ఆ రాత్రే కాదు.. అయిదు నెలలుగా లేడు

23 Feb, 2020 10:04 IST|Sakshi

ఇసుక చెట్టు

ఒళ్లో బిడ్డను ఎవరో తీసుకుంటున్నట్టనిపిస్తే అదిరిపడి కళ్లు తెరిచింది పద్మ. పక్కసీట్లోని ఆవిడ చేతుల్లో ఉంది బిడ్డ. గుక్కపట్టి ఏడుస్తోంది. చీరచెంగుతో మొహం తుడుచుకొని నిద్రమత్తు వదిలించుకుంటూ బిడ్డను తీసుకుంది పద్మ. 
‘నాయమ్మ కదా.. ’ అంటూ భుజాల మీదుగా పమిటను లాక్కుని కిటికీ వైపు కాస్త ఓరగా తిరిగి బిడ్డకు పాలు పట్టడం మొదలుపెట్టింది. 
పాప పాలు తాగుతూంటే పిల్ల తల నిమురుతూ కిటికీలోంచి మేఘాలను పరికిస్తోంది పద్మ.  
ఏదో ఆలోచిస్తూన్నట్టున్న  పద్మనే చూస్తోంది పక్కసీటావిడ. పద్మ కాస్త ఇటు తిరుగుతే ఆమెతో మాట కలపాలని.  
నిజం చెప్పొద్దూ.. పద్మ ఒళ్లో బొద్దుగా మెరిసిపోతున్న ఆ బిడ్డ భలే నచ్చింది ఆవిడకు, పక్కనే ఉన్న ఆమె భర్తకు కూడా.. కాసేపు ఎత్తుకొని ఆడించాలని.. ముద్దు చేయాలనీ ఉంది ఆ జంటకు. 
అందుకే పద్మతో మాట కలపాలని ఆరాటపడుతోంది ఆమె.  
పాప పొట్ట నిండినట్టుంది.. కబుర్లు మొదలుపెట్టింది .. ఊ.. ఉక్కు.. అంటూ!
పమిట చెంగుతో బిడ్డ మూతి తుడిచి లేపి  తన ఒళ్లో నిలబెట్టుకుంది పద్మ. 
పక్క సీటులో ఉన్న ఆవిడను  చూసి చేతులేస్తోంది పాప. ఆవిడ భర్త చిన్నగా విజిల్‌ వేస్తే పాపను మచ్చిక చేసుకోచూస్తున్నాడు. 
‘ఎన్ని నెలలు?’ అడిగింది ఆవిడ.. పాప చెయ్యి పట్టుకొని ముద్దాడుతూ. 
‘అయిదు’ పాప జుట్టు సవరిస్తూ పద్మ. 
అంతే ఆ సమాధానానికే చనువు తెచ్చుకొని పాపను తీసుకుంది ఆవిడ. ఆమె,ఆవిడ భర్త  పాపతో ఆటల్లో పడిపోయారు. 
విమానం హైదరాబాద్‌ దిశగా పోతోంది.. పద్మ మనసు వెనక్కి కువైట్‌కి మళ్లింది.

యాక్సిడెంట్‌లో భర్త పోయాక ఉపాధి కోసం బెంగుళూరుకు పోయింది. ఇళ్లల్లో పని వెదుక్కుంది. అక్కడున్నప్పుడే కువైట్‌లో పనిచేసే  వనిత పరిచయమైంది. ‘ఇక్కడెంత చేసినా అంతంత మాత్రమే సంపాదన. ఇదే పని కువైట్‌లో చేస్తే నీ పిల్లల బతుకన్నా బాగుపడ్తది. ఖఫీల్‌ ఇళ్లల్లో పనుంది నువ్వు చేస్తానంటే’ అన్నది.  కువైట్‌కు తీసుకెళ్లింది. తన గదిలోనే పెట్టుకుంది. వనిత చెప్పినట్టు సంపాదన పర్వాలేదు. ఇంటికి దండిగానే పంపింది. అంతా బాగుంది.. 
అప్పుడే కనపడ్డాడు మహీంద్ర గుణసింఘే. తాము ఉండే కాంప్లెక్స్‌లోనే.. తమకెదురుగా ఉన్న గదిలో. ముందు చూపులతో వెంటాడాడు స్నేహంగా. తర్వాత మాటలు కలిపాడు ఆప్యాయంగా! దగ్గరయ్యాడు ప్రేమగా! 
పాప కెవ్వుమనే సరికి ఉలిక్కిపడి చూసింది. పక్కసీట్లోని ఆవిడ దగ్గర నుంచి తల్లి దగ్గరకు రావడానికి .. తల్లి దృష్టిని ఆకర్షించడానికి అరుస్తోంది చంటిది. అయినా పసిదాన్ని సముదాయిస్తూ తన ఒళ్లోనే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తోంది ఆవిడ. పిల్ల ఉండట్లేదు. కాళ్లతో తన్ని పైపైకి లేస్తోంది.
‘బుజ్జి.. చిట్టి... ’ అంటూ పాపను దృష్టి మరల్చచూస్తోంది ఆవిడ. 
ఆమె ప్రయత్నాలను చూస్తూంటే పాపమనిపించింది పద్మకు.  పాపను తన ఒళ్లోకి తీసుకుంటూ ‘మీ పిల్లలు పెద్దవాళ్లా?’ అడిగింది ఆమెను. 
ఏమీ చెప్పకుండా మౌనంగా ఉందామె. 
‘మీతో వచ్చినారా?’ మళ్లీ అడిగింది పిల్లకు పాలిస్తూ పద్మ. 
‘నాకు పిల్లల్లేరు’అంటూ సీట్‌ పౌచ్‌లో ఉన్న మ్యాగజైన్‌ తీసి తెరిచింది. ఇంకే వివరం చెప్పడానికి సుముఖంగాలేనట్టు. 
నొచ్చుకుంది పద్మ. 
తన పైటను గట్టిగా పట్టుకొని పాలు తాగుతున్న బిడ్డకేసి చూసుకుంది. బుగ్గలు కదిలినప్పుడల్లా కుడి బుగ్గ మీద సొట్ట.. అచ్చం అతని లాగే. భగభగమండింది మనసు.
‘ఎందుకు భయపడుతున్నావ్‌? నేనున్నాను కదా’ అంటూ చేయి పట్టుకున్నాడు అతను. 
‘మహీ..నాకు ఇద్దరు పిల్లలు అక్కడ. ఇప్పుడు ఈ బిడ్డనూ కని ఎట్లా సాకేది? ఊళ్లో వాళ్లకు ఏమి చెప్పేది?’భయంగా అడిగింది. 
‘నీ దేశంలో చెప్పాల్సిన అవసరం లేదు.. నా దేశంలో చెప్పాల్సిన అవసరమూ లేదు.. మన బిడ్డ మన దేశంలో మన దగ్గర హాయిగా ఉంటది’ అన్నాడు ఆమె చుబుకం పట్టి దగ్గరకు తీసుకుంటూ.
ఏడుస్తూ అతణ్ణి అతుక్కు పోయింది. 

‘పిచ్చిపద్మా.. బిడ్డను ఒదులుకుంటానని ఎట్లా అనుకున్నావ్‌? మన వాళ్లకి కావల్సింది డబ్బులు.  పంపిస్తూనే ఉన్నాం. తర్వాత కూడా పంపిస్తాం. ఎప్పుడో ఒకసారి  కలిసొస్తాం. నేను వెళ్లినప్పుడు  బిడ్డ నీతో ఉంటుంది. నువ్వు వెళ్లినప్పుడు నాతో ఉంటుంది. ఇక్కడే చదివిద్దాం. అవన్నిటికీ ఇంకా చాలా టైమ్‌ ఉందిలే.. అప్పుడు చూద్దాం.. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉండు’ అని ఆమెను హత్తుకున్నాడు భరోసాగా. 
ఆరునెలల గర్భవతిగా.. ఉన్నప్పుడే పనిమాన్పించాడు రెస్ట్‌ తీసుకో అని. అంతా తనే చూసుకున్నాడు. వనిత స్నేహితురాలు ఒకామె నర్స్‌.  ఆమెనే డెలివరీ చేసింది తాముంటున్న గదిలోనే. ఆ టైమ్‌లో హోటల్‌లో డ్యూటీలో ఉన్నాడు అతను. ‘మహీంద్రా.. కూతురు పుట్టింది’ అతనికి ఫోన్‌ చేసి చెప్పింది వనిత. ఆ రాత్రి ఆత్రంగా ఎదురు చూసింది పద్మ అతని కోసం. ఆ రాత్రే కాదు అయిదు నెలలుగా లేడు. అతని జాడ కోసం  తాను చేయగలిగిన అన్ని ప్రయత్నాల తర్వాత అర్థమైన సత్యం.. మోసపోయానని. 
ఈ విషాదంలో కనిపించిన ఆశ.. ఆమ్నెస్టీ. నిజానికి ఇండియాకు రావాలని లేదు. కాని కువైట్‌లో ఈ బిడ్డ ఏ జాతీ లేని అనాథ అవుతుంది. ఇండియాలో అనాథాశ్రమంలో వదిలినా ఆ దేశం పిల్లగానైనా పెరుగుతుంది. 
దుఃఖం ముంచుకొచ్చింది పద్మకు. ఏడుపును దిగమింగుకోడానికి బిడ్డ చిట్టిపిడికిలి పట్టుకొని నోటికి అదుముకుంటోంది. 
పక్కాసీటావిడ కంటపడింది.

‘ఆ.. పద్మా.. అంతాబాగేనా?’ ఫోన్‌లో వనిత. 
‘ఊ...’ ముక్తసరిగా పద్మ.
‘పాప.. ’ వనిత. 
అప్పుడు కట్టలు తెచ్చుకుంది పద్మ దుఃఖం. ‘పాపను ఇచ్చేశాను’ చెప్పింది. 
‘ఇచ్చేశావా? ఎవరికి?’ విస్తుపోతూ వనిత. 
‘విమానంలో పరిచయమయ్యారు భార్యభర్తలు. హైదరాబాద్‌లో ఉంటారట. పిల్లల్లేరు. వాళ్ల ఒళ్లో పెట్టేశాను’ ఏడుస్తూనే పద్మ. 
‘వాళ్ల గురించి ఏమైనా తెలుసుకున్నావా లేదా? వాళ్లు ఏం చేస్తుంటారు పిల్లా..’ వంటి ప్రశ్నలు అడుగుతూనే ఉంది వనిత. ఇవతల ఏడుస్తూనే ఉంది పద్మ.
- సరస్వతి రమ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా