జిమ్‌ కార్బెట్‌ ఆఫ్‌ భీమిలీ

22 Sep, 2019 08:00 IST|Sakshi

కొత్త కథలోళ్లు

ఈ వేటపిచ్చి నాకెలా పట్టుకుందో మాకెవరికీ అర్థం కాని విషయం. మా కుటుంబంలో అటేడు తరాలూ, ఇటేడు తరాలూ ఎవరి డిక్షనరీలోనూ ఈ వేట అనే పదమేలేదట. నా చిన్నప్పుడు మా చిట్టిమావయ్య కేటపుల్‌ తో పిట్టలు కొట్టడానికివెళ్తూ అప్పుడప్పుడూ నన్నుకూడా తీసుకెళ్ళేవాడుకాని అంతమాత్రానికే వేట నాకొక పెద్ద అబ్సెషన్‌ అయిపోయిందంటే  మాత్రం ఒప్పుకోను నేను.  
ఐతే నాకున్న వేటపిచ్చిని వివరించడానికి మా మామ్మ, నక్కా జానకమ్మ దగ్గర కత్తిలాంటి  థియరీ ఒకటుండేది. అదేంటంటే, మానాన్నకి ఆదినారాయణరాజు అని ఒక ఫ్రెండ్‌ ఉండేవారట. ఆయన పెద్దవేటగాడట. ఆయన వేటకి వెళ్ళినప్రతీసారీ ఆయనతోపాటూ ‘తోడువేటగాడిగా’ మానాన్నకూడా వెళ్తూఉండేవారట.

‘‘ఎవరో వేటకి వెళ్ళినప్పుడు నాన్న తోడెల్తే నాకు వేటపిచ్చి పట్టుకోవడమేంటి మామ్మా భలే చెప్తావులే నువ్వు’’ అని నేను విసుక్కుంటే–
‘‘నోర్ముయ్యరా ఎదవా. నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు రాజుగారు కనీసం వారానికొకసారైనా దుప్పి మాంసమో, అడవిబాతుల మాంసమో, ఏదోఒకటి  పంపించేవారు కదా మనకి. అవి నేను వొండిపెడితే మీఅమ్మ చక్కగా తినేది.’’  
‘‘అయితే’’ 
‘‘అయితేనా. అలా మీ అమ్మ తిన్న వేట మాంసాలన్నీ మీ అమ్మ కడుపులో ఉండి నువ్వుకూడా తిన్నావుకదా అందుకే నీకీ వేట సర్దా పట్టుకుందిరా’’ అని ఢంకా బజాయించి నా నోరు మూయ్యించేది.  
చిన్నప్పుడెప్పుడో మొదలైన ఈ పిచ్చి నాకు వయసుతోపాటు విపరీతంగా పెరిగిపోయి సెలవొస్తేచాలు ఒక సంచిలో గోళీకాయలూ, ఇంకొకచేత్తో కేటిల్బారూ పట్టుకొని మాఊర్లో చెట్లూ పుట్టలూ పట్టుకొని తిరుగుతూ ఉండేవాడ్ని ఉడతల్నీ పిట్టల్నీ కొట్టుకుంటూ.  నిక్కర్లు వేసుకొనే రోజుల్లో అలా తిరగడం బాగానే ఉండేదిగాని ఇంటర్మీడియెట్‌కి వచ్చి పేంట్లేసుకు తిరిగే టైంకి కేటిల్బార్‌ పట్టుకుతిరగడం నామోషీగా అనిపించేది. అదిగో అలాంటి రోజుల్లోనే తెలిసింది ‘ఎయిర్‌ గన్‌’ అని ఒకరకమైన తుపాకీ ఉంటుందనీ దానికి లైసెన్స్‌ అవసరం లేదనీ, దానితో పెద్దపెద్ద పిట్టల్ని చాలా ‘వీజీ’గా  కొట్టొచ్చనీ.  ఇక అప్పట్నుండీ ఒక ఎయిర్‌ గన్‌ కొనుక్కోవాలనే కోరిక మనసులో బలంగా నాటుకుపోయింది.

కాకపోతే చిక్కంతా మానాన్నతోనే.  తుపాకీ మాటెత్తగానే ‘‘నీ కేటిల్‌ బార్‌ పిచ్చితోనే ఛస్తుంటే ఇప్పుడు తుపాకీ కూడానా. కాళ్ళు విరగ్గొడతాను వెధవా’’ అని తన్నబోయారు. 
‘‘పోనీ కొనొచ్చుకదా. పావురాలూ గువ్వలూ కొట్టుకొస్తే చేపా మాంసాల ఖర్చు కొంచెం తగ్గుతాది కదా’’ అని అమ్మ రికమెండ్‌ చెయ్యబోతే  ‘ఛీ నోర్ముయ్‌. నువ్వూ నీ వెధవ కక్కుర్తీని’’ అని తిట్టేరట.  సో, మనచేతికి  ఎయిర్‌ గన్నొకటి వస్తుందనీ దాంతో మనం స్టైల్‌గా  పిట్టలు కొట్టుకుంటూ తిరగొచ్చనే కల కరిగిపోతున్న సమయంలో మా చందు....ఇప్పుడు మా చినబావ....అప్పుడుకాదు.......చల్లటివార్తొకటి మోసుకొచ్చాడు.  
అదేంటంటే,  వాళ్ళింటికిదగ్గర్లో ఉండే రాజుల కుర్రాళ్ళిద్దరు తుపాకీ పట్టుకొని వేటకి వెళ్ళడం చూసాడట ఆరోజు. అందులో ఒకడితో మావాడికి కొంచెం పరిచయం ఉండడంతో వారితోపాటూ తనుకూడా వెళ్ళడమే కాకుండా, తుపాకీ కూడా ఫైర్‌ చేసాడట వాళ్ళని బ్రతిమలాడి. వాళ్ళు వేట ముగించుకొని వెళ్ళిపోయాక  పరుగెత్తుకొచ్చాడు నాకా విషయం చెప్పడానికి. నిజం చెప్పొద్దూ కడుపు మండిపోయింది నాకు.

నా బాధచూసి ‘‘బాధపడకు బాబ్జీ. వాళ్ళలో ఒకడు నాకు  తెలుసు కదా. వాడినెలాగైనా దారిలోపెట్టి  మనం వేటకెళ్ళేలా చూస్తానుకదా’’ అని ఓదార్చాడు నన్ను. మా చందులో ఒక గొప్ప లక్షణం ఉంది. తనేదైనా తలంచుకుంటే అది సాధించేవరకూ నిద్రపోడు. కుదిరితే అవతలవాడి పీకో కుదరకపోతే వాడి కాళ్ళో పట్టుకొని ఆపని మాత్రం ఎలాగోలా సాధించితీరతాడు. అన్నట్టుగానే వారం తిరిగేసరికల్లా ఆ రాజులకుర్రాణ్ణి ఏకంగా మా ఇంటికే వెంటబెట్టుకొచ్చేసాడు. అలా తీసుకురాబడ్డ కుర్రాడే అచ్చిబాబుగాడు. తరవాత అనతికాలంలోనే  వాడూ నేనూ రోజులో ఇరవైగంటలు కలిసే ఉండేటంత బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయిపోయాం. అలా అయ్యాక చాలా ఆనందకరమైన విషయం ఇంకొకటి చెప్పాడు వాడు.

పరదేశిపాలెంలో ఉంటున్న వాళ్ళన్న సుబ్బడి దగ్గర డబుల్‌ బేరల్‌ తుపాకి ఉందనీ, దానితో కూడా అప్పుడప్పుడూ మేము వేట చెయ్యొచ్చనేది దాని సారాంశం. పరదేశిపాలానికి దగ్గరలో ‘గంభీరం’ అని ఒక గెడ్డా (వాగు) దాని చుట్టూ దట్టమైన అడివీ ఉండేవారోజుల్లో. ‘‘అక్కడ మనం చెవులపిల్లులు కొట్టొచ్చురా బాబీ. అక్కడ మావిడితోటల్లోకి అడివిపందులు కూడా తెగదిగుతాయొరే. ఈ సమ్మర్లో మనం పందులవేటకి కూడా వెళ్ళొచ్చు సుబ్బడితో.’’ అని చెప్పాడు. ఇక అప్పట్నుండీ రాత్రుళ్ళు నిద్రపడితే ఒట్టు. కొంచెం కునుకుపడితే చాలు కొమ్ములు తిరిగిన అడివిపందిని (‘టస్కర్‌’ అంటారు ఇంగ్లీషులో) వేటాడి దాన్నో వెదురుబొంగుకి కట్టి కూలీలతో మోయించుకొస్తున్నట్టు కలలే కలలు. 

ఇక చలికాలం వచ్చిందంటే చూడాలి మా హడావుడి. కోతలైపోయి ఖాళీగా ఉన్న వరిపొలాల్లోకి ‘నత్తకొట్టులు’ అనే వలస పక్షులు దిగేవి ఎక్కడినుంచో వచ్చి. ఒక్కొక్కటీ కనీసం నాలుగైదు కేజీల బరువుండే పెద్దకొంగజాతి పక్షులవి. అవి  చాలా ఎలర్ట్‌గా ఉండడమేకాక,  మేస్తున్నప్పుడు కాపలాకాయడానికి వాటిలోనే  ఒకదాన్ని ‘వాచ్‌ మేన్‌’గా నియమించుకుంటాయేమో   ఏదైనా ప్రమాదం వస్తున్నట్టనిపిస్తే ‘ఆ వాచ్మేన్‌’ వెంటనే   మిగతావాటిని హెచ్చరించడం, అవి క్షణాల్లో   ఎగిరిపోవడం జరిగిపోతుంది. అందుకే వాటిని వేటాడడం చాలా కష్టమైన పని.  తెల్లవారుజామున మాత్రమే, అదికూడా ఓపిగ్గా తిరిగితే, ఎప్పుడొ దొరికేది   వాటిని వేటాడే అవకాశం.

అయితే  భీమిలీకి పదికిలోమీటర్ల దూరంలో ఉండే బోయపాలేనికి, వణికించే చలిలో, ఉదయం నాలుగ్గంటలప్పుడు సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్ళాలంటే  దేవుడు కనబడేవాడు మాకు. అయినా సరే  ‘ధైర్యే సాహసే వసంతలక్ష్మీ’ అనుకుంటూ బయల్దేరేవాళ్ళం  తెల్లవారుజామునే వణుక్కుంటూ.   (వసంతలక్ష్మి  అచ్చిబాబుగాడి పక్కింటమ్మాయి. అందంగా ఉండేది)     
షూటింగ్‌ స్పాట్‌కి వెళ్ళేక మొదలయ్యేది అసలుకథ.  ఖాళీగా బట్టబయలులాంటి వరిపొలాలూ.....చిత్తడిచిత్తడిగా నేలా...... వర్షంలా కురుస్తున్న మంచూ..... గడగడలాడించే చలీ..... దూరంగా ఎక్కడో నత్తకొట్ల గుంపూ. ఆ గుంపుకి తుపాకీవేటు దూరంలోకి చేరుకోవడం  మొదటిలక్ష్యం. నిటారుగా నిల్చొని కాదుకదా కనీసం  ఒంగోని వెళ్ళడానికి కూడా  వీలుకాని పరిస్థితి.  పొలానికీ పొలానికీ మధ్యనున్న గట్లను చాటుచేసుకొని  నీళ్ళు పారడానికి తవ్విన దొరువులగుండా, తుపాకీ వీపుమీద వేసుకొని, డ్రాయర్‌ వినా మిగిలిన వస్త్రాలన్నీ విప్పిపారేసి, పాములా పాక్కుంటూ వెళ్ళడం ఒక్కటే దారి. దెబ్బకి  మోచేతులూ, ముణుకులూ దోక్కుపోవడమేకాక,  ఛాతీనుండి పొట్టవరకూ ఎర్రగా గీరుకుపోయి సురసురమని ఒకటే మంట. ఇలా నరకయాతనపడుతూ తుపాకివేటు దూరంలోకి వెళ్లడానికే గంటపైన పట్టేసేది.

ఊపిరితిత్తులు పగిలిపోయేటంత ఆయాసం. రొప్పుతూ రోజుతూ  ఊపిరి స్వాధీనంలోనికి తెచ్చుకొని, తుపాకీ ఎక్కుపెట్టి గురితీసుకుంటున్న సమయానికి ఆ ‘వాచ్మేన్‌ వాజమ్మ’ మమ్మల్ని పసిగట్టెయ్యడం, మిగిలిన పక్షుల్లి్న  హెచ్చరించెయ్యడం, అవి ఆకాశంలోకి లేచిపోవడం, కోపం, కసీ  కలగలిపి తన్నుకొస్తుంటే బండబూతులు తిట్టుకుంటూ ఈసురోమంటూ మేం వెనక్కిరావడం. ఇలా కనీసం  వారం పదిరోజులు ఓపిగ్గా ప్రయత్నిస్తే  మా అదృష్టం బాగున్నరోజెప్పుడో   తుపాకి పేల్చే అవకాశం దొరికేది.  అలా దొరికిన అవకాశాన్ని మాత్రం వృథా చేసేవాళ్ళం కాదు.  నత్తకొట్టు పడితీరాల్సిందే.  అచ్చిబాబుగాడైతే ఒకే తూటాతో రెండు నత్తకొట్టుల్ని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఒకసారిలాగే వారం రోజుల్నుంచీ నానాతిప్పలూ పడుతున్నాం. కష్టపడి తుపాకీవేటు దూరంలోకి రావడం, అవి  ఎగిరిపోవడం. ఏడుపొకటే తక్కువ మాకు. ఎనిమిదోరోజు తుపాకీ నా చేతిలోనుండి తీసుకుంటూ ‘‘నువ్వుండరా బాబీ. ఈరోజు నేను ట్రైచేస్తాను. నత్తకొట్టు పడకపోతే ఇక జన్మలో తుపాకి ముట్టుకోనొరేయ్‌’’ అని భీష్ముడిలా ప్రతిజ్ఞొకటిచేసి బయల్దేరాడు అచ్చిబాబుగాడు. గంట తరవాత నెమ్మదిగా  ‘రేంజ్‌’లోకి చేరుకున్నాడు.  రెండుక్షణాలు ఆయాసం తీర్చుకొని, నెమ్మదిగా తుపాకీ గురిపెడుతున్నవాడ్ని  గమనించిన గుంపు మొత్తం ఒక్కసారిగా, ఎప్పటిలాగానే,  ఆకాశంలోకి   లేచిపోయింది.  
ఐతే ఈసారి మాత్రం బూతులు తిట్టుకుంటూ వెనక్కి తిరిగిరాలేదు వాడు. ఒక్కఉదుటున లేచి, పైకెగిరిపోతున్న ఆగుంపు క్రిందకి పరిగెత్తుకుంటూవెళ్ళి,  ‘హేమర్స్‌’ రెండూ ఎక్కుపెట్టి,  ఫైర్‌ చేసాడు.  వాడేం చేయబోతున్నాడో నాకర్థం అయ్యేలోపే రెండు బేరల్సూ ఒకదాని తరవాత ఒకటి పేలడం,  రెండు నత్తకొట్లు గిలగిల్లాడుతూ పైనుండి నేలకురాలడం....జీవితంలో నేనెప్పటికీ మరచిపోలేని దృశ్యం. ఆరోజునుండీ వాడిని జిమ్‌ కార్బెట్‌ అనే పిలిచేవాడ్ని నేను.

సరే ఆ నత్తకొట్టుల్ని విజయగర్వంతో మేం  సుబ్బడింటికి మోసుకెళ్ళడం, దమయంతి వదినగారు వాటితో బ్రహ్మాండమైన పులావు చెయ్యడం, అదొక  పెద్దకేరేజీనిండా నింపుకొని  మాఇంటికి తీసుకెల్తే,   వేటంటేనే శివాలెత్తిపోయే మానాన్న  చిరునవ్వులు చిందిస్తూ ‘నత్తకొట్టు పులావు’ సుష్టుగా భోంచేయడం...అదంతా నలభైఅయిదేళ్ళ పైబడ్డ చరిత్ర.
పందొమ్మిదివందల డెభ్భైఐదు తరవాత మళ్ళీ వేట ఊసెత్తలేదు మేమెప్పుడూ. ‘‘ఆ సంగతులింకా గుర్తున్నాయిరా బాబీ నీకు. ఎన్నిజీవాలు తీసాంరా ఆరోజుల్లో. ఆపాపం ఊరికే పోదొరే. ఇప్పుడు కాకపోతే వచ్చీ జన్మలోనైనా అనుభవిస్తాం మనం.’ అంటాడు వాడు  నేను రేపిన జ్ఞాపకాల్లోకి తొంగిచూస్తూ. వాడలా అన్నప్పుడు నిజంగానే భయం వేస్తుంది నాకు.

మరిన్ని వార్తలు