సాసరో రక్షతి రక్షితః!

12 Jun, 2016 01:14 IST|Sakshi
సాసరో రక్షతి రక్షితః!

హ్యూమర్
‘‘పాపం... సాసర్లు! వాటి వాడకం రోజురోజుకూ తగ్గిపోతోంది రా’’ అన్నాడు మా రాంబాబు గాడు. నేను వాడికి టీ సర్వ్ చేస్తున్నప్పుడు వాడు అన్న మాట ఇది.  ‘‘సాసర్ల మీద నువ్వంత జాలిపడాల్సిన అవసరం లేదురా! వేరే ఇంకెవరికైనా మరీ ఫార్మల్‌గా ఇవ్వాల్సి వస్తే సాసర్ కూడా ఇచ్చే వాణ్ణేమో. నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్‌వి కాబట్టి కప్పు మాత్రమే ఇచ్చా. దీంట్లో అంత బాధపడాల్సిందేముంది రా’’ అన్నాను.
 ‘‘అదేం కాదులే. మొత్తం మానవాళి అంతా సాసర్ పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తోంది.

ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు ఎన్నాళ్లుగానో చాయ్ కప్పుకు తోడుగా వాడుకొని ఇప్పుడు దానికి ఆ తోడు కూడా లేకుండా చేస్తున్నారు ఈ మానవులు’’
 ‘‘మానవులు అంటున్నావ్. సాసర్‌ను మనుషులు గాక జంతువులేమైనా యూజ్ చేస్తాయట్రా’’ అన్నాను.
 ‘‘అవును... జంతువులు యూజ్ చేస్తుంటాయి. ఎండ్రకాయ చూడు ఎంచక్కా వీపు మీద సాసర్‌ను బోర్లించుకున్నట్లూ...

ఆ బోర్లించిన దాని కింది నుంచి నాలుగు జతల కాళ్లు బయటకు వచ్చినట్లు, అవి సాసర్‌ను అటూ ఇటూ లాగుతున్నట్లు ఉంటుంది.  ఇక మన తాబేలును చూస్తే మాత్రం అది బోర్లించిన సాసర్ కిందికి తన ముఖాన్ని, కాళ్లూ, చేతుల్ని లోపలకు లాక్కునట్లుగా ఉంటుంది. సాసర్ గౌరవార్థం దాన్ని తమపై బోర్లించినట్లుగా బతికే జీవాలు ఎన్నెన్నో!

ఈ లోకంలోని అనేక జీవులు సాసర్‌ను ఇంతగా నెత్తిన పెట్టుకుంటున్నాయి కదా... మరి భూమ్మీది మనుషులకేం పోయేకాలం వచ్చిందో సాసర్‌కు దక్కాల్సిన గౌరవం ఎందుకీయడం లేదో’’ అన్నాడు వాడు.
 ‘‘భూమ్మీద మనషులివ్వకపోతే ఆకాశం నుంచి ఎవడో ఊడిపడి వాటికి గౌరవం   ఇస్తున్నాడా?’’ అన్నాను నేను.
 ‘‘అవును ఆకాశం నుంచి ఊడిపడేవారే ఇస్తున్నారు’’ అన్నాడు వాడు.
 
‘‘ఏదో మాట వరసకు ఆకాశం నుంచి ఊడిపడేవారు ఇస్తున్నారా అంటే నిజమే అంటున్నావు. అదెలారా?’’ అడిగా.
 ‘‘మనం దిక్కుమొక్కు లేక విమానాలూ, ఎయిర్ బస్సులూ లాంటి వాటిని ఉపయోగిస్తున్నాం గానీ... ఏలియన్స్ అనే గ్రహాంతర వాసులూ చక్కగా చక్కర్లు కొట్టడానికి విశాలంగా ఉండే సాసర్లను యూజ్ చేస్తుంటారు. విమానాలు చూడు... ఇరుకు ఇరుకుగా ఉంటాయి. అదే సాసర్ అనుకో.

ఎంత విశాలంగా ఉంటుందో చూడు. ఈసారి ఎవరైనా ఏలియన్ గనక నాకు కనిపిస్తే... మన సైంటిస్టులకు ఫ్లైయింగ్ సాసర్ టెక్నాలజీ ఇవ్వమని అడుగుతా. దాంతో ఇకపై మనం కూడా పక్షి షేప్‌లో ఉండే ఓల్డ్ ఫ్యాషన్ విమానాలను వదిలేసి... హ్యాపీగా ఇకపై విశాలమైన సాసర్ ఏరోప్లేన్స్ వాడొచ్చు’’ అంటూ కాస్త గ్యాప్ ఇచ్చి ‘‘నీలాంటి వాడికి ఇలా సాసర్ ఘనతల గురించి హితబోధలు చేస్తూ డైనోసార్లకు పట్టిన గతి సాసర్లకూ పట్టకుండా చూసుకోవాలి’’ అన్నాడు వాడు.
 
‘‘ప్రాస కుదురుతుంది కదా అని డైనోసార్లనూ, సాసర్లనూ కలిపేస్తున్నావ్. అసలు వాటి మధ్య పోలికేమిట్రా?’’ అడిగాను నేను.
 ‘‘పాపం... మన డైనోసార్లు అంతరించిపోయినట్లుగానే సాసర్లూ క్రమంగా కనుమరుగైపోతున్నట్లుగా ఉందిరా’’
 ‘‘అదేమిట్రా?’’
 ‘‘ఇప్పుడు నువ్వు టీ ఇస్తూ కప్పు మాత్రమే ఇచ్చావు.

గతంలో అందరూ టీ సర్వ్ చేసే సమయంలో దానితో పాటు సాసర్‌ను తప్పక ఇచ్చేవారు కదా. అప్పట్లో లోకంలో డైనోసార్లలాగే ఇప్పుడు ట్రేలలో సాసర్లు ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తున్నాయని వాటిని క్రమంగా అంతరించిపోయేలా చేస్తున్నార్రా నీలా టీ ఇచ్చే వాళ్లంతా.
 ‘‘అవి అంతరించి పోకుండా ఏం చేయాలని నీ ఆలోచన’’
 ‘‘టీవీ ఉన్న ప్రతివాడూ సాసర్‌నే డిష్ ఏంటెన్నాలా తయారు చేసుకునేందుకు అవకాశం ఏదైనా ఉందేమోనని పరిశోధిస్తా.

ఆ ఆవిష్కారానికి నేనేమీ పేటెంటు తీసుకోకుండా ఆ టెక్నాలజీని యథేచ్ఛగా అందరూ వాడుకునేందుకు ‘సాసరో రక్షతి రక్షితః’ అని జాతిప్రజలందరికీ ఒక పిలుపునిస్తా. డిష్ ఏంటెన్నాగా ఎవరు సాసర్‌ను రూపొందించు కుంటాడో... వాడికి సాసర్ అనేక ఛానెళ్లను వీక్షించే అవకాశం ఇస్తుంది. ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి, ఆ జేఏసీ సాయంతో సాసర్‌కు దక్కాల్సిన తగిన గౌరవం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందిరా’’ అన్నాడు వాడు ఆవేశంగా.
 
‘‘వద్దులేరా... నీకంత శ్రమ అవసరం లేదు. సాసర్‌కు ప్రత్యేకంగా ఒకడు గౌరవం ఇవ్వాల్సిన పనిలేదు. దాని పేరులోనే మహత్యం ఉందిరా. దాన్ని పిలవాలంటే ‘సా’ అన్న అక్షరం తర్వాత ‘సర్’ అని ప్రతివాడూ దాన్ని గౌరవిస్తాడు. కాబట్టి ఇప్పటికి నువ్వు సెలైంట్‌గా ఉండు చాలు’’ అన్నాను నేను.
 ‘‘నాకు తెలియని విషయం చెప్పావు. నువ్వు కూడా మెల్లగా నా దార్లోకి వస్తున్నావ్’’ అంటూ ప్రశంసించాడు మా రాంబాబు గాడు.
 - యాసీన్

మరిన్ని వార్తలు