఆమె చివరిశ్వాస వీడ్కోలు స్వరం పలికించింది.
చెట్టుమీద కోకిలలు మౌనం పాటించాయి. పక్షులు తమ రెక్కలు తెగినట్టు విలవిలలాడాయి. తన చివరికోరికగా ఆ పాటలను ఫారినర్‌కు అంకితం చేసి, ఆ గూడెంలో కోకిల స్వరాలయం ప్రారంభించమని చెప్పింది. 

- శ్రీ సుధామయి

మరిన్ని వార్తలు